అన్ని కళలకు ఆలవాలమై, ఎన్నో వందల సంవత్సరాల అద్భుతమైన నాగరికతతో కూడిన వైభవంతో విలసిల్లిన భరతఖండం, పరదేశీ రాజ్యకాంక్షకు బలై తన ప్రాభవాన్ని కోల్పోవడమే కాకుండా దాసీలుగా బతికే పరిస్థితికి రావడం కూడా జరిగింది. ఇది చరిత్ర. అయితే మన సంస్కృతిని కాపాడుకోవడానికి, మన ఉనికిని మరల సముపార్జించుకోవడానికి, మొక్కవోని ధైర్యంతో ఎదురొడ్డి పోరాడి, అహింసా మార్గంలో మన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవడమే కాకుండా దానికి సరికొత్త రూపకల్పన చేయడంలో ఎందఱో స్వాతంత్ర్య సమరయోధులు, మేధావులు, రూపకర్తలు భాగస్వాములయ్యారు. వారందరి అవిరళ కృషి, దేశభక్తి, త్యాగనిరతి నేడు మనందరం అనుభవిస్తున్న స్వతంత్ర భారత ఆధునిక నాగరిక జీవన విధానం. మరి అటువంటి వారిని అప్పుడప్పుడు స్మరించుకోవడం మన కనీస ధర్మం.
ఆంగ్లేయుల పాలననుండి విముక్తి పొంది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన భారతదేశ ఉనికిని చూపే జాతీయ పతాకం ఎంతో అవసరం. అటువంటి జాతీయ జెండా రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించి త్రివర్ణ పతాకాన్ని అన్ని వర్గాలు మెచ్చుకొనే విధంగా తయారుచేసి అందించిన ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య ఈ నవంబర్ సంచిక ఆదర్శమూర్తి.
నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో 1876, ఆగస్టు 2న పింగళి వెంకయ్య గారు జన్మించారు. తన ప్రాధమిక, ఉన్నత విద్యానంతరం భూగర్భ శాస్త్రవేత్తగా గుర్తింపు పొంది మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక మంచి జాతీయ జెండా ఉండాలనే తపనతో మూడు సంవత్సరాలు అనేక దేశాల జాతీయ పతాకాలను విశ్లేషించి, 1916లో 'ఎ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా' అనే బుక్‌లెట్‌ను ప్రచురించారు. ఇందులో దాదాపు ముప్పై రకాల పతాకాల మూల నమూనా పొందుపరచడం జరిగింది.
జాతీయ జెండా రూపకర్త అని పెద్దగా చెప్పుకునేది ఏముంది అని మనందరికీ అనిపించవచ్చు. కానీ ఒక దేశ ఔన్నత్యాన్ని, సంస్కృతినీ, చరిత్రను తెలిపే చిహ్నం ఈ జాతీయ పతాకం. కనుక ఆ జెండా సృజనాత్మకతతో ఆలోచించి, ప్రముఖులందరితో చర్చించి, మేధావుల యొక్క సూచనలను పరిగణలోకి తీసుకొని రూపకల్పన చేయడం జరుగుతుంది. ఆ తరువాత చట్టసభలలో ప్రజా ప్రతినిధుల ఆమోదంతో ఆ పతాక ఆవిష్కరణ రాజ్యాంగ పరంగా ఆమోదముద్ర పొందుతుంది. మరి ఇన్ని అవరోధాలను అన్నింటినీ త్రికరణ శుద్ధితో అధికమించి నేటి మన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారు అందుకోసం దశాబ్దకాలం శ్రమించాడు. తన ఆలోచనలన్నీ జాతీయ జెండా ఎలా ఉండాలనే విషయం మీదే ఉంచుకొని సాతంత్ర్య ఉద్యమాన్ని నడిపిస్తున్న నాటి కాంగ్రెస్ నిర్వహించే ప్రతి సమావేశానికి తప్పనిసరిగా హాజరై, అక్కడి ప్రముఖుల అభిప్రాయాలను స్వీకరించి ఆ పిమ్మట తన ఆలోచనలకు ఒక రూపం కల్పించారు. కనుకనే మన జాతీయ జెండా ‘త్రివర్ణ పతాక’మై నేటికీ రెపరెపలాడుతున్నది. అందులోని మూడు రంగులు సర్వమతాల సమ్మేళనాన్ని ప్రతిబింబించగా, మధ్యలోని అశోక ధర్మ చక్రం మన సంస్కృతికి చిహ్నమై అలరారుతున్నది. స్వాతంత్ర్యానికి ముందు ఆ ధర్మ చక్రం స్థానంలో రాట్నం ఉండి, గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేసేది. ఏ దేశమైనా సుభిక్షంగా ఉండాలి అంటే అక్కడి ప్రజలకు ఆహారాన్ని అందించే రైతన్న సుఖసంతోషాలతో విలసిల్లాలి. అటువంటి మంచి సందేశాన్ని మన వెంకయ్య గారు తను రూపొందించిన జెండా ద్వారా చెప్పకనే చెప్పారు.
నిస్వార్థంతో, గాంధేయవాదిగా అతి సాధారణమైన జీవితాన్ని గడిపిన పింగళి వెంకయ్య గారు చేసిన సేవ అనితరము. ఆయనలాగే దేశ సేవకే తమ జీవితాలను అంకితం చేసిన ఎందఱో మహానుభావులు, వారి సేవలకు సరైన గుర్తింపు లభింపక మరుగున పడిపోయారు. వెంకయ్య గారు కూడా తన వృద్ధాప్యం లో ఆర్ధిక సమస్యలతో సరైన సహాయం అందక ఎన్నో ఇబ్బందులు పడి తన ఎనభై ఆరో ఏట పరమపదించారు. అయిననూ, మన జాతీయ జెండా ఎగురుతున్నంత కాలం తెలుగు వారి గుండెల్లో పింగళి వెంకయ్య గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.