కాలగర్భంలో కలిసిపోయిన నాగరికతల గురించి, చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో సామాజిక స్థితిగతుల భూత, వర్తమానాల తేడాల గురించి మనకు తెలియాలంటే, ఆనాడు చేయించిన శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు మనకు సాక్షి. అయితే ఆ చరిత్ర గురించి ఉత్ప్రేక్షలతో కళ్ళకు కట్టినట్టు వివరించాలంటే కవి అనే వాడికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఆ కవి తన అక్షరాల హారాలతో యావత్ చరిత్రను వివరించగలరు. అంతటి భావజాలం ఉన్నవాడు మాత్రమే కవిగా లేక కవయిత్రిగా ఆనాడు రాణించారు. ‘కత్తి కంటే కలం గొప్పది’ అన్న నానుడి ఊరికే రాలేదు. ఒక రచయిత తన కలం తో రాజ్యాలను నిర్మించగలరు, కూల్చగలరు. కనుకనే పూర్వకాలంలో కవులకు రాజాస్థానంలో ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ఆ తరువాతి కాలంలో రంగస్థల నాటకాలు ఎంతో ప్రాచుర్యం పొందడానికి ఆ నాటకాలను వ్రాసిన రచయితలు ముఖ్యకారకులు. వారు నాటి సామాజిక స్థితిగతులను, చారిత్రాత్మక ఘట్టాలను అంశాలుగా తీసుకొని తమ మేథోసంపత్తితో ఎన్నో రచనలను చేసి సమాజానికి అందించేవారు. ఆ విధంగా చరిత్రను, తద్వారా నాగరికతను తరువాతి తరాలకు అందించేందుకు ఒక మాధ్యమంగా పనిచేశారు, చేస్తున్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు, అభివృద్ధి పథంలో సాగుతున్న జీవన ప్రయాణానికి ఉత్ప్రేరకం లాగా పనిచేసేది నేటి భావజాల అభ్యుదయ రచనలే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అటువంటి రచనలకు, రంగస్థల నాటక రంగానికి ఆద్యుడు, నేటికీ ఎంతోమంది సాహిత్య వేత్తలకు ఒక దిక్సూచిగా నిలిచి, ఆంగ్ల భాషా వాఙ్మయంలో అత్యంత ప్రముఖుడై, అన్ని తరగతుల పాఠ్యాంశాలలో తన రచనలతో ప్రముఖ స్థానాన్ని సంపాదించిన శ్రీ విలియం షేక్స్పియర్ నేటి మన ఆదర్శమూర్తి.
ఏప్రిల్ 23, 1564 వ సంవత్సరంలో ఇంగ్లాండ్ లోని స్ట్రాట్ఫోర్డ్ అనే పట్టణంలో షేక్స్పియర్ జన్మించారు. ఆయన పుట్టుకకు ఒక పరమార్థం ఉన్నది అన్న విషయం బాల్యంలోనే ఆయన కుటుంబ సభ్యులకు మరియు ఆ ఊరి ప్రజలకు ఆయన మేథో అనుకరణల ద్వారా అర్థమైంది. కనుకనే ఆ స్ట్రాట్ఫోర్డ్ పట్టణానికి ఆయన ద్వారానే ప్రపంచంలో ఒక ఉన్నతమైన గుర్తింపు లభించింది. ప్రాధమిక విద్యలోనే ఆంగ్ల వ్యాకరణం ఒంటబట్టించుకొని, ఆంగ్లంతో పాటుగా గ్రీక్, లాటిన్ భాషలు కూడా క్షుణ్ణంగా నేర్చుకొన్నారు. ఆ తరువాత నాడు ప్రముఖంగా ఉన్న నాటక రంగం వైపు ఆకర్షితుడై, నాటకాలను వ్రాయడం ఎలా అనే ఉత్సుకతతో నాటక రచన చేసే విధానాన్ని కూడా అభ్యసించారు. ఆ అభ్యాసమే ఆయనను ప్రముఖ రచయితగా గుర్తింపునిచ్చింది. యావత్ ప్రపంచం ఆయనను గుర్తుంచుకుని ఆయన రచనా విధానాలే నేటి నాటక, రంగస్థల రచయితలకు పాఠ్యాంశాలుగా మారాయి. రంగస్థల రంగానికి సరైన రూపురేఖలతో ప్రాణం పోసిన వాడు షేక్స్పియర్. ఆయన వ్రాసిన ఎన్నో నవలలు నేటికీ ప్రముఖమై అన్ని భాషల సాహిత్యంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నాయి. మాక్బెత్, టెంపెస్ట్, రోమియో అండ్ జూలియట్, హామ్లెట్, అంటోనీ మరియు క్లియోపాత్ర.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ మనకు తెలిసిన పేర్లే అనిపిస్తాయి. ఎందుకంటే అందరూ ఆయన నాటకాలను నవలలుగా చదివి అభ్యాసం చేసినవారే. తన జీవిత కాలంలో దాదాపు ముప్పై నాటకాలు షేక్స్పియర్ వ్రాయడం జరిగింది.
సొన్నెట్ (Sonnet) అనేది ఇంగ్లీషుకావ్యములో పదునాలుగు చరణములు గల ఒక విధమైన పద్యము లేక లఘు గీతం. ఆ ప్రక్రియ సృష్టికర్త షేక్స్పియర్. అటువంటి పద్య ప్రక్రియలను ఎన్నింటినో ఆయన ఆంగ్ల సాహిత్య లోకానికి పరిచయం చేశారు. ‘The Sonnets of Shakespeare’ లో ఆయన వ్రాసిన 154 పద్యాలను చూడవచ్చు.
షేక్స్పియర్ తన రచనలలో ఎన్నో సరికొత్త పదాలను ఆంగ్ల సాహిత్యానికి పరిచయం చేయడం జరిగింది. ఈ కొత్త పదాలకు మిగిలిన భాషలలోని మూలాలతో సంబంధం ఉన్నందున, ఎంతో అర్థవంతమై ఆ పదాలన్నీ నేటికీ నిఘంటువులో స్థానాన్ని కలిగివున్నాయి. కనుకనే షేక్స్పియర్ రచనలు ఆంగ్ల సాహిత్యం లోనే కాక మిగిలిన భాషావేత్తలకు కూడా ప్రీతిపాత్రమైనాయి. ఆయన రచనల స్ఫూర్తితో ఎంతోమంది సాహిత్యం పట్ల ఆకర్షితులయ్యారు. సమాజంలో తమకంటూ పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించారు. ఆ విధంగా ఆంగ్ల సాహిత్యానికే కాదు, అన్ని భాషలలో కూడా తన ఉనికిని చూపుతూ ఎంతో సేవ చేస్తున్న షేక్స్పియర్ నిజంగా ఆదర్శమూర్తి.
ఏప్రిల్ 23, 1616, షేక్స్పియర్ మరణించారు. కానీ, వన్నెతరగని సాహితీ విలువలతో ఆంగ్ల భాష తో మిళితమై అన్ని భాషలూ వెలుగొందినంత కాలం షేక్స్పియర్ పేరు ఈ భువిలో, సాహితీ ప్రియులందరి మనసులలో అజరామరమై ఉంటుంది. అన్ని భాషల పాఠ్యాంశాలలో ఆయన రచనలు నిత్యం మనకు కనిపిస్తూనే ఉంటాయి.