తరువోజ
పరవడి మననుడి వడివడి నదిల
వరవడి పరుగిడు పదగని నుడిర
కనుగలి వినుగలి గరిమల విరిసె
ఘనమగు మననుడి కళల మురిసెడి
మనుగడ నిలిపెడి మననుడి తెలుగు
మనబడి విరిసెడి మదినుడి వెలుగు
ఎద నుడి మనగుడి ఎడద కదిలెడి
ఇల బతుకుల నుడి ఎలమి కలిగెడి
తెలుగు నుడి మధురం
తేటగీతి.
మాతృభాష తెలుగు గూర్చి మౌనమేల
తెలుగు వారికే ల నుడిపై తెగులు బుట్టె
మనకు ప్రభుత కు తెలుగుపై మనసు లేదు
జాను తెలుగందు తెలుగోడి జాడ యేది
మమ్మియని పిలువ మురిసేనమ్మ నేడు
తండ్రిని ట డాడి యనగానె దర్ప మాయె
అత్త పిన్నియో తెలియదు ఆంటి యనిన
అచ్ఛ తెలుగు మాటాడిన నచ్చదాయె
తల్లి సున్నము పిన్నిట బెల్ల మాయె
ఆంగ్ల భాష మాట్లాడిన హాయి గలుగు
మనల తెలుగు మాటాడగ మనసు రాదు
యేమి ఖర్మమో తెలు గన్న లేమి చూపు
సంస్కృతంబు లోని మధుర సారమంది
అరవ భాష నుండి నుడుల నందమొంది
కన్నడంపు కస్తూరికా వన్నెలంది
పర నుడుల మాటలను కూడి పరవశించు
కమ్మనైన తెలుగు మన అమ్మ నుడిర
భాషయనిన తమిళులకు ప్రాణ మాయె
మహిమరాటీల భాషపై మమత జూడు
కన్నడిగులకు భాషయే కల్పవల్లి
ఉత్తరాదులకిందీయె యూపిరాయె
వారిని జూసైన మనవారు మారరేమి!?