లయకారుడైన శివుడిమీద పంచాక్షరి నుంచి ఏ శ్లోకం లో చూసినా దక్ష యజ్ఞ వినాశనం గురించి ఉండడం గమనించవచ్చు – దక్షుడు బ్రహ్మ చేత స్పృజించబడిన ప్రజాపతి. ప్రజాపతులు ప్రజోత్పత్తి కోసం నియమించబడినవారు; వాళ్లపని అంతవరకే. ఈ ప్రజలని రక్షించే, లయించే పని విష్ణుమహేశ్వరులది. ప్రజాపతులు సృష్టి అంతా తమవల్లే జరిగింది అని గర్వించి భగవంతుణ్ణి విస్మరిస్తే ఏం జరుగుతుందో చెప్పేదే దక్ష యజ్ఞం కధ. దక్షుడు తనకి పుట్టిన పిల్లల్లో ఒకరైన సతీదేవిని, శివుడికి ఇచ్చి పెళ్ళిచేసాడు. అయితే శివుడి అవతారం చూసి మనసులో లోపల కొంచెం కంటగింపు – అల్లుడు ఏనుగు చర్మం కట్టుకుని కపాలం చేతిలో పట్టుకుని శ్మశానాల్లో తిరుగుతాడనీ అసలు ఏమీ లేనివాడనీను. కూతుర్ని సుఖపెట్టడానికి శివుడు పనికిరానివాడని దక్షుడి అభిప్రాయం కాబోలు, అందువల్ల అయినదానికీ, కానిదానికీ శివుణ్ణి కించపరచడం, మామగారైన తనకి గౌరవం ఇవ్వలేదనడం సాగిస్తాడు. ఇదంతా చూసినా శివుడేమీ అనకపోవడం చూసి దక్షుడు మరింత రెచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది.
మనం కూడా అంతే కదా? ఎవరిమీదైనా కోపం వస్తే అలా నోటికొచ్చినది ఏదో ఒకటి అంటూ ఉంటాం. అవతలి వారు ఊరుకునే కొద్దీ ఆ దూషించడం ఎక్కువౌతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ దూషణవల్ల రక్తపోటు, తలనొప్పీ, గుండెపోటూ మరోటీ రావడం సహజమే కదా? దీనివల్ల అర్ధం అయ్యేదేమిటి? భగవంతుడిమీద, ఎవరిమీద అయినా కోపం వస్తే ఆయన్ని తిట్టీ కొట్టీ మనం మన జీవితాలనే నాశనం చేసుకుంటున్నాం. దీన్నే బద్దెన అన్నాడు – “తన కోపమె తన శతృవు, తన శాంతమె తనకు రక్ష,” అని.
దక్షుడు సతీదేవిని అవమానించాక ఆవిడ తన తపోబలంతో అగ్నిలో కాలిపోయింది యజ్ఞవాటికలో. అక్కడే ఇదంతా చూస్తున్న నందీ, మిగతా శివగణాలు యజ్ఞం చేసేవారిని శపించారు. ఆ యజ్ఞం చేయించే బ్రహ్మవేత్తలైన భృగు మహర్షీ మొదలైన వారు శివగణాలని తిరిగి శపించి, అభిచార హోమం చేసి వాళ్ళని యాగశాలలోంచి వెళ్లగొట్టారు. శివగణాలు వెనక్కి వచ్చి ఇదంతా శివుడికి చెప్పేసరికి ఆయన అగ్రహోదగ్రుడై ఒక జడ తీసి నేలమీద కొట్టాడు. అందులోంచి అవిర్భవించిన వీరభద్రుడు శివుణ్ణి అడిగాడు, “తండ్రీ నన్నెందుకు సృష్టించారు, ఏం చేయమంటారు?” అని. అప్పుడు శివుడు వీరభద్రుడితో ఏం చేయాలో చెప్పే పద్యమే పోతన మహాభాగవతం నాలుగో స్కంథంలో రాసిన ఈ చంపకమాల పద్యం.
చ. గురుభుజశౌర్య! భూరిరణకోవిద! మద్భటకోటి కెల్ల నీ
వరయ వరూధినీవరుఁడవై చని యజ్ఞము గూడ దక్షునిన్
బరువడిఁ ద్రుంపు; మీ వచట బ్రాహ్మణతేజ మజేయమంటివే
నరిది మదంశసంభవుఁడవై తగు నీకు నసాధ్య మెయ్యెడన్? [4-109]
“మంచి భుజబలం, శౌర్యం, పెద్దపెద్ద రణాలలో ఆరితేరినవాడివైన వీరభద్రా, నా భటులందరికీ (మద్భటకోటికెల్ల) నాయకుడివై, యజ్ఞంతో పాటు దక్షుణ్ణి కూడా దండించు (బరువడి ద్రుంపు). అయితే అక్కడున్న భృగుమహర్షి లాంటి బ్రహ్మవేత్తలవల్ల నీకు అపజయం కలుగుతుందనుకుంటావేమో (బ్రాహ్మణతేజమజేయమంటివే), కానీ నువ్వు నాలోంచి పుట్టిన ఈశ్వరాంశసంభూతుడివి (మదంశ సంభవుడవై), నీకు అపజయం అన్నదే లేదు (నీకు నసాధ్యమయ్యెడన్).”
వీరభద్రుడు యజ్ఞవాటిక దగ్గరకి వెళ్ళిన తర్వాత కథ మనకి తెల్సినదే. దక్షుడి తలపోయాక మేక తల తగిలిస్తారు. దానితో గర్వంపోయి శివకేశవులకి భేదం లేదని తెలుసుకున్నాక (శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే) యజ్ఞం పూర్తిచేసి శివుడికి భాగం ఇస్తాడు. చివరకి మనకి తెలిసేదేమిటంటే భగవంతుడి కోపం వల్ల దక్షుడికి తానేమిటో, భగవంతుడంటే ఎటువంటివాడో తెలిసి వస్తుంది. అమ్మవారు తన మానవదేహం వదిలేసి శివైక్యం చెంది, పార్వతిగా అర్ధనారీశ్వరి అవుతుంది. మొత్తానికి శివుడి కోపం చివరకి మంచి జరగడం కోసమే అని ప్రపంచానికి తెలిసివస్తుంది.
ఇంకో కోణంలోంచి చూద్దాం. భగవంతుడంటే ఎటువంటివాడు? ఏ మహర్షి చెప్పడం చూసినా భగవంతుడంటే “కరుణా సముద్రుడు.” దీన్నే క్రితం నెలల్లో రాసిన ఒక పద్యంలో కంచెర్ల గోపన్న’దాశరధీ కరుణాపయోనిధీ’ అంటూ చెప్పడం చూసాం కదా? కరుణాసముద్రుడైన భగవంతుడికి కోపం అనేదే రాదు. మనం ఎన్ని తప్పులు చేసినా సరే ఆయన “పోనీలే, మరోసారి ప్రయత్నించు,” అంటూ మనకూడా ఉండేవాడే. మరి మనం చేసే కొన్ని బుధ్ధిలేని పనుల వల్ల భగవంతుడికి కోపం రావచ్చు; దాని మూలాన మనకో దెబ్బ తగిలినా అది మన మంచికే కనక అప్పుడు మనకి తగిలే దెబ్బ సరైన చోట తగిలి మంచి దారిలోకి వస్తాం. ఇది తల్లి తండ్రులు పిల్లల్ని ఎప్పుడైనా ఒక దెబ్బ వేయడం, ఏదైనా అడిగితే కాదు అనడం వంటిది. దానివల్ల పిల్లలకి మంచే తప్ప చెడు జరగదు.
దక్షుడి తల పోవడం అంటే అహంకారంతో ఉన్న పాత గుణాలుపోయి కొత్తవి, అణుకువతో ఉన్నవీ వచ్చాయి అని తెలుసుకుంటే చాలు. మరో రెండు విషయాలు; మొదటిది - భగవద్వీలల వల్ల మొత్తం లయం అవుతున్నప్పుడు ఎటువంటి బ్రహ్మవేత్తలు కూడా దాని నుంచి తప్పించుకోలేరు. చావు అనేది తప్పనిసరి – ప్రపంచంలో ఏది జరిగినా జరగకపోయినా. దీన్నే గీతాచార్యుడు మరో విధంగా చెప్పడం గమనించవచ్చు “జాతస్య హి ధృవో మృత్ర్యుర్ధృవం జన్మ మృతస్యచ..” రెండోది పోతన శివభక్తుడు కదా? రామభద్రుడు భాగవతాన్ని రాయమన్నా, ఈ పద్యంలో పోతన శివభక్తి కొట్టొచ్చినట్టూ కనబడుతూ ఉంటుంది.