ఉల్లీ! తల్లీ!! -- దివికుమార్
తల్లీ ఉల్లిపాయ
నువ్వేడ దాగుండావే
మా తల్లీ ఉల్లిపాయ ...
గంజిగట్క తాగునపుడు
పచ్చి మిరపతోడు నీకు
కూర నార వండినపుడు
కలగలుపు 1ఆటు నీవు
ఇప్పుడు నీ జాడెక్కడ
యెతికి యెతికి చస్తుంటిమె... ॥తల్లీ॥
కోడిగుడ్డు పొరుటుకెపుడు
కమ్మదనం నీవె గదే
పెసర మినప అట్టునడుమ
కర కరలాడే దానివె
పప్పు పులుసు సాంబారులో
పసందుగా నిలిచెదాన్వె.... ॥తల్లీ॥
మేము పంటయేసినపుడు
గిట్టుబాటుకాకుంటివె
ఒకనాడు అమ్మబోతె
అడివై మమ్మదలిస్తివె
ఈనాడూ కొనబోతే
కొరివిదయ్యమైతివేమె... ॥తల్లీ॥
పేదోళ్ళ పెన్నిధివని
తెగ మురిసి పోతుంటిమె
బక్కోళ్ళ బంధువువని
బాగ నిన్ను చూస్కుంటిమె
సంపన్నుల సరస జేరి
మాకు సవతివై పోతివె... తల్లీ॥
నల్లధనం వ్యాపారులు
దయలేని పాలకులు
డాలర్ల మోజున పడి
2వోలికి నిన్నమ్మేసిరె
రాకెట్లలో నిను బెట్టి
ఆకసాని కంపేసిరె.... ॥తల్లీ॥
నీ పేరు తలవగానె
కత్తికి కన్నీళ్ళు పుట్టె
దాక, చట్టి నువులేక
ఉసూరుసురు అనబట్టె
నిను పట్టి తెచ్చెదాక
పొయ్యి మండనంటోందో... ॥తల్లీ॥
కూలినాలి పేదోళ్ళూ
నడిమిరైతు సోదరులు
పోలోమని ఉరుకుతుండ్రు కసిమీద కదులుతుండ్రు
దోపిడోళ్ళ బంధాలను
బదాబదలు చేయమనవె ...... ॥తల్లీ॥
1. ఆటు = తక్కువ కూరగాయ ముక్కలకు ఉల్లి కల గలుపు వల్ల ఎక్కువ కూర చేసినపుడు దాన్ని ఆటు రావటం అంటారు.
2. వోలి = కన్యాశుల్కం. ఇప్పటికీ కొన్ని గిరిజన తెగలలో ఈ సాంప్రదాయం వుంది.
వింత సంత
తూర్పున పూసిన
పువ్వే
పడమరన రాలిపోతున్నది
అమ్మ
కడుపున
కాసిన కాయ
ఆరడగుల నేలలో పండడంలో
ఆశ్చర్యమేముంది
గాలికి
ఊగిపోయే మేఘమే
పుడమికి
పచ్చదనం పోస్తున్నది
గాలితో పెరిగి
గాలిలేక కరిగే దేహం
చిరస్మరణీయత పొందడంలో వింతేముంది
ఆలోచిస్తే సృష్టి అంటే
పగిలిపోయే తిత్తి
నిజం తెలిసి నాలుగు రోజులు
ఉండిపోయేటందుకు ఎందుకో నేననే సుత్తి
నేను అనేది మిడిచిపడిన కొద్ది కరిగే అగరబత్తే కదా
నేను -- విశ్వర్షి వాసిలి
•1•
నేను
సాధకుడను, సన్యాసిని కాను
బుద్ధుడను, భిక్షువును కాను.
....అంతర్ముఖీనుడను,
..........అనుకరణను కాను
....ప్రాపంచికుడను,
..........అనుసరణను కాను.
..........కనిపించే బైరాగినీ కాను
..........కనిపించని తాపసినీ కాను.
అవును, నేను
....నిశ్వాసగా బాహ్యాన్ని,
....ఉచ్వాసగా ఆంతర్యాన్ని.
(మొన్న ఆచార్య గంగిశెట్టి గారు నన్ను ‘సాధక గురు’ అని సంబోధించారు. ఆ సంబోధనకు చిరు స్పందన ఇది)
•2•
నేను
కాను మనోవ్యాపారాన్ని,
......అయినా మనసును
కాను ఇంద్రియక్రతువుని,
......అయినా దేహాన్ని.
....దేహానికి మనసు లేనివాడిని
....మనసుకు దేహం కానివాడిని.
......లేనిదాని ఆరాటాన్నీ కాను
......ఉన్నదాని వ్యామోహాన్నీ కాను.
అవును, నేను
....దేహ బంధం మనసు ఒరిపిడి
..........లేనివాడిని.
ఆకలి...ఆకలి -- ఆచార్య రాణి సదాశివ మూర్తి
కంటికి చూచుటకాకలి
వంటికి తాకగను మేను వాంఛల మదికిన్।
పంటికి తినుటకునాకలి
మింటికి భూతములఁ మ్రింగ మిక్కుటము జుమీ।।
(భూతములు = పంచభూతాలు... వీటిలో తనను తాను కూడా)
క్రోధికి నన్యులఁ బీడయు
బోధికి నేర్వగ మరిమరి బుద్ధులఁ గఱపన్।
వ్యాధికి తనువే దినుసగు
ఆధికి బ్రాణంబునరయనాకలితీరుల్।।
ద్వేషికి లోకవినాశము
భూషికి భూషలును మించ భోగికి యశమున్।
రోషికి పరదోషము సం
తోషికి శమమాకలిభువి తోచెడు విధముల్।।
లోభికి యాకలి సొమ్ముల
నాభికి నాదంబు బుట్ట నానా గతులన్।
శోభికి భానంబు యశో
లాభికి కృషి యాకలి గన లాస్యము జేయున్।।
కిరికిరికెట్టు -- మూర్తి జె.ఎస్.ఆర్.
సరదా సరదా కిరికెట్టూ
ఇది దొరలు ఆడు బల్ కిరికెట్టూ
వరల్డు కప్పు=ప్రపంచాన్ని కప్పు వస్త్రవిశేషం
బ్యాట్=దుడ్డుకర్ర (బంతిని గబ్బిలంగా ఎగిరేట్టు కొట్టింగ్)
బ్యాట్స్ మేన్=గబ్బిలాల్ని తోలేవాడు
బాల్=వెంట్రుకలచెండు=దారాలచెండు (క్రికెట్ చెండుని వెంట్రుకల్లాంటి దారాలతో చుట్టి దానిమీద తోలుముక్కల్తో కుట్టి తయారిస్తారు)
బౌలర్=బంతులోడు
నోబాల్=తెలుసుకోవలసిన బంతి(know ball)
ఇల్లీగల్ బాల్=బంతియొక్క అక్రమసంతానం
స్పిన్ బాల్=తలతిరుగుడు బంతి
లెగ్ బ్రేక్=కాళ్ళువిరగ్గొట్టే బంతి
ఆఫ్ బ్రేక్=సగంసగం విరగ్గొట్టి బాధపడుతూంటే చూసి ఆనందించే సాడిస్టు బంతి
వైడ్ బాల్=పిచ్చిదాటినబంతి
గుగ్లీ=గూగులమ్మమ్మబంతి
షార్ట్ పిచ్ బాల్=బుడ్డ పిచ్చి బంతి
డెడ్ బాల్=చచ్చినబంతి
డెలివరీ=బంతిని కనడం(చూడ్డం కాదు)
డక్ ఔట్=మందెక్కువై పడిపోయిన బాతు
వికెట్ కీపర్=వికెట్లని ఉంచుకున్నవాడు
ఫ్రీ హిట్=డబ్బులు తీసుకోకుండా ఉచితంగా కొట్టే దెబ్బ
ఓవర్=అతి
డెత్ ఓవర్స్=అతిగా చంపడాలు
రన్ రేట్=పరుగు వెల (ఉదా:పరుగుకి ఐదువందలు వెయ్యి ఇలా పందాలుకాయడం)
సిల్లీ మిడాన్=సగం కిక్కెక్కిన సిల్లీ ఫెలో
మిడాన్=మిడిమేళంగాడు
మిడాఫ్=చప్పిడి మిడిమేళంగాడు
స్లిప్=కాలుజారినోడు
పిచ్=చూసేవాళ్ళకి పిచ్చిక్కించే గోదా
వికెట్లు=పిచ్చికి పిచ్చెక్కకుండా గుచ్చే పుల్లలు
బేల్స్=పిల్లకిరీటాలు(అధికారం శాశ్వతం కాదని ఔట్ చేసి మరీ చెబుతూంటాయి. కావాలంటే చంద్రబాబునాయుడుగారిని అడగండి)
ఎంపైర్=రాజ్యంలేని మహారాజు
బౌండరీ=పిచ్చెక్కిన జనాలు పిచ్చిమీదకి రాకుండా కట్టే తాడు