Menu Close
తేనెలొలుకు తెలుగు భాష
-- శ్రీ శేష కల్యాణి గుండమరాజు --

"ఏమోయ్ వంశీ? మొత్తానికి మీ నాన్న కోరిక ప్రకారం మంచి కాలేజీలో సీటు సంపాదించేసి విదేశాలకు వెళ్ళిపోతున్నావన్నమాట! ఎప్పుడు నీ ప్రయాణం?", అంటూ వంశీ భుజం పై ఆప్యాయంగా చెయ్యి వేసి అడిగాడు పద్మనాభం.

వంశీ కొంచెం సిగ్గుపడుతూ తన తండ్రి రఘురాం వంక చూసి చిరునవ్వులు చిందించాడు.

"ఒరేయ్ పద్మనాభం! మా వాడికి తెలుగు అర్ధం కాదురా! ఇంగ్లీషులో అడుగు! ఠక్కున సమాధానం చెప్తాడు!", అని నవ్వుతూ తన స్నేహితుడు పద్మనాభంతో గర్వంగా అన్నాడు రఘురాం.

"అదేంటీ? తెలుగు మన మాతృభాష కదరా? అది నీ కన్నకొడుకుకి నేర్పకపోవడమేమిటీ?!", అని ఆశ్చర్యపోయాడు పద్మనాభం.

పద్మనాభం తనతో అంటున్న మాటలు విననట్టుగా ప్రవర్తిస్తూ అక్కడినుండి వెళ్ళిపోయాడు రఘురాం!

*** *** *** ***

రఘురాం తండ్రి అనంతరామయ్య, తమ సొంత ఊరైన వైదేహీపురంలో గొప్ప తెలుగుభాషాపండితుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి! తెలుగు భాష పై ఎన్నో పరిశోధనలు చేసిన అనంతరామయ్య, తెలుగులో అనేక పద్యాలూ, కావ్యాలూ, పుస్తకాలూ రాయడం ద్వారా వైదేహీపురంలోనేకాక ఆ చుట్టుపక్కలనున్న గ్రామాలలో కూడా మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించుకోగలిగాడు.

ఉద్యోగరీత్యా వైదేహీపురంలోని ఒక కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనంతరామయ్యకి ఆదాయం పెద్దగా ఉండేది కాదు. దానికితోడు, అనంతరామయ్యకి దానగుణం ఎక్కువ! తనకు నెలనెలా వచ్చే జీతంలో కొంతభాగం దానధర్మాలు చెయ్యడానికి వినియోగించేవాడు అనంతరామయ్య. అందువల్ల అనంతరామయ్య భార్య సుశీల, కొడుకు రఘురాం తమకు ప్రతినెలా మిగిలే కొద్దిపాటి డబ్బుతోనే సద్దుకుపోతూ, నిత్యం పేదరికాన్ని అనుభవిస్తూ కాలం గడపవలసి వచ్చేది!

అనంతరామయ్య దంపతులకు రఘురాం ఒక్కడే సంతానం. రఘురాం చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, ఎక్కువగా ఒంటరితనంవల్ల బాధపడుతూ ఉండేవాడు! ఎందుకంటే సుశీలకు ఎప్పుడూ ఇంటిపనీ, వంటపనీ సరిపోయేది. అనంతరామయ్య పగలంతా కళాశాలలో ఉద్యోగం చేసి, చీకటి పడేవేళకు ఇల్లు చేరుకొని, ఆ తరువాత తన గదిలో ఒక్కడే కూర్చుని, ఏవేవో పుస్తకాలు చదువుకుంటూ, రచనలు చేసుకుంటూ, తన ప్రపంచంలో తను గడుపుతూ ఉండేవాడు. దాంతో అనంతరామయ్యకు తన కుటుంబం గురించి పట్టించుకునే తీరికా, ఓపికా ఉండేవి కావు.

రఘురాం పసిమనసుకి తన తండ్రి కూడా తన తోటి పిల్లల తండ్రులలాగా తనతో సమయం గడిపి, ఆటలు ఆడితే బాగుంటుందని అనిపిస్తూ ఉండేది. రోజులు గడిచే కొద్దీ తన తండ్రి తనతో గడిపేందుకు ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతో, తనకన్నా ‘తెలుగు భాష’ అంటేనే తన తండ్రికి ఎక్కువ ఇష్టమన్న అభిప్రాయం రఘురాంకి దృఢంగా ఏర్పడిపోయింది! అలా మెల్లిగా తనకు తెలియకుండానే ‘తెలుగు భాష’ పై ద్వేషాన్ని పెంచేసుకున్నాడు రఘురాం!

ఒకసారి వైదేహీపురానికి ఖరీదైన కారులో కొందరు వ్యక్తులు ఏదో పని మీద పట్నం నుండి వచ్చారు. వాళ్ళు సూటూ-బూటూ వేసుకుని, చలువ కళ్లద్దాలు పెట్టుకుని, దర్జాగా కారు దిగి పొలాల పక్కన నిలబడి, ఒకరితో ఒకరు ఆంగ్ల భాషలో మాట్లాడుకుంటూ ఉంటే వారిని చాలా గొప్పవారన్న భావనతో చూశారు వైదేహీపురంవాసులు. అది చూసిన రఘురాంకి తను కూడా ఆంగ్ల భాష నేర్చుకుని పట్నం వెళ్ళిపోయి బాగా డబ్బు సంపాదించాలన్న కోరిక పుట్టింది.

'ఈ తెలుగు భాషను నమ్ముకుంటే నేను కూడా మా నాన్నలాగా అరకొర జీతంతో బతకాల్సొస్తుంది!', అని అనుకున్నాడు రఘురాం.

ఆ మరుసటి రోజు, తను చదువుకుంటున్న బళ్ళో ఆంగ్ల భాష తెలిసిన సిద్ధయ్య మాష్టారును బతిమలాడి, ఆయన వద్దనున్న ఆంగ్ల భాషలోని పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని, వాటిని రఘురాం చదవడం మొదలుపెట్టాడు. ఆంగ్ల భాష పై రఘురాం చూపుతున్న ఆసక్తిని చూసి మురిసిపోయిన సిద్ధయ్య మాష్టారు, ఆంగ్ల భాషలో మాట్లాడటంలో రఘురాంకు ప్రత్యేక శిక్షణను ఇచ్చాడు. కొద్దికాలంలోనే రఘురాం ఆంగ్ల భాష పై పట్టు సాధించాడు. సహజంగా తెలివితేటలు కలిగిన రఘురాం బాగా చదువుకుని పట్నంలో ఒక మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించాడు.

సంస్థలోని ఉన్నతాధికారుల్లో ఒకరైన సదాశివం రఘురాంను చూసి, "అనంతరామయ్యగారి అబ్బాయివా నువ్వు? మాది కూడా వైదేహీపురమే! నీకు మా అమ్మాయి సీతను వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేకపోతే మీ నాన్నగారితో నేను మాట్లాడతాను!", అని అన్నాడు.

సీత అందంగా ఉండటంతో సరేనన్నాడు రఘురాం.

"అనంతరామయ్యగారితో సంబంధం కలుపుకోవడం అంటే అది మా పూర్వజన్మ సుకృతం!!", అని సంతోషపడిపోయాడు సదాశివం.

రఘురాం సీతను పెళ్లి చేసుకున్నాడు. వారికి వంశీ పుట్టాడు.

అప్పుడే పుట్టిన వంశీని చేతుల్లోకి తీసుకుని, “వీడికి తెలుగన్నది వినపడకుండా పెంచుతాను!”, అని అన్నాడు రఘురాం. భర్త నిర్ణయానికి అడ్డు చెప్పలేకపోయింది సౌమ్యస్వభావి అయిన సీత.

వంశీకి ఊహ తెలిసేనాటికే అనంతరామయ్య, సుశీలలు లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రఘురాం, తను అనుకున్నట్టుగానే వంశీతో ఆంగ్ల భాషలో మాట్లాడుతూ, ఆంగ్ల భాషలోని పుస్తకాలు చదివిస్తూ, అస్సలు తెలుగే మాట్లాడని ‘ఇంగ్లీష్ మీడియం’ పాఠశాలలో వంశీని చేర్పించాడు. అంతేకాకుండా, వంశీ ఇంట్లో ఉన్నంతసేపూ సీతతో కూడా రఘురాం ఆంగ్ల భాషలోనే మాట్లాడేవాడు! పొరపాటున కూడా అనంతరామయ్య గొప్పతనం గురించికానీ, తెలుగు భాష విశిష్టతను గురించికానీ వంశీకి తెలియనివ్వలేదు రఘురాం.

హై-స్కూలుకు రాగానే వంశీని తమ ప్రాంతానికి దూరంగా, వేరే రాష్ట్రంలో ఉన్న ఒక అంతర్జాతీయ పాఠశాలలో వేసి, అక్కడి హాస్టల్ లో పెట్టి చదివించాడు రఘురాం. ఆ విధంగా తెలుగు భాషకు దూరంగా ఉంటూ హై-స్కూల్, డిగ్రీ చదువులు పూర్తి చేశాడు వంశీ.

పై చదువులకు వంశీని విదేశాలకు పంపించేస్తే, వంశీ విదేశీయులలాగా ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడగలుగుతాడనీ, అతడి చదువు పూర్తయ్యాక విదేశాల్లోనే స్థిరపడిపోతే ఇక వంశీకి తెలుగు భాషను నేర్చుకునే అవసరమే ఉండదని అనుకున్నాడు రఘురాం. తన తండ్రి కోరిక తెలుసుకున్న వంశీ పోస్టు-గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలలో ఉన్న కళాశాలలకు దరఖాస్తులు పెట్టుకుంటే, అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన ఒక విశ్వవిద్యాలయంలో అతనికి సీటు వచ్చింది!

రఘురాం చాలా సంతోషించి తన బంధుమిత్రులందరినీ పిలిచి విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులోనే రఘురాం స్నేహితుడు పద్మనాభం వంశీని చూసి ఆశ్చర్యపోయాడు. విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. వంశీ విదేశాలకు వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత రఘురాం పదవీవిరమణ పొందాడు.

*** *** *** ***

ఒకరోజు రఘురాం తీరుబడిగా కూర్చున్నప్పుడు, "నాకు మన సొంత ఊరికి వెళ్లిపోవాలని ఉందండీ! మా బంధువులంతా అక్కడే ఉన్నారు. మన శేషజీవితం మనం పుట్టిపెరిగిన ఊళ్ళో గడిపితే బాగుంటుంది కదండీ?", అంది సీత.

రఘురాంకి కూడా ఆ ఆలోచన బాగా నచ్చింది. పట్నంతో పోలిస్తే వైదేహీపురంలో తక్కువ ఖర్చుతో విలాసవంతంగా బతకచ్చని అనుకున్నాడు రఘురాం. అదీకాక, తన కొడుకును గురించి గ్రామంలో ఉన్న తన చిన్ననాటి స్నేహితులకు గొప్పగా చెప్పుకోవచ్చని భావించిన రఘురాం, వెంటనే వైదేహీపురానికి మకాం మార్చేశాడు!

రెండు సంవత్సరాలు గడిచాయి. విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న వంశీ, ఒకసారి తన తల్లిదండ్రులను చూసిపోదామని వైదేహీపురానికి వచ్చాడు. ఒకనాటి సాయంత్రం వంశీ రఘురాంతో ఏవో విషయాలు మాట్లాడుతూ ఉండగా వైదేహీపురం గ్రామసర్పంచితోపాటూ మరో ముగ్గురు గ్రామపెద్దలు రఘురాం ఇంటికి వచ్చారు. రఘురాం వారిలో కొందరిని తన తండ్రి స్నేహితులని గుర్తించాడు.

ఆ వచ్చిన వారిలో పెద్దవాడైన నాగభూషణం, "బాబూ రఘురాం! నేనూ, మీ నాన్నగారూ మంచి స్నేహితులం! వచ్చేవారం మీ నాన్నగారి పుట్టినరోజు కదా? మన గ్రామంలో ఉన్న సాహితీ అభిమానులమంతా కలిసి ఆయన పేరు మీద ఒక స్మారక సభను నిర్వహిద్దామని అనుకుంటున్నాము. మీ ఇంటిల్లుపాదీ తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి!", అన్నాడు.

కాదనలేకపోయాడు రఘురాం.

"నాన్నగారితోపాటూ నువ్వు కూడా రా నాయనా!", అన్నాడు నాగభూషణం వంశీ వంక చూస్తూ.

వంశీ సరేనన్నట్లు తల ఊపుతూ చిరునవ్వు నవ్వాడు.

"వాడికి ‘తెలుగు’ అర్ధం కాదులెండి!", అని నాగభూషణంతో అన్నాడు రఘురాం, ఎప్పటిలాగే కొంచెం గర్వంగా!

"పోనీలే బాబూ! విదేశాలలో చదువుకున్నాడని అన్నారు కదా! కార్యక్రమానికి మాత్రం అబ్బాయిని తీసుకురండి!", అని చెప్పి గ్రామపెద్దలతో వెళ్ళిపోయాడు నాగభూషణం.

గ్రామపెద్దలు చెప్పిన సమయానికి సీతనూ, వంశీని తీసుకుని కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళాడు రఘురాం. సభను, వేదికనూ చాలా ఘనంగా ఏర్పాటు చేశారు గ్రామస్థులు. చుట్టుపక్కల గ్రామాలనుండీ పేరొందిన సాహితీవేత్తలెందరో సభకు వచ్చారు. సభాకార్యక్రమం ప్రారంభమయింది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి అనంతరామయ్యతో తమకున్న అనుబంధం గురించీ, ఆయన రచనల గురించీ చిన్న చిన్న ప్రసంగాలు ఇస్తున్నారు. నాగభూషణం వంతు వచ్చింది.

నాగభూషణం మైకు అందుకుని, "అనంతరామయ్య మన ఊరివాడు కావడం నిజంగా మన అదృష్టం! అనంతరామయ్య నేడు మన మధ్య లేకపోయినా ఆయన వారసుడు రఘురాం ఈ రోజు ఇక్కడే ఉన్నాడు! రఘురాంని వేదికపైకి వచ్చి తమ తండ్రిగారి తెలుగుపాండిత్యం గురించి నాలుగు మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను!", అన్నాడు.

అది విని, "నేనా?", అంటూ నోరెళ్ళబెట్టాడు రఘురాం.

రఘురాం తన తండ్రి రాసిన పుస్తకాలను ఎప్పుడూ చదవలేదు సరికదా వాటి పేర్లు కూడా అతనికి తెలియవు! ఆ విషయం తెలిస్తే గ్రామస్థుల ముందు తన పరువు పోతుందని భయపడేసరికి రఘురాంకు చమట్లు పట్టి చేతులు చల్లబడ్డాయి!

తన తండ్రి పరిస్థితిని గమనించిన వంశీ వేదిక పైకి వెళ్లి, "మీకు అభ్యంతరం లేకపోతే మా తాతగారి గురించి నేను మాట్లాడతాను!", అన్నాడు.

సభ అంతా నిశ్శబ్దం ఆవరించింది. వంశీ నాగభూషణం వద్ద మైకు తీసుకుని అనంతరామయ్య సాహిత్యం గురించి అనర్గళంగా మాట్లాడటమేకాకుండా ఆయన రచించిన రెండు పద్యాలను ఎటువంటి తప్పులూ లేకుండా చెప్పి వాటి తాత్పర్యం కూడా వివరించి, "నేను తెలుగువాడినవ్వడం నిజంగా నా అదృష్టం! అనంతరామయ్యగారు నాకు తాతయ్యని చెప్పుకోవడం నాకు గర్వకారణం! తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటి చెప్పి, తేనెలొలుకు ఈ భాషలోని తియ్యదనాన్ని మన తెలుగువారంతా ఆస్వాదించేలా చెయ్యడమే ఇకపై నా లక్ష్యం! ", అని తన ప్రసంగం ముగించాడు.

వంశీ గొంతులో అనంతరామయ్య స్వరం ధ్వనించింది! రఘురాం అవాక్కయ్యాడు! సభ చప్పట్లతో మార్మోగిపోయింది. విదేశాలలో చదివినా వంశీ తెలుగు భాషను సుస్పష్టంగా పలకగలగడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

కార్యక్రమం ముగిసి ఇంటికి చేరుకున్నాక, "వంశీ! ఇవాళ నువ్వు మన ఇంటి పరువును కాపాడావురా! అసలు నువ్వు తెలుగు ఎప్పుడు నేర్చుకున్నావు?", అని ఆశ్చర్యంగా కొడుకును అడిగాడు రఘురాం.

"నాన్నా! నేను విదేశాల్లో ఉన్నప్పుడు మా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ నా దగ్గరకు వచ్చారు. ఆయన కూడా భారతీయుడే. నాతో మాట కలిపిన ఆయన నా పూర్తి పేరు అడిగారు. నేను చెప్పాను. ‘మీరు తెలుగువారా? మీ నాన్నగారెవరు? మీ తాతగారు ఎవరు?’ అని వివరాలు అడిగారు. నేను చెప్పాను. ఆయన మొహం ఆనందంతో వెలిగిపోయింది! నా చెయ్యి పట్టుకుని మా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయంలో ఉన్న తెలుగు విభాగానికి నన్ను తీసుకుని వెళ్లారు. అక్కడ తాతగారు రాసిన పుస్తకాలున్న గదిని నాకు చూపించి, అంత గొప్ప తెలుగుభాషాపండితుడి మనవడినైన నన్ను కలవడం ఆయనకు ఆ భగవంతుడిచ్చిన అవకాశమని అంటూ తెగ సంబరపడిపోయారు! అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన ఆ విశ్వవిద్యాలయంలో తెలుగు భాషకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చెయ్యడంలో, తెలుగు ప్రాముఖ్యతను గురించి తాతయ్య రాసిన పుస్తకాలు చాలా ఉపయోగపడ్డాయట! మా ప్రొఫెసర్ గారు తాతయ్యకున్న తెలుగు పాండిత్యం గురించి ఉత్సాహంగా చెప్తూ ఉంటే, ఒక తెలుగువాడినయ్యుండీ తెలుగు భాష రాకపోవడం అన్నది నాకు చాలా సిగ్గుగా అనిపించింది. వెంటనే తెలుగు భాషను నేర్పించే కోర్సులు తీసుకుని తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకున్నాను. నా రక్తంలో ఉన్న భాష కావడంవల్ల కాబోలు! నాకు ‘తెలుగు’ త్వరగానే వచ్చింది! ఆ తర్వాత నాకు దొరికిన ఖాళీ సమయాల్లో తాతగారు రాసిన పుస్తకాలు చదివాను. అది నాకు ఇవాళ ఇలా ఉపయోగపడింది!", అన్నాడు వంశీ.

నివ్వెరపోయాడు రఘురాం.

"ఇంతకీ నువ్వు చెప్పిన పద్యాలు చాలా బాగున్నాయిరా! అవి ఏ పుస్తకంలోవి?", అని వంశీని ఆసక్తిగా అడిగాడు రఘురాం.

"ఒక్క క్షణం!", అంటూ వంశీ తన సూట్-కేసు తెరిచి, అందులోంచి ఒక పుస్తకం తీసి, "నాన్నగారూ! తాతయ్య రాసిన పుస్తకం ఇది! ఇందులోవే ఆ పద్యాలు! ", అంటూ ఆ పుస్తకాన్ని రఘురాం చేతుల్లో పెట్టాడు.

కళ్ళజోడు సరి చేసుకుంటూ పుస్తకం పేరును చూశాడు రఘురాం.

‘తేనెలొలుకు తెలుగు భాష - ఇది మా ‘అమ్మ’ భాష!’, అని కనపడింది!

ఆ పేరు చూడగానే, 'ఒరేయ్ నాన్నా! నేను ఎంతో ఇష్టంగా రాసిన ఈ ఒక్క పుస్తకం చదవరా!', అంటూ తన చిన్నప్పుడు అనంతరామయ్య తనను ఎన్నోసార్లు బతిమలాడటం గుర్తుకువచ్చింది రఘురాంకి. తన తండ్రిని తలుచుకుంటూ పుస్తకం తెరిచాడు రఘురాం. అందులోని మొదటి పేజీలలో ఆ పుస్తక విశేషాలను ప్రస్తావిస్తూ అనంతరామయ్య ఇలా రాశాడు:

"నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, నా జీవితాన్ని పంచుకున్న నా భార్య, నా అంశతో పుట్టిన నా బిడ్డ రఘురాం, నా మాతృభాష తెలుగు - నాకు పంచప్రాణాలు!  నవమాసాలూ నన్ను మోసి, కని, పెంచి, నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా తల్లి ఋణం తీర్చుకోవడం నాకు అసాధ్యం! నేను నా తల్లి నోటి వెంట విన్న మొదటి భాష, ఆవిడ నాకు నేర్పిన తొలి భాష ‘తెలుగు భాష’! తరాలు మారినా తెలుగు భాష వన్నె తగ్గకూడదని మా అమ్మ నాకెప్పుడూ చెప్తూ ఉండేది. ఆవిడ నేర్పిన ఈ తేనెలొలుకు తేట తెలుగును వాడుకలో ఉంచి బతికించడం నా కర్తవ్యం! 'దేశ భాషలందు తెలుగు లెస్స!'యని కీర్తింపబడ్డ మా ‘అమ్మ’ భాషను భావితరాలకు అందించడం నా బాధ్యత! కనీసం ఈ విధంగానైనా మా అమ్మ ఋణం కొంత తీర్చగలుగుతానేమో! అందువల్ల నేను తెలుగు భాషను సంరక్షించడం, పోషించడం నా జీవితాశయంగా పెట్టుకున్నాను! నా ఆశయ సాధనలో భాగంగానే నేను తెలుగులో అనేక రచనలు చేశాను. నేనున్నంత కాలం తెలుగు భాషకున్న ఆదరణ తగ్గకుండా చూడటంలో నా శక్తి కొలదీ కృషి చేస్తాను. నా తదనంతరం మన తెలుగు భాషను కాపాడే బాధ్యత నా ఒక్కగానొక్క తనయుడు రఘురాం స్వీకరిస్తాడని నా నమ్మకం! ఏదో ఒక రోజు ఈ విషయంలో రఘురాం నన్ను మించిన వాడవ్వాలన్నది నా ఆకాంక్ష! నా వారసులంతా తెలుగు భాష యొక్క సంరక్షణను ఒక ఉద్యమంగా చేపట్టి, రాబోయే రోజులలో మన తెలుగు భాషాఖ్యాతిని ఈ ప్రపంచమంతా వ్యాపింపచెయ్యడంలో విజయవంతులు కావాలని నేను వారిని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాను! మారుతున్న కాలంలో మనిషి మనుగడకు పరాయి భాషలను ఆశ్రయించినా, నా తెలుగు భాషకున్న గొప్పతనాన్ని లోకం ఏనాటికీ విస్మరించకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను! "

అది చదివిన రఘురాంకు కన్నీరు ఆగలేదు!

ఆ పుస్తకంలో ప్రచురింపబడి ఉన్న అనంతరామయ్య చిత్రాన్ని రఘురాం తన చేతివేళ్ళతో ఆప్యాయంగా స్పృశిస్తూ, “నన్ను క్షమించండి నాన్నా! ఉన్నతమైన మీ ఆశయాన్ని నేను తప్పుగా అర్ధం చేసుకున్నాను! మీరు నా పై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను! తెలుగు భాష కోసం మీరు జీవితాంతం చేసిన కృషిని, నా జీవిత చరమాంకంలో కానీ నేను గుర్తించలేకపోయాను! నన్ను మన్నించమని అడిగే అర్హత నాకుందోలేదో తెలియదు కానీ మీ ఆశీర్వాదంతో పుట్టిన మీ మనవడు వంశీ తెలుగు భాషను సంరక్షించడంలో మీకు నిజమైన వారసుడై మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు నాన్నా!”, అని అన్నాడు.

భావోద్వేగంతో చెమర్చిన తన కళ్ళను తుడుచుకుని, ఆత్రంగా ఆ ‘తెలుగు’ పుస్తకాన్ని ఇష్టంతో చదవడం మొదలుపెట్టాడు రఘురాం!

(సమాప్తం)

Posted in August 2021, కథలు

1 Comment

  1. వెన్నెలకంటి సుబ్బు నారాయణ

    మధూ, కధ చాలా బాగుంది. మన తెలుగు జాతి గౌరవం మరియు గొప్పతనం గురించి చక్కగా వివరించావు. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు వారి పిల్లలకు తెలుగు భాష గొప్పదనం గురించి తెలియజేసి తెలుగు భాష అభివృద్ధికి ఎంతో కొంత కృషి చేస్తే మంచిది. అమెరికాలో ఉంటూ కూడా “సిరిమల్లె తెలుగు మాస పత్రిక గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా నడుపుతూ తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్న నీవు అభినందనీయుడవు. నీకు మనఃపూర్వక అభినందనలు.

    ఇట్లు,

    నీ మిత్రుడు

    వెన్నెలకంటి సుబ్బు నారాయణ

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!