Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

పద్మనాయక – రెడ్డిరాజుల యుగం

ఎఱ్ఱాప్రగ్గడ

ఎర్రన ప్రతిభావంతుడు. తన పూరణ ప్రారంభంలో ఆశీర్ణమస్ర్కియా వస్తు నిర్దేశాలలో ఏ ఒక్కటైనా చేసే అవకాశం లేదు. కాబట్టి అందులో ఉన్న ఒక ‘సరస్వతీ గీత’ అనే ఘట్టాన్ని ఆధారంగా చేసుకొని సరస్వతీ స్తుతి చేశాడు. సరస్వతీ గీత ఘట్టంలో తా క్ష్యుడు అనే ముని భారతిని ఆరాధించి ఆమె ప్రత్యక్షం కాగా ఆమెద్వారా తన సందేహాలను నివృతి చేసుకొంటాడు. ఇది మూలంలో లేదు. దీనిని గూర్చి ఆరుద్ర మాటలు. “ఇది ఎర్రన గారు చేసిన స్తుతి. అరణ్య పర్వ శేషాన్ని రచిస్తున్నప్పుడు వారు మొట్టమొదట ఈ పద్యాన్ని చెప్పాడని నేను తలుస్తున్నాను” ఆ పద్యం

“అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర డంబర ....గృపజూడు భారతీ!” (ఆర – 4 -216)

ఇందులో ఎర్రన సరస్వతిని ‘భారతీ’ అని పద్యం చివర సంభోదించారు. దీనిని గూర్చి నోరి నరసింహ శాస్త్రి గారిచ్చిన వివరణ లోని సారాంశం ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

“ఎర్రన గురువుగారు శంకరస్వామి. శ్రీ విద్యారణ్యులవారు స్తోత్రము చేసిన శంకరానంద గురుపాదులితడే కావచ్చును. శృంగేరి మొదలైన శంకర పీఠ స్వాములు భారతీ సంప్రదాయయతులు. ఎర్రన గురువైన శంకర స్వామి కూడా భారతీయతియై యుండును. కర్ణాటక ప్రాంతములో శ్రీ విద్యారణ్యులు చేసినట్టి ఉద్ధరణ కార్యమును ఈ శంకర స్వామి గూడా శ్రీశైల భూమిలో చేసి యుండుననుటకు సందేహము లేదు. శంభుదాసుడను లక్షణాభిదేయమును ఎర్రనకు గురువే ప్రసాదించి యుండును.

ఎర్రన తన పద్యంలో భారతీ అనే పదం వాడడం వాళ్ళ అటు సరస్వతిని, ఇటు గురువును కూడా స్మరించడం విశేషం.

నరసింహ శాస్త్రి గారి వివరణ కు స్పందిస్తూ ఆరుద్ర ఎర్రన ప్రతిభను గూర్చి ఇలా అన్నారు.”...ఒక క్రియతో రెండు కార్యాలు సాధించినట్లు ఎర్రన గారు ఈ పద్యంలో ఇష్టదేవతా ప్రార్థనా, గురుస్తుతీ రెంటినీ సాధించారు. ఇది గ్రంథంలో కథతో విలీనమయ్యే ప్రార్థన. ప్రతిభంటే ఇలా ఉండాలి.”

తెలుగువారు శ్రీకారంతో పద్యం ప్రారంభిస్తే తమిళులు సినిమా పాట కూడా ‘అ’ కారంతో ప్రారంభిస్తారని ఆరుద్ర తెల్పారు. (స.ఆం.సా. పేజీ 551-2).

ఎర్రన “అంబానవాంబు......” అంటూ ‘అ’ కారంతో ప్రారంభించిన విషయం గూర్చి చెబుతూ తమిళులను గూర్చి ప్రస్తావించారు ఆరుద్ర.

ఎర్రన గారి భారత భాగంలో ఉన్న ఘట్టాలను ఆరుద్ర ఒక పట్టికగా ఇచ్చారు. ఎర్రన గారు మొత్తం 1595 గద్య, పద్యాలతో భారత రచన పూరించారు. ఇందులో మొదటి భాగంలో నన్నయ గారి శైలి, రెండవ భాగంలో తిక్కన గారి శిల్పం కనపడతాయి అని అన్నారు ఆరుద్ర. ఎర్రన గారే మహాభారత గద్యలో తన రచనను ఒక పట్టికగా ఇచ్చారు. ఇందులో ఇరవై మాత్రమె భారత వ్యక్తులకు సంబంధించిన కథా భాగాలు. మిగతావి ధర్మరాజు గారి పురాణ కాలక్షేపం.

ఎర్రన రచనలు:

  1. అరణ్యపర్వ శేషం 2. నృసింహ పురాణం 3. రామాయణం 4. హరివంశం

నృసింహ పురాణం లో నృ.పు. ముందే అరణ్య పర్వ శేషం పూరించినట్లు చెప్పారు. హరివంశంలో ఆ రచనకు ముందే రామాయణం రచించినట్లు చెప్పారు.

హరి వంశ రచన క్రీ.శ. 1335 పూర్వమే జరిగి ఉండాలి అంటే ప్రోలయ వేమారెడ్డి ఆ సంవత్సరంలో శ్రీశైలానికి, ఆహోబిలానికి సోపాన పంక్తి నిర్మించాడు. ఈ విషయం ప్రోలయ వేమారెడ్డి వేయించిన చీమకుర్తి శాసనంలో కనపడింది. అయితే ప్రోలయ వేమారెడ్డి చేసిన దానధర్మాలను గూర్చి ఎర్రన తన హరివంశం లో వర్ణించాడు. అది “అగ్రహారములు విద్యా తపోవృద్ధ విప్రులకిచ్చి ....” అందులో అహోబిల, శ్రీశైల సోపాన నిర్మాణ విషయం లేదు. అందువల్ల ఆ సోపాన నిర్మాణానికి ముందే ఎర్రన హరివంశం రచించి ఉంటాడు. ఇక ఎర్రన గారి కాలాన్ని గూర్చి వేదం వెంకటరాయ శాస్త్రి గారు క్రీ.శ. 1364-86 మధ్య అన్నారు. (స.ఆం.సా పేజీ 574)

హరివంశం లో కరతలామలకము. ఏనుగు తిన్న వెలగపండు, చీమ చిటుక్కుమన్న మొదలైన సామెతలు ఉన్నాయి.

ఎర్రన గారు రచించిన నాలుగు గ్రంథాలను గూర్చి వరుస క్రమంలో క్లుప్తంగా పరిశీలించడం జరుగుతుంది.

అరణ్యపర్వ శేషం :

ఎర్రన నృశింహ పురాణం రచిస్తూ ఆ రచనకు పూర్వమే అరణ్యపర్వశేషోన్నయం చేసినట్లు చెప్పారు.

ఎర్రన, తిక్కన విరాటపర్వంలో కీచకుడు ద్రౌపదిని వేధించినట్లుగా ఎర్రన గారి అరణ్యపర్వంలో సైంధవుడు ద్రౌపదిని బాధపెట్టాడు. అయితే ఎర్రన ద్రౌపది అరణ్య వాసంలో ఉన్నది. అజ్ఞాత వాసంలో లేదు. అందుకే ఎర్రన ద్రౌపది నోట తన భర్తల ఘనతను ‘ప్రకటిత శౌర్య సారుల’ ప్రతాపాన్ని పేరు పేరునా ఏడు పద్యాలలో చెప్పించాడు. ధర్మరాజు మదపుటేనుగు- భీముడు సింహం...ఇది మూలంలో ఉన్నదే. మూలంలో ధర్మరాజు గూర్చి మాత్రమె చెప్పిన ద్రౌపది, ఎర్రన రచనలో తెనుగుదనం తో గూడిన ఉపమానాలతో – ఏనుగుకు నీళ్ళు చూపడం, సింహం జూలు పట్టుకొని ఊగడం, పులిని కోలతో కొట్టడం, బుసకొట్టే త్రాచు పాముల్ని (నకుల సహదేవులను) కాళ్ళతో నలపడం వంటి సాహసాలు చెయ్యవద్దు అని సైంధవుణ్ణి హెచ్చరిస్తుంది. అక్కడ కీచకుడు, ఇక్కడ సైంధవుడు. ఇలాంటి పోలికే మరొకటి.

విరాట పర్వంలో ద్రౌపది భీముని ముందు పాండవులందరినీ పొగుడుతుంది. అలాగే ఎర్రన గారి అరణ్య పర్వంలో యుద్ధానికి (సైంధవునితో) వస్తున్నా పాండవులను వర్ణిస్తుంది. సావిత్రీ చరిత్రను ఎర్రన ఒక ప్రబంధం లా వ్రాశారు. అందుకే ఎర్రన గారికి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వచ్చింది. ఇలాంటి ప్రబంధాలను అరణ్యపర్వ శేషంలో రాయడం వల్లే వచ్చిందన్నారు ఆరుద్ర.

‘ఉన్నయం’ పద విచారణ : ఎర్రన అరణ్యపర్వంలో కొత్త పదాలేవీ వ్రాయలేదు. ‘తాటాకులను పురుగులు కొట్టేస్తే శిధిలమైన అక్షరాలను పూరించారు’ అనే వాదన నడికుదురు వీరరాజు పంతులు గారు బాగా ప్రచారం చేశారు. కొందరు పెద్దలు దీనిని అంగీకరించలేదు. ఎర్రన గారు తాము ‘అరణ్యపర్వశేషోన్నయం’ నిర్వహించామని చెప్పుకొన్నారు. (నృసింహ-1-17 -స.ఆం.సా. పేజీ 555). శేష + ఉన్నయం, ఉన్నయం అనే పదానికి అర్థం – ‘కడముట్టజెప్పుట’ అనే అర్థాన్ని వేటూరి శివరామ శాస్త్రి గారు సిద్ధాంత కౌముది, అమరకోశం, భట్టి మొదలైన ప్రయోగాలతో చెప్పారు. (హరివంశం పీఠిక, పుట15, అధోజ్ఞాపిక).

ఎర్రన గారు తన అరణ్యపర్వ శేషాన్ని పూరిస్తూ చెప్పిన మాటలు గమనార్హం. “భావ్యచరితుడాపస్తంభ సూత్రుండు...ఎర్రనార్యుండు సకలలోకైక విదితుడయిన నన్నయభట్టు మహాకవీంద్రు సరస సారస్వతాంశ ప్రశస్తిదన్ను – జెందుటయు ....కానా యరణ్య పర్వ శేషము – పూరించె గవీంద్ర కర్ణపుట పేయముగా..” ఎర్రన గారి అరణ్యపర్వ రచనా (అరణ్య-7-469-70) విశేషాలను చెప్పుకోవాలంటే ఇటువంటి రచనలో కాక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. మచ్చుకు కొన్ని;

ఎర్రనకు కర్మణీ ప్రయోగాలు ఇష్టం. పుట్టింపబడిన యా మనుష్యులు, మొదలైనవి. దీనిని గూర్చి చెప్తూ ఆరుద్ర ‘...నన్నయ, తిక్కన ల పద ప్రయోగ సూచీలు తయారు చేయించిన సాహిత్య అకాడమీ వారు ఎర్రన గారి రచనలకు కూడా పదప్రయోగ సూచిక చేయించాలి అప్పటికి గాని కవిత్రయ భాష సంపూర్ణంగా మన కోశాలకు ఎక్కదు. సలహా సంఘ సభ్యునిగా నేను ఎన్ని సార్లు మొత్తుకొన్నా అకాడమీ వారు ఈ పధకాన్ని మూల పడేశారు...” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎర్రనను గూర్చి శివరామ శాస్త్రి అభిప్రాయం – “ఎర్రన జన్మతః కవి. భావుకత అతనికి పరివేషము. అతని కవితా శయ్య పుష్పగుంఘితము. హృదయము రసప్రస్రవణము. నృసింహ పురాణములో నన్నయ, తిక్కనలను స్తుతించిన పద్యాన్ని స్మరిస్తూ ఆరుద్ర ‘ఈ ఆర్యులలో చేరి భారతాన్ని అక్షరాలా పూరించిన ఎర్రన గారు లేకపోతే వ్యాసముని ప్రణీత పరమార్థము తెలుగు వారికి తెలిసేదే కాదు. ఈ విజ్ఞానఖనికి మనం ఎప్పుడూ ఋణపడి వున్న వాళ్ళమే’ అని అన్నారు.

నృసింహ పురాణం:

అరణ్యపర్వం పూరించిన అనంతరం “కతిపయాక్షర పరిగ్రహజనితంబైన నైసర్గిక చాపలంబు కతంబున (నృసింహ పీఠిక 12) కనులు మూసుకొని భావన చేసే ఎర్రనకు ఆయన తాతగారు మనసులో మెదిలి... అహోబిల నరసింహస్వామి నాకు ఇష్టదైవం అతని విభవం ఆ మహిమావతారం నీ మధురోక్తి గుంభనతో మనీషులు మెచ్చుకొనేటట్లు ప్రస్తుతించు” అని చెప్పారు. ఇది తిక్కనకు హరహరనాథుడు చెప్పిన రీతిలో ఉన్నది.

ఎర్రన బ్రహ్మాండాది పురాణాలలో ఉన్న విషయాలు తీసుకొని అయిదు ఆశ్వాసాలలో 804 గద్యపద్యాలు రచించారు. నన్నెచోడుని ప్రభావం ఎర్రన మీద పూర్తిగా ఉన్నది. చిన్న కథను తీసుకొని విపుల వర్ణనలతో ప్రబంధం వ్రాశాడు. సముద్ర వర్ణన, వైకుంఠ వర్ణన ఇత్యాది వర్ణనలు ఎన్ని పద్యాలలో ఒక్కొక్కటి వర్ణించాడో ఆరుద్ర లెక్కగట్టి చెప్పారు. (స.ఆం.సా. పేజీ 557).

సంస్కృత నరసింహ పురాణానికి, ఎర్రన నృసింహ పురాణానికి పొత్తు కుదరదు అని చెప్పిన ఆరుద్ర వేటూరి శివరామ శాస్త్రి గారిచ్చిన కథను ఇక్కడ వివరించారు.

పోతన గారి రచనల వల్ల, ఎర్రన గారి నృసింహ పురాణం వల్ల ప్రహ్లాద చరిత్ర ఆంధ్రలోకంలో అత్యంత ఆదరణ పొందింది. ఎర్రన రచన లోని కొన్ని పద్యాలు పోతనకు ఉపయోగపడ్డాయి.

ఎర్రన గారి - “వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి
తగదను తండ్రియు తండ్రిగాదు”

పోతన పద్యం- “తండ్రి హరి జేరుమనియెడి తండ్రి తండ్రి...”

అలాగే

పోతన పద్యం – “పానీయంబులు ద్రావుచుం...”

ఎర్రన పద్యం – “కుడిచినప్పుడు నిద్రగూరిన యప్పుడు...”

వర్ణనలు-చంద్రుని అందరూ వర్ణిస్తారు. కానీ ఎర్రన వర్ణన చూడవలసిందే

వెన్నెల వెళ్ళి పాల్కడని వ్రేకదనంబున చేర్చి దిక్కులన్
మిన్నును ముంపనందు రజనీకర బింబము కుండలీభవ
త్పన్నగ తల్ప కల్పనముభంగి దనర్చె, తదంతరంబున
వెన్నుని భంగిజూడ్కులకు వేడ్క యొనర్చె గలంకమత్తరిన్

**** సశేషం ****

Posted in November 2022, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!