Menu Close
Page Title

బిల్వమంగళుని కవితలో మాధుర్యాన్ని చిందించిన బాలకృష్ణుడు

బిల్వమంగళుడు వంశాచారంగా శైవుడైనా అనుకోని విధంగా శ్రీ కృష్ణుని పై అతడి మనసులగ్నమై, భక్తి గా మారి, గాఢమైన ప్రేమగా పరిఢవిల్లి, కంటిచూపు లేకపోయినా కొంటి చేష్టలతో మనోమందిరాన్నాక్రమించి, అతని చేత శ్రీ కృష్ణ కర్ణామృతాన్ని పలికించాడు.

శైవా వయం న ఖలు తత్ర విచారణీయం
పంచాక్షరా జపపరా నితరాం తథాపి,
చేతో మదీయ మతసీ కుసుమావభాసం
స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరమ్ || 2- 24

‘మేము పంచాక్షరీ మంత్రాసక్తులైన శైవులం, అయినా నామనస్సు అవిసపువ్వు వలె చిరునవ్వుతో ప్రకాశించు కన్నులు గల గోప కిశోరుణ్ణే స్మరిస్తోంది.’ అంటాడు బిల్వమంగళుడు.

కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణమ్
సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠేచ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణిః || 2 - 109

అంటూ తన మనో నేత్రానికి దర్శన మిచ్చిన ఆ గోపాల బాలుణ్ణి కళ్ళకు కట్టినట్లు కీర్తిస్తూ,

హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే
హే కంసాన్తక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ,
హే రామానుజ హే జగత్రయగురో హే పుండరీకాక్ష మాం
హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వామ్ వినా || 2-108

అంటూ స్తుతించాడు. ఈ పై రెండు శ్లోకాలు చాలా మందికి సుపరిచితమే. ఈ రెండవ శ్లోక రచన కులశేఖర ఆళ్వారుకి కూడా ఆపాదింపబడింది. సాహిత్య సీమలో అసమాన స్థానాన్ని సంపాదించుకున్న ఆ అమృతధార దాదాపు తొమ్మిది శతాబ్దాల తరువాత కూడా దాని మాధుర్యం ఏమాత్రం కుంటుబడకుండా అందరి హృదయాలలోను మకరందాన్ని చిప్పిలిస్తోనే ఉంది.

బిల్వమంగళుని చరిత్ర అతని 'శ్రీ కృష్ణ కర్ణామృతమ్' అంత ప్రసిద్ధికాంచి గ్రంధస్తం చేయబడకపోయినా, వివిధ మూలాల ఆధారంగా దాన్ని సంక్షిప్తంగా ఈవిధంగా ఇక్కడ వివరించడం జరిగింది. ఏది ఏమైనా బిల్వమంగళుడి చరిత్రకంటే లీలాశుకుని మధుర రచన 'శ్రీ కృష్ణ కర్ణామృతమ్' మూడు ఆశ్వాసాలతో 328 శ్లోకాలతో ఉత్తమ భక్తి కావ్యంగా సాహితీ లోకంలో నేటికీ భాసిస్తోంది. ఒక కధ ఏమిటంటే దాని లోని ప్రతి శ్లోకానికి బాలకృష్ణుని అంగీకారం లభించిందట. లేనివాటిని బిల్వమంగళుడు (లీలాశుకుడు) విసర్జించాడట.

కేరళ లోని శుకపురం లో ఎనిమిదవ శతాబ్దంలో ఒక సంపన్న శాస్త్రీయ శైవ బ్రాహ్మణ కుటుంబం లో రామదాసు కు ఏకైక పుత్రునిగా జన్మించిన బిల్వమంగళ అయ్యర్ చిన్నతనంలోనే తండ్రి ప్రోద్బలంతో సకల శాస్త్రాలు చదువుకున్నాడు. కానీ కొంతకాలం తర్వాత చిన్నతనంలోనే తండ్రి మరణించడం వల్ల చెడు సహవాసం వల్లో, అతడికి వయస్సుతో బాటు సహజంగా పెరిగే అరిషడ్రిపుల ఒత్తిడుల వల్లో - వాటిలోముఖ్యంగా కామానికి దాస్యుడవ్వడం వల్లనో స్త్రీ సాంగత్యానికై ఎక్కువగా చొరవ చూపేవాడట. ఆ విధంగా చింతామణి అనే అందమైన వేశ్యతో సంబంధాన్ని పెట్టుకుని, ఆ అనుబంధం అతని తలపులని క్షణమైనా విడిచి ఉండలేనంతగా పెరిగి బలపడి, తనపిత్రార్జితమైన యావదాస్థిని చింతామణికి ధారాదత్తం చేయించింది. తుదకు తండ్రి శ్రాద్ధ దినమునాడు కూడా శ్రాద్ధకార్యక్రమాన్ని సక్రమంగా పూర్తిచెయ్య నిచ్చగించక త్వరపెట్టేటట్లు చేసి, ముగించుకుని, హితులమాట కూడా పెడచెవినిపెట్టి ఆమెను కలవడానికి ఆత్రుత పెట్టింది. ఆనాటి పెనుతుఫానులో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటి ఆమెను చేరుటకై ఎటువంటి సాధనము దొరక్క, ఈదుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించి నదీమధ్యంలో ప్రవాహవేగానికి కొట్టుకొని పోతూ ఆసరాగా దొరికిన దుంగనే పట్టుకుని వేళ్ళాడుతూ మెల్లగా ఎట్లాగో ఆవలి తీరానికి చేరి, ఆవిపరీత వాతావరణంలో చింతామణి ఇంటి బహిర్ద్వారం మూసి ఉండడం చూసి, ఎదురుగా కనబడ్డ తాడుని ఆధారంగా పట్టుకుని గోడనెక్కి ఇంటి ఆవరణలో ప్రవేశించే ప్రయత్నం చేయడంలో చింతామణి పైగల ఏకాగ్ర చింతన అతడు నది దాటుటకు వాడిన దుంగ శిధిలమైన మానవ శరీరమనిగాని, గోడనెక్కుటకై వాడిన తాడు చనిపోయిన ఒక పామనిగాని అతడికి స్పృహేలేదు. ఆవిధంగా లోనికి ప్రవేశించిన అతని దయనీయస్థితిని చూసి ఆమె తనపైగల ప్రేమకు మురిసిపోయి సంతోషిస్తుందని భావించిన అతడికి ఆమె నిర్లక్ష్య వైఖరితో నిరాశే ఎదురయ్యింది. అతగాడికి తనపై గల శరీర వ్యామోహము వదలలేని నిస్సహాయ స్థితిని చూసి ఆమెకి రోతపుట్టి, సహజంగా కృష్ణ భక్తురాలైన చింతామణి "ఈ తుచ్చము అశాశ్వతమైన మాంసపు ముద్దైన శరీరంపై గల మోహం అనురాగం, నన్ను పొందడంకోసమై నీ ఈ అకుంఠిత దీక్ష, ఆ దీనజనోద్ధారకుడు మురళీధరుడైన బాలగోపాలునిపై పెట్టి ఉంటే నీ మోక్షమార్గం సులభతరమై ఉండేది గదా. నీ ఈ విలువైన జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు" అన్న చింతామణి మాటలు సూటిగా హృదయాన్ని ఛేదించి అతడి ఆలోచనా తీరుకి నూతన మార్గాన్ని, వెలుగుని చూపించింది. దానితో ఆమెనే గురువుగా గుర్తించి, ఆ అయోమయస్థితిలో జీవిత గమ్యం గానక పోతుండగా కొద్ది రోజుల తరువాత మార్గమధ్యంలో ఒక సుందరమైన ఒక బ్రాహ్మణ స్త్రీ కనిపించింది. అతడి అస్థిర చిత్త స్థితిలో, వెనుకటి గుణమైన కాముకత్వం వెనక్కి లాగగా అతడి శరీరం, మనస్సు ఆమెను కోరింది. అప్పుడతడు ఉచితానుచితాలు యోచించక ఆమె భర్తని ఆమె పొందుకై అర్ధించగా అతడు ఈతని దయనీయస్థితినిచూసి అంగీకరించాడు. ఇంతలో చింతామణి మాటలు చెళ్ళున చెంప దెబ్బలా గుర్తుకువచ్చి మెలకువ తెప్పించగా తను దిగజారిన నీచస్థితిని తలుచుకుని, బాహ్య సౌందర్యాన్ని చూస్తూ మనస్సుని తప్పుడుదారిని పట్టిస్తున్నవి తన కళ్ళే గనుక వాటిని నిర్వీయం చెయ్యాలనే ఉద్రేకం పెల్లుబకగా కృత నిశ్చయంతో ప్రక్కనే పొదలో ఉన్న ముల్లు తీసుకుని తన రెండు కళ్ళని పొడుచుకుని అంధుడుగా మారి ప్రాయశ్చిత్తం చేసుకున్నాననుకున్నాడు బిల్వమంగళుడు.

Baby Krishnaఅప్పుడు చింతామణి సాంగత్య ప్రభావం వల్లనో లేక దైవనిర్ణయం వల్లనో ఎట్లాగో బృదావనం చేరుకొని బాల కృష్ణుని చూసి అతనితో గడపాలన్న బలమైన వాంఛ కలిగింది. కానీ దారి గానక ఆకలితో అటునిటు తిరుగుండగా ఒక చిన్న కుర్రాడు గోవుల కాపరిగా పరిచయం చేసుకుని పాలిస్తూ అతనికి తోడై అతడి అప్పటి దీనావస్థలో తోడుగానిలిచి బిల్వమంగళుడి మనస్సుకి ఆతడి సాంగత్యముతో స్వాంతనాన్ని చేకూర్చాడు. మెల్లగా అతని సాంగత్యప్రభావం వల్ల బిల్వమంగళుడి మనసులోని దేహ చింతతీరి చింతామణి స్థానాన్ని ఈ కుర్రాడు క్రమంగా ఆక్రమించి అతడిని విడిచిపెట్టి క్షణమైనా ఉండలేనంతగా మారిపోయాడు. ఈ మార్పు బిల్వమంగళుడికి అమిత ఆశ్చర్యాన్ని కలిగించింది, ఒక స్త్రీ వలలోనుండి బయట పడ్డాననుకుంటే మరొక బాలుని అనురాగంతో బంధింపబడుతున్నానేమని చింతించ సాగాడు. ఎటులనైనా చింతామణి ఉపిరిపోసి ఉహానొసగిన బృదావనం చేరుకొని బాల కృష్ణని చూడాలన్న కాంక్ష రోజురోజుకి ప్రబలతరమై దానిని ఎట్లా తీర్చు కోవాలో తెలియక తికమక పడుతున్న సమయాన్న 'బృదావనం వెళ్లాలనుకుంటున్నావా, నేను నిన్ను బృదావనానికి తీసుకెళ్తానని' ఆ బాలుడు ఒక కర్ర అంధుడైన బిల్వమంగళుని చేతికిచ్చి దాని రెండవ వైపు అతడు పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ నందబాలుని కథలు చెబుతూ బృందావనానికి తీసికెళ్ళాడట. శుకపురంలో పుట్టిన బిల్వమంగళుడు శుకమహర్షి భాగవత కథలో వర్ణించినట్లు బాల కృష్ణుని లీలలు మనోహరంగా మధురంగా వర్ణించే ఇచ్ఛ ఉండడంవల్లనే కాబోలు లీలాశుకుడనే పేరుతో 'శ్రీకృష్ణకర్ణామృతమ్' వ్రాశాడట. సహజ పండితుడైన బిల్వమంగళుడు బృందావనంలో ఆ బాలుని ద్వారా విన్న కృష్ణలీలలకి తన పాండిత్య పటిమని జోడించి అల్లుకు పోయిన భావ సంపదని మధుర శ్లోకాలగా కూర్చి ఆ బాలునికి వినిపించేవాడట. ఆ బాలుడు బాగుంది అని సంకేతం యిచ్చిన వాటినే ఉంచి తక్కిన వాటిని విసర్జించేవాడట.

'శ్రీకృష్ణకర్ణామృతమ్' లో మొదటి శ్లోకంలో గురుతుల్యురాలైన చింతామణికి జయం కలగాలని నెమలి పింఛధారిని మురళీగానలోలుని ప్రార్ధిస్తూ, మధుర శ్లోక స్రవంతికి నాంది పలికాడు.

బర్హోత్తంసవిలాశకుంతల భరం మాధుర్య మాగ్నాననం
ప్రోన్మీలన్నవయౌవనం ప్రవిలసద్వేణుప్రణాదామృతమ్|
ఆపీనస్థన కుట్మలాభిరభీతో గోపీభిరారాధితం
జ్యోతిశ్చేతసి న శ్చకాస్తి జగతామేకాభిరామాద్భుతమ్|| 1-4

'నెమలి పింఛంతో అలంకరించబడి చెమరిన లేత యవ్వనపు మోముతో భాసించగా, అమృతధారలు కురిపించు మురళీ రవమాధుర్యం మిన్నంటగా, దానిని ఆస్వాదిస్తూ పులకలతో ఉబ్బిన గుబ్బలతో గోపికాంతలు చుట్టుముట్టగా, సౌందర్యరాశి, మనోహరము అయిన జ్యోతివలె ప్రకాశించే ఆతడి తేజస్సు నాలోభాసించు చున్నది.'

కమనీయకిశోరముగ్ధమూర్తేః కలవేణుక్వణితా దృతాననేందోః
మమ వాచి విజృంభతాం మురారేః మధురిష్ణుః కణికాపి కాపికాపి|| 1-7

'చూస్తూనే మరీమరీ ఆశలుగొలుపునట్టి బాల్యముగ్ధత్వం పొడచూపు వాడై, అవ్యక్త మధుర వేణు గానాన్ని నినదింపచేస్తున్న చంద్రునివంటి ముఖము గల అతడి సౌందర్యం నావాక్కునందు చెలరేగు గాక.'

హే దేవ హే దయిత హే జగదేక బంధో,
హే కృష్ణ హే చపల, హే కరుణైక సింధో,
హే నాథ హే రమణ హే నయనాభిరామా,
హా హా కదాను భవితాసి పదం దృశోర్మే || 1 -40

' ఓ దేవ ఓ ప్రియా, ...ఎప్పుడు నాకు ప్రత్యక్షమగుదువోకదా'

బహులచికుర భారం బద్ధపించ్ఛావతంసం
చపలచపలనేత్రం చారుబింబాధరోష్ఠం |
మధురమృదులహాసం మంధరోదారాలీలం
మృగయతి నయనం మే ముగ్ధవేషం మురారేః || 1-46

'దట్టమై అందమైన కురులలో శిరోభూషణంగా అమర్చిన నెమలి పింఛంతోనూ, లేడికన్నులవలె అతి చంచలమైన కన్నుల తోనూ, సొగసైన దొండపండువంటి పెదవులతోనూ, మధురము, కోమలము అయిన చిరునవ్వు విరాజిల్లే ముగ్ద రూపం గల కృష్ణుని సుందర రూపం చూడ ఉవ్విళ్లూరుతున్నాను.'

చికురం బహుళం విరళం భ్రమరం
మృదులం వచనం విపులం నయనం
ఆధరం మధురం వదనం లలితం
చపలం చరితం చ కధానుభవే|| 1 -61

'దట్టని కురులు, పలుచని ముంగురులు, కోమల వాక్కులు, విస్పారిత నేత్రాలు, సొగసైన మోవి, లేలేత మొగము, చపల నడవడి గల మనోహరుడైన కృష్ణుని చూచుట ఎన్నడో గదా!'

మాధుర్యేణ ద్విగుణ శిశిరం వక్త్రచంద్రం వహన్తీ
వంశీవీథీవిగళదమృత స్రోతసా సేచయంతీ|
మద్వాణీనాం విరహణపదం మత్త సౌభాగ్య భాజాం
మత్పుణ్యానాం పరిణతి రహో నేత్రయో సన్నిధత్తే|| 1 - 74

'చక్కదనంచే మరింత చల్లదనం కూర్చుతున్న చంద్రునివలెనున్న మోము కలిగి, ఊదుతున్న మురళినుండి అమృతంపు వెల్లువై కురిపిస్తున్న మధురస్వరాలతో వీనుల విందు చేయుచు, నా పొగడ్తకి కేంద్రమై, పెంపొందుతున్న నా పుణ్యఫలముగా యున్న కృష్ణుడు, నా మనో నేత్రానికి గోచరిస్తున్నాడు.'

మృదుక్వణ న్నూపురమందరేణ బాలేన పాదాంబుజ పల్లవేన,
అనుక్వణన్మంజుల వేణుగీత మాయాతి మే జీవిత మాత్త కేళి|| 1 - 77

'కృష్ణుని చిన్నిపాదాలపై వెలుగొందుతున్న అందెలు అతడి నడకకు అనుకూలంగా అదురుతూ మృదువుగా ఘల్లుమనుచుండగా, దానికి దీటుగా క్రీడా విలాసాలతో మధురమైన వేణునాద మాలాపన చేస్తుంటే నాకు ప్రాణసమానుడైన కృష్ణుడు వస్తున్నాడనిపిస్తోంది.'

సర్వజ్ఞత్వే చ మౌగ్థ్యే చ సార్వభౌమమిదం మమ
నిర్విశన్నయనం తేజో నిర్వాణ పదమశ్నుతే || 1 -82

సర్వజ్ఞత్వంలోను, బేలతనంలోనూ, సర్వలోక సార్వభౌముడైన అతడి అసమాన తేజస్సుతో నా మనస్సు నిర్వాణాన్ని అనుభవించేస్తోంది.

మన్దారమూలే మదనాభిరామం బింబాధరా పూరిత వేణునాదం
గోగోపగోపి జనమధ్య సంస్థం గోపంభజే గోకులపూర్ణచంద్రమ్|| 1-100

'కల్పవృక్షముక్రింద గోవులమధ్య, గొల్లజనం మధ్య అందంగా మన్మధునివలె కూర్చుని, దొండపండు వంటి పెదాల వద్ద మురళి నుంచుకొని నూదుతూ ఆ నాద మాధుర్యాన్ని గోపల్లెకు పంచే నిండు చంద్రుడైనవాడిని భజిస్తున్నాను.'

అంటూ మొదటి ఆశ్వాసంలోను, ప్రార్థనలతో రెండవ ఆశ్వాసంలోను వేడుకుంటాడు, లీలాశుకుడు గా చెప్పుకునే బిల్వమంగళుడు

మందం మందం మధురనినదై ర్వేణు మాపూరయన్తం
బృందం బృందావనభువి గవాంచారయన్తం చరన్తం|
ఛందోభాగే శతమఖముఖధ్వంసినాం దానవానాం
హంతారం తం కథయ రసనే గోపకన్యా భుజంగమ్|| 2-6

'మనోజ్ఞస్వరాలతో మెల్లమెల్లన వేణువునూదుతూ, బృందావన గోగణాలని మేపుతూ, వేదాంత వీధుల చరిస్తూ, రాక్షసుఁల నెల్ల నడచుచు, గోపకన్యల విటుడుగా ప్రసిద్దుడైన కృష్ణుని ఓ నాలుకా కీర్తింపుమా!'

అపి జనుషి పరస్మిన్నాత్తపుణ్యో భవేయం
తటభువి యమునాయాస్తాదృశో వంశనాళః|
అనుభవతి య ఏషశ్రీమదాభీరసూనో
రాధారమణిసమీపన్యాసధన్యామమవస్థాం|| 2-9

'యమునా తీరాన పుట్టిన ఈ వంశనాళం (పిల్లనగ్రోవి) ఏపుణ్యం చేసుకుని కృష్ణుని మోవిచేరి కృతార్థత పొందిందో గదా! నేను కూడా అట్టిపుణ్యాన్నే ఈజన్మలో చేసుకుని వచ్చేజన్మలోనైనా యమునాతటిని వెదురు బొంగుగాబుట్టి అటువంటి సార్ధకత పొందగలుగుదునా?'

అయి మురళి ముకున్దస్మేరవక్త్రారవింద
శ్వనమధురసజ్ఞే ! త్వామ్ ప్రణమాద్య యాచే
ఆధరమణిసమీపం ప్రాప్తవత్వామ్ భవత్వామ్
కథయ రహసి కర్ణే మద్దశామ్ నందసూనోః || 2 -11

'ఓ మురళీ! నీవు కృష్ణుని నగుమొగమునందాని శ్వాస తేనియలు పొందునట్టి అదృష్ట వంతురాలివి గనుక నిన్నొకటి అర్ధిస్తున్నాను. నువ్వు అతడి కెమ్మోవిపొంత నున్నప్పుడు దాపునే ఉన్న అతడి చెవిలో నా దుర్దశను రహస్యముగా వినిపించవా?'

యా శిఖరే శ్రుతిగిరాం హృది యోగభాజాం
పాదాంబుజే చ సులభా వ్రజసుందరీణాం|
సా కాపి సర్వజగతామభిరామసీమా
కామాయ నో భవతు గోపకిశోరమూర్తిః|| 2-18

'వేదాంతమందు ప్రతిపాద్యమై, యోగుల హృదయములందు ధ్యానమూలమై, గోపస్త్రీల వద్ద అనువర్తించువాడై, లోకంలోచక్కదనానికి నిర్వచనమైన చిన్ని కృష్ణుడు మా కోరికలనీడేర్చుగాక.'

రాధా పునాతు జగదత్యుతదత్త చిత్తా
మన్థానమాకలయతీ దధిరిక్తపాత్రే|
తస్యాః స్థనస్తబక చంచలలోలదృష్టి
ర్దేవోపి దోహనధియా వృషభం నిరుంధన్ || 2-25

'కృష్ణుని పై పారవశ్యంతో మనసు నిలిచిన రాధ పెరుగులేని వట్టి కుండని కవ్వంతో చిలుకుతున్న సమయాన ఆమె కదులుతున్న చనులని పరవశంతో చూస్తూ ఎద్దుకి పాలు పిండబోతున్న కృష్ణుడు లోకాన్ని కాపాడునుగాక.'

వరమిమముపదేశ మాద్రియధ్వం
నిగమవనేషు నితాంత చారఖిన్నాః|
విచినుత భవనేషు వల్లవీనా
ముపనిషదర్థములూఖలే నిబద్ధమ్|| 2-28

'వేదాలనే అడవులలో తిరిగి వెదకి వేసారిన విద్వాంసులారా మీకు కావలసినది అక్కడ దొరకక పోవచ్చు. మీకు దొరికే సులువైన ఉపాయము వినుడు, గొల్ల యిండ్లలో పోయి వెదకుడు; మీకు ఉపనిషత్తుల అర్ధము కృష్ణునిరూపములో అక్కడ సులభముగా కానవచ్చును.'

తరువాయి భాగం వచ్చే సంచికలో....

-o0o-

Note: Most the information is obtained from internet and some also from the book “The man who knew Infinity” by Robert Kanigel, published by Washington Square Press

Posted in August 2021, సాహిత్యం

1 Comment

  1. సి వసుంధర

    లీలాశు కుని శ్రీ కృష్ణ కర్ణామృతం
    గూర్చి తెలిపి మా మనసులను పరవసింప చేసినందుకు గోపాలరావు గారికి ధన్యవాదాలు. సి వసుంధర

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!