•1•
శూన్యం కాని స్థితీ కాని
గగనం లేని గాలీ లేని
వెలుతురు చేరని చీకటీ చేరని
వాయులీన ఖగోళత.
అణువుకు అనంతానికి అభేదత.
•2•
శక్తీ పదార్ధతల సమ్మేళనంగా అణువు
అణువుతో సంయోగించిన కాలం, స్థితీ.
కాలం పెరుగుతూ, విశ్వమూ పెరుగుతూ
ప్రభవించిన వాయుమేఘవలయం
గ్రహాలతో నక్షత్రాలతో పరిపుష్టమైన గగనం
పదార్థ సాంద్రత ఉష్ణతీవ్రతలతో గోళావిష్కరణ
సౌరకుటుంబ ప్రాభవంతో గురుత్వాకర్షణ.
•3•
కాలం స్థితీ విడివడని ఏకత
ఆ ఏకత్వంతో ఖగోళతన జవజలం
ఆ జలధిన ఈదులాడుతూ ఒక జీవం
జీవనానికై కలయ తిరుగుతున్న ప్రాణం
జల జీవానికి ప్రాణభూతంలా భూగోళం
భూగోళానికి శ్రీకరంగా నేను.
•4•
ఆ సంగమ సాగరాన
ఘర్షిస్తూ సంఘర్షిస్తూ
పారాడుతూ పోరాడుతూ
సగం మానవతనంతో ఎగసిన మత్స్యం
మనువు రక్షణలో మత్స్యం
జలతత్వంతో ముడిపడ్డ మానవతత్వం
మత్స్యావతారంగా తొలి ఆవిష్కరణగా
పరిణామానికి శ్రీకారంగా నేను
నీట జీవం ప్రాణం జీవనంగా నేను.
•5•
నేను
మనువును, తొలి మానవుడను
అణువు మూలంగా కణకణ సంయోగాన్ని
అవును, మానవ తత్వానికి తొలి ఆత్మను
మానవ తనానికి తొలి అణువును
మానవ రూపానికి తొలి కణాన్ని
సృష్టికి ఆకరంగా నేను.
•6•
ఇహం నుండి కణం పరం నుండి కాంతి
సృష్టికి ఉద్యుక్తమైన పరాప్రకృతి
కణ పరిణామానికి తొలి అంకంగా
ఇహానికి పయనమైన కాంతి.
అవును, కాంతి వేగంతో ప్రభవించిన కాలం
విస్తృతమవుతూ కాలం విస్తరిస్తూ నేను
కాలంతో కాంతితో చైతన్యమవుతూ నేను
నీటి నుండి మట్టిని చేదుకుంటూ నేను.
•7•
అవును, మట్టి కేంద్రంగా అనంత జలవలయం
అణువును కణాన్ని సంగమింపచేసిన ఇహం
కాంతిని కాలాన్ని సంయోగింపచేసిన పరం
ఇహానికి పరానికి అరూపవారధిలా నేను.
అవును, మనిషికి మతిని జతపరచిన నేను
జీవవైవిధ్యానికి మత్స్యావతారంగా నేను.
•8•
చరాచర వైవిధ్య సామూహికరూపంగా సృష్టి
సృష్టికి సమాంతర పరిణామంగా నేను
దశదిశలా భవిష్యత్తులోకి విసిరేయబడ్డ నేను.
అవును, నేను కాలాన్ని కాంతిని పెంచుతున్నవాణ్ణి
సృష్టి ప్రకృతిని వికృతిని పెంచుతున్నవాణ్ణి.
అవును, పరిణామ వేగానికి తొలి వారసుణ్ణి
మత్స్యావతార మనువు తత్వాన్ని
మనువు ధర్మాన్ని చేరుతున్న మనసు మర్మాన్ని.
•9•
అమరత్వమూ లేదు మృతతత్వమూ లేదు అమవస పున్నములు లేనేలేవు
ఉఛ్వ్వాసమూ లేదు నిశ్వాసమూ లేదు
ఏకంగా శ్వాస పురుడుపోసుకున్న క్షణం.
కణ స్పందన అది కాల చైతన్యం అది
మానవ రూపావిష్కరణకు తొలి అంకం అది
నాభినుండి నాడీమండలంవరకు రూపావిష్కరణ
మత్స్యం నుండి మనువు వరకు ఇహ ఆవిష్కరణ
భిన్నత్వంలో ఏకత్వం మత్స్యావతార నేను.
•10•
మనసు నుండి జాలువారిన కామన
వెలుగును చుట్టుముట్టిన చీకటి
నిప్పును పొదువుకున్న నీరు
కాంతిని ప్రసరించిన కాలం
ఇహం నుండి శక్తి విస్ఫోటనం
పరం నుండి ప్రాణ ప్రవాహం
ఖగోళతలో వైవిధ్య జీవచైతన్యం
భూమికలుగా తొలి అవతార నేను
మాత్సర్య మత్స్యావతారాన్ని నేను.
•11•
చిరుజీవం పెరుగుతూ పెనుజీవం కావటం
పెరిగినకణం మూలకణంగా వెనుతిరగటం
రేపటికోసం ఒకరిని ఒకరు ఆశ్రయించటం
చివరికి నిష్క్రమించటం సృష్టి పరిణామం.
తిరోగమనం మృతతత్వానికి తొలిపరిణామం
ఇది మత్స్యావతార ఆవిష్కృత రహస్యం
అణువు కథ ఇది మనువు కథ ఇది
మనిషి కథనం ఇది మనసు కథనం ఇది
మట్టి కథ ఇది మట్టిని మెట్టిన మనిషి కథ ఇది
పరిణామ చరిత్రలో తొలి ఇతిహాసం ఇది.
మెలకువ వచ్చేదందుకే!
ఉభయ సంధ్యల క్రీగీతల ఎరుపై మెరిసిపోడానికి...
నలుపు ఎరుపై, ఎరుపు తెలుపయ్యే
వెలుగు పరిణామం వ్యాఖ్యానించడానికి...
వెలుగులో వెలుగై వెలిగిపోవడానికి!...
మెలకువ వచ్చేదందుకే!
చీకటి చింతను ఎడబాపేటందుకు
మనిషికి మనిషున్నాడని చూపేటందుకు
చేయీ చేయి కలిపి బీడునేలలో వెలుగుపంటలు వేసేటందుకు
మెలకువ వచ్చేదందుకే!
మాటల తమలపాకు చిలకలు చుట్టి లోకం నోటికందించడానికి
వెలుగు సున్నం రాచి నోళ్లు పండించడానికి
మెలుకువ వచ్చేదందుకే!
నిన్ను నా కన్నుల్లో నింపుకోడానికి
నేను నీ కాంతికిరణమై వెలగడానికి
నీ జీవమాధ్యమంగా లోకాన్ని ఉద్దీపించడానికి......!!!
(పై దాంట్లో మూడో ఖండికను, కొద్దీ రోజుల క్రితం 'నానా' గా పెట్టి ఇప్పుడు మళ్లీ రిపీట్ చేస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి– ల.నా.)
మూలం: స్వామివివేకానంద
స్వేచ్ఛానువాదం: వాధూలస
నేను శక్తినిమ్మని అడిగాను
దేవుడు నాకు కష్టాలు ప్రసాదించాడు
నన్ను శక్తిమంతుణ్ణి చేయడానికి
నేను తెలివితేటలిమ్మని అడిగాను
దేవుడు నాకు సమస్యలనొసంగాడు
పరిష్కరించడానికి
నేను నాకు సంపద కావాలని అడిగాను
దేవుడు నాకు కండలు, మెదడు ఇచ్చాడు
పనిచేయడానికి
నాకు ధైర్యమిమ్మని అడిగాను
దేవుడు ప్రమాదాలు కల్పించాడు
అధిగమించడానికి
సహనమిమ్మని అడిగాను
దేవుడు నేను అనివార్యంగా నిరీక్షించే
పరిస్థితిలో ఉంచాడు
నేను ప్రేమ కావాలని అడిగాను
దేవుడు కష్టాల్లో ఉన్న జనాలను ఇచ్చాడు
సహాయపడమని
నేను అనుగ్రహం కావాలన్నాను
దేవుడు అవకాశాలు కలిపించాడు
నేను కోరుకున్నవేవీ పొందలేదు
నాకు అవసరమైనవన్నీ పొందగలిగాను
చైతన్య ధాటీ సారస్వతా ప్రభాసత
భోళా తనమే నిజగుణ ప్రబలత
స్నేహ పరిమళాల హృదయ ప్రాకారత
సాహిత్య పరిశోధనా ప్రతిభా తిలక
ఉపన్యాస ప్రాగల్భ్యతా రవళిత ,
అనేకానేక వేదికా పురస్కృత
ఆమె ఉందంటే పెద్ద దిక్కు దక్షత
ఆమె లేని లోటు నమ్మలేని అశక్యత
ఈ నివాళి ఆత్మీయతకొక
అనివార్య ప్రవళికా లతిక
దూర తీరాల నివాసానికేగిన
శ్రీమతి వాసా ప్రభావతి
మహిళా రచనలకు ఆలంబనా ప్రగతి.
చెరగని పుటల అక్షర జ్యోతి
లేఖినీ సముదాయ
మానస చిరంతనా లోక నిత్య ప్రణతి
నా ప్రయాణం మొదలైంది
ఈ భూమి మీద నేను శిశువుగా పడగానే
శైశవాన్ని విడిచి కౌమారంలో అడుగిడగానే
యౌవనపు రుచి చవి చూడగానే
నా ప్రయాణం కొనసాగింది.
మధ్యవయస్సు అనుభవాల్ని మూటకట్టుకోగానే
వృద్ధాప్యపు ముడుతలు నుదుటినుండి తనువంతా అల్లుకోగానే
నా ప్రయాణం ఇంకా కొనసాగింది
వృద్ధాప్యపు చివరి మజిలీ లో
కూడబెట్టిందంతా చేతుల్లోకి తీసుకోవాలనుకున్నా.
కాని చేతులు లేవట్లేదు.
కన్నులు నిలవట్లేదు.
ఆశచావట్లేదు.
గట్టిగా ఒక నిట్టూర్పు విడిచా.
ఊరు విడిచా.
తనువు విడిచా.
శ్వాసవిడిచా.
నేలవిడిచా
నింగికెగశా.
కిందికి చూస్తూనే ఉన్నా.
నే విడిచిన దేహం చుట్టూ జనం. జనం. జనం.
పెడబొబ్బలు
ఏడుపులు
కన్నీరు
బొట్లు.. బొట్లు.
మౌన రాగాలు
నిశ్శబ్ద శోకాలు
నన్ను సరిగా పెంచలేదని ఒకరు.
నాకు సరిగా పంచలేదని ఒకరు.
నాకేమీ ఉంచలేదని ఒకరు.
వీలు సరిగా లిఖించలేదని ఒకరు.
అవన్నీ విని నాలుక కొరుక్కుందామనుకున్నా
అరెరే... కొరకడానికి నాలుకే లేదు.
నేను ఏం మాట్లాడినా వారికి వినబడదు.
కారణం ... మాట్లాడటానికి నాకు నోరే లేదు.
*వీడు నన్ను మించలేదు*.
వికటహాసం చేస్తోంది కాలం.
నేను కూడ బెట్టింది నాతో రాలేదు. కాని
ఎప్పుడో ఆకలితో ఉన్న ఎవరికో
నేను కూడు బెడితే
ఆకలి తీరిన ఆ కడుపు కన్నులు
ఆత్మీయంగా నవ్విన నవ్వు
మెరుపై, వెలుగై , చల్లని వెన్నెల వాడై
నాతో నడిచింది. నన్ను
కోటి సూర్య ప్రభలతో కూడిన
కాంతిలోకంలోకి తీసుకువెళ్ళింది.
ఇక్కడ ఏజనఘోషా లేదు.
మనిషి కప్పుకునే ఘోషాలేదు.
అహంకారపు హేషా లేదు.
గంధర్వ కన్య లా
ఆమె నడిచినంత మేర
వెన్నెల పరుచుకుంది..
"కల్లిమెర"(శుభోదయం) అంటూ నేను
కరచాలనమైనప్పుడు
దూరంగానో
దగ్గరగానో ...
ఒక అమృత హస్తం
నన్ను కాపు కాస్తున్నట్లుంది ..
నాకు తెలిసినంతవరకు
మగాణ్ని
ఆమెలాంటి
ఆత్మ వలయమేదో
కాపాడుతున్నట్లుంది..
ఆమెని చూసాక
స్త్రీ లేకపోతే ...
స్త్రీ సముద్రతీర లాంతరుగా మారక పోతే..
జీవనసాగరంలో మగాడు
జాడ తెలీని ఓడ అవుతాడేమో..?
నేను దగ్ద మౌతున్న ఎర్రని రాత్రి
ఆశల్ని వెలిగించు కుంటున్నప్పుడు
మస్తిష్కాన్ని పడమటివైపు మళ్ళిస్తున్నప్పుడు
కూలుతున్న దేహపు గోడల్ని సరిచేసు కుంటున్నప్పుడు ...
ఆమె స్నేహం
మధ్య ధరా సముద్రపు నీలి కెరటంగా
రోజూ నా హృదయ తీరాన్ని తాకుతూంది
ధ్యానంలో ఉన్న ఒలింపస్ పర్వతంలా
భావ ప్రవాహమైన పీనస్ నదిలా...
దృశ్యం మీద రెప్పల దుప్పటి కప్పుకున్నాక
"కల్లి నిక్ష్ ట "(శుభ రాత్రి) చెప్పి
ఆమె
బుగ్గపై అద్దిన ముద్దు ముద్రలా
పొడవాటి స్వప్న మేదో
ఆత్మరేఖగా దుప్పటిని చీలుస్తుంది ..
ప్రపంచం ఇప్పుడే మొదలైందో
ముగింపు కొచ్చిందో తెలీదు కానీ
మనిషి పుట్టినప్పటి నుండి
స్త్రీ ప్రేమించడం మాత్రమే చేస్తుంది
అనంతమైన అవని మీద
ఆ ఒడ్డయినా
ఈ ఒడ్డయినా
ఆమె కు
లాలించి పాలించడమే తెలిసింది ..
కన్నబిడ్డ జైలు కెళ్ళినప్పుడు
కరపత్రమైన గోర్కీ అమ్మలా...
శోక శిఖరాలు
ఎక్కినా
దిగినా...
మగాడ్ని ఆనంద డోలికల్లో ఊగించే
ఆరోహణ
అవరోహణ...
క్రమం తెలిసింది మాత్రం
ఆమె
ఒక్క దానికే..!