జాతీయ గ్రంథాలయ దినోత్సవం
శ్రీ షియాలి రామామ్రిత రంగనాథన్ జన్మదినమైన ఆగస్టు 12వ తారీఖును భారత సమాఖ్య ప్రభుత్వం జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించింది.
యస్.ఆర్. రంగనాథన్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయాల్లో లైబ్రేరియన్ గాను, గ్రంథాలయ విజ్ఞానం ఆచార్యులు గాను పని చేశారు. అలానే 1944 నుండి 1953 వరకు భారత గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా పని చేశారు. 1957లో International Federation for Information and Documentation కి గౌరవ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అలాగే Library Association of Great Britain కి జీవిత కాల ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
వీరు వెలువరించిన “Five Laws of Library Science” అనే గ్రంథం చాలా ప్రఖ్యాతినొందినది మరియు విశిష్టమైనది. ఇందులో;
- మొదటి సూత్రం: గ్రంథాలయాల్లో పుస్తకాలను భద్రపరచడం ఎంత ముఖ్యమో అంతకన్నా వినియోగార్థం చదువరులకు అందుబాటులో ఉండటం ముఖ్యం.
- రెండవ సూత్రం: గ్రంథాలయాల్లో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండాలి.
- మూడవ సూత్రం: అన్ని వర్గాల చదువరుల కోసం గ్రంథాలయం పుస్తకాలను సేకరించాలి.
- నాల్గవ సూత్రం: గ్రంథాలయాల్లో పుస్తకాలను చాలా సులభంగా కనుగొనే విధంగా అమర్చాలి.
- ఐదవ సూత్రం: గ్రంథాలయాలు ఎప్పుడూ గతిశీలంగా ఉండాలి. మార్పులను అందిపుచ్చుకోవాలి.
ఈ ఐదింటిని ప్రపంచ వ్యాప్తంగా గ్రంథాలయ విజ్ఞానానికి మూల సూత్రాలుగా పరిగణిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రదేశంలో జరిగిన గ్రంథాలయోద్యమం గురించి కూడా చెప్పుకోవాలి. ఈ ఉద్యమాన్ని అయ్యంకి వెంకటరమణయ్య గారు ప్రారంభించారు. వీరితో పాటు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, పాటూరి నాగభూషణములను కలిపి గ్రంథాలయోద్యమం త్రిమూర్తులనేవారు.
ఆధునిక పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్ లో తొలి గ్రంథాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేశారని పరిశోధకులు భావిస్తున్నారు.1886 లో విశాఖపట్నంలో మంతిన సూర్యనారాయణమూర్తి ఈ పౌర గ్రంథాలయాన్ని నెలకొల్పారు.
అయ్యంకి వెంకటరమణయ్య గారు 1911లో రామమోహన గ్రంథాలయాన్ని విజయవాడలో స్థాపించారు. ఆయన 1914 లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార ప్రతినిధులతో గ్రంథాలయ మహాసభలు నిర్వహించారు. మొదటి గ్రంథాలయ మహాసభలు 1914 ఏప్రిల్ 10న విజయవాడలో జరిగాయి. ఈ మహాసభలకు చిలకమర్తి లక్ష్మీనరసింహం అధ్యక్షత వహించారు. రమణయ్య గారు 1915లో భారతదేశంలో తొలి గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం తరపున ఇండియన్ లైబ్రరీ జర్నల్ ను ప్రారంభించారు.
ఆంధ్రదేశంలో బాపట్ల జిల్లా వేటపాలెంలోని సారస్వత నికేతనం చాలా పురాతన గ్రంథాలయం. అక్టోబర్ 15,1918న ఈ గ్రంథాలయాన్ని ఊటుకూరు వెంకటశ్రేష్టి స్థాపించారు. 1929లో గ్రంథాలయం కొత్త భవనానికి మహాత్మాగాంధీ శంకుస్థాపన చేయగా, తరువాత ప్రకాశం పంతులు గారిచే ప్రారంభించబడింది. ఇలా ఆంధ్రదేశం నిండా విశిష్ట గ్రంథాలయాలనేకం స్థాపించబడడానికి గ్రంథాలయోద్యమం కారణమైంది.
ఆధునిక గ్రంథాలయాలేకాక తెలుగుదేశంలో కొన్ని ప్రాచీన పుస్తక భాండాగారాలు కూడా ఉన్నాయి.
పాత గుంటూరులో శ్రీ తిక్కన సోమయాజి నివసించినది వేణుగోపాలస్వామి గుడి రోడ్డులో. అక్కడికి దగ్గర్లోనే ఒక భవనంలో ఆయన రచనలు చేశారు. తిక్కన తరువాత కొన్ని శతాబ్దాలపాటు నిలదొక్కుకున్న ఆ భవనాన్ని 1911లో దాతలు పునర్నిర్మించారు.ఆ భవనంలో శ్రీ మహాకవి తిక్కన భాండాగారము నడపబడుతుంది. ఇక్కడ అనేకానేక అమూల్య గ్రంథాలు భద్రపరచబడి ఉన్నాయి.
వెంకటగిరి సంస్థానం వారు కొన్ని శతాబ్దాల పాటు సరస్వతి నిలయం అను పేరిట గ్రంథాలయాన్ని నిర్వహించారు.ఈ గ్రంథాలయాన్ని 1850 - 1916 మధ్య కాలంలో చాలా బాగా నిర్వహించారు. కుమారయాచమ నాయుడు, ఆయన కుమారుడు గోపాలకృష్ణ యాచేంద్ర సరస్వతి నిలయాన్ని పరిపుష్టం చేశారు. కానీ గోపాల కృష్ణ యాచేంద్ర తదనంతరం సంస్థానం వారు గ్రంథాలయ నిర్వహణను పట్టించుకోకపోవడంతో క్రమంగా శిథిలమయ్యి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. సరస్వతి నిలయం దుస్థితి గురించి "వెంకటగిరి పుస్తక జీవ సమాధి" పేరుతో బంగోరె జమీన్ రైతులో వార్త వ్యాఖ్యగా ప్రచురించారు.
గ్రంథాలయాలు పునరుజీవింపబడాలంటే ఇప్పటి యువతరానికి పుస్తక పఠనాభిలాష పెరగాలి.
Ernest Hemingway అన్నట్లు There is no friend as loyal as a book. ఇప్పటి తరానికి పఠనాభిలాష పెంచడం తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం యొక్క ఉమ్మడి బాధ్యత. పుస్తక పఠనం మనోవికాసం కలిగిస్తుందన్నది సత్యం.