Menu Close
తెలుగు పద్య రత్నాలు
-- ఆర్. శర్మ దంతుర్తి
ఉ. ముప్పున గాలకింకరులు ముంగిట నిల్చినవేళ, రోగముల్
    గొప్పరమైనచో గఫము కుత్తుకనిండినవేళ, బాంధవుల్
    గప్పినవేళ మీ స్మరణ గల్గునో గల్గదో, నాటి కిప్పుడే
    తప్పక చేతు మీ భజన ….

చాలామందికి తెల్సిన శతకంలోనిదే ఈ పద్యం. అయితే ఇది ఏ శతకం లోనిదనేది కనిపించకుండా ఉండడానికి నాలుగో పాదం అసంపూర్తిగా ఉంచుదాం ప్రస్తుతానికి. ఇది ఎవరు రాసారో చెప్పండి చూద్దాం?

మనలో చాల మందికి ఉన్న భ్రాంతి ఏమిటంటే, జీవితం అతి చిన్నది. ఉన్నవి దొరికినంతలో ఎక్కడికక్కడ అనుభవించాలి. ఎప్పుడో రాబోయే చావుకి ఇప్పట్నుంచీ ఎందుకు గొడవ? అది రావడానికి ముందు యవ్వనం, ఉద్యోగం, పెళ్ళీ, పిల్లలూ అవీ కానిచ్చి వార్ధక్యం వచ్చాక అప్పుడు రామా కృష్ణా అనుకోవచ్చు. అయితే ఇందులో ఉన్న చిక్కు ఏమిటంటే, మనం జీవితంలో రోజూ ఏ విషయంమీద మనసు పెడతామో అదే మనకి అలవాటౌతుంది. అంటే జీవితాంతం పెళ్ళీ, పిల్లలూ, వాళ్లజీవితాలూ మిగతా అనుభవాలు అవీ ఆనందిస్తూంటే ఈ లోపునే మనకి ఏ రోగమో అంటుకోవడం జరుగుతుంది. అప్పుడు ఇన్నాళ్ళూ అసలు ప్రయత్నమే చేయని మనకి నోట్లోకి కానీ మనసులోకి కానీ భగవంతుడు గుర్తుకు వస్తాడా? పోనీ ఎంతకాలం బతుకుతాం అనేది మనకి తెలుసా? ఈ పద్యంలో చెప్పేది అదే.

చావు వచ్చేటప్పుడు కాలకింకరులు – యముడి భటులు వచ్చి గుమ్మంలో నించున్నారు. నేను రాను, ఇంకా కొంచెం సమయం కావాలి అని అడగడం కుదరదు. రోగముల్ గొప్పరమైనచో – విపరీతమైన వ్యాధితో వళ్ళు కుళ్ళి పోయింది. ఆ వ్యాధుల వల్ల గొంతుకలో కఫం నిల్చిపోయి మాట రావడంలేదు. మనసంతా వ్యాకులం చచ్చిపోతానేమో అని. అప్పుడైనా భగవంతుడి రూపు గుర్తు తెచ్చుకుందామంటే చుట్టూరా బంధువులు – బాంధవుల్ కప్పినవేళ – తమ మొహం చూపించడానికి వాళ్ళకి తహ తహ, పోయేవాడికి చివరి చూపు ఎవర్ని చూద్దామా అనే. అప్పుడు నీ స్మరణ కలుగుతుందో లేదో? భగవంతుడా ఇప్పుడే, బలసత్వాలు ఉన్నప్పుడు నీ భజన చేస్తాను అంటున్నాడు కవి.

ఇంతకీ కవి ఎవరో కనిపెట్టారా? లేకపోతే ఈ నాలుగోపాదం చదవండి పూర్తిగా

తప్పక చేతు మీ భజన దాశరధీ కరుణాపయోనిధీ

ఇది కంచర్ల గోపన్న రాసిన దాశరధీ శతకంలోనిది. గోపన్న భద్రాద్రి రాముడికీ ఆయన పరివారానికీ నగలు ప్రభుత్వ సొమ్ముతో చేయించి, దాని వల్ల కారాగార శిక్ష అనుభవించి రాముడి కోసం ప్రాణాలు పణంగా పెట్టినవాడు. ఏ పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ రాముడి మీద నమ్మకం పోగొట్టుకోలేదు. అన్నింటి కన్నా విచిత్రం, ఇంత చేసి గోపన్న కూడా రాముణ్ణి వేడుకుంటూ, “క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా, ఏ తీరుగ నను దయచూచెదవో’ అనగల అతి చనువున్న భక్తుడు. అయితే ఆయన ఆలకించకపోతే, “పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా?” అని దబాయించగలడుకూడా. అలా అడిగినా ఇంకా ఏమీ చేయకపోతే, “సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్రా నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్రా” అని వెక్కిరించగలడు కూడా.

అంటే భగవంతుణ్ణి ఎక్కడో ఉన్నాడనీ ఎప్పుడో వస్తాడనీ కాకుండా, ఇప్పుడే, ఇలారా, వస్తావా, లేదా అని అడగగల సత్తా ఉన్నప్పుడు ఆయన వచ్చితీరుతాడు. ఎంత త్వరగా వస్తాడనేది, మన మనఃస్థితి బట్టి ఉంటుందనేది తెలుసుకుంటే చాలు. గజేంద్రుడిలా మారి ‘కావవే రక్షించు భద్రాత్మకా’ అన్నప్పుడు ఆ రావడం “సిరికిం జెప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడే…” అన్నట్టూ మనకి అవగతం అవుతుంది.

ఇదే రామకృష్ణ పరమహంస చెప్పడం కూడా మనం చూడవచ్చు. “అమ్మ భవానీ ఏదైనా ఇవ్వగలదు. వెళ్ళు, దభాయించి అడుగు, నువ్వు ఉన్నావా, ఉంటే రా వచ్చి నాకు కనిపించు. ఆనందం అనేది అడిగి మరీ తీసుకో. అలా నమ్మకంగా త్రికరణశుధ్ధిగా అడిగినప్పుడు ఇవ్వనూ అని ఎలా అంటుంది?”

బుద్ధుడు సన్యాసం తీసుకున్నప్పుడు కూడా, జవసత్వాలు ఉన్నప్పుడే కానీ, ఎప్పుడో ముసలితనం వచ్చాక కాదు. అదే రామదాసు ఈ పద్యంలో చెప్పేది. ఎప్పుడో యముడి పిలుపు వినిపించినప్పుడు మనం ఎక్కడ ఉంటామో, ఏ స్థితిలో ఉంటామో? అప్పుడు అసలు మన మనసులో ఏముంటుందో ఎవరికెరుక. అందుకే ఇప్పటినుంచే – అంటే గుర్తు వచ్చినప్పటినుండి, జవసత్వాలు ఉన్నప్పటినుండే భగవంతుణ్ణి స్మరించాలి అని చెప్తున్నాడు గోపన్న.

 

****సశేషం****

Posted in August 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!