Menu Close
తెలుగు పద్య రత్నాలు 18
-- ఆర్. శర్మ దంతుర్తి --

ఈ మధ్య వార్తల్లో చదివిన విషయాల ప్రకారం హనుమంతుడి గురించి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా చెప్తున్నారుట. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడ్డం, ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడ్డం, మాట్లాడేటపుడు మధురంగా సంభాషించడం, అదే పనిగా మాట్లాడకుండానూ, మరీ నోరు కట్టేసుకోకుండానూ ఉండడం అనేవన్నీ. హనుమంతుడు లంకానగరంలో ఏమి, ఎలా చేసాడో, రాముణ్ణి మొదటిసారిగా కలిసినప్పుడూ, సీతా అమ్మవారిని లంకలో మొదటిసారి చూసినప్పుడూ, రావణుడితో సభలో ఎలా మాట్లాడాడో అవన్నీ ఉటంకిస్తూ చెపుతున్నారు – పాఠ్యాంశంగా. హనుమంతుడు మొదటిసారి రాముణ్ణి చూసాక మాట్లాడిన తీరువేరు, మొదటిసారిగా లంకలో దిగగానే లంఖిణితో మాట్లాడిన తీరు వేరు; అమ్మవారు ఇంక నాకు ఆత్మహత్య ఒకటే గతి అనుకుంటూ ప్రాణం తీసుకోబోతూన్నప్పుడు ఆవిడతో మాట్లాడిన తీరువేరు. ఇవన్నీ మామూలు మనుషులుగా మనందరం తప్పకుండా నేర్చుకోవాలి. మరి హనుమ ఎక్కడ నేర్చుకున్నాడివన్నీ?

సూర్యుడి దగ్గిరకి వెళ్ళి హనుమ అడుగుతాడు తనకి చదువు నేర్పమని. ‘నేనేమో నువ్వు అందుకోలేని వేగంతో తిరుగుతూ ఉంటే నీకు పాఠాలు చెప్పడం ఎలా కుదురుతుంది’ అంటాడు సూర్యుడు. దానికి హనుమంతుడి సమాధానం ఏమంటే, ‘ఓ కాలు ఉదయాద్రిమీదా, ఓ కాలు అస్తాద్రిమీదా వేసి సూర్యుడు ఎటువెళ్తే అటు వంగుతూ నేను మీ కూడా వస్తాను, మీ పాఠాలు మీరు కానివ్వండి, నేను నేర్చుకుంటాను’ అని. అంతటి దీక్ష కలవాడు కనకే వేదవేదాంగాలు నేర్చుకుంటాడు. దీని అర్ధం ఏమంటే, ఎప్పుడైతే మనకి అటువంటి అకుంఠిత దీక్ష ఉందో అప్పుడు ఏదైనా సాధ్యమై తీరుతుంది. ఇప్పుడా హనుమంతుడు – ఇన్ని విద్యలు నేర్చుకున్నాడు కనక లంకకి వెళ్లడానికి సమర్ధుడు. ఎక్కడ ఎవరితో ఏమి ఎలా మాట్లాడాలో తెల్సినవాడు కనక. ఈ నెల పద్యం రామాయణ కల్పవృక్షంలో విశ్వనాధ సత్యన్నారాయణగారిది. సుందరకాండకి ముందు జాంబవంతుడు హనుమని లంకకి వెళ్ళడానికి ‘నీకన్నా సమర్ధుడెవరున్నారు, అలా ఏమీ తెలియనివాడిలా కూర్చున్నావేమిటయ్యా?’ అంటూ పొగుడుతున్నప్పుడు హనుమ ఇచ్చిన సమాధానం.

ఉ.
ఎంతటివాడు కావలయునెప్పుడు యత్ప్రతిభావిశిష్టుడై
యంతటివాడు నేనగుదునప్పుడు తత్ప్రతిభావిశిష్టుడై
యంతక ప్రాంగణస్థిత మహాధ్వజవధ్బుజదండ తీవ్రుడన్
చింతిత కార్యముల్ తనరజేయగ గల్పతరూపమానుడన్         (రామాయణ కల్పవృక్షం. 439)

హనుమకి ఇచ్చిన శాపం వల్ల తన శక్తి ఎంతటిదో వేరే ఎవరో గుర్తు చేస్తే తప్ప తెలియదుట. అందువల్ల జాంబవంతుడు గుర్తు చేస్తాడు. అప్పుడు హనుమకి తన శక్తి తెల్సి వచ్చింది. తానేంటో ఏం చేయగలడో చెప్తున్నాడు. ఏ ప్రతిభతో ఎప్పుడు ఎలాంటి వాణ్ణి కావాలో (ఎంతటివాడు కావలయునెప్పుడు యత్ప్రతిభావిశిష్టుడై) అప్పుడు అంతటి ప్రతిభావంతుణ్ణి కాగలను (యంతటివాడు నేనగుదునప్పుడు తత్ప్రతిభావిశిష్టుడై). ఎప్పుడు ఎంతటి తీవ్రత కావాలిస్తే అప్పుడు అంతటి భుజదండ తీవ్రత చూపించగలను (యంతక ప్రాంగణస్థిత మహాధ్వజవధ్బుజదండ తీవ్రుడన్). ఎటువంటి కార్యానైనా సరే చేయగలవాణ్ణి (చింతిత కార్యముల్ తనరజేయగ గల్పతరూపమానుడన్). ఇదంతా గొప్పలు చెప్పుకోవడం కాదు. తన శక్తి ఇదీ అని తెలియచెప్తున్నాడు. ఎందుకలా? ఎందుకంటే ‘ఈ శతయోజన విస్తీర్ణమైన సాగరం లంఘించడానికి ఎవరికుంది బలం?’ అన్నప్పుడు, ఒక్కొక్కరూ నేను పది, నేను ఇరవై, నేను ముప్ఫై యోజనాలు దూకగలను అంటూ వారి వారి శక్తి చెప్పినప్పుడు హనుమంతుడు చెప్తున్నాడన్నమాట – ఇదీ నా ప్రతాపం అంటూ. ఇదంతా చెప్పాక తాను చెప్పినట్టూ ‘చూసి రమ్మంటే కాల్చివచ్చినంతటి’ ఘనుడు అంజనీ పుత్రుడు. ఆ దాటేది కూడా ఎలా దాటుతాడో చెప్తాడు – రాఘవుడి ధనుస్సులోంచి విడిచినబాణం ఎంతటి వేగంతో వెళ్తుందో అంతటి వేగంతో వెళ్లగలడుట.

ఇదంతా చెప్పాక లంకకి వెళ్ళడానికి సాగరం దాటుతుంటే ఈ చెప్పిన విషయాల ప్రకారం నిజంగానే హనుమంతుడు అంతటివాడా కాదా తెల్సుకోవడానికి దేవతలు సురస అనే నాగమాతని పిల్చి చెప్తారు ‘ఈ హనుమంతుడు అసలు ఎంతటివాడో చూద్దాం దారి అడ్డగించు’ అని. ఆవిడ అడ్దగించాక అతి సులభంగా శరీరం పెంచి ఒక్కసారి చిన్నగా అయ్యి బయటకి వచ్చి – అంటే అవిడతో యుధ్ధం కూడా చేయకుండా, ఆవిణ్ణి బాధించకుండా – ‘అమ్మా, నీనోట్లోకి వస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఇంక నన్ను వెళ్లనియ్’ అంటాడు. అలా ఎవరితో ఏమి మాట్లాడాలో ఎలా వ్యవహరించాలో తెలిసినవాడు కనకే రాముడు మొదటిసారి హనుమని చూసినపుడు తమతో ఎలా మాట్లాడాడో గమనించి లక్ష్మణుడితో అంటాడు,

సంస్కార క్రమ సంపన్నాం అద్భుతాం అవిలంబితాం
ఉఛ్చారయతి కల్యాణీం వాచం హృదయ హర్షిణీం ( వాల్మీకి రామాయణం 4-3-32)

మధురమైన వాక్కు; సరిగ్గా పలికే పదాలు; మరీ వేగంగానూ, మరీ నెమ్మదిగానూ కాని ఉఛ్ఛారణ, మాట్లాడేటపుడు చెప్పే విషయంలో నమ్మకం, చెప్పవల్సింది సరిగ్గా చెప్పడం; ఇటువంటి మంచి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంతటి వాడైనా మొత్తం రామాయణంలో ఎక్కడా కూడా హనుమంతుడు ‘నేను ఇంత గొప్పవాణ్ణి’ అంటూ ప్రగల్భాలు పలకడం కనిపించదు. ఆఖరికి రావణ సభలో అడుగుతారు ‘ఎవరు నువ్వు, ఇక్కడకి ఎందుకొచ్చావు?’ అంటూ. దానికి హనుమ ఇచ్చే సమాధానం ఏమంటే, ‘జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః’ అంటూ మొదలుపెట్టి ‘నేను వాళ్ల దూతని మాత్రమే సుమా’ అంటూ చెప్పడం చూస్తే ఎంతటి వినయం కలవాడో తెలుస్తుంది.  చివరకి రావణుడితో కూడా ఇదే చెప్తాడు – ‘బ్రహ్మా స్వయంభూః చతురాననోవా, రుద్రః త్రినేత్ర త్రిపురాంతకోవా, ఇంద్రో మహేంద్ర స్సురనాయకోవా, త్రాతుం నశక్తాయుధి రామవర్యం.’ తానెంతటి వాడైనా ముందు తన గురించి కాదు, రాముడి గురించి మాత్రమే చెప్పేది – బ్రహ్మ, రుద్ర మహేంద్రాదులతో సహా ఎవరూ రాముడి ముందు నిలవలేరు అని. అదే హనుమంతుడి వినయం.

****సశేషం****

Posted in December 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!