Menu Close
తెలుగంటే.....తెలుగే
- రాఘవ మాష్టారు -

తెలుగంటే అమ్మ ఒడి
తెలుగంటే జాతి గుడి
కమ్మనైన తెలుగే
మన భావాల ఊపిరి
తీయనైన తెలుగే
మన జీవన లాహిరి

అమ్మ పెట్టిన గోరు ముద్ద తెలుగు
నాన్న పెట్టిన ప్రేమ ముద్దు తెలుగు
అమ్మమ్మ పెట్టిన గోరింటాకు తెలుగు
నానమ్మ జోకొట్టిన లాలి పాట తెలుగు

చెల్లి పెట్టిన కాకి ఎంగిలి తెలుగు
అన్న కొట్టిన మొట్టి కాయ తెలుగు
తాత చెప్పిన పిట్ట కథ తెలుగు
అవ్వ పెట్టిన సద్దిబువ్వ తెలుగు
బావ బగ్గకు రాసిన అత్తరు తెలుగు
అక్క వీపునాడిన ఉప్పాట తెలుగు

మనలో వచ్చిన కమ్మని కలలు
మదిలో విచ్చిన ఝమ్మని పిలుపులు
గుండె లోతుల దాగిన చిన్ననాటి గురుతులు
మండు టెండలో కురుసిన వాన చినుకులు
మన తెలుగు పదాల విరిజల్లులు

తెలవారి వెలుగులా
చిరుగాలి పిలుపులా
పండిన వరి పొలంలా
పొంగిన పాల పొంగులా
వెన్నెల్లో గోదారి లా
పట్టులంగా ఓణిలా
నుదుట బొట్టు పంచ కట్టులా
చెరువు చె ట్టు పొలం గట్టులా
పరమాన్నం అంబలి తొక్కులా
జొన్న అంబలి రాగి ముద్దలా
ముద్దు ముద్దు సంక్రాంతి లా
ముద్ద బంతి ముద్దు గుమ్మలా
బతుకమ్మ పండగ లా
ఏరువాక సందడి లా

గడప గడపలో విరిసినది
ఎడద ఎడద లో మురిసినది
మన మాతృ భాష ఘనమైన తెలుగు
మన ఆత్మ ఘోషగా మిగిలినది తెలుగు.

Posted in November 2022, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!