షిర్డీసాయి బోధ
షిర్డీ సాయిబాబా అనే అవధూత భక్తి ఉద్యమం కొన్ని దశాబ్దాలుగా యావత్ భరతఖండం అంతా ఉధృతంగా సాగుతున్నది. పెక్కు మంది వారిని కేవలం కామితార్థములు తీర్చే దైవంగా, శివుడి అవతారంగా భావించి పూజిస్తున్నారు. కానీ వారిని ఒక సద్గురువుగా గుర్తించి, వారు చేసిన బోధనలు గూర్చి తెలుసుకోవడం కూడా భక్తులకు అత్యావశ్యకం. ప్రతి షిర్డీ సాయి బాబా మందిరం గోడలపై రాసి ఉండే రెండు పదాలు శ్రద్ధ మరియు సబూరి. బాబా జీవించియున్నప్పుడు తన భక్తులకెపుడూ శ్రద్ధ మరియు సబూరి అలవరచుకొమ్మని బోధించేవారు. దానిలో మొదటిదైన శ్రద్ధ గురించి -
భగవంతుడు ఉన్నాడనే ప్రగాఢ విశ్వాసాన్ని, ఆయనను ప్రాప్తించుకోవాలనే ఆకాంక్షను శ్రద్ధ అని నిర్వచిస్తారు స్వామి వివేకానంద. శ్రద్ధ అంటే అనుష్ఠానయుత విశ్వాసం. అంటే, విశ్వసిస్తున్నామని కేవలం నోటి మాటగా చెప్పడం కాదు; ఆ విశ్వాసాన్ని అనుష్ఠానంలోకి తీసుకురావడం, ఆ విశ్వాస లక్ష్య సాధనకు కృషి సలపడమే శ్రద్ధ.
శ్రద్ధాయత్ పూర్వకః సర్వ పురుషార్థ సాధన ప్రయోగః చిత్త ప్రసాద ఆస్తిక్య బుద్ధి: - అనగా సమున్నత లక్ష్య సాధనకు చేసే ప్రయత్నాలన్నిటికీ శ్రద్ధ అత్యంత అవశ్యం అంటారు శంకర భగవత్పాదులు ముండకోపనిషత్తు (౨.1.౭) భాష్యంలో. ఏమిటా సమున్నత లక్ష్యం – పరమాత్మను ప్రాప్తించుకోవడమే ఆ లక్ష్యం. దీనినే అద్వైతంలో బ్రహ్మైక్యం అని, విశిష్టాద్వైతంలో విష్ణు సాయిజ్యం అని, భేదాభేద సిద్ధాంతంలో శివైక్యమని అంటారు.
భగవద్గిత 7:3 లో భగవానుడు ఈ విధంగా చెప్పారు: ‘మనుష్యాణాం సహశ్రేషు కశ్చిద్యదతి సిద్ధయే! యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః!’ అనగా వేలకొలది మనుష్యులలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో గూడా ఏ ఒకానొక్కడు మాత్రమే యదార్థ తత్వమును ఎరుoగును. దీన్ని బట్టి శ్రద్ధ కలిగి యుండడం ఎంత కష్టమైన కార్యమో తెలియవస్తుంది. భగవానుడిని కామితార్థములు తీర్చుకునుటకై గాక ఆయనను ప్రాప్తించుకోవడo కోసం ధ్యానించాలి, పూజించాలి. అదే నిజమైన శ్రద్ధ. జ్ఞాన, భక్తి, కర్మ, రాజ యోగాల ద్వారా భగవంతుణ్ణి చేరుటకై యత్నించుటే అనుష్ఠానయుత మతము.
అటువంటి శ్రద్ధను గూర్చి స్తుతించేదే ఋగ్వేదంలోని శ్రద్ధా సూక్తం :
“ఓం శ్రద్ధయాగ్ని: సమిద్యతే శ్రద్ధయా హూయతే హవి:” – శ్రద్ధ వలెనే జ్ఞానాగ్ని ప్రజ్వలితమవుతుంది. శ్రద్ధ వలనే మన మనస్సనెడి ఆహుతి భగవంతునికి సమర్పించబడుతుంది.
రెండవదైన ‘సబూరి’ యనగా ఓర్పు లేదా నిష్ఠ. ఓర్పు చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం మధురంగా ఉంటుంది అంటాడు రూసో. ఆత్మ సాక్షాత్కారానికైనా, నిర్వాణపథాన్ని చేరుటకైనా లేదా లౌకిక వ్యవహారాలలో విజయం దక్కించుకొనుటకైనా ఓర్పుగా నిష్ఠతో అనగా లక్ష్య శుద్ధితో సాధన చేయాలి. అప్పుడే అంతిమ విజయం లభ్యమవగలదు.
సామాజిక దృక్పథంతో సాయిబాబా ఇచ్చిన అమూల్యమైన సందేశం మటుకు "సబ్ కా మాలిక్ ఏక్ హై". మనం ఏ పేరుతో పిలిచినా బదులు పలికే దేవుడు ఒకడే అని దీని అర్ధం లేదా సారాంశం. జాతీయోద్యమం ఊపందుకున్న తరుణంలో సాయిబాబా ఇచ్చిన ఈ సందేశానికి కేవలం ఆధ్యాత్మిక ప్రాధాన్యతే గాక సామాజిక ప్రాధాన్యత కూడా ఉంది. జాతీయోద్యమంలో గాంధీ శకారంభానికి కొంచెం ముందుగా అంటే 1918వ సంవత్సరంలో షిర్డీ సాయిబాబా పరమపదించారు. గాంధీజీ తన రాజకీయ సామాజిక కార్యాచరణ "సబ్ కా మాలిక్ ఏక్ హై" అనే దృక్పథంతోనే కొనసాగించారు. “రఘుపతి రాఘవ రాజారామ్ పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరోనాం సబ్కో సన్మతి హే భగవాన్” అనే గీతం ఆలంబనగా సమాజంలోని అన్ని వర్గాల ఐక్యతకు పాటుపడ్డారు.