భావాన్నెపుడూ ప్రకాశింప చేసేది ప్రశ్న
మనిషిని మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది
తిరగేసి అడిగితే వెక్కిరించినట్లుంటుంది
ఎగరేసి చూస్తే నెత్తికెక్కి కూర్చున్నట్లుంటుంది
తప్పుకు వెళ్దామంటే కొక్కెంలా లాగి వేలాడేసుకొంటుంది
కొన్ని ప్రశ్నలుంటాయి......
ఎంచక్కా దువ్వి ముస్తాబు చేసి పిల్లాణ్ణి బడికి పంపినట్లు
చైతన్యపు వీధుల్లో వేలుపట్టి నడిపించుకు వెళ్తున్నట్లు.....
కొన్ని ప్రశ్నలు మనల్ని రెండుగా విడదీసి
త్రాసులో అటూ ఇటూ కూర్చోబెట్టి తూస్తుంటాయి
ముల్లు ఎటు వాలుతుందా అని రెండు వైపులా
సిబ్బెట్లు బిక్క చచ్చిపోతుంటాయి...
మరికొన్ని ప్రశ్నలుంటాయి......
పగలంతా వెనుకెనుకే ఒదిగుంటూ రాత్రిమాత్రం
దుప్పట్లో దూరి ముక్కులు పిండి ఊపిరాడక చేస్తుంటాయి
గుండెలమీద వాలీ, తల మీదికి వంపు తిరిగీ
టపీటపీమని మోదుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి
ఇంకొన్ని ప్రశ్నలుంటాయి......
చలిగాలిలా చెవులు కొరికేస్తూ
ఈదురుగాలిలా మనిషినే చుట్టేస్తూ....
............
అసలు మనం మెలిదిరిగిపోయే క్షణాన్ని
మనమెప్పుడైనా చూసుకొన్నామా?
ప్రశ్న గుప్పెట్లో ఇరుక్కొన్నప్పుడు
నీ లోపలకి నీవు చూసుకో...తెలుస్తుంది
ఆకాశం మర్రిచెట్టుకి ప్రశ్నగుర్తు ఉయ్యాలకుర్చీని
తలక్రిందులుగా వేలాడదీసి అందులో కూర్చుంటే
తెలుస్తుంది, ప్రశ్నకూడా మనల్ని ఉయ్యాలలూపి
నిద్ర బుచ్చుతుందని... ప్రశ్నే ఓ జోల పాటని..
చిరిగిన ఆత్మల్ని అతుకేసి కుట్టిన జోలి రూపమని
ఆత్మ ప్రకర్షకూ-- వికర్షకూ మధ్య కీలకమని!
నా వయసుని
ఒక్క అడుగు కూడా
ముందుకు కదలకుండా
నిన్నలలో మొన్నలలో ఆపేశాయి
నా మనసులో
లలిత భావనలను
సుమ కోమలాలను
సుందర నందనవనాలను మొలిపించాయి ..
నా తనువుకు
అణువణువుకు
ఉజ్వల తేజస్సును తరలించాయి..
ఈ అధ్యయనాలు..
నా ఆలోచనలను
ఆనంద తీరాల వైపు
మహోదయాల వైపు మళ్లించాయి..
నా రచనలకు
అనురాగం ఆరాధన
ప్రణయం ప్రణవం నేర్పించాయి..
ఈ కాలం ..
ఏకంగా నన్ను
ఒక కవితగా మార్చి వేసింది ..
ఈ విరామం..
నా జీవితాన్ని
రసరమ్య కావ్యంగా తీర్చి దిద్దింది..
నా రచనలు
నన్ను సంపూర్ణ
ఆరోగ్య వంతుణ్ణి చేశాయి
నా కవితలు
నాకు తెలియని
ఏనాడూ ఎదురుపడని
ఎందరికో పరిచయం చేశాయి
ఇంకా...
ఈ పద నర్తనలు..
నాలోని
ఆవేదనల్ని మోశాయి
నాలోంచి
ఆనందాన్ని తవ్వి తీశాయి
నా జీవితాన్ని
ఒక మహాకావ్యంగా వ్రాశాయి..
అందుకే
ఈ అక్షరాలకు
సదా ఋణపడి ఉన్నాను.
అనాదిగా జతపడి ఉన్నాను ..
మనస్సు కు పరుగు సహజం
పరుగు ఎప్పుడూ ఆపదు
పరుగెత్తి పరుగెత్తి అలసినా
వయస్సు పరిహసిస్తుంది
తనువు డస్సిందని విన్నవిస్తుంది,
నైజం మారని మనస్సుకు
వయసెక్కడుంది?
అశ్వమా కళ్లెం వేసేందుకు?
కలల కౌగిళ్ళలోకి జారిపోతుంది
ఉహల గున్న మావిళ్ళకి
ఊయలలు గట్టి ఊగుతుంది.
చికిలించే ప్రశ్నలకి
రామ జోలపాడుతుంది
కథల తాయిలాలు పెడుతుంది..
రేచక కుంభకాల బందీ విడిపించి
సహస్రారంపై కూర్చో పెడుతుంది
ఓ కొత్త ప్రపంచం వేయిరేకుల పద్మమై వికసించి
ప్రియాతిప్రియంగా ఆహ్వానిస్తోంది...
పొదుపు బతుకుల శ్రీమతులు
కొంగు బంగారాన సంతానవతులు
సంసార చక్రాలకు బండి కందెన ఇరుసులు
హక్కుల ఆత్మగతానికి
విడిపోనివి ఆప్యాయతలు ,అనుబంధాలు
అందుకే ఎడతెగని ప్రయాసలు.
విశ్రాంతి తీరాన ఉబలాట ప్రయత్నాలు .
తోలు పెట్టెల తూకాల బరువుకు
కిటికీలు తెరుచుకోని గాలి పయనాలు.
దిగగానే బిత్తరి చూపుల కలయికలు,
పరచుకున్న తివాచీల మీద
కాలి మడమల పగుళ్ళు
గుచ్చుకోనీయక పదిల పడిన వాళ్ళు .
వాలు కుర్చీ లో దిన పత్రికను
అక్షరాలకు ఒంటరిగా విడువక
ఆయనను సిగ ముడిలో
తురుముకుని వచ్చిన వాళ్ళు
కొరియన్ అంగళ్ళ భారతీయతలో
వంటింటి పచనలకొరతలేనివాళ్ళు .
అవి ఇవి దొరకవన్న
అపవాదులనన్నింటినీ మించి
రోటి పచ్చళ్ళ దంపుళ్ళకు
నడుం నొప్పిని సడలించిన వాళ్ళు.
చలి లోగిళ్ళకు ధైర్యమొకింత సడలినా
ఊలు బట్టల దిట్టపు నిట్టూరుపులలో
మో మోటమి గెలిచిన వాళ్ళు.
కన్న బిడ్డలు కళ్ళెదుట కనబడుతుంటే
భుజపు టెత్తుల సిరిధాన్యపు
మూట బరువు దించుకున్న వాళ్ళు .
అవకాశాల ఆవలి తీరాలకు
అవధులను దాటి
కడుపు తీపి చెక్కెర మడుగులకు
కను కొలను ముత్యాల
దట్టపు గట్టుకట్టిన వాళ్ళు .
విశ్వ గ్రామంలో జానపదాన్ని
నెలకొలుపుతుంటారు
భ్రమలన్నీ తొలగిన వయసులో
ఆకు పచ్చని చీటీ రాకడల తలవాకిట
నిశ్చింతను కోరుతుంటారు .
నిలకడ ఊపిరుల రెండు
ఉదయాలకు ధన్య వాదాలను తెలుపుకుంటారు.