Menu Close
బిడ్డా.. నువ్వు గెలవాలి!
-- వేణు నక్షత్రం --

“నాన్నా రేపటి నుండి లాక్ డౌన్ ఎత్తేస్తున్నారట, చెల్లి కూడా ఇప్పుడే ఫోన్ చేసింది. అందరమూ కలిసి రేపొస్తం” అంది కవిత చాలా రోజుల తర్వాత తల్లితండ్రుల్ని చూస్తున్నాననే సంతోషంతో. “రండ్రి బిడ్డా రండ్రి! ఒక్కూర్లే ఉన్నట్టే కానీ, ఎన్ని రోజులాయె మిమ్మల్ని సూడక! ఈ మాయదారి కరోనా వచ్చి అందరినీ ఆగమాగం చెయ్యవట్టె” విచారంగా కొంత వేదాంత ధోరణిలో అన్నాడు నారాయణ.

కరోనా మహమ్మారి తన ప్రతాపంతో ప్రపంచాన్ని వణికిస్తుంది. పిట్టల్లా జనాలు నేల కొరుగుతున్నారు. ప్రపంచం అంతా లాక్-డౌన్ లో ఉంది. ఒక సేల్స్ ఆఫీసులో అకౌంటెంట్ గా పని చేస్తున్న కవిత కూడా ఇంటికే పరిమితం అయ్యింది. కవిత చెల్లి సవిత, ఒక ఎం.ఎన్.సి లో వైట్ కాలర్ ఉద్యోగం. అందరూ హైదరాబాద్ లోనే ఉన్నా కేవలం స్కైప్, జూమ్, వాట్సాప్ లలో చూసుకోవడమే తప్ప ప్రత్యక్షంగా కలుసుకోక చాలా రోజులు అయ్యింది.

ఇంటికొచ్చిన బిడ్డలిద్దరినీ చూడగానే, యుద్ధానికి వెళ్లి విజయంతో తిరిగి వచ్చిన సైనికుల్ని చూసినట్లు సంతోషంతో ముఖం వెలిగిపోయింది తల్లితండ్రులిద్దరికీ. అందరూ ఒకరికొకరు కౌగలించుకుని కళ్ళు చెమర్చారు కొద్దిసేపు. తెలిసిన వాళ్ళు కరోనా భూతానికి బలైపోయిన విషయాలు కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

నారాయణకు ఐదేండ్ల క్రితం గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. అప్పటి నుండీ ఆరోగ్యం రోజు రోజుకీ కొంత దెబ్బతింటుంది. మీడియా అత్యుత్సాహంతో భయపెట్టే కరోనా వార్తలు, చూసీ చూసీ నారాయణ మానసికంగా, శారీరకంగా ఇంకా క్రుంగి పోయాడు! బక్క చిక్కి పోయిన తండ్రిని చూడగానే బాగా జాలేసింది బిడ్డలిద్దరికీ.

వెళ్తూ వెళ్తూ తండ్రికి ఇష్టమయిన మద్యం ఒక చిన్న బాటిల్ తీసుకుపోయింది కవిత. బాగా బతికిన రోజుల్లో, వారంలో ఒకటి రెండు సార్లు మద్యం తీసుకునే వాడు. ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందుల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల కూడా బాగా తగ్గించేసాడు. “ఎందుకు బిడ్డా గివన్నీ! వద్దని చెప్పినాను కదా!!” అన్నాడు కొంచెం నిష్టూరం కలిసిన ప్రేమతో తీసుకుంటూ! తల్లి కూడా వారించింది బిడ్డని ఎందుకివన్నీ అని.

వెంటనే వెళ్లి ఒక గ్లాసు తెచ్చుకొని కొద్దిగా మందు ఒంపుకుని బిడ్డలను పక్కన కూర్చుండ బెట్టుకొని ఒక సిప్పు తీసుకున్నాడు నారాయణ. తల్లి చేసిన పకోడీలతో తండ్రికి కంపెనీ ఇస్తూ కూర్చుని మాట్లాడుతున్నారు అందరూ.

“బిడ్డా.. నీకు చాలా రాజుల రోజుల నుండి ఒక ముచ్చట చెపుదాము అనుకుంటున్నాను! ఇగో అందరున్నారు కదా ఇనుండ్రి” అని ఒక సుక్క మందు నోటితో జుర్రుకొని మొదలుపెట్టాడు.  కవితకి అర్థం అయ్యింది ఏదో అతి ముఖ్యమైన విషయంచెప్పబోతున్నాడని. 'మందు పడ్డప్పుడే ఏవేవో మాట్లాడతాడు' అని అనుకోవాలని తండ్రి ప్రయత్నం, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడానికే మందు తాగుతాడు అని, మందు లేకపోతె మాట్లాడలేడు అనే విషయం ఎప్పుడో అర్థమయ్యింది ఇంట్లో అందరికీ.

“బిడ్డా, ఇగ నేనా ఇంకెక్కువ రోజులు బతకను. నీకు తెల్వంది కాదు, వయసు డెబ్బయి దాటిపోయి మూడేండ్లయిపాయె. రోజు రోజుకూ ఏవో కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. మూణ్ణెల్ల కింద దమ్ము తీసుకోవడంలో ఇబ్బంది అయితే మీరు దవాఖానకు తీసుకుపోయి ఆక్సిజన్ పెట్టిచ్చుట్ల మళ్ళా మంచిగయితిని. దమ్మొచ్చిన్నప్పుడన్న మీరు దగ్గరుండి దవాఖానలకు తింపుతుండ్రు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కాకపొతే రేపో, ఎల్లుండో, ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే! ఇంక నేనా సాధించేది ఏదీ లేదు, కానీ ఒక్క మాట!” అని మరొక్క సిప్పు జుర్రుకుని మళ్ళీ మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వింటున్నారు తల్లీ కూతుళ్లు.

“నాకా కొడుకులు లేరు, ఉన్నది మీరిద్దరే! మిమ్మల్ని కూడా కొడుకుల్లేక్కనే పెంచిన, సదివిపిచ్చిన కద! రేపు నేను పోతే మాత్రం, నాకు తలకొరివి నువ్వే పెట్టాలె!” అని ఒక పకోడీ ముక్క తీసుకున్నాడు.

“ఎక్కడయినా పెద్ద కొడుకు తండ్రికి, చిన్న కొడుకు తల్లికి అంతిమ సంస్కారాలు చేస్తారు. మీరు అదే పాటించుండ్రి. ఇదొక్కటి చేస్తానని మాటివ్వు!” అని కవిత చేయి తీసుకుని చేయి చాపాడు నారాయణ. తండ్రికి పెద్ద కూతురు అంటే తాను, తల్లికి తన చెల్లి సవిత అంతిమ సంస్కారాలు చేయాలని, తల్లి నొచ్చుకోకుండా చెప్పడం గ్రహించింది కవిత. అనుకోకుండా ఇలాంటి కోరిక కోరడంతో కొంత ఉద్వేగానికి గురయ్యారు తల్లి కూతుళ్ళు.

“నాన్నా.. ఇప్పుడవన్నీ ఎందుకు? నీకేమి కాదు. నేను చూసుకుంటాలే, నేనున్నాను కదా!” వేడెక్కిన వాతావరణాన్ని కొంత తేలిక చేయాలని ప్రయత్నించింది కవిత. సవిత కూడా జత కలిపింది అక్కతో. తల్లి కొంత బాధగా లేచి అక్కడి నుండి వంటింట్లోకి వెళ్ళింది.

“అవునమ్మా, నేను అదే చెపుతున్నాము, నువ్వున్నావనే నా ధైర్యం. నాకు తెలుసు, ఈ సుట్టాలు ఒక పట్టాన నెగలనియ్యరు. మిమ్మల్ని సదివించాలంటేనే, నేను ఎందరికో సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ‘ఆడోల్లకు సదువెందుకు, సక్కగ పెద్ద మనిషి కాగానే పెళ్లి చేస్తే సరిపాయె’ అని అందరూ అనేటోళ్లే. వాళ్ళు అట్ల అన్నందుకన్నా, జిద్దు తోటి మీ ఇద్దరినీ చదివించిన బిడ్డా. నేనా సదువుకోక పోతి, ఏదో కంపెనీల రోజుకూలి కింద పని జేస్తి. మీకు నా అసుంటి కష్టం రావద్దని చదివిస్తి. నాకు మాత్రం కొడుకులయినా బిడ్డలయినా మీరే కద!” కొంత ఉద్వేగానికి గురయ్యాడు నారాయణ.

మాట్లాడడానికి, వినడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ, నాన్న కోరుతున్నది చాలా న్యాయమైన కోరికే అని అర్థం అయ్యింది కవితకి. ఆడపిల్లల్ని చదివించడం కూడా ఒక విప్లవాత్మక మార్పు నారాయణ కుటుంబంలో. ఆడపిల్లై ఉండి మొట్టమొదట స్కూల్ కి వెళ్ళింది కవితనే వాళ్ళ కుటుంబంలో. కవితకి ఈ విషయం తండ్రి చెప్పినప్పుడు చాలా గర్వంగా అనిపించేది. తండ్రి అడిగిన కోరికకి కవిత సమాధానం చెప్పే వరకు ఊరుకోలేదు నారాయణ. సరే అని చేతిలో చెయ్యి వేసింది కవిత, అప్పటికి గానీ శాంతించలేదు నారాయణ.

ఆ తర్వాత కొద్దిసేపు అవీ ఇవీ మాట్లాడి భోంచేసి బయలు దేరారు కవిత, సవిత. తండ్రి గురించి ఆలోచిస్తుంటే చాలా బాధేసింది కవితకి. తన స్కూటీ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్లుతుంటే జ్ఞాపకాలు తన చిన్నప్పటి రోజుల్లోకి వెళ్లాయి.

*** *** *** ***

“ఇద్దరూ అమ్మాయిలే, ఒక బాబు ఉంటే బాగుండు” అని చిన్నప్పుడు తల్లి సరోజ చాలా సార్లు అనేది తండ్రి తో.

“కొడుకైతేనేమీ, కూతరయితే నేమి,మళ్ళీ పిల్లగాడే పుడతాడని గ్యారంటీ ఏమిటి?” అని గట్టిగా వాదించేవాడు తండ్రి తల్లితో.

మరోసారి అడగడానికి అవకాశం లేకుండా తానే వెళ్లి, పిల్లలు పుట్టకుండా వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు. మళ్ళీ అమ్మాయే పుట్టిందని ఎందరో తండ్రులు, పురిట్లోనే పసిపిల్లల్ని అంతమొందించండం లాంటి ఎన్నో వార్తలని చూసింది కవిత. కానీ తన తండ్రి ఇద్దర్నీ ప్రేమగా పెంచడం, తండ్రి పట్ల చాలా గౌరవం పెరిగింది. ఇద్దరూ అమ్మాయిలే అని, ఎప్పుడూ చిన్న చూపు చూడలేదు. సరిపోయీ, సరిపోనీ జీతంతో తాను, తిన్నా తినకున్నా కూడా ఇద్దరినీ గ్రాడ్యుయేషన్ వరకూ చదివించాడు.

నారాయణకు ఒక అన్న ఉండేవాడు, కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఒకరోజు ఇంటికి వచ్చిన ఆయన “అరేయ్ నారాయణా, నీకు ఎట్లాగూ మగపిల్లలు లేరు కదా! నా ఇద్దరి పిల్లల్లో ఎవర్నో ఒకర్ని దత్తత తీసుకుంటే వాడు మీ ఆలుమగలిద్దరినీ ‘పున్నామ నరకం’ నుండి రక్షిస్తాడు” అన్నాడు. అప్పుడు నారాయణ వినీ విననట్టే ఆవిషయాన్ని దాటేసాడు. ఆయన వెళ్లిన తర్వాత “ఆ కనపడని పున్నామనరకం ఉందో లేదో కానీ, వాళ్ళు మన ఇంటికి వస్తే మాత్రం ప్రత్యక్ష నరకమే! నా పిల్లలు నాకు చాలు, వాళ్ళని ప్రయోజకులుగా చేస్తే అంతకంటే స్వర్గం ఏముంటుంది?” అని ఆరోజు నారాయణ తన ఇద్దరు బిడ్డల్నీ పొగడుతూ కొంత వేదాంత ధోరణిలో భార్యతో చెప్పడం ఇప్పటికీ మరచిపోలేదు కవిత.

ఇద్దరు కూతుళ్ళని కొడుకుల్లాగే పెంచాడు, కానీ కొడుకు అవసరం ఏంటో ఆ రోజుల్లో అమ్మ అంతగా ఎందుకు కోరిందో ఇప్పుడర్థమయ్యింది కవితకి. కొడుకు మాత్రమే నిర్వహించే ఒక బాధ్యత మిగిలి ఉంది అని ఈరోజే తెలిసింది కవితకి. కానీ తండ్రి మాత్రం, ఆ భాధ్యతను కూడా కూతుళ్లే నిర్వహించాలని ఈ రోజు మాట వేయించుకోవడం చూస్తే, ఆడ పిల్లల్ని ఇంతగా ప్రేమించే తండ్రి అంటే మరోమారు గౌరవం పెరిగింది కవితకి.

ఈ మధ్య లాక్ డౌన్ సమయంలో తండ్రికి శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది అయితే ఎవరికీ ఫోన్ చెయ్యొద్దు అని తల్లితో ఒట్టు వేయించుకుని బాధనంతా తండ్రి కడుపులోనే తెగ మింగుకున్నట్టు అమ్మ చెప్పింది ఏడుస్తూ. కరోనా మొదలవ్వని రోజుల్లో, ఇంటికి దగ్గరి లోని నర్సింగ్ హోమ్ కి తీసుకు వెళ్తే కొన్ని గంటలు ఆక్సిజన్ పెట్టితే, మళ్లీ మామూలు స్థాయికి వచ్చే వాడు. ఇప్పుడు ఆ నర్సింగ్ హోమ్ లో ఎవరికో కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల మూసివేశారట. బయటకి పోయే పరిస్థితి లేనందువల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలిగించొద్దు అన్నాడట. ఆ విషయం విన్నప్పటి నుండీ మనసు మనసులో లేదు కవితకి, తండ్రి పరిస్థితి గుర్తొచ్చి రెండు కళ్లూ నీటితో నిండిపోయాయి. తండ్రి ఆలోచనలు వెంటాడుతుండగా ఇంటికి చేరుకుంది కవిత.

*** *** *** *** ***

ఎప్పటి నుండో బిడ్డలతో చెప్పాలనుకున్న మాటలు చెప్పేయడంతో మనసు చాలా తేలికయ్యింది నారాయణకి. చాలా సంతోషంగా కూడా ఉంది. నారాయణకి కవిత అంటే చాలా ప్రేమ, నమ్మకం. ఆలోచనలు కవిత చుట్టూ తిరుగుతున్నాయి. కొడుకులా పెంచినందుకు తన కుంటుంబాన్ని కూడా మగవాడి లాగే దగ్గరుండి నడిపిస్తుంది, చాలా ధైర్యవంతురాలు. క్వారీలో పనిచేస్తున్న భర్తకు దుమ్ము, ధూళితో ఆస్తమా వచ్చి, జీతం కన్నా హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతుంటే, ఉద్యోగం మానేపించి ఏదైనా వ్యాపారం చెయ్యమని చెప్పింది. భర్త రియల్ ఎస్టేట్ అని ఎచ్చులకు పోయి అప్పుల్లో కూరుకుపోతే, కవిత ఉద్యోగం చేస్తూ తనే కుటుంబాన్ని పోషిస్తుంది ఇప్పుడు. అంతే కాకుండా ఈ మధ్యనే బ్యాంకు నుండి లోను తీసుకుని, తన వంటిమీద ఉన్న బంగారం కూడా అమ్మేసి, ఒక ఇంటికి యజమాని కూడా అయ్యింది. ఆడవాళ్లు తమ కిష్టమయిన బంగారాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడరు, కానీ కుటుంబం కోసం సంతోషంగా బంగారాన్ని అమ్మేసింది కవిత. ఈరోజుల్లో భార్య మెడలో ఉన్న బంగారం కోసం హింసించి తీసుకెళ్లే భర్తలున్నారు. ఇప్పుడు భర్త కూడా బంగారం అమ్మొద్దని చెప్పినా రేపటి రోజుల గురించి ఆలోచించడం కవిత దూర దృష్టికి, కుటుంబం పట్ల వహిస్తున్న బాధ్యతలని చూస్తే చాలా గర్వంగా ఉంది తండ్రికి. కానీ ‘లోను’ తీర్చడానికి, సంసారాన్ని నడిపించడానికి కవిత పడుతున్న కష్టాన్ని, ఆమె బోసి పోయిన మెడను చూస్తూ తట్టుకోలేక పోయేవాడు నారాయణ. ఆలోచనలు కవిత చుట్టూ తిరుగుతుంటే, ఒక భారం దిగిపోయిన తృప్తితో హాయిగా నిదురపోయాడు నారాయణ.

*** *** *** *** ***

కరోనా ఇప్పట్లో తగ్గేలా లేదు, కరోనాతో  కలసి ప్రయాణించాల్సిన అవసరం ఉంది అని,  ప్రభుత్వం అన్ని వ్యాపారాలు, ఆఫీసులు ప్రారంభించుకోవచ్చు అని ప్రకటన చేయడంతో మెల్లమెల్లగా వ్యాపారాలు తెరచుకుంటున్నాయి.

ఆఫీసుకుకి రమ్మని, మేనేజరు నుండి ఫోన్ రావడంతో మాస్క్ ధరించి, భయం భయంగా ఆఫీసుకి వెళ్ళింది కవిత. లాక్-డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా కేసులు విపరీతంగా బయట పడుతున్నాయి. కనిపించని శత్రువుతో అందరిలో గుబులు మొదలయ్యింది. కవిత గత అయిదు సంవత్సరాలుగా వెళ్తున్నది అదే ఆఫీసు, అదే వీధి, అదే మనుషులు- కానీ ఇప్పుడు అంతా కొత్తగా, శత్రువులు లేని యుద్ధభూమిని తలపిస్తుంది. కనిపించిన ప్రతి ఒక్కరూ, ఒకరికి-ఒకరు శత్రువులాగే కనిపిస్తున్నారు. రోజూ పక్క పక్కనే కూర్చుని గంటలకొద్దీ మాట్లాడుతూ పనిచేసిన కొల్లీగ్స్ తో కూడా ఇప్పుడు పక్కన కూర్చోవాలి అన్నా, మాట్లాడాలన్నా భయం. మాస్కులు ధరించడం వల్ల తెలిసిన వాళ్ళని కూడా కొన్ని సార్లు కొత్త గా పరిచయం చేసుకోవాల్సిరావడం వింతగా ఉంది. పక్క ఆఫీసుల్లో పని చేసే ఇద్దరు వ్యక్తులు కరోనాతో చనిపోయారు అని తెలిసి ఆఫీసు బయటకి వెళ్ళడానికి చాలా భయపడింది కవిత.

అప్పటికి ఒక వారం గడిచింది. మెల్లి మెల్లిగా పరిస్థితులకు అలవాటు పడుతున్నారు ప్రజలు. రోజులాగే ఆ రోజు కూడా ఆఫీసుకి వెళ్ళింది. వీలయినప్పుడన్నా తల్లి తండ్రులతో మాట్లాడుతుంది. తండ్రికి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాడు అన్న విషయం తెలిసినప్పటి నుండి రోజూ రెండు మూడు సార్లు ఫోన్ చేసి పరిస్థితి కనుక్కుంటుంది కవిత. ఆఫీసుకి వెళ్లే ముందు ఫోన్ చేసి మాట్లాడింది తండ్రితో.

"నాకేమయింది బిడ్డ, నేను మంచిగున్న. ఏం ఫికర్ చేయకు” అన్నాడు నారాయణ. ఆ తర్వాత ఆఫీసుకి వెళ్లిన కవిత పనిలో బిజీ అయిపొయింది, అంతలో అనుకోకుండా అమ్మ నుండి ఫోన్ వచ్చింది “నాన్నకి శ్వాస తీసుకోవడం లో చాలా ఇబ్బంది అవుతుంది” అని. ఇంకేమాత్రం ఆలస్యం చేయక వెంటనే ఇంట్లో ఉన్న భర్తకి ఫోన్ చేసి, తండ్రిని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని చెప్పింది కవిత. ముందు ఫోన్ చెయ్యమంది హాస్పిటల్ కి. కరోనా మహమ్మారి వల్ల చాలా వరకు హాస్పిటల్స్ మూసివేయ బడ్డాయి, కొన్ని హాస్పిటల్స్ కేవలం కోవిడ్ కేసుల కోసమే తెరిచారు. కోవిడ్ భయంతో చాలా వరకు హాస్పిటల్స్ సాధారణ పేషంట్స్ ని చూడడం లేదు. కవిత భర్త దగ్గరలోని రెండు హాస్పిటల్స్ కి ఫోన్ చేస్తే నిరాశే ఎదురయ్యింది. సమయం చూస్తే మధ్యాహ్నం మూడు గంటలు. విషయం తెలిసిన కవిత, సహాయం చేస్తారనుకున్న మిత్రులు కొందరికి ఫోన్ చేసింది. కావాల్సింది తాత్కాలిక ఆక్సిజన్ ఏర్పాటు, కానీ ఏ హాస్పిటల్ వాళ్ళు సిద్ధంగా లేరు ఆక్సిజన్ మాస్క్ అమర్చడానికి. కోవిడ్ కేసు కాదు అని చెప్పినా వినే పరిస్థితిలో ఎవరూ లేరు.

ఆక్సిజన్ పెట్టడం ఎలా అని ఆలోచించింది. విషయం కనుక్కున్న కొల్లీగ్, తనకు తెలిసిన ఒక వ్యక్తి ఫోన్ నంబర్,ఇంటి అడ్రస్ ఇచ్చాడు. అతడు ఆక్సిజన్ సిలండర్ తో పేషంట్ ఇంటికే వచ్చి అమర్చుతాడు అన్నాడు. ఇదేదో మంచి సదుపాయం అని వెంటనే ఫోన్ చేసింది ఆనంబర్ కి. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవ్వరూ లేపడం లేదు. భర్తకు కూడా ఆ వివరాలు ఇచ్చి, ఫోన్ లేపక పొతే ఒకసారి వెళ్లి చూసిరమ్మంది. కవిత భర్త వెళ్లి చూస్తే అది ఒక మెడికల్ షాప్, బందు చేసి ఉంది. లోపల ఎవరూ లేరు.

నారాయణ కి ఆయాసం ఎక్కువ అవుతుంది, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది, పరిస్థితి విషమిస్తుంది. చెల్లికి కూడా ఫోన్ చేసింది కవిత. వెంటనే సవిత తన భర్తకు ఫోన్ చేసి రమ్మంది. వాళ్లకు స్వంత కారు ఉంది, వచ్చే వరకు ఉండమని తల్లికి చెప్పింది. కొద్దిసేపు ఎదురు చూశారు, కానీ నారాయణకి ఇబ్బంది కావడంతో ఆటో మాట్లాడుకొని దగ్గరలోని హాస్పిటల్ కి వెళ్లారు అత్త, అల్లుడు. ఆ హాస్పిటల్ వాళ్ళు పేషంట్స్ ని తీసుకోవడం లేదు అని తెలిసినా, బ్రతిమిలాడితే పని అవుతుందేమో అన్న ఆశతో అక్కడి వరకూ వెళ్లారు.  ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లామన్నారు గేటు బయటే. కానీ ప్రభుత్వాసుపత్రిలో ఖాళీ బెడ్స్ లేవు అని ప్రచారం జరుగుతుంది. చేసేదేమీ లేక ఇంకొంత దూరంలో ఉన్న మరొక హాస్పిటల్ కి వెళ్లారు, అక్కడా అదే పరిస్థితి. ఈ లోపుల కవిత కొన్ని హాస్పిటల్స్ కి ఫోన్ చేస్తూనే ఉంది.

ఆటోలో అచేతనంగా భార్య భుజాలపై ఒరిగిన నారాయణకు ప్రాణాలు అవిసిపోతున్నాయి శ్వాస ఆడక. ఊపిరి బిగపట్టుకుంటున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎక్కడన్నా, ఏ హాస్పిటల్ వాళ్ళు అయినా కరుణించి వైద్యం చేస్తారేమో అని ఆశతో గత మూడు గంటల నుండీ దవాఖానా కోసం ఆటోలో తిరుగుతూనే ఉన్నారు. చివరకు సికిందరాబాద్ లో ఒక నర్సింగ్ హోమ్ వాళ్ళు తీసుకు రమ్మన్నారు. వెంటనే అడ్రస్ వాట్సప్ లో పంపింది భర్తకి కవిత. తండ్రిని తీసుకు రమ్మని చెప్పి తానూ బయలు దేరింది హాస్పిటల్ కి. చెల్లి కూడా ఎక్కడికి రావాలో తెలియక కంగారుపడుతుంటే హాస్పిటల్ అడ్రస్ చెప్పింది.

కవిత హాస్పిటల్ కి చేరుకొని, తండ్రి కోసం ఎదురు చూస్తుంది. భరించరాని నొప్పి, చిన్న పిల్లాడిలా విల విల లాడుతున్నాడు. మధ్య మధ్యలో పెద్దగా ఒక శ్వాస తీసుకుంటున్నాడు. దాదాపు ముప్పై నిమిషాల పైనే పడుతుంది హాస్పిటల్ చేరుకోవడానికి నారాయణ దంపతులకి. చుట్టూ హాస్పిటల్సే, కానీ ఏమీ చేయలేక, తన అస్సహాయతకు బాధపడుతూ ఓదార్చుతుంది భర్తని సరోజ. కవిత ఫోన్ చేస్తూనే ఉంది, కానీ తండ్రి మాట్లాడే పరిస్థితిలో లేడు, తల్లితో మాట్లాడుతుంది. హాస్పిటల్ చేరుకోవడానికి ఇంకో పది నిమిషాలు ఉంది అనగా, ఒక దీర్ఘ శ్వాస తీసాడు నారాయణ. అదే చివరి శ్వాస అని ఊహించలేదు ఎవ్వరూ!

కవిత తల్లి తో మాట్లాడుతూ, హాస్పిటల్ సిబ్బందిని సిద్ధం చేసింది. ఈ లోపుల హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆటో రాగానే కంగారు పడుతూ పరుగెత్తింది కవిత. తండ్రి ఉలుకూ పలుకూ లేక ఉండటం మనసు కీడుని శంకించింది. ఆ భయాన్ని తనలోనే దాచుకుంది. అంతలోనే ముందు కరోనా కోసం టెంపరేచర్ చెక్ చేయడానికి నర్సు వచ్చింది, కానీ శరీరంలో ఎలాంటి స్పందన లేక పోవడం వల్ల వెళ్లి డాక్టర్ కి చెప్పింది. డాక్టర్ వచ్చి పల్స్ చూసి, చాలాసేపటి క్రితమే శ్వాస ఆగిపోయింది, ఇంకేం లాభం లేదు, ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడు. విషయం తెలిసి ఘొల్లుమని ఏడ్చారు తల్లీ బిడ్డలు. అంత కష్ట పడి అన్ని హాస్పిటల్స్ తిరిగి వస్తే తండ్రితో చివరి మాటలకి కూడా నోచుకోలేదు అని కవిత కన్నీరు మున్నీరు అయ్యింది.

ప్రతి పేషంట్ ని కరోనా రోగి లానే అనుమానించడం చాలా బాధేసింది కవితకి. ఏదో ఒక హాస్పిటల్ లో కొంత సేపు ఆక్సిజన్ పెట్టితే బ్రతికేవాడు. చుట్టూ హాస్పిటల్లే అయినా ఒక్క హాస్పిటల్ కూడా వైద్యం అందిచండానికి ముందుకు రాలేదు. "ఇది ముమ్మాటికీ హాస్పిటల్ యజమాన్యం చేసిన హత్యనే” గట్టిగా అరవాలనిపించింది, కానీ మాటలు గొంతు పెగల్లేదు.

చాలా కోపం, దుఃఖం వస్తుంది, కానీ తాను కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటే జరగాల్సిన పనులు ఎవరూ చేయరు అని దుఃఖాన్ని కడుపులోనే మింగుకుంది. తల్లిని ఓదార్చడం తమ వల్ల కాలేదు కవితకి. అంతవరకూ స్వంతంగా నడుచుకుంటూ వచ్చి ఆటోలో కూర్చున్న వ్యక్తి కొన్ని నిమిషాల్లో నిర్జీవం అయిపోవడం నమ్మలేకుండా ఉంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోక ముందే సెక్యూరిటీ గార్డ్ వచ్చి, అక్కడినుండి వెళ్లిపోవాలని పురమాయిస్తున్నాడు. ఆటోవాడు నారాయణ పార్థివ శరీరాన్ని అక్కడే దించేస్తాను, తీసుకుపోను అంటాడు. ఒక మనిషి కష్టాల్లో ఉంటే ఏ మాత్రం పట్టించుకోకుండా, సహాయం చేసేది బదులు ఇలా ఇబ్బందులకి గురిచేయడం చూస్తుంటే చాలా కోపం, అసహ్యం కలిగింది కవితకి.

ఒకపక్క చెల్లి కొద్ది సేపట్లో వస్తుంది అని చెప్పింది. ఇక్కడ వెయిట్ చేయడానికి కూడా అనుమతించడం లేదు. అంతవరకూ మనిషిగానే ప్రవర్తించిన ఆటోవాలా సాటి మనిషి మరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం, గత మూడు గంటల నుండీ తన ఆటోలో ఎక్కించుకొని తిరిగిన వారి మనోభావాలను కనీసం పట్టించుకోకుండా, ఆపదలో ఉన్న వారి నుండి ఆర్థిక ప్రయోజనాలకోసం వెంపర్లాడటం చూస్తే ఏమనాలో తెలియలేదు కవితకి. మొత్తానికి కవిత భర్త ఏదో బేరం కుదుర్చుకుంటే సరే అని ఇంటికి తీసుకెళ్లాడు ఆటోవాలా.

తండ్రిని బ్రతికించుకోవాలని ఎంతో ఆరాటంతో కనపడ్డ ప్రతి హాస్పిటల్ తలుపు తడుతూ, చివరికి ఇక్కడికి చేరుకుంటే హాస్పిటల్ సిబ్బంది తమ పరిస్థిని అర్థం చేసుకోకుండా అక్కడి నుండి వెళ్లిపొమ్మని తరిమి వేయడం చూస్తుంటే మానవత్వం అనేది డబ్బు పొరలతో కప్పివేయబడిందా అనిపించింది కవితకి. ఎవ్వరికీ ఇతరుల కష్టాలతో కానీ, వారున్న పరిస్థితిని అర్థం చేసుకోకుండా, కేవలం తమ అవసరాన్ని ఆర్ధిక ప్రయోజనంలా మార్చుకోవడము చూస్తుంటే ఏమనాలో తెలియలేదు కవితకి. ఆటోలో వెళ్తూ చెల్లికి ఫోన్ చేసింది, ఇద్దరూ ఫోన్లో నే ఏడుస్తూ, దగ్గరి చుట్టాలందరికీ కవిత ఫోన్ చేసి చెప్పింది. తల్లి తండ్రుల రక్త సంబంధీకులు అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి తెలిసిన కొన్ని గంటల్లోనే వచ్చారు. కరోనా కట్టడి సమయం కాబట్టి కొద్ది మంది పెద్దవాళ్ళు రాలేము అన్నారు. జరగాల్సిన పనులు ఇద్దరు అల్లుళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

సరోజ చెల్లెలికి ఇద్దరు కొడుకులు భాస్కర్, రమేష్. కవిత - సవిత లతో బాగా కలసి ఉంటారు. నెలకొక సారి అయినా రెండు ఫ్యామిలీలు కలుస్తుంటారు. విషయం తెలియగానే అందరూ వచ్చారు. ఇద్దరు బావలతో కల్సి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కవిత కజిన్స్ భాస్కర్, రమేష్. వారు రాగానే చాలా ధైర్యం వచ్చింది కవితకి, పట్టుకుని ఏడ్చింది చాలా సేపు. అందరూ కవితకి, వాళ్ళ నాన్నకి ఉన్న అనుబంధాన్ని పొగుడుతూ చెపుతుంటే దుఃఖం రెట్టింపు అయ్యింది కవితకి.

పెదనాన్న కొడుకులు, పెద్దమ్మ, కవిత - అత్తా, మామ, మరుదులు అంటే తన భర్త తమ్ముళ్లు, సవిత - అత్తా మామలు, ఆడబిడ్డ అందరూ వచ్చారు. కొత్తవాళ్లు వచ్చినప్పుడల్లా ఏడ్పులు మిన్నంటుతున్నాయి. అప్పటికే దగ్గరి బంధువులందరూ వచ్చారు, చీకటి కాబోతుంది.

“అందరొచ్చినట్టే కదా, ఇంకా ఎవరి కోసం ఎదురు చూసేది లేదు తంతు మొదలు పెట్టండి, అంతిమ సంస్కారాలు ఎవరు చేస్తున్నారు” అన్నాడు కార్యక్రమాలు నిర్వహించే కులపెద్ద. తండ్రి కోరిక ప్రకారం, పెద్ద కూతురు కవిత తలకొరివి పెడుతుంది అని తల్లి చెప్పింది అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కులం పెద్ద మనిషికి. అసలే తండ్రి పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న కవితకి ఆ విషయం అప్పటిదాకా గుర్తుకు రాలేదు. నాన్నకి ప్రామిస్ చేసిన విషయం ఎప్పుడో మర్చిపోయింది ఈ హడావిడిలో. తల్లి చెప్పగానే కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధురాలు అయ్యింది కవిత.

‘పెద్ద బిడ్డ తలకొరివి పెడతదట’ అన్న మాట విన్న కులపెద్ద, వెంటనే అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు కోపంతో. “నా జిందగీల చూడలేదు ఆడోల్లు తలకొరివి పెట్టంగ. చిన్నాయిన, పెద్దనాయిన కొడుకులు ఎవ్వరూ లేరా? అసలు మొగోల్లే లేరా వంశంల అగ్గి పెట్టడానికి? గీ ఆడోల్లు చేసుడేంది?” రెచ్చిపోతున్నాడు మద్యం మత్తులో ఉన్న ఆ పెద్ద మనిషి. బాధిత కుటుంబాల దుఃఖంతో అసలే పనిలేదు, కానీ వారికి మాత్రం మద్యం అందించాల్సిందే అడిగినప్పుడల్లా. ఆయన తృప్తిగా ఉంటే చనిపోయిన వారికి ఆత్మ శాంతిస్తుందని చెప్పుకుంటారు. అందుకే ఆయనకు కోపం రాకుండా చూసుకుంటారు ఇలాంటి సందర్భాలలో.

ఈ వార్త కొన్ని సెకండ్లలో అక్కడ ఉన్న అందరికీ చేరిపోయింది. కొద్దిమంది గుసగుసగా చెవులు కొరుక్కుంటున్నారు ఆడపిల్ల తలకొరివి పెడుతుందట అని.

“అమ్మాయి, మన వంశం వాళ్ళు ఇంకో వంశం వారికి తలకొరివి పెట్టకూడదు. అందులో ఆడ పిల్లలు అసలే పెట్టకూడదు” అన్నాడు కవిత మామ అంటే తన భర్త తండ్రి. సాధారణంగా ఆయన చాలా సౌమ్యుడు, కోడలన్నా మంచి గౌరవం. ఎప్పుడూ తను చేసే అన్ని పనులనూ సమర్థించే మామయ్య కూడా ఈ రోజు ఏదో తప్పు చేసినట్టు వద్దని వారించడం, విషయం అంత సీరియస్ గా ఉంటుందని అనుకోలేదు కవిత.

“మన వంశంలో ఇద్దరు కొడుకులు ఉండగా, వేరే ఇంటికి ఇచ్చిన పిల్లతోటి ఎట్ల తలకొరివి పెట్టిస్తరు? మేమేమన్నా ఆస్తులు, పాస్తులు పంచివ్వమన్నామా తలకొరివి పెట్టినందుకు?” కొడుకులను చూపిస్తూ అంది పెద్దమ్మ అంటే తన తండ్రి అన్న భార్య.

“పెద్ద బిడ్డ తలకొరివి పెడుతుందట, విడ్డూరం కాకపొతే ఎక్కడన్నా విన్నారా? ఇంకో ఇంటికిచ్చిన ఆడిపిల్లలు తలకొరివి పెడతారా? అల్లుళ్ళ కు తెలివి లేదా? ఎట్లా ఒప్పుకుంటారు పెళ్ళాం తలకొరివి పెడుతుంటే?” పెదనాన్న వాళ్లకు సంబంధించిన ఎవరో దూరపు బంధువు అంది అందరికీ వినబడేట్టు, అగ్నికి ఆజ్యం పోసినట్టు.

పనిలో పనిగా అప్పటికే బయటకి వెళ్లిన ఇద్దరు అల్లుళ్ళు కొంత మద్యం సేవించి వచ్చారు. రెచ్చగొట్టే విధంగా ఉన్న ఆ ముసలమ్మ మాటలు ఇద్దరు అల్లుళ్ళూ విన్నారు. పెద్ద అల్లుడు అంటే కవిత భర్త ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోడు, భార్య ని సమర్థిస్తాడు ప్రతీ విషయంలో. అసలే మందు మీదున్న చిన్న అల్లుడు రాజు కి రోషం పొంగుకు వచ్చింది ముసలమ్మ అన్న మాటలు విన్నాక.

“మేము ఇంటి అల్లుళ్ళము, మాకు అన్ని హక్కులు ఉంటాయి. కొడుకుల తర్వాత మేమే కొడుకుల్లాంటి వాళ్ళం. తలకొరివి పెట్టేది మగవాళ్ళు మాత్రమే! మేము, ఆడవాళ్లు పెడితే ఒప్పుకోము. వదినా.. నువ్వే తలకొరివి పెట్టాలనుకుంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం, ఆ తర్వాత నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో! “కవిత భర్త తరుపున కూడా వకాల్తా పుచ్చుకున్నట్టు, అరిచాడు రాజు. సవిత వారిస్తున్నా వినడంలేదు రాజు, ఇంత వ్యతిరేకత తమ ఇంటి నుండే మొదలు అవుతుందని ఊహించలేదు కవిత.

అంత వరకూ తనూ ఇంటి వాడే అన్నట్టు అని పనులు పురమాయిస్తున్న తన చెల్లెలు భర్త ఆవేశాన్ని ఆపుకోలేక అలా అరవడం, ఊహించక తట్టుకోలేక పోయింది కవిత.  ఆపత్కాలంలో అందరూ ఆదుకుంటారని అనుకున్న కవితకి, సమస్య ఇంత జటిలంగా ఉంటుందని ఊహించలేక పోయింది. ఆ రోజు తండ్రి చేతిలో చేయి వేసి మాట ఖచ్చితంగా ఎందుకు వేయించుకున్నాడో, ఆ విషయం తీవ్రత ఎంత ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా అర్థమయింది కవితకి. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్న కవితని ఓదార్చడం అటుంచి, తాగి వచ్చి ఈ రోజు తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా తిరగబడడం తట్టుకోలేక పోయింది. ఎవరో బయటి వారు అంటే తిరిగి జవాబు ఇవ్వాలని అనుకుంది, కానీ తన స్వంత మరిది, పెద్దమ్మ, మామగారు ఇలా అందరూ తన ఫ్యామిలీ అనుకున్న వాళ్ళే ఈ రోజు ఎదురు తిరగడం తట్టుకోలేక పోయింది కవిత. సవితకి భర్తని అనేంత స్వతంత్రం లేదు, కనీసం ఆపడానికి కూడా ధైర్యం లేక పోయింది అలా మాట్లాడుతుంటే. తండ్రికిచ్చిన మాట కోసం ఎట్టి పరిస్థితిలో వెనుకడుకు వేసేది లేదని నిర్ణయించుకుంది కవిత.

“నేను చేస్తున్న పని నా కోసం చెయ్యట్లేదు, నా తండ్రి చివరి కోరిక! నేను తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను” అని గట్టిగా అరిచింది, కానీ ఏడ్చి ఏడ్చి నోరు ఎండిపోయింది, గొంతు కూర్చిండి పోయింది. మాటలు నోరు దాటి రాలేకపోయాయి.

“ఈ సుట్టాలు ఒక పట్టాన నెగలనియ్యరు” ఆ రోజు తండ్రి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. తన ముందు ఏ మార్గం కనపడటం లేదు, కార్యక్రమం నిర్వహించాల్సిన కులపెద్ద చాలా కోపంగా ఉన్నాడు. బాగా ఆలోచిస్తుంది ఎలా మొదలు పెట్టాలా అని. ఎవరో మంచి నీళ్లు తెస్తే తాగి గొంతు తడుపుకుంది. కులపెద్దని ఏమన్నా అంటే పరిస్థితి ఎక్కడికో పోతుంది, ఆయన ఈగో హర్ట్ కాకుండా పరిస్థితి అర్థం చేయాలి అనుకుంది కవిత. ఆయన కనుక అలిగిపోతే అరిష్టం అంటారు, ఇక అందరితో మాటలు పడాలి. బాగా ఆలోచించింది, పుట్టెడు దుఃఖంలో కూడా తన బాధ్యతని మరచి పోలేదు.

కవిత ఏమీ మాట్లాడక పోవడం చూస్తుంటే భాస్కర్ కి చాలా కోపం వచ్చింది. భాస్కర్ తమ్ముడు రమేష్ కూడా పరిస్థితి గమనిస్తున్నాడు. కానీ కవిత అంత తొందరగా దేన్నీ వదులుకోదు అని తెలుసు వాళ్ళిద్దరికీ. కవిత భర్త కూడా చూస్తూ ఉన్నాడు కానీ ఎవరినీ ఏమంటే పరిస్థితి ఎలా మారుతుందో అర్థం కాక మౌనంగా చూస్తున్నాడు. తన భార్య అంతిమ సంస్కారాలు చేయడం అతనికేమీ అభ్యంతరం లేదు, తనకు తండ్రి అంటే ఎంత ప్రేమనో తెలుసు. కవిత తల్లి కూడా పుట్టెడు దుఃఖంలో ఉంది, కూతురు పరిస్థితికి లోపల చాలా చింతిస్తుంది. తన భర్త చివరికోరిక దక్కక్కుండా పోతుందేమో అని అంత దుఖంలోనూ భయపడుతున్నది.

కవిత తన మౌనాన్ని అంగీకారం అనుకున్నాడు మరిది. తన ఆలోచనలని తీవ్రం చేసింది. ఈ రెండు మూడు నిమిషాల్లో తాను మాట్లాడక పొతే, మరెప్పటికీ సరిదిద్దుకోలేని ఒక పెద్ద తప్పు, తన తండ్రి చివరికోరికను తీర్చలేని అసమర్ధురాలి గానే జీవితమంతా మిగిలిపోవాలి, అనుకుంది.

“తండ్రి తమ కోసం ఎంతో చేసాడు, కష్టపడి చదివిస్తే ఆయనకు చివరి రోజుల్లో ఒక మంచి జీవితం అందించలేక పోయాను, చివరికి ఒక కృత్రిమ ఆక్సిజన్ పెట్టించలేక పోయాను” అని కరోనా భూతాన్ని తిట్టుకుంటూ, కుమిలి పోయింది మనసులో. తండ్రి శవం పై పడి బోరున విలపిస్తుంటే అక్కడ ఉన్న వారి అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కొద్దిసేపు తల్లిని పట్టుకుని కడుపులో గూడుకట్టుకున్న దుఃఖమంతా పోయేవరకు ఏడ్చింది. “నాకేమి కాదమ్మా ఫికర్ చేయకు” అని అన్న తండ్రి కొన్ని గంటల్లో తమకు దక్కకుండా పోవడం, హాస్పిటల్ వాళ్లు ఎవరన్నా సమయానికి ఆక్సిజన్ పెడితే ఈ రోజు తమ తండ్రి తమతో ఉండేవారు అని అక్కాచెల్లెళ్ళిద్దరూ విలపిస్తుంటే ఆ దృశ్యం అక్కడున్న వారి గుండెలను పిండేసింది. ఆ బాధ లోంచి, తండ్రి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ, బలాన్ని ధైర్యాన్ని చేకూర్చుకొని, తన తండ్రి అంతిమ సంస్కారానికి మానసికంగా సిద్ధం అయ్యింది కవిత.

“తన తండ్రి అంతిమ సంస్కారం కోసం ఇంకొకరిని అడిగేదేముంది? ఒక్కసారి కూడా తన తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించని వారి కోసం తన నిర్ణయాన్ని మార్చుకోవాలా?” ఆలోచనలు పదునెక్కుతున్నాయి కవితకి.

పెద్దమ్మ వాళ్ళను, ఇంకో పెద్దమనిషిని పెద్దగా పట్టించుకోదలచుకోలేదు, వారికి జవాబు ఇవ్వడం కూడా వ్యర్థం అనుకుంది, కానీ సమస్య అంతా కార్యక్రమం నిర్వహించాల్సిన కులపెద్దని ఒప్పించడం పెద్ద సవాల్ గా మారింది. రాజు తండ్రి అంటే తన చెల్లి మామయ్య, ఒక రిటైర్డ్ గవర్నమెంట్ అధికారి. ఎక్కడ అయినా చాలా హుందాగా ప్రవర్తిస్తాడు, మొత్తం ఫ్యామిలీ లో బాగా చదువుకున్న వాడు అని పేరు. ఇంతకు ముందే వచ్చి కూర్చున్నాడు, కవితని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. రాజు తన తండ్రి పక్కనే కూర్చున్నాడు, ఆయన పక్కనే కులపెద్ద కార్యక్రమ నిర్వాహకుడు కూర్చొని గుర్రుగా చూస్తున్నాడు కవితని.

మరిది దగ్గరకి వెళ్లి “రాజూ .. నీవు చెప్పింది అంతా విన్నాను. ఇప్పుడు నాకు, నా తండ్రి చివరి కోరికను తీర్చడం కన్నా వేరే మార్గం లేదు. కొడుకు తర్వాత కొడుకులం అన్నావ్, నిజంగా ఆ మాటకు కట్టుబడి ఉంటే నా తండ్రి చివరి కోరిక ఏదో, దాని విలువెంతో తెలుసుకో! కాదు కూడదూ అంటే నీ ఇష్టం. ఇది నా తండ్రి చివరి కోరిక, ఖచ్చితంగా ఆయన అంతిమ సంస్కారం నేనే చేసి తీరుతాను. అయినా, ప్రపంచమంతా స్త్రీలకు, పురుషలకు ఒకటే రూలు అని, చివరకి సుప్రీం కోర్టు కూడా తరతరాలుగా ప్రవేశం లేని గుళ్ళకి స్త్రీలను అనుమతిస్తుంటే, కన్న తండ్రి చివరి కోరిక ప్రకారం, స్వంత బిడ్డ తండ్రి అంతిమ సంస్కారాలకు పనికి రాదా? ఎవరన్నా అడ్డొస్తే కోర్టుకు పోయయినా అనుమతి తీసుకొస్తా! ఎవరన్నా ఇష్టం ఉంటె ఉండొచ్చు, నేను తలకొరివి పెట్టడం చూడటం ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు" చివరి రెండు మాటలు కులం పెద్దవైపు చూస్తూ గట్టిగా వార్నింగ్ లా అంది.

అంతకు ముందు ఏం జరిగిందో తెలియదు కాబట్టి అప్పుడే వచ్చిన సవిత మామయ్య భాస్కర్ ని విషయం అడిగి తెలుసుకున్నాడు. కవిత అంటే చాలా గౌరవం ఆయనకి, నారాయణ చాలా విషయాలు చెప్పేవాడు కవిత గురించి. వాళ్ళ కొడుకు ప్రతి చోటా ఏదో ఒక సమస్య సృష్టిస్తాడని బాగా తెలుసు. అసలే తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న వాళ్ళకు తన కొడుకు ద్వారా, అక్కడ జరుగుతున్న పనులకు అడ్డంకులు జరగడం చూసి సహించలేక పోయాడు, కొంత ఇబ్బందికి గురయ్యాడు.

“అమ్మాయి కవితా, మీ తండ్రి మిమ్మల్ని ఎలా పెంచాడో, చాలీ చాలని జీతంతో మిమ్మల్ని ఎలా చదివించాడో అన్నీ తెలుసు. స్త్రీ, పురుష బేధం లేకుండా మనిషి చంద్ర మండలానికి వెళ్తుంటే, ఈ పనులు స్త్రీలే చేయాలి, పురుషులే చేయాలి అని నిబంధనలు  పెట్టుకోవడం తప్పు. ఇంకా ఈ కాలంలో కూడా అంతిమ సంస్కారాలు ఎవరు చేయాలి అని వాదించుకోవడం అనవసరం. తండ్రికి, కొడుకు అయినా, బిడ్డ అయినా ఒక్కటే. మీ తండ్రి కోరిక ఎలా ఉందో అలాగే కానివ్వు” అందరూ వినేట్టు గట్టిగానే అన్నాడు మామయ్య.

అంత వరకూ నిశ్శబ్దంగా చూస్తున్న భాస్కర్ కి కూడా అవకాశం దొరికినట్లయింది. హంతకులను ఉరితీసేప్పుడు కూడా వారి  చివర కోరిక అడిగి నెరవేర్చంగా లేంది, తండ్రి  చివరికోరికను స్వంత కూతురు తీర్చడం ఎలా తప్పు అవుతుంది అంకుల్? ఇప్పుడు చేసే పనికి, లింగ భేదాన్ని అన్వయిస్తే అది చట్ట రీత్యా నేరం, ఏ పని అయినా ఎవ్వరయినా చెయ్యొచ్చు అనేది ప్రభుత్వం నిర్ణయం” ఆవేశంగా అన్నాడు భాస్కర్.

ఇప్పుడు కవిత కి మామయ్య, అన్నయ్య సప్పోర్ట్ తో ఇంకా ధైర్యం తెచ్చుకుంది. “కొడుకులు లేకుంటే 'పున్నామ నరకానికి' పోతారు అని భయపెట్టించినా, ఆయన ఎప్పుడూ ఎవరికీ భయపడలేదు. ఆడ పిల్లలకి చదువెందుకని మొత్తుకున్నా ఆయన మమ్మల్ని చదివించకుండా ఉండలేదు. చివరికి తలకొరివి నన్నే పెట్టమని చేతిలో చెయ్యి వేయించుకున్నాడు. మా నాన్న కోరిక నేను తీర్చడంలో మిగతా వాళ్ళకి ఏం ఇబ్బందో తెలియదు. ఆడవాళ్ళు ఉద్యోగం చేయవచ్చు, ఆడవాళ్లు సంపాయించ వచ్చు, మగవాళ్ళు ఆడ వాళ్ళ సంపాదన మీద పడి తిని బ్రతకొచ్చు, కానీ ఆడవాళ్లు మాత్రం తండ్రి అంతిమ సంస్కారాలు చేయడానికి పనికిరారు! ఇది ఎక్కడ రాసి ఉంది?” ఆవేశంగా అంది కవిత పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ.

ప్రేమగా పెంచిన తండ్రి చివరికోరిక తీర్చడంలో తప్పేంటి అని అందరూ కవితకు మద్దతుగా నిలిచారు. కవితకు మద్దతుగా మాట్లాడిన మాటలు అందరినీ తీవ్రంగా ఆలోచింపచేశాయి. ప్రభుత్వం, చట్టాలు, కోర్టులు అన్న మాటలు బాగా వినిపించాయి ఆ కులపెద్దకి. దానికి తోడు, కవిత మామయ్య, బాగా చదువుకున్న వాడు, సంఘంలో మంచి పేరున్న ఆయన కూడా మద్దతు ఇవ్వడంతో కొంత భయపడి, పెద్దరికాన్ని కాపాడుకోవాలంటే నలుగురితో నారాయణ అనడమే మంచిదని “మీరందరూ సరే అంటే నాకేమి ఇబ్బంది? మీరన్నట్టే కానీ, చలో నడువమ్మా, ఇప్పటికే పొద్దుపోయింది బాగా” అని లేచాడు కులపెద్ద. కులపెద్ద ఏమాత్రం ఎదురు చెప్పక, ఒప్పుకోవడంతో కవిత మనసులో తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంది.

“బాగా చెప్పినవమ్మా, ఇప్పటికయినా కొద్ది మందికి బుద్ది వస్తే అదే మంచిది. నీవు వెళ్లి పని చూసుకో, మిగతాది నేను చూసుకుంటా” అని భార్య సంపాదన మీద పడి బతుకుతున్న తన కొడుకుకు ఇప్పటికన్నా బుద్ది రావాలని గట్టిగానే అన్నాడు సవిత మామయ్య. అంత వరకూ ఎగిరెగిరి దూకిన  కవిత మరిది, సిగ్గుతో తలదించుకున్నాడు, తాగిన మత్తు కూడా పూర్తిగా దిగింది.

“బాగా ఆలోచిస్తే, కన్న తండ్రి చివరి కోరిక తీర్చడం కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అనిపిస్తుంది. ఈ వంశాలు, గోత్రాలు అన్ని మనకి మనం సృష్టించుకున్నాయి. మనిషి పుట్టాకే ఈ పద్ధతులు పుట్టాయి, ఒక పని చేయడానికి మంచి మనసు ఉండాలి. నీవే కరెక్టు, అలాగే కానియ్” అన్నాడు కవిత మామయ్య అంటే తన భర్త తండ్రి. అంత వరకూ వద్దూ అన్న తన స్వంత మామయ్య కూడా సమర్దించడం వల్ల కవితకి ఇప్పుడు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ఏ లోకంలో ఉన్నాడో తెలియని తన తండ్రి, తప్పక ఈ మాటలు విని సంతోషిస్తాడని అనుకుంది. అంతవరకూ అటు భర్త పోయిన దుఃఖంతో, ఇటు భర్త చివరి కోరిక తీర్చలేమేమో అని బాధపడుతున్న సరోజ మనసు కొంచెం కుదుట పడింది.

స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగిన నారాయణ పార్థివ శరీరాన్ని అలంకరించి పాడె పై పడుకోబెట్టారు. పాడె పై ఉన్న తండ్రిని చూసి, తల్లీ కూతుళ్లు ఒకరినొకరు పట్టుకుని బోరుమని విలపించారు. తిరిగిరాని లోకాలని శాశ్వతంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న తండ్రిని చూస్తే, ప్యాంటు - షర్టు వేసుకొని 'ఫ్యాక్టరీ కి పోయొస్తా బిడ్డా' అని చెప్పుతున్నట్టు అనిపించింది కవితకి.

“నాన్న వెళుతున్నాడు, మరెన్నడూ రాడూ” అంటూ తల్లినీ, చెల్లినీ పట్టుకుని బోరుమని కవిత ఏడుస్తుంటే, అందరి హృదయాలు బరువెక్కాయి. ఆ దృశ్యం చూసి, ఒక్కసారి ఘొల్లుమని ఏడుపు అందుకున్నారు అక్కడున్న అందరు చుట్టాలు. అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తల్లీకూతుళ్లు విలపిస్తున్న తీరు చూసిన వారి కళ్ళు చెమ్మగిల్లాయి. “బిడ్డా, నువ్వు గెలిచావ్!” అని తండ్రి దీవించినట్టు అనిపించింది కవితకి తండ్రిని చూస్తుంటే. తృప్తిగా కళ్ళు మూసుకుంది కొన్ని క్షణాలు.

“నాన్నా, నువ్వే గెలిచావ్! నీవు మాపై పెట్టుకున్న నమ్మకానికి,ఇప్పుడు నీ నమ్మకమే గెలిచింది, అని లోపలి నుంచి దుఃఖంతోపాటు తన్నుకొచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ తండ్రి కి మొక్కింది కవిత. తన కర్తవ్యం గుర్తుకు వచ్చి మిగిలిన కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నద్ధం అయ్యింది. కుండలో మండుతున్న బొగ్గులని వేసి, దాన్ని చేతితో పట్టుకోవడానికి వీలుగా తాడుతో కట్టి సిద్ధంగా ఉంచాడు భాస్కర్. తన భర్త తోడు రాగా, అంతిమ సంస్కారాల్లో అతి ముఖ్యమైన ఆ పొగలు కక్కుతున్న కుండని, గుండెనిండా ఆత్మవిశ్వాసంతో వంగి తన చేతులోకి తీసుకుని నడవడానికి సిద్ధమయింది కవిత. గోవిందా, గోవిందా అని నిదానాలు చేస్తూ, నారాయణ పార్థివ శరీరానికి తన ఇంటి నుండి అంతిమ వీడ్కోలు పలుకుతూ బయలుదేరారు బంధుజనమంతా. గుండెనిండా పుట్టెడు దుఃఖంతో, చేతిలో పొగలుకక్కుతున్న కుండతో పాడె ముందు గంభీరంగా నడుస్తున్న కవితని చూస్తుంటే, అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని పట్టుకుని, అనాదిగా మగవాడి చేతిలో అణచబడుతున్న స్త్రీలలో ఆత్మవిశ్వాసం నింపుతూ నడుస్తున్న ఆదిశక్తిలా కనిపించింది అందరి కళ్ళకి కవిత.

(సమాప్తం)

Posted in August 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!