Menu Close
అమ్మ వినాలని
-- వేములపాటి శ్రీనివాసమూర్తి

సంగీతం మాస్టారు సుబ్రహ్మణ్యం గారి ఇల్లు విద్యార్థులతో, వారి తల్లితండ్రులతో సందడి సందడి గా వుంది. ఆయన బాగా నేర్పిస్తాడు అని, ఆయన దగ్గర నేర్చుకొంటే పాడుతా తీయగా లాంటి పోటీల్లో సెలెక్ట్ అవుతారని పేరు పడి పోయింది.

శాంతమ్మకి తన కొడుకు సురేషును ఆయన దగ్గర శిష్యుడు గా చేర్చాలని గాఢమైన కోరిక. శాంతమ్మ పదేళ్ల క్రితము భర్తను కోల్పోయి ఒకే ఒక కొడుకును అతి గారాబంగా ఏ లోటు లేకుండా పెంచుతోంది. నాలుగైదు ఇళ్ళల్లో వంట పని చేసుకొని సంసారం నడిపిస్తున్నది. పిల్ల వాడికి మంచి విద్య, బుద్ధులు నేర్పాలని, పెద్ద వాడయి పెద్ద పదవులు చేపట్టాలని ఆమె కోరిక, విశ్వాసము. అందుకనే కొడుకుకి మంచి ఆహారము, మంచి దుస్తులు, అన్ని వసతులు ఏర్పాటు చేసి తండ్రి లేని లోటు లేకుండా పెంచుతోంది. సురేష్ కూడా అమ్మ మాట విని చదువులో బాగా రాణించాడు. ఎప్పుడూ చదువులో ఆటల్లో ప్రధముడుగా నిలిచేవాడు. సంగీతం నేర్చుకోకపోయిననూ ఇంట్లో కూని రాగాలు తీస్తూ ఉండేవాడు చిన్నప్పటి నుండి. ఎలాగైనా సుబ్రహ్మణ్యం మాస్టారు దగ్గర చేరి సంగీతంలో కూడా పేరు సంపాదించాలని సురేష్ కోరిక. కానీ, సంగీతం మాస్టారు ఫీజు అమ్మ మీద ఇంకా భారం అవుతుంది అని ఊరుకున్నాడు. అయితే  కొడుకు మనసు తల్లి అర్ధం చేసుకొంది. అందుకే ఈ రోజు చేర్చడానికి తీసుకొచ్చింది. అచ్చటికి వచ్చేవాళ్లు అందరు కొంత వరకు సంపన్నులే. శాంతమ్మ మాత్రం ఆమె వేసుకొన్న దుస్తులు వల్ల సాధారణ కుటుంబం మనిషి లాగ కనిపిస్తున్నది. అందరి తల్లిదండ్రుల లాగే తాను కూడా తన కొడుకు సురేష్ ను ఆయన దగ్గర చేర్చుకోమని ప్రాధేయ పడుతోంది.

సుబ్రహ్మణ్యం గారు వచ్చిన పిల్లలకి పాడమని చిన్న టెస్ట్ పెట్టి రెండు మూడు నిమిషాల తరవాత కొంత మందికి ఓకే అంటాడు. కొంత మందిని వెనక్కి పంపేస్తాడు. సురేష్ ని కూడా పాడమన్నాడు. కానీ, అంత మనసు పెట్టి వినలేదు. తీసుకోదలచుకోలేదేమో విసుగ్గా, “ప్రతి వాడు బాలసుబ్రహ్మణ్యం అయిపోవాలనో, పాడుతా తీయగా లో గెలవాలనో, సినిమాలలో పాడాలనో కలలు కంటారు.” అని వ్యంగంగా అంటూ “మీ వాడికి సంగీతం రాదమ్మ, ఎందుకు డబ్బు, టైము వృధా” అని అన్నాడు. సురేష్ చాలా దిగాలు పడి పొయ్యాడు. వాడి నిరాశ చూసి తల్లి హృదయం తల్లడిల్లింది. “సార్, మీ కాళ్ళకు మొక్కుతాను. దయచేసి మా వాడికి ఒక్క అవకాశము ఇవ్వండి. తండ్రి లేని బిడ్డ. బాగా ఇష్ట పడుతున్నాడు. మీరు కాదంటే వాడు చాలా బాధ పడతాడు. అది చూసి నేను డీలా పడిపోతాను పైగా అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రం” అని దగ్గుతూ దీనంగా అర్ధించింది. ఆమె చాలా బలహీనంగా, అనారోగ్యంగా ఉన్నట్లు తోస్తుంది. ఆమె ప్రాధేయ పడగా పడగా మాస్టారు సురేషు ను చేర్చుకోడానికి ఒప్పుకున్నాడు. “సరే ఫీజు ఆఫీస్ లో కట్టేసి మీ అబ్బాయిని రేపటి నించి రమ్మని చెప్పు. చాలా కష్ట పడవలసి ఉంటుంది” అని చెప్పాడు.

శాంతమ్మ ఆనందానికి హద్దులు లేవు. సురేష్ మొహం వెయ్యి కేండిల్ బల్బ్ లాగ వెలిగి పోయింది. “మా వాడు కష్టపడి సంగీతం బాగా నేర్చుకొని మీకు మంచి పేరును తెస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అదే నేను మీకు హామీ ఇస్తున్నాను.” అని కొడుకును తీసుకొని బయటకు వెళ్లి ఫీజు కట్టేసి రసీదు తీసుకొని టైమింగ్స్ కనుక్కొని ఇంటి ముఖం పట్టింది.

సురేష్ రోజూ టైం ప్రకారము క్లాస్ అటెండ్ అయ్యేవాడు. శ్రద్ధగా గురువు గారు చెప్పినట్లు మెళుకువలు సులభంగా పట్టేసేవాడు. ఇంటి దగ్గర కూడా నిరంతరం మానకుండా సాధన చేసేవాడు. అతని ప్రోగ్రెస్ చూసి గురువు గారు కూడా మెచ్చుకోవడం మొదలు పెట్టాడు. శాంతమ్మ కూడా అప్పుడప్పుడు వచ్చి సురేష్ ప్రోగ్రెస్ మాస్టారు దగ్గర తెలుసుకొని, సంగీతం కూడా సురేష్ కు బాగా అబ్బిందని తెలిసి చాలా ఆనంద పడింది. ఆమెకు వాడే లోకము. వాడి సంతోషమే తన జీవితము. వాడి అభివృద్దే తన జీవన సాఫల్యం.

ఇలావుండగా ఒక రోజు సురేష్ సంగీత పరిజ్ఞానం ఎంతవరకు వచ్చిందో కనుక్కోవడానికి గురువు గారి వాడకు వెళ్లినప్పుడు సురేష్ ఆ వూళ్ళో జరిగే పెద్ద పాటల పోటీ కి సెలెక్ట్ అయ్యాడు అని తెలిసి ఆనందముతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది శాంతమ్మ.

సంగీత పోటీకి ఇంక మూడు వారాలు ఉందనగా సురేష్ క్లాస్ కి రావడము మానేసాడు. గురువు గారు ఆరా తీశారు . పని వత్తిడి వల్ల సురేష్ వాళ్ళ అమ్మ శాంతమ్మ కు జబ్బు ముదిరిందని ఆమెను హాస్పిటల్ లో చేర్చారని ఎవరో చెప్పారు. ఆయన పనుల బిజీ వల్ల చూడడానికి వెళ్లలేక పోయాడు. సురేష్ తన స్టూడెంట్స్ అందరిలో ఫస్ట్ లో వున్నాడు. పోటీ కంటూ వెళ్ళితే బహుమతి ఖాయం.

కానీ వాడు పోటీ కి వస్తాడో రాడో కూడా తెలియదు. వాళ్ళ అమ్మని తీసుకొని తన మేన మామ ఊరికి ట్రీట్మెంట్ కి తీసుకెళ్లారు అని తెలిసింది. వాళ్ళ అమ్మకి నయం కావాలని, వాడు పోటీ లో పాడి గెలవాలని మాస్టారి మనోవాంఛ. భగవంతుణ్ణి ప్రార్ధన చేస్తూనే వున్నాడు.

&&&& &&&& &&&&

ఆ ఊరి టౌన్ హాల్ లో పాటల పోటీలు మొదలయ్యాయి. ప్రఖ్యాత సినిమా సంగీత దర్శకులు, గాయకులూ జడ్జెస్ గా ఆసీనులయ్యారు. హాల్ కిట కిట లాడుతున్నది. మాస్టారు కూడా మొదటి వరుసలో కూర్చున్నాడు. పోటీ దారులు ఒకరి తర్వాత ఒకరు స్టేజి మీద పాడుతున్నారు. తామే విజయము సాధించాలని నూరు శాతం కృషి చేస్తున్నారు. వారి తల్లి తండ్రులు, శ్రేయోభిలాషులు వాళ్ళ విజయానికి ప్రార్థిస్తున్నారు. చూడడానికి వచ్చిన ప్రేక్షుకులు ఆనందిస్తూ విజేతలఫై తమ తమ అంచనాలు వేస్తూ పక్క వారితో చర్చిస్తున్నారు. కోలాహలంగా వుంది సభా స్థలి.

“తరవాత వచ్చే సింగర్ సురేష్ అతను "నగవులు నిజమని నమ్మేదా" అనే అన్నమాచార్య కీర్తన పాడుతాడు. అతనిని స్టేజి మీదకి రావాల్సింది గా మనవి.” అని ఆ సభను నిర్వహించే ప్రయోక్త అన్నాడు.

సురేష్ స్టేజి మీదకి వచ్చి వంగి సభలోని వారికి వందనాలు చేశాడు. తరవాత కళ్ళు మూసుకొని పైకి చూస్తూ  మనసులో అమ్మను స్మరించుకున్నాడు. సభకు, న్యాయ నిర్ణేతలకు, తన సంగీత గురువు సుబ్రహ్మణ్యం గారికి నమస్కరించి మైక్ నోటి దగ్గరకు తీసుకొని పాట పాడడము మొదలు పెట్టాడు. చాలా స్పష్టంగా గొంతు ఎత్తి హృదయ రంజకంగా పాడాడు. మైక్ లేక పోయినా చాలా దూరము వినపడే అంత గట్టిగా పాడుతున్నాడు. ప్రేక్షకులను మంత్ర ముగ్గులను చేశాడు. శ్రోతలను వేరే లోకాలకు తీసుకెళ్లాడు. అతనిని ఎవరో గాన గంధర్వుడు ఆవహించినట్లు ఆ పోటీకి విచ్చేసిన వారందరికీ అనిపించింది.

పాట ముగించే సరికి ప్రేక్షకులు అందరు లేచి నిలబడి దాదాపు మూడు నిమిషాలు సేపు చప్పట్లు మోగించారు.

సుబ్రహ్మణ్యం మాస్టారు కూడా సురేష్ ఇంత బాగా పాడుతాడని ఊహించ లేదు. చప్పట్లు సద్దుమణిగాక, ఆ పోటీల ప్రయోక్త సురేష్ ని అభినందించి “నీవు ఈ రోజు ఇంత బాగా పాడడానికి కారణము ఏదైనా ఉందా” అని అడిగాడు.

అందుకు సురేష్,

"ముందు మా గురువు గారు సుబ్రమణ్యం గారికి, ఆయన శిక్షణకు, ఆయన నా ఫై చూపిన అనురాగానికి నేను జన్మ జన్మలకి ఋణ పడి వుంటాను." ఆ మాటలకు మాస్టారు కళ్ళు నీళ్ల పర్యంతం అయ్యారు.

సురేష్ ఇంకా కొనసాగించాడు. కళ్ళలో నీరు, గొంతు బొంగురు పోయింది. నేను ఇంత బాగా పాడడానికి ముఖ్య కారణం   మా అమ్మ శాంతమ్మ. పోయిన వారమే మృత్యువు తో పోరాడి స్వర్గం చేరింది. ఈ కార్యక్రములో ఆమె లేదు అనే లోటు,  బాధ వున్నా, ఒక విషయంలో చాలా సంతోషంగా వుంది. ఆమె బతికినప్పుడు వినికిడి సమస్యతో బాధపడేది. బాగా అరిస్తే కానీ వినబడేది కాదు. నా పాట విని ఆనందపడే అవకాశము ఆమె చెవులకు లేదు.

కానీ, నేడు నా పాట ఆమె హృదయానికి వినబడే ఉంటుంది. ఈ రోజు నేను అంత బాగా పాడడానికి కారణము స్వర్గం లోని "అమ్మ వినాలని". వినే ఉంటుంది తన హృదయంతో, ఆత్మతో."

సభలో కంట తడిపెట్టని వారు లేరు.

* * * సమాప్తం * * *

Posted in August 2019, కథలు

6 Comments

  1. Anupama

    శ్రీనివాసమూర్తి గారు ధన్యవాదాలు.నా మనసు,కళ్ళు కూడా తడితో బరువుగా అనిపించింది.చాలా చాలా బాగా రాసారు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!