“బాబాయ్! నన్ను నువ్వు చూడనేలేదా ఏమిటి!”
మాటా పలుకూ లేకుండా తలవంచుకుని వెళ్ళిపోతున్న సుబ్బారాయుడిని, ఎదురుగా వస్తున్నవాడు ఆగి మరీ పలుకరించాడు దామోదరం. ఏదో సుదీర్ఘమైన ఆలోచనలలో ఉన్న సుబ్బారాయుడు ఆ పలుకరింపుతో ఉలికిపడినట్లై పక్కకి తిరిగి చూసి, నిలబడి దామోదరం వైపు గుడ్లప్పగించి వెర్రిగా చూశాడు.
“అదేమిటి బాబాయ్! అట్టా చూస్తున్నావు? నువ్వు నన్నానవాలు పట్టనేలేదా? నేను, దామోదరాన్ని!”
సుబ్బారాయుడు ప్రజ్ఞాలోకి వచ్చాడు. “ఔను, నువ్వు మా రామస్వామి కొడుకు దామూవని నాకు తెలుసులేరా అబ్బాయి! కాని నా మనసు మనసులో లేదు. ఏదో ఆలోచనలోపడి పరధ్యాన్నంగా ఉండి, “గుడ్డెద్దు చేలోపడ్డట్టు” ఒకే ఇదిగా ఇట్టా వెళ్ళిపోతున్నాను. నువ్విది విన్నావుగా, మన రాజధానిని అమరావతి నుండి మార్చేస్తారుట కదా!”
“ఔనుట! విన్నానయ్యా, కాని అట్టా చెయ్యడానికి ఒప్పుకోముకదా మనం.”
“అట్టాగే అయినట్టైతే ఇక మనం చేసిన త్యాగానికి అర్థమేమిటిట! బంగారం పండే భూములురా మనవి! ఏటా మూడు పంటలు పండేవి, అన్నీ నాశనం చేసుకున్నాము కదయ్యా! ఇట్టా మనజోలికి రాకుండా, ముందే అట్టా వేరే చోట రాజధానిని ఏర్పాటుచేసివుంటే, ఎంతో బాగుండేది అందరికీ కూడా. మొదట్లో మనవాళ్ళు - రాజధాని కట్టాలంటే పంటభూములే కావలసివచ్చాయా, బీడు భూములు ఎన్నిలేవు! మేము మా భూములను ఇవ్వమనే అన్నాము కదా! కాని చివరిదాకా ఆ మాట మీద నిలబడలేకపోయాం. బాబు పెద్ద పెద్ద ఆశలు చూపించడంతో కక్కుర్తిపడి, వీగిపోయి మనసు మార్చుకున్నారు అందరూ. ఇప్పుడు చూడు, ఎట్టాంటి పరిస్థితి వచ్చిపడిందో! మొదటికే మోసం వచ్చేలా ఉంది ఇప్పుడు. రెండు పొట్టేళ్ళు కొట్లాడితే, వాటి మధ్యన పడి చచ్చిన గొర్రెలమంద పాటులా ఉంది మన పని! మనదేముంది చెప్పు, ఎవరు ముఖ్యమంత్రి ఐతే వారినే నమ్ముతాము, అంతేకదా! వీరా, వారా అన్నదానితో మనకేమిటి సంబంధం, నువ్వు చెప్పు! ఎవరైనా సరే, మనల్ని ముంచకుండా వుంటే, అంతేచాలు. ఈ సంవత్సరం ఇంకా సిస్తుడబ్బు కూడా ముట్టజెప్పలేదు మనకి, ఏం తిని బ్రతకాలో! రోజురోజుకీ వార్తలు వింటూంటే గుండె పగిలేలా ఉంది. అందరూ తలోమాటా అంటున్నారు - మన రాజధాని తిరుపతికి మారుస్తారని ఒకరంటే, కాదు కాదు విజయవాడకి - అంటున్నారు మరొకరు. అదేమీకాదు, నలుదిక్కులా నాలుగు రాజధానులు వస్తాయి ఆంధ్రప్రదేశ్ కి అంటున్నారు ఇంకొందరు. మరి సగం సగంగా ఉన్న అమరావతి మాటేమిటో? అదీ అసలైన ప్రశ్న! దానికి మాత్రం ఎవరూ సరిగా జవాబు చెప్పడంలేదు” అని, ఉస్సురని నిట్టూర్చి, మళ్ళీ చెప్పసాగాడు సుబ్బారాయుడు, “మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టినప్పుడూ, రాజగోపాలాచారి పుణ్యమాని, ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది, కాని టంగుటూరి ప్రకాశం పంతులుగారి లాంటి మహానుభావుడు – పరోపకారి, నిస్స్వార్ధ ప్రజాసేవకుడు మనకు తొలిసారి ముఖ్య మంత్రి కావడంతో మన రాష్ట్రం నెమ్మదిగా కోలుకుంది. ఆ తరవాత మళ్ళీ తెలంగాణా విడిపోయినప్పుడూ ఆంధ్రప్రదేశే ఘోరంగా నష్టపోయింది. కోస్తా వాళ్ళు తమ సంపదంతా రాష్ట్ర రాజధాని కదాని హైదరాబాదులోనే పెట్టి మోసపోయారు. అది చాలదన్నట్లు ఇప్పుడు, అందరూ కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధికై ఏకముఖంగా పాటుపడాల్సిన ఈ సమయలో కూడా మనలో మనకు ఈ అంతః కలహాలేమిటటో!" వినాశకాలే విపరీత బుద్ధిః! ఆంధ్రాని సర్వనాశనం చేసిగాని విడిచి పెట్టరు కాబోలు వీళ్ళు! తల్చుకుంటే ఏడవాలనిపిస్తోందిరా అబ్బాయీ!”
“కంగారు పడకు బాబాయ్! ఏమీ జరగదు. పైన కేంద్రప్రభుత్వం ఉంది కదా, రైతులకు అన్యాయం జరగనివ్వదు. ఏ కమిటీయో వేసి, సబబేమిటో నిర్ణయించకపోదులే. అంతేకాదు, మనకు చాలామంది ప్రజానాయకులున్నారు కదా! అంతగా తప్పివస్తే, ఎవరో ఒకరు పూనుకుని ఉద్యమించి మనకు న్యాయం జరిగేలా చూస్తారులే. మన అమరావతీ రైతులుకూడా కూటమిగా ఏర్పడుతున్నారు. అవసరమైతే మనమూ పోరాడటానికి సిద్దంగా ఉన్నాము. నువ్వేం భయపడకు బాబాయ్! వాళ్ళూ వీళ్ళూ అన్నమాటలు పట్టించుకోకు. తెలిసిన వాళ్ళూ, తెలియనివాళ్ళూ - అందరూ తలోరకంగా అట్టా ఏవేవో అంటూ, అవకాశం దొరికిందికదాని తమ మాట చమత్కారాన్ని ప్రదర్శిస్తున్నారు, అంతే! అమరావతిని కాదని, తిరుపతిని రాజధాని చెయ్యాలని ఎవరో ఒకరికి తోచినంత మాత్రంలో అది జరిగిపోదు. తిరపతిలో ఇప్పటికే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది! ఇక ఇట్టా రాజధాని రద్దీ కూడా దానికి జోడిస్తే, ఆ బరువుకు ఏడుకొండలూ ఏకంగా ఒకేసారి భూమిలోకి కూరుకుపోగలవు” అంటూ నవ్వసాగాడు దామోదరం.
“నీకిది నవ్వులాటగా ఉందా దామోదరం! నాకైతే ప్రాణసంకటంగా ఉంది. చంద్రబాబుకి పంటభూముల్ని రాజధానిగా మార్చాలన్న ఆలోచన మన ప్రాణానికి ముప్పై వచ్చిందిగావును. బంజరులా పడి ఉన్న ఏ భూమిపైనైనా రాజధాని కట్టినట్లైతే ఎంతో బాగుండేది! ఆ ప్రదేశమూ వృద్ధిలోకి వచ్చివుండేది, మనకీ దౌర్భాగ్యమూ తప్పివుండేది. మనవి మంచి ఫలసాయాన్నందించే మాగాణి భూములు కదయ్యా ... మ్చు!” మళ్ళీ భారంగా నిట్టూర్చాడు సుబ్బారాయుడు.
“బాబా ధైర్యంగా ఉండు. అన్నీ సద్దుకుంటాయిలే! కాలమే మందు అన్ని సమస్యలకి! మనకి అన్యాయం జరగదు. ఆ నమ్మకం నాకుంది. ఆ భరోసామీదే నేనిట్టా నవ్వ గల్గుతున్నాను.”
“నాకు నవ్వు రావడంలేదురా అబ్బాయీ, నలుగురు ఆడపిల్లల తండ్రిని! వరకట్ననిషేధం చట్టరూపంలోనే ఉండిపోయింది గాని ఇంకా పూర్తిగా జనంలోకి రాలేదు కదా. పై ముగ్గురు అమ్మాయిలకు చదువులు చెప్పించి, ఆపై కట్నకానుకలిచ్చి అత్తారిళ్ళకి సాగనంపే సరికి మా నాన్న నాకిచ్చిన పదెకరాల పంటపొలం కాస్తా ఐదు ఎకరాల్లోకి వచ్చింది. ఇంకా ఆఖరుపిల్ల పెళ్ళికి ఉంది. రెండెకరాలు దాని పెళ్ళికి ఖర్చైనా ఇంకా మూడు ఎకరాలు ఉంటాయి, దానిమీది వ్యవసాయంతో నేనూ, మీ పిన్నీ సుఖంగా బ్రతికెయ్యవచ్చులే - అనుకున్నాను. ఈలోగా ఈ రాజధాని రంధి వచ్చిపడింది. చిన్నమ్మలు పై చదువులు చదువుకుంటానని పట్టుపట్టడంతో “సరే” ననక తప్పలేదు. దాని చదువయ్యి పెళ్ళి సమయం వచ్చేసరికి చంద్రబాబు చేసిన వాగ్దానాలన్నీ పూర్తిచేస్తాడు, మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్ళి చేద్దాం - అనుకున్నా. ఇప్పుడు దాని పెళ్లి ప్రశ్నార్థకమయ్యింది. ఏమి చెయ్యాలో తోచకుండా ఉంది. దురాశ దుఃఖానికి చేటని బాగా తెలిసొచ్చిందిలే! ఏమి లాభం, చెట్లు కాలాక ఆకులు పట్టుకున్నట్లు!”
“బాబాయ్! నేను నీకు చెప్పేటంత పెద్దవాడిని కాను. మన బ్రతుకులు ఒక ప్రశ్నగా మారాయన్నది నిజం. కాని, అది ఎప్పటికీ ఒక "శేషప్రశ్న" గా అలాగే ఉండిపోదు. త్వరలోనే దానికొక సరైన జవాబు దొరుకుతుంది. మనం కొద్దిరోజులు ఓరిమి పట్టి ఉండక తప్పదు. చెయ్యాల్సిన పని చెయ్యాలి గాని, ఇట్టా హైరానపడితే లాభమేముంటుంది చెప్పు! ఇక ఉంటా బాబాయ్! ఏదో పనిమీద వెడుతున్నట్టున్నావు ...”
“ పనా! ఏం పనిలే; ఎంత దిగులుతో ఉన్నా మేమీ పెళ్ళికి వెళ్ళక తప్పదు. మెదక్ లో మా తోడల్లుడి కూతురు పెళ్లి ఉంది, వెళ్ళకపోతే గొప్ప నిష్టూరం వస్తుంది. పెళ్ళికూతురు కోసం ఏదైనా బహుమతి కొనాలని బజారుకి వెడుతున్నా. మన పరిస్థితి ఎలా ఉన్నా ఈ లాంఛనాలు తప్పవు కదా! నాలుగు కాలాలపాటు గుర్తుగా ఉండే వెండి వస్తువు ఏదైనా తెమ్మంది మీ పిన్ని. సరే! ఇక వస్తానురా అబ్బాయ్! వార్తలు కనిపెడుతూవుండు.”
“అట్టాగే బాబాయ్!” వెళ్ళిపోయాడు దామోదరం.
వెళ్ళిపోతూన్నదామోదరాన్నే చూస్తూ అనుకొన్నాడు సుబ్బారాయుడు మనసులో, “ఈ వ్యవహారం సవ్యంగా ముగింపుకు రాకపోతే ఏముంది, మళ్ళీ నాలాంటి బక్క రైతులకు సకుటుంబంగా ఆత్మహత్యలే శరణు! మొహాన ఏమి రాసుందో ఏమో! అంతా ఆ భగవంతుని దయ! ఈ దామూగాడికేమి, గొప్ప కబుర్లు అట్టా వాడు ఎన్నైనా చెప్పగలడు. వీళ్ళకి “బంగారు గుడ్లు పెట్టే బాతు:"లాంటి” రియలెస్టేట్ వ్యాపారం ఉందికదా విజయవాడలో! పైగా అక్కడ సొంతానికి మేడలూ, మిద్దెలూ చాలా ఉన్నాయి. అట్టాంటి ఆస్తులున్న వాళ్ళకు పెద్ద కష్టమేమి ఉంటుందిట! వాళ్లకి కొన్నిపోయినా కొన్ని మిగిలివుంటాయి. ఇట్టే కోలుకుంటారు. నాలాంటి బక్కరైతులకే ఇది మరీ చావుదెబ్బ! అన్నదాతల ఆత్మహత్యలు ఇప్పుడిప్పుడే కాస్త ఆగాయనుకుంటే మళ్ళీ మొదలౌతాయి కాబోలు! దామూగాడి కున్నంత ధైర్యం నాకు రమ్మంటే మాత్రం వస్తుందా ఏమిటి...” దిగులుగా అనుకున్నాడు అమరావతి రైతు సుబ్బారాయుడు.
####
మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి. అందంగా అలంకరించబడిన కల్యాణమండపంలో పెళ్లితంతు నడుస్తోంది. హాలులో వేసి ఉన్న కుర్చీలలో ఆహూతులు వచ్చికూర్చుని పెళ్లి ని చూస్తున్నారు. అన్నిటికీ వెనకగా ఉన్న కుర్చీలలో ఒకదానిపై, మనసంతా దిగులుతో కూర్చునివున్నాడు సుబ్బారాయుడు. పెళ్ళిపందిరిలో ఎవరికి ఏమి కావలసినా అందిస్తూ ఉషారుగా అటూ ఇటూ తిరుగుతూన్న తన కూతురు ధరణినే చూస్తూ, ఆమె పెళ్ళిని గురించి ఆలోచిస్తూ పరాకుగా ఉన్నాడేమో, హటాత్తుగా బుజంమీద చెయ్యిపడేసరికి ఉలికిపడి పక్కకు తిరిగి చూశాడు సుబ్బారాయుడు.
తెల్లని ఇస్త్రీ బట్టలు కట్టి, జరీతో ఉన్న ఎరుపు ఆకుపచ్చ రంగుల అత్తాకోడళ్ళoచు కండువా బుజానవేసుకుని, పెద్దపెద్ద మీసాలతో పెద్దమనిషిలా కనిపిస్తున్న వ్యక్తి ఒకరు పక్కనున్న కుర్చీలో కూర్చుని, చనువుగా సుబ్బారాయుడు బుజంపైన చెయ్యివేసి, అతనిని పలకరించాడు, “అయ్యా! మనదే ఊరు” అని. అతనికి కూడా సుబ్బారాయుడి వయసే ఉండవచ్చు అనిపిస్తుంది చూడగానే.
ఉలికిపడి తలెత్తి, శూన్య దృక్కులతో గుడ్లప్పజెప్పి అతనివైపు వింతగా చూసి అన్నాడు సుబ్బారాయుడు, “తమరి ఊరేదో నాకు తెలియదండి, మాది మాత్రం అమరావతి” అన్నాడు. పరాకుగా ఉండడంతో అవతలి వ్యక్తి అడిగినదేమిటో సుబ్బారాయుడికి సరిగా అర్థమవ్వలేదు.
పక్కతను గఫ్ఫాలు కొడుతూ పకపకా నవ్వాడు. ఆపై బుజం మీద తట్టి అన్నాడు, “మిమ్మల్ని చూడగానే తెలుస్తోంది, మీరు అమరావతి రైతు కదూ! ఈ మధ్య అమరావతి రైతుల మొహాల్లో సంతోషమన్నది కనిపించడం మానేసింది. అదే గుర్తు.”
“ఔను. మీరు సరిగానే చెప్పారు. కన్నతల్లి లాంటి మాగాణి భూముల్ని చెయ్యి జార్చుకున్నాము కదా, మాకింక దిగులుకాక మరేం ఉంటుంది చెప్పండి! ప్రస్తుత పరిస్థితిలో ఏది ఎలా సానుకూల పడుతుందో తెలియడం లేదు. పొలం మళ్ళీ చేతికి వస్తుందన్న ఆశ ఇక ఎలాగా లేదుగాని, దాని తాలూకు డబ్బైనా వస్తే పిల్ల పెళ్ళి చెయ్యాలని నా కోరిక” అన్నాడు దిగులుగా సుబ్బారాయుడు. అక్కడితో ఊరుకోకుండా వేలెత్తి చూపించి, “అదిగో, ఆ పెళ్ళికూతురి పక్కన నిలబడివున్న అమ్మాయే మా అమ్మాయి, ధరణి! చదువుకుంటానంటే చదివించా, డిగ్రీ తెచ్చుకుంది. ఇక పెళ్ళిచేయాలి. చదువు, అందం ఉంది కదాని, కట్నం తక్కువిస్తానంటే తగిన వరుడు దొరకడు కదా! వరకట్న నిషేధచట్టం ఉత్తి “నేతి బీరకాయ సామ్యం” అయ్యింది. కాస్తంత మంచి సంబంధం కావాలంటే, పది లక్షలకు తక్కువ కట్నం ఇస్తే ఎవరూ ఒప్పుకోరు. చుట్టూ ఉన్న బడా బడా రైతులంతా రాజధానికని పొలాలు ఇస్తూంటే నేనూ నా పొలం ఇవ్వక తప్పలేదు. పోనీ, పొలంపోతే పోయింది, డబ్బైనా చేతికి వస్తుంది, పిల్ల పెళ్లి చెయ్యొచ్చు అనుకున్నా! ప్రస్తుత పరిస్థితిలో అదీ కనిపించడం లేదు. ఇప్పుడేమి చెయ్యాలన్నదే నాకు తెగని ప్రశ్నయి కూర్చుంది. అదే నా దిగులు.” వినే చెవి దొరికే సరికి గుండె నిండా గూడుకట్టుకున్న గుబులంతా వెళ్ళగక్కాడు సుబ్బారాయుడు.
వెంటనే పక్కన కూర్చున్న పెద్దమనిషి స్పందించాడు, “మీరేమీ ఇదవ్వకండి. నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది మా ఊళ్ళో. మాది కైకలూరు. నా పేరు అప్పారావు. మా ఊరి మునసబుగారి అబ్బాయి. వాళ్లకి ఒక్కడే కొడుకు. అమెరికాలో చదివాడు. అక్కడే ఉద్యోగం కూడా వచ్చింది. త్వరలోనే పెళ్ళి చేసెయ్యాలని తల్లితండ్రుల ఆలోచన. వాళ్లకి కట్నంతో పనిలేదుట! చదువు, చక్కదనం ఉండి, మంచి కుటుంబమైతే చాలుట! ఎవరైనా తెలిసివుంటే చెప్పమన్నారు నన్ను. మీ అడ్రస్ చెప్పండి, రాసుకుంటా” అంటూ చొక్కాజేబులోంచి చిన్న నోటుబుక్కు, పెన్ను తీశాడు అప్పారావు.
సుబ్బారాయుడిలో వివేకం మేల్కొంది. “ఆగండి, తొందరపడ వద్దు. వాళ్ళు చూస్తే బాగా భాగ్యవంతుల్లా ఉన్నారు. వాళ్ళు కట్నం వద్దన్నారు, బాగుంది. కానీ వాళ్లకి తగిన విధంగా మేము ఘనంగా పెళ్ళి చెయ్యాలన్నా, ముందుగా మాకు మా పొలం తాలూకు డబ్బు చేతికి రావాలికదా!”
“నాకు తెలియక అడుగుతున్నాను, ఏమీ అనుకోకండి ... ఎన్నికలు ఐదు ఏళ్ల కొకసారి వస్తూంటాయికదా! ఎప్పటి కప్పుడు ముఖ్యమంత్రులు మారి పోతూంటారు కదా! భవిష్యత్తు ఏమిటో, ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారో, ఎవరు ఓడిపోతారో ఎవరికి తెలుసు? రాజధాని ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు - ఐదేళ్ళలో అమరావతి నిర్మాణం పూర్తౌతుందని ఆయనెలా అనుకున్నాడు, ఆ మాటలు మీరెలా నమ్మారు? ఒకవేళ కొత్త ప్రభుత్వం కనక వస్తే, కొత్త కొత్త రకాల మార్పులు రావచ్చునన్న ఆలోచన రాలేదా మీకెవరికీ?”
అంతలో సూత్రధారణకు సమయం దగ్గరపడడంతో, పెళ్ళి చేయిస్తున్న బ్రాహ్మణునికి సహాయకునిగా వచ్చిన యువకుడు, మంగళసూత్రం అక్షతలు పట్టుకురావడంతో వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. ఆ బ్రాహ్మడు అందరి చేతికి మంగళసూత్రాన్ని తాకించి, అక్షతలు చేతిలో ఉంచి వెడుతున్నాడు. అతడు వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళ సంభాషణ కొనసాగింది ...
“మీరేమీ దిగులు పడకండి. సినిమా హీరో పవన్ కళ్యాణ్ అమరావతి రైతులకి తాను సాయపడతానని వాగ్దానం చేశాడు. ఇక చంద్రబాబు సరేసరి! తన శాయశక్తులా మీకోసం తాపత్రయపడుతున్నాడు. అంతేకాదు చిన్నా, పెద్దా అమరావతి రైతులందరూ కూడ ఒక కూటమిగా ఏర్పడుతున్నారు. మీరు కూడా ఆ కూటమిలో చేరండి, మీలో ఐకమత్యం ఉంటే మీ పని సానుకూలమౌతుంది.“
సుబ్బారాయుడి కళ్ళు ఒకసారి తళుక్కున మెరిసి అంతలోనే మళ్ళీ చిన్నబోయాయి. “నాకు ఎవరూ తెలియదే! నేనేమీ పెద్దగా చదువుకోలేదు.ఈ సమస్య సానుకూలపడాలి - అంటే ఏమి చెయ్యాలి, ఎవరిని కలుసుకోవాలి - అట్టాంటివి నాకేమీ తెలియవు” అన్నాడు సుబ్బారాయుడు దిగులుగా.
కొంతసేపు మాటాడకుండా ఉండిపోయాడు ఆ పెద్దమనిషి అప్పారావు. అంతలో ఏమితోచిందో ఏమో, “మీరు మీ ఊరు హైదరాబాదు మీదుగానే వెళ్ళాలి కదా! నేనో అడ్రస్ ఇస్తా, అక్కడకు వెళ్లి నాపేరు చెప్పండి. వాళ్ళు మీకు వసతి చూపించడమేకాదు, అమరావతి రైతుల కూటమిలో సంతకం పెట్టేందుకు ఎక్కడకు వెళ్ళాలో అక్కడికి కారుమీద తీసుకెడతారు కూడా. అప్పటి వీలునుబట్టి పవన్ కల్యాణ్ ని కలుసుకునే ఏర్పాటు కూడా చేస్తారు. ఆయనకు మీరు మీ ఇబ్బందులన్నీ చెప్పండి, మీకు మంచి జరుగుతుంది” అంటూ, పాకెట్ నోట్బుక్కులోంచి ఒక కాగితం చింపి అడ్రస్ రాసి పట్టుకుని, “హైదరాబాదులో బస్సు దిగి, ఆటో ఎక్కి ఈ అడ్రస్ చెపితే చాలు, మిమ్మల్ని మా వాళ్ళింటికి తీసుకెడతాడు ఆటోవాడు” అంటూ, ఆ చీటీ సుబ్బారాయుడు చేతిలో ఉంచాడు అప్పారావు. దాన్ని పదిలంగా జేబులో ఉంచుకున్నాడు సుబ్బారాయుడు.
మాటల ధోరణిలో పెళ్లితంతు ఎప్పుడు ముగిసిందో వీళ్ళిద్దరికీ తెలియలేదు. వాళ్ళు ప్రజ్ఞలోకివచ్చి చూసేసరికి జనం భోజనాలకు వెడుతూండడం కనిపించింది. అది చూసి వాళ్ళూ భోజనశాలకు బయలుదేరారు జంటగా .