Menu Close
బావా బావా పన్నీరు!
-- వెంపటి హేమ --

ఆట్టే వ్యవధి లేకుండానే ఫ్లయిట్ నంబరు, తను హైదరాబాద్ లో లాండయ్యే టయిం వగైరాలన్నీ మెయిల్ చేశాడు మహేశ్. మనసు, పట్టరాని ఆనందంతో క్లౌడ్ నైన్ మీద ఆకాశంలో తేలిపోతూండగా మహేశ్ రాకకోసం ఎదురు చూడసాగింది సృజన. ఆమెకు కాలం ఎంతకీ కదలనట్లు అనిపిస్తున్నా కూడా మహేశ్ వచ్చేరోజు రానే వచ్చింది.

చక్కగా ముస్తాబై, మహేశ్ ని రిసీవ్ చేసుకోడానికని బయలుదేరింది సృజన. ఇక ఎయిర్పోర్టుకి వెళ్ళడానికి టాక్సీని పిలుద్దామనుకుంటూoడగా ఫోన్ మోగింది...

“సారీ సజనీ! నేను రావడం లేదు, మా నాన్నకి ఈ ఉదయమే అకస్మాత్తుగా “హార్టు అటాక్” వచ్చింది. హాస్పిటల్లో చేర్పించాను. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందిట! ICU లో ఉంచారు ఆయన్ని. ఏవేవో రకరకాల టెస్టులు రాశారు. చేయించా. రిజల్ట్సు రావాలి. ఆపరేషన్ అవసరమయ్యే లాగుంది. మొన్ననే ఒక స్నేహితుడు ఆపద వచ్చిoదంటే ముందూ వెనకా ఆలోచించుకుండా ఉన్న డబ్బంతా అతనికి ఇచ్చేశా. ఇప్పుడు హాస్పిటల్ చార్జస్ కి, టెస్టులకి పోగా నాదగ్గర మిగిలింది ఆపరేషన్కి సరిపోతుందని అనిపించడం లేదు. ఇంకా కొన్ని టెస్టులు కూడా మిగిలున్నాయిట! ఇక ఆపరేషన్ అంటే మొత్తం నాల్గు లక్షలకు తక్కువ అవ్వదని చెపుతున్నారు. నా కివ్వాల్సిన ఫ్రెండుని అడిగితే - ఇంత షార్టు నోటీసుతో అంత డబ్బు ఎలా తిరిగి ఇవ్వగలను - అంటూ మొండి చెయ్య చూపిస్తున్నాడు. ఏం చెయ్యాలో తోచకుండా ఉంది. నాకున్న ఆత్మీయుడు మా నాన్న ఒక్కడే! అమ్మ ఏనాడో చనిపోయింది కదా!” మహేశ్ గొంతు చాలా దీనంగా ఉంది.

ఏడుస్తున్నాడేమో - అనుకుంది సృజన బాధగా. అతనికి ఎలాగైనా సాయపడి ఆ కన్నీరును ఆపాలనింపించింది ఆమెకు. వెంటనే అంది, "బాధ పడకు డార్లింగ్! వెంటనే నీ "నిఫ్టు ఇన్ఫో" నాకు పంపు. నా అక్కౌoటులో లక్షకు పైగా ఉంది డబ్బు. దాన్ని వెంటనే నీకు  పంపుతా. ఆ డబ్బు కట్టేసి ఆపరేషన్ కి ఏర్పాటు చెయ్యి. మిగిలిన డబ్బు డిశ్చార్జి టైంలో కడతామని చెప్పు.”

“నీ డబ్బా! వద్దు, నేను తీసుకోను.. ఇంకా మనమిద్దరం కలుసుకున్నది కూడా లేదు, అప్పుడే నీ డబ్బు తీసుకోడమా, నో! ఇప్పుడేమిటి! ఎప్పటికీ నేనలా చెయ్యను. అది నావల్ల కాదు. ఇక్కడ మాకొక ఇల్లు ఉంది. దాన్ని బేరం పెడతా.”

“ఇల్లు అమ్మడమంటే, అదంత తొందరగా పరిష్కారం అయ్యేది కాదు కదా! పోనీ నీకంత ఇదిగా ఉంటే ఇది అప్పనుకో! మళ్ళీ నాకు ఇచ్చేద్దువుగానిలే! ప్రస్తుతానికి తీసుకుని పెద్దాయనకి వైద్యం జరిగేలా చూడు. అది ముఖ్యం.”

“అలా అన్నావు బాగుంది. ఐతే సరే! నా నిఫ్టు నంబర్ పంపుతాలే. ఇల్లు బేరం కుదిరి డబ్బు చేతికి రాగానే ముందుగా నీ బాకీ తీర్చేస్తా. ఓకేనా” అంటూ "బై" - చెప్పి మహేశ్ ఫోన్ పెట్టేశాడు.

ఆట్టే వ్యవధి లేకుండానే మహేశ్ దగ్గరనుండి నిఫ్టు నంబర్లు వచ్చేయి. అతను పంపిన అక్కౌoటుకి వెంటనే అతనిపేర అక్షరాలా లక్షన్నర రూపాయలు తన అక్కౌoటు నుండి ఆన్ లైన్ ట్రాన్సుఫర్ చేసేసి ఊపిరి పీల్చుకుంది సృజన.

#      #        #

ఒక రోజు గడిచాక మళ్ళీ మహేశ్ నుండి ఫోన్ వచ్చింది. “సజనీ! నీకు మెనీమెనీ థాంక్సురా! నువ్వు పంపిన డబ్బుతో టెష్టులన్నీ అయ్యాయి. రక్తనాళాల్లో మూడుచోట్ల బ్లాక్సు ఉన్నాయిట! వెంటనే ఆపరేషన్ చేసి, బ్లడ్ బైపాస్ చెయ్యకపోతే నీ తండ్రికి ప్రమాదం - అని చెప్పారు డాక్టర్లు. వెంటనే నేను - డిస్చార్జి వేళ బిల్లు మొత్తం కట్టేస్తానని, అచ్చం నువ్వు చెప్పమన్నట్లే  చెప్పా- కానీ, "హార్టు ఆపరేషన్ అంటే రిస్కుతో కూడిన విషయం. మొత్తం డబ్బు కట్టాకే చేస్తాం ఆపరేషన్" అన్నారు వాళ్ళు. నా తండ్రి  ప్రాణం నిలబడాలంటే అది నీవల్లే ఔతుంది. మీ నాన్నగారిని అప్పు అడుగు. నీ సాయానికి నా జన్మంతా కృతజ్ఞతతో ఉంటా. ఈ సాయంవల్ల నీకు నేను ఎంతో ఋణపడిపోతా, కానీ తప్పదు.” ఏడుపు గొంతుతో అన్నాడు మహేశ్.

“ఛ! మనమధ్య ఋణమేమిటి మహేష్? త్వరలో మనమిద్దరం ఒకటి కాబోతున్నప్పుడు నా డబ్బనీ నీ డబ్బనీ తేడా ఏమిటి డార్లింగ్! ఇంకెప్పుడూ అలా మాటాడవద్దు, నాకు కోపం వస్తుంది.”

“కోపమా! వద్దు వద్దు. రాణీగారి ఆజ్ఞ మీర గలడా ఈ దాసుడు” అని నవ్వాడు మహేశ్, అంత కష్టంలో ఉండీ కూడా.

#       #         #

వెంటనే తండ్రికి ఫోనుచేసి తన "బూజం ఫ్రెండ్" ఒకతె ఆపదలో ఉందనీ, ఒక్క మూడు లక్షలు సాయం చేస్తే చాలు, ఇల్లమ్మి ఆ డబ్బు వాపసు చేసేస్తుoదనీ నమ్మబలకింది సృజన. కూతురుమాట కాదనే అలవాటు లేని ఆ పెద్దమనిషి, శ్రీనివాసరావు - ముందూ వెనుకా ఆలోచించకుండా అప్పేకదా కొద్దిరోజుల్లో తిరిగి ఇచ్చేస్తుంది - అన్న నమ్మకంతో వెంటనే ఆ మూడు లక్షలూ కూతురు అక్కౌంట్ లోకి మెయిల్ ట్రాన్స్ఫర్ చేసేశాడు. ఆ డబ్బు అందిన వెంటనే దాన్ని మహేశ్ అక్కౌంట్ కి పంపేసి, ఆపై  సృజన మహేశ్ కి ఒక మెసేజ్ పెట్టింది, “డబ్బు అందగానే ఆపరేషన్ చేయించు. నాన్నగారికి నా గుడ్ విషెస్సు, నమస్కారాలు తెలియజేయి. వారాంతపు సెలవుల్లో తప్పక ఆయనను చూడడానికి లక్నో వస్తానని కూడా చెప్పు. అలా మనం ఇద్దరం కల్సుకోడం కూడా ఔతుంది.”

ఏ క్షణంలోనైనా మహేశ్ నుండి “థాంక్సు గివింగ్ కాల్” వస్తుందన్న సృజన ఆశ అడియాశే అయ్యింది. మహేశ్ కాల్ కోసం ఆ రోజంతా ఎదురుచూసి, ఎదురుచూసి విసికిపోయిన సృజన, తనే అతనికి కాల్ చేసింది. ఫోన్ రింగయ్యిందే గాని ఎవరూ ఎత్తలేదు. మరో రెండుసార్లు చేసింది సృజన, కాని ఎవరూ ఆ కాల్ని రిసీవ్ చేసుకున్నది లేదు. ఆమె మనసు కీడు శంకించింది, “పెద్దాయనకు ఏమైనా అయ్యిందేమో" అని భయపడింది. మహేశ్ ఫోన్ కాల్ కోసం మరో రోజు కూడా ఎదురు చూసింది. మెసేజ్ కూడా పెట్టింది, కానీ ఫలితం లేదు. మనసు పరిపరివిధాలుగా ఆలోచించసాగింది.

చివరకి మహేశ్ సైలెన్సు వలన వచ్చిన హృదయవేదనను తట్టుకోలేక, తట్టుకోలేక పక్క రూమ్ ఫ్రండ్ కి జరిగినదంతా చెప్పింది. అంతా విని ఆమె నిర్ఘాంతపోయింది. "ఈ మధ్య సైబర్ నేరాలను గురించిన వార్తలెన్నో డైలీ పేపర్లలో వస్తున్నాయి, అసలు ఈ మహేశ్ అన్న వాడు ఉన్నాడో లేదో ముందు తెలుసుకో" అని సలహా ఇచ్చింది.

ఆమె మాటలతో జ్ఞానోదయమైన సృజన వెంటనే అతడు ఇచ్చిన నిఫ్టు నంబర్లని ఆధారంగా తీసుకుని బ్యాంకుకి ఫోన్ చేసింది. బ్యాంక్ ఆఫీసర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ సృజనకు షాక్ లా తగలడంతో, ఉన్నబడంగా నిలువునా కుప్పకూలిపోయింది.

“రెండు రోజుల క్రితమే మహేశ్ అనే పేరున్న వ్యక్తి వచ్చి, ఆ అక్కౌవుంట్ లో ఉన్న డబ్బు మొత్తం తీసుకుని, ఆపై ఆ అక్కౌంట్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయాడు!” ఇదీ బ్యాంక్ నుండి వచ్చిన సమాచారం.

అంటే - మహేశ్ అన్నపేరుతో వ్యవహరించిన వ్యక్తి ఒక ఫ్రాడ్ – అన్నమాట! ఎంత సిగ్గుచేటు! తను ఇన్నాళ్ళూ డేటింగ్ చేసినది, ప్రేమలో పడ్డది ఒక  సైబర్ నేరగాడితోనా!! డబ్బు నాల్గున్నర లక్షలతోపాటు తన మనసుని కూడా దోచుకుపోయాడు కదా పాపాత్ముడు! తన తెలివoతా ఏమయిందని తను అంత తేలిగ్గా మోసపోయింది! రేపు ఉదయమే వెళ్లి  పోలీసుల సహాయం తీసుకోవాలి - అనుకుంది సృజన. ఆ రాత్రి ఆమెకు నిద్ర పడితే ఒట్టు!

 #       #       #

మరునాడు పక్కింటి ఫ్రెండును తోడుగా తీసుకుని మాదాపూర్లోని సైబర్ క్రయిం ఇన్వెస్టిగేట్ చేసే పోలీసు స్టేషన్ వెతుక్కుంటూ బయలుదేరింది సృజన. ఆ సమయానికి పోలీస్ ఇనస్పెక్టర్ అక్కడే ఉన్నాడు. ప్రాయంలో ఉన్న యువతులిద్దరు రావడం చూసి అతడు మర్యాదగా వాళ్ళని ఆహ్వానించి కూర్చోమని చెప్పి, వాళ్ళు అక్కడికి రావలసి వచ్చిన కారణం ఏమిటని అడిగాడు...

సృజన తనకు వచ్చిన ఇబ్బందిని గురించి వివరించి, మహేశ్ తనకు ఇచ్చిన ఫోన్ నంబరు, నిఫ్టు నంబరు ఆయనకు ఇచ్చిoది. వెంటనే పోలీస్ యంత్రాంగం పని మొదలుపెట్టింది. బ్యాంకు లక్నోలోది కాని, ఫోన్ వచ్చింది మాత్రం లక్నో నుండి కాదు, ఆంధ్రప్రదేశ్ లోని లక్కవరం అన్న ఒక సాదా సీదా ఊరినుoడని తేల్చేశారు వాళ్ళు కొద్దిసేపట్లోనే. కేసు ఫైల్ చేస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు పోలీసులు. బ్యాoకులో ఎకౌంటు తెరిచినప్పుడు అతన్ని స్పాన్సర్ చేసింది ఎవరో తెలుసుకుని, అతని ద్వారా క్రిమినల్ని తేలికగా పట్టుకుంటాము - అన్నారు.

సృజన ఆలోచించింది - తను కోరి తెచ్చుకున్న కష్టమిది. కేసు పెడితే తన తెలివిలేనితనం అందరికీ తెలిసిపోతుంది. తన ఫోటో పేపర్లలో వచ్చినా రావచ్చు. తన బ్రతుకు బజారున పడుతుంది. అది తనకు మాత్రమేకాదు తన తల్లితండ్రులకు కూడా అవమానమౌతుంది. ఇక ఎవరిముందు వాళ్ళు తలెత్తుకుని తిరగలేరు. గప్చుప్ గా ఉండిపోతేనే నయం, డబ్బుతో శని విరగడైపోయి కనీసం పరువైనా దక్కుతుంది - అనుకున్న సృజన ఇనస్పెక్టర్ కి కేసు పెట్టనని చెప్పింది. దొంగల తల్లికి ఏడవ సిగ్గు - అన్నట్లు అయ్యింది పాపం సృజన బ్రతుకు.

వయసులో పెద్దవాడైన పోలీసు ఇనస్పెక్టర్ ఆమెను బాగా చివాట్లు పెట్టాడు. వయసులో ఉన్న యువతులు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాడు. “ఈ సోషల్ మీడియా వచ్చి జనానికి మంచి చేస్తోందో, చెడు చేస్తోందో తెలియడం లేదు. ఈ మధ్య సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందులోనూ ఇలాంటివి మరీను! డేటింగ్ పేరుతో మోసగించి డబ్బు లాగే వాళ్ళు ఎక్కువైపోయారు. వీటికి ఆడా, మగా అనే భేదం లేదు. అమాయకులను బేలుపుచ్చి  చేరికవుతారు. తీపి మాటలతో గుట్టు మొత్తం రాబడతారు. ఆ తరవాత "సెల్ఫీ" లంటూ వివిధ భంగిమలతో ఒకరికొకరు ఫోటోలు పంపుకుంటారు. నేరగాడు ఎప్పుడూ తన జాగ్రత్తలో తానుంటాడు. ఇక ఆ రెండవ పార్టీ "బకరా" కాక తప్పదు. కష్టాల్లో ఉన్నానని చెప్పి డబ్బు సాయం అడగడం జరగవచ్చు. లేదా ఆలోచన లేకుండా పంపిన రకరకాల సెల్ఫీలు పబ్లిక్ లో పెడతానని బ్లాక్మెయిల్ కూడా చెయ్యవచ్చు. బాయ్ ఫ్రెండ్ గా దరిజేరి ఉన్నదంతా ఊడ్చుకుని పరారైపోనూవచ్చు! ఇలాంటి కష్టాలకు ఆడా, మగా - అని తేడా ఏమీ లేదు. కానీ ఇద్దరిలో ఈ రకమైన అపాయమన్నది ఆడపిల్లలనే ఎక్కువగా బాధిస్తుంది. ఆ సంగతి గుర్తుంచుకుని ఆడవాళ్ళు ఏ మాయగాళ్ళ మాటలను నమ్మి మోసపోకుండా, హద్దుల్లో ఉండడం చాలా అవసరం. ముల్లొచ్చి అరటాకుమీద పడినా, అరటాకు వెళ్ళి ముల్లుమీద పడినా చిరిగిపోయేది అరిటాకే కదా! ఐనదేదో అయ్యింది, ఇకనైనా జాగ్రత్తగా ఉండమ్మా! మీకు డబ్బుకి లోటు లేదన్నావుగా, పొతే పోయాయిలే నాలుగున్నర లక్షలు. నిన్నతడు బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం తప్పకుండా నాతో చెప్పు, వాడి అంతు తేలుస్తాను” అని ముక్క చివ్వాట్లు పెట్టి మరీ పంపాడు సృజనను ఆయన.

సృజన తానుండే హాస్టల్ కి తిరిగివచ్చేసరికి రిసెప్షన్ లో ఆమె రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుని ఉన్న తండ్రి కనిపించాడు. కూతురు వీకెండ్ వచ్చినా ఇంటికి రాకపోడమే కాకుండా, ఫోన్లో కూడా సరిగా మాటాడకపోయేసరికి, కూతురుకి ఏమయిందోనన్న భయంతో, శ్రీనివాసరావు పనులన్నీ పక్కనపెట్టి కూతురుని చూడడానికి వచ్చాడు. తండ్రిని చూసి, ఇక తట్టుకోలేక బోరున ఏడ్చేసింది సృజన. ఏడుస్తూనే జరిగినదంతా చెప్పేసింది తండ్రికి.

కూతుర్ని ఓదార్చాడు శ్రీనివాసరావు, “డబ్బు పొతే పోయిందిలే, నువ్వు బాగున్నావు  కదా! నా కది చాలు. ఇక, చేసిన ఉద్యోగం చాలు గాని ఇంటికి పోదాం పద” అంటూ కూతురుచేత తక్షణం ఉద్యోగానికి రాజీనామా చేయించి, అప్పటి కప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోయాడు.

మరొకప్పుడైతే తండ్రిని ప్రతిఘటించేదేమో గాని, నిరీహతో చేవ చచ్చి ఉన్న సృజన ఏమీ మాటాడకుండా ఉద్యోగానికి "బై" చెప్పేసి, తండ్రి వెంట వెళ్ళిపోయింది. పట్టుమని పది నెలలైనా గడవక ముందే ఆమె ఉద్యోగపర్వం ముగిసిపోయింది.

# # # #

“సృజనా! అమ్మలూ, ఒకసారి ఇలా రావే” అంటూ తల్లి ఎలుగెత్తి పిలవడoతో, తన గదిలో మంచం మీద పడుకుని సీలింగ్ వైపు చూపు నిగిడ్చి, మహేశ్ ని గురించిన ఆలోచనలలో మునిగి పరాకుగా ఉన్న సృజనకు తల్లి పిలుపుతో లేవక తప్పిందికాదు. ఆమె ఇంటికి వచ్చి అప్పుడే రెండు రోజులయ్యిoది.

సృజన తల్లి వంటగదిలో కాఫీ కలుపుతోంది. కమ్మని కాఫీ ఆరోమాతో గాలి నిండిపోయి ఉంది. కాఫీ కప్పుని సాసర్లో ఉంచుతూ, “బావ వచ్చాడు. లైబ్రరీలో ఉంటానన్నాడు. ఈ కాఫీ తీసుకెళ్ళి ఇవ్వు” అని చెప్పి, పొగలు కక్కుతున్న కాఫీ కప్పున్న సాసర్ని కూతురు చేతికి అందించింది ఆమె.

అయిష్టంగానే ఆ కాఫీకప్పుని తీసుకుని తప్పనిసరిగా లైబ్రరీ రూమ్ లోకి నడిచింది సృజన. ఆమెకు శివ ఎదుటికి వెళ్ళాలంటే మొహం చెల్లకుండా ఉంది. కాని, బ్రతుకుతో రాజీ పడక తప్పదు కదా!

వెనక్కి తిరిగి షెల్ఫులో ఏదో పుస్తకం కోసం వెతుకుతూ నిలబడివున్న మనిషిని చూసి, సృజన తలవంచుకుని, నేలచూపులు చూస్తూ, “బావా! కాఫీ” అంది.

“హాయ్ సజనీ! హౌ ఆర్ యు?” వెంటనే అతడు ఆమె వైపుకి తిరిగాడు.

ఆ కంఠస్వరం విని కొయ్యబారిపోయింది సృజన. ఆ గొంతు మహేశ్ ది! ఆ పిలుపూ మహేశుదే! ఆశ్చర్యంతో తలెత్తి చూసిన సృజనకు ఎదురుగా మహేశ్ నిలబడి ఉన్నాడు. అప్రయత్నంగా ఆమె పెదవులు దాటి వచ్చింది అతని పేరు, “మహేశ్?”

“ఔను. నేనే నీ మహేశ్ ని! స్టైల్ పూర్తిగా మారిపోవడంతో నువ్వు నన్ను గుర్తిoచలేకపోయావు. నేనే నీ బావ శివను కూడా. ఇక కంఠస్వరమంటావా... కాలేజిలో చదివే రోజుల్లో నా హాబీ మిమిక్రీ. అందుకే అలవోకగా గొంతు మార్చి మాటాడగలిగా. ఇంత తేలికగా నువ్వు నా వలలో చిక్కుంటావనుకో లేదు, కానీ చిక్కావు.”

దిగ్భ్రాంతితో అవాక్కై నిలబడిపోయింది సృజన.

శివ మళ్ళీ తనే మాటాడాడు, "మేనకోడలు కోడలు కావాలన్నది మా అమ్మ కోరిక! అది నెరవేరకపోతే మా అమ్మ ఆత్మకు స్వర్గంలోకూడా శాంతి ఉండదనిపించింది. అంతే కాదు, మామయ్య నన్ను అల్లుణ్ణి చేసుకునే ఉద్దేశంతో బోలెడు డబ్బు ఖర్చుచేసి నన్ను అమెరికా పంపి చదివించాడు. అన్నింటికన్నా పెద్ద కాంప్లికేషన్ మరొకటుంది, అది నా మనసు! ఐ లవ్ యు సృజనా! నువ్వైతే తేలిగ్గా ఒక్క ముక్కలో "నో" చెప్పేశావుగాని, నేను నీ "నో"ని యాక్సెప్ట్ చెయ్యాలంటే ఎన్నింటికి జవాబు చెప్పాలో చూడు! నాకు నువ్వు, "నో" చెప్పాక చివరిసారిగా ఒక  ప్రయత్నం చేసి చూడాలనుకున్నా. రకరకాల పేర్లతో వివిధ డేటింగ్ చానెల్సులో రిక్వెస్టులు పెట్టా. నువ్వు తక్కిన వాటి నన్నిoటినీ వదలేసినా, “మహేశ్” పేరుకున్న గ్లామర్ కి పడిపోయావు. నిన్ను కనిపెంచిన నీ తల్లిదండ్రులు నీ మంచి కోసమే కృషి చేస్తారన్నది నమ్మలేని నువ్వు, కేవలం వెబ్ లో మాత్రమే పరిచయమైన, ముఖాముఖీ ముఖపరిచయమైనా లేని పరాయి వాడిని అంత తేలికగా ఎలా నమ్మగలిగావు? డేటింగ్ చానల్సులో సక్సెస్ పాలు చాలా తక్కువ. ధారాళంగా మోసాలు జరుగుతుంటాయి. సైబర్ క్రైం దెబ్బ ఎలా ఉంటుందో ఒక్కరవ్వ నీకు రుచి చూపిoచాలనిపించింది. వలవేశా, చేప పడింది. అమెరికా వెళ్ళాక నా స్టైల్ మారింది. అద్దంలో చూసుకుని నన్ను నేనే ఆనవాలు పట్టలేకపోయా. అందుకనే నువ్వూ ఆనవాలు పట్టలేవనిపించి, ధైర్యంగా నా ఫోటోలు నీకు పంపగలిగా. వెబ్ ని నమ్మిన నువ్వు నా వెబ్ లో తేలిగ్గా చిక్కుకున్నావు. మరి ఇప్పుడేమంటావు?” చిరునవ్వుతో ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు శివ.

“నన్ను క్షమించు బావా! ఇకనుండి నేను నీ దానిని” అంది సృజన గద్గద స్వరంతో. ఆమె కళ్ళలో చిప్పిలిన కన్నీటిని క్రిందికి జారనీకుండా శివ తన పెదవులద్ది తుడిచేశాడు.

"పిచ్చి పిల్లా! మనమధ్య డేటింగ్ నువు పుట్టినప్పటినుండీ సాగుతోనే ఉంది. నువ్వే అది గ్రహించలేకపోయావు. మనమిద్దరం కలిసి పెరిగాం. ఆడుకున్నాం, అల్లరి చేశాo! తాయిలాలు పంచుకుతిన్నామ్ ... "

"చాలు బావా, చాలు! నాదే తెలివితక్కువ, క్షమించి నన్ను నీదాన్ని చేసుకో."

గాఢ పరిష్వంగంలో చిక్కుకుని తన్మయులై ఉన్న ఆ యువజంటను చూసి నిట్టూర్చింది బల్లమీదున్న కాఫీకప్పు ...

“బావా బావా పన్నీరు, బావకి మరదలు బంగారు! ఇక నే నెవరికి కావాలి కనక!” ఉసూరుమంటూ దిగజారి పొగలు తగ్గి, చప్పగా చల్లారిపోయింది కప్పులోని కాఫీ.

(సమాప్తం)

Posted in August 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!