Menu Close
ఋణం (కథ)
-- శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ --

ఉదయం పేపరు చదివినప్పటినుంచీ సూర్యానికి కొంచెం దిగులు ఆవహించింది. ఆఫీసుకెళ్ళి పనిచేశాడన్నమాటేకానీ అన్నీ అసంపూర్తిగా వదిలేసి పెందరాళే ఇంటికొచ్చేశాడు. సూర్యం రాకని భార్య సమీర గమనించినా, గమనించనట్లే టీవి సీరియల్లో మునిగిపోయింది.

సూర్యం ఫ్రెష్ అయ్యి కాఫీ కలిపి ఒక కప్పు సమీరకిచ్చి (ఇది వెరైటీగా అనిపించిందా? అదంతే. పొరపాటున ఒకరోజు సూర్యం పెట్టిన కాఫీ తెగనచ్చేసి “నీ కాఫీ సూపర్ డియర్” అనగానే మన వాడి ఛాతి మోడీలా పొంగి, చేసిన ఆ పొరపాటు అలవాటుగా మారింది).

సోఫాలో కూర్చుని తాగుతుంటే ఎదురుగా టీపాయి మీదున్న పేపరు కనబడింది.అది చూడగానే సూర్యానికి మళ్ళీ ఒక్కసారి ఎక్కడో అసంతృప్తి.  కారణం పేపర్లో వచ్చిన ప్రకటన – “కఛ్చపి కళావేదిక” వారు నిర్వహిస్తున్న "ఉగాది కధల పోటీ" - రచయతలకు ఆహ్వానం.

సూర్యంకి చిన్నప్పటినుంచీ కధలు చదవడమంటే పిచ్చి. ఉన్న ఊళ్ళోని అన్ని గ్రంధాలయాల్లోని వార, పక్ష, మాస పత్రికలన్నీ ఊదిపడేయటమే కాకుండా, కిళ్ళీకొట్లో దొరికే అపరాధ పరిశోధనలు, డిటెక్టివ్ పుస్తకాలు అద్దెకి తెచ్చుకొని, కరెంటు లేకపోయినా కోడిగుడ్డు దీపం సహాయంతో పుస్తకాల పురుగులా రాత్రికి రాత్రే ఫినిష్ చేసినవి కోకొల్లలు.

ఆ రోజుల్లోంచే అతని మెదడులో ఒక కోరిక మొలకెత్తింది. అదేమిటంటే, తనుకూడా ఒక కధ రాయాలని, రచయత సూర్యం అనిపించుకోవాలని. ఎంతో ఆలోచించి, ఆవేశపడి రాసి పత్రికలకు పంపిన ఇంచుమించు ఒక అరడజను కధలు చాలా క్షేమంగా తిరుగు టపాలో ఇంటికి చేరాయి. ఇంక పెన్నుకి పని చెప్పి కాగితాలు వృధా చేయడం దండగ అని విరమించుకున్నాడన్నమాటే గాని, కోరికని మాత్రం చంపుకోలేదు.

చదువు, ఉద్యోగం, పెళ్ళి, సంసారం, పిల్లలు, వీటితోబాటొచ్చే వడిదుడుకులతో కధలు చదవడం క్రమేపీ తగ్గి, కధ రాయాలనే కోరికను వెనకసీట్లోకి నెట్టేశాయి.

కానీ కధ అచ్చవ్వలేదన్న బాధ మాత్రం ఇంకా అలాగే ఉంది. అంతే కాకుండా ఎప్పుడు కధల గురించి ప్రకటన చూసినా అదే అసంతృప్తి, ఏదో కోల్పోయానన్న భావం సూర్యాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. సూర్యం ఆఫీసుకి వెళ్ళే దారిలోనే ప్రఖ్యాత రచయత కోబ్రా ఇల్లు కూడా ఉంది.ఆ ఇంటిని చూసినప్పుడల్లా అతనిలోని కోరిక మరింత పెరుగుతూ వస్తోంది.

ఒక నిశ్చయానికి వచ్చినవాడిలా సోఫాలోంచి లేచి పేపరు తీసుకొని చూసాడు, సరిగ్గా నెలరోజుల టైం ఉంది - కధ పోటీకి పంపడానికి, ఆలోచనంటూ వస్తే సరిగ్గా వారం చాలు అనుకుంటూ బెడ్ రూం లోకి నడిచాడు. కానీ ఈ పాతికేళ్ళనుండి ఏవో కధలు, సీరియళ్ళు అప్పుడప్పుడు చదవడమేగాని వాటి మీద ధ్యాస పెట్టి చదవలేదు. ఈ సుదీర్ఘ కాలంలో ఎంతో మంది ఎన్నో అద్భుతమైన రచనలు చేసి ఉంటారు, ఎన్నో క్రొత్త వొరవడులు వచ్చి ఉంటాయి - అవేవీ మనం చదవలేదే!

రాత్రంతా అవే ఆలోచనలు. ఎక్కడో చదివాడు, పెద్ద పెద్ద రచయతలందరూ మందు కొడుతూ, సిగరెట్లు కాలుస్తూ రచనలు చేస్తారని. కానీ తనకి ఆ రెండలవాట్లు లేవే? ఉండుంటే కనీసం ఆ ఆర్హతైనా వచ్చేదికదాని ఉస్సూరుమన్నాడు. సగం రాత్రి గడిచాకాగాని నిద్ర పట్టలేదు.

%%%

సూర్యం మర్నాడు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే దారిలో స్టేషనరీ షాపు దగ్గర స్కూటరు పార్క్ చేసి లోపలికి వెళ్ళి కొన్ని తెల్లకాగితాలు, బాల్ పెన్నులు కొనుక్కొని ఇంటికి చేరాడు. అప్పుడే సరిగ్గా కూతురు స్మితని స్కూల్నుండి తీసుకొని సమీర కూడా వచ్చింది.

"అన్ని తెల్లకాగితాలెందుకు, స్మితకి నోటుబుక్స్ కొనేశాం కదా!" అంది సమీర టేబుల్ పైనున్న పేపర్స్ చూసి. సమీర ప్రశ్నకి సమాధానం చెప్పకుండా లోపలకి వెళ్ళాడు సూర్యం.

"కధ రాస్తున్నట్లు సమీరకి చెప్పనా? వద్దులే! ఫస్టు కాపీ రాసి సర్ప్రైజ్ చేద్దాం " అనుకొని, అందరూ పడుకున్నారని నిర్ధారణ చేసుకున్నాకా మెల్లిగా తలుపు దగ్గరగా వేసి హాల్లోకి చేరాడు సూర్యం.

రాత్రి పన్నెండు దాటింది. హాల్లో టేబుల్ దగ్గర నుండి సోఫాలోకి, మళ్ళీ టేబుల్ దగ్గరికి మారుతూనే ఉన్నాడు ఎన్నెన్నో ఆలోచనలు. అసలు కధ దేని గురించి రాయాలి? ప్రేమ-త్యాగం, పగ - ప్రతీకారం, కుటుంబాలు - విలువలు. ఏది ఆలోచిస్తున్నా ఎక్కడో విన్నట్టో, చూసినట్టో అనిపించేదే. అర పేజీ రాయడం, అడ్డంగా కొట్టేసి ఆరుముక్కలు చేయడం. ఒక్కసారి జుట్టు గట్టిగా పీక్కొని అరవాలనిపించింది. కానీ పడగ్గదివైపు చూసి తమాయించుకున్నాడు. ఇక ఈరోజుకి లాభం లేదనుకొని పడక్కి దారితీసాడు.

సూర్యం లేచేసరికి బారెడు పొద్దెక్కింది. గబగబా బాత్రూంలో దూరి, కిచెన్ లోకెళ్ళేసరికి అప్పటికే కాఫీ కలిపేసిన ఛాయలు కనిపించాయి. ఓహో! తను తాగేసిందన్నమాట అనుకొని, ఫిల్టరులో మిగిలిన డీకాషనుతో కాఫీ కలుపుకొని హాల్లోకి నడిచాడు.

సమీర ముభావంగా టీపాయి మీద కూరలు తరుగుతోంది. సూర్యం పేపరు తీసుకొని,"నన్ను లేపాల్సింది సమీ, బాగా లేట్ అయిపోయింది" అంటూ పలకరించాడు. సమీర సమాధానం చెప్పకుండా అక్కడినుంచి లేచి కిచెన్ లోనికి వెళ్ళిపొయింది. ఏమిటి అంత మూడీగా ఉంది? ఏమై ఉంటుందబ్బా? బహుశా రాత్రి తనతో కబుర్లు చెప్పకుండా బాగా లేట్ గా పడుకున్నాననేమో!

"సమీ! రాత్రి కొంచెం ఆఫీసు పని చేసుకోవాల్సి వచ్చింది" అంటూ దగ్గరకు రాబోతున్న సూర్యాన్ని తప్పించుకొని విసవిసా బయటికి వెళ్ళిపొయింది సమీర.

సూర్యానికి అసలు సమీర అలక ఎందుకో అర్ధం కావడంలేదు. ఒక్కసారి తేదీలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. సమీర పుట్టిన రోజు లేదా పెళ్ళిరోజు. తన పుట్టినరోజు మరచిపోయి విష్ చేయని రోజున సమీర పెట్టిన పెంట అంతా ఇంతా కాదు. కానీ ఈరోజు ఆ రెండూ కావే! ఏమై ఉంటుందబ్బా? అనే ఆలోచనలతోటే ఆ రోజు శనివారం కూడా కావడంతో ఇంట్లోనే గడుపుతున్నాడు. ఎలాగైనా సరే కధ కోసం ఈ రోజంతా కూర్చోవాలి అనుకున్న సూర్యానికి, సమీర కధే అంతుపట్టటం లేదు. సాయంత్రందాకా ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఇక లాభంలేదనుకొని ఎప్పటిలాగే బతిమాలే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

కాసేపటికి సమీర నోరు విప్పి కొపంగా "ఎంతకాలం నుంచి సాగుతోంది? ఇంత అమాయకంగా కనిపిస్తావు. పెళ్ళయి పదేళ్ళవుతోంది. ఆరేళ్ళ కూతురు కూడాను, ఇప్పుడు నీకు ఆ పనులు చేయడానికి సిగ్గనిపించడంలేదా? అసలు నీకు నేనేమి అన్యాయం చేసాను? ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్లు ఆఫీసుపనని అబద్ధాలు కూడాను" అంటూ రోజూ టీవి సీరియల్లో వినపడే డైలాగులన్నీ గుక్కతిప్పుకోకుండా సింగిల్ టేక్ లో చెప్పేసరికి, సూర్యానికి అది కలో నిజమో కంఫ్యూజయ్యి ఒక్కసారి చేతిని గిల్లి చూసుకొని నిజమే అనుకున్నాకా,

"సమీ! రాత్రేమైనా పీడకలొచ్చిందా? అంతల్లా టీవీ సీరియల్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పానా" అని సూర్యం పూర్తి చేసేలోగా," "ఆపు! నన్ను చెప్పనీయ్" అని పెద్దగా అరుస్తూ,

"నంగనాచిలా మాట్లాడకు! ఎవత్తది? ఎంతకాలం నుండి సాగుతోంది? ఏవిటీ! బాపూ గీసిన బొమ్మలా ఉందా? దాని కళ్ళు అరవిరిసిన మందారమా? దానిది పిట్ట నడుమా! ఈరొజు నేను కట్టిన చీర రేపటికి నీకు గుర్తుండదు కాని, ఆహాహ! అది ఎప్పుడో ఫ్యాషన్ షో లో కట్టిన చీర మాత్రం నీకంటిముందు తెరచాపలా ఎగురుతోందా! అబ్బబ్బబ్బబ్బ! ఏమేమి వర్ణనలు? సిగ్గులేకపోతే సరి. ఈరోజు తాడో పేడో తేలిపోవాల్సిందే" అని చివాలున లేచి బెడ్రూములోకి పరుగుదీసింది.

అవునూ! ఈ డైలాగులెక్కడో విన్నట్లుందే అని సూర్యం ఆలోచించేలోగా సమీర గుప్పిట్లో కొన్ని కాగితం ముక్కల్ని తీసుకొచ్చి టీపాయిపై పడేసింది. అవి చూడగానే సూర్యానికి ఒక్కసారి రాత్రి తన కధా ప్రయత్నం గుర్తుకొచ్చి దానితోపాటు ఆ ప్రయత్నానికి బలియైపోయిన తెల్ల కాగితాలు, అవి ఎలా సమీర కంటబడ్డాయో తన డిటెక్టివ్ బుర్రతో పసిగట్టి, కధని చెప్పకుండా సస్పెన్స్ థ్రిల్లర్ చేద్దామనుకుంటే, తన కేరక్టర్ నే సస్పెక్ట్ చేసేలా చేసుకున్నానే! ఇప్పుడు ఎలా నిజం చెప్పాలి? చెబితే నమ్ముతుందా లేదా ఇంకా పెద్ద ఇష్యూ చేస్తుందా?

ఇంక ఆగలేక సమీర చేయి పట్టుకొని బలవంతంగా ప్రక్కన కూర్చోపెట్టుకొని మొత్తం జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి అది సరిపోక కూతురుపై ఒట్టు వేసాకా గాని సమీర శాంతించలేదు.

%%%

ఇలా ప్రతిరోజూ అర్ధరాత్రి దాకా పేజీలకు పేజీలు రాయడం ఎక్కడో అసంతృప్తిగా అనిపించడం, చింపేయడం - దినచర్య అయిపోయింది సూర్యానికి.

అసలు ఇన్నేసి కధలు జనాలందరు ఎలా రాసేస్తున్నారు? మొన్ననే రచయత కోబ్రా కి ఒక సంవత్సరంలో వంద కధలు ప్రచురణ పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున సన్మానం చేసారు. తను ఆఫ్ట్రాల్ ఒక కధ రాయడానికే ఇంత కష్టపడుతున్నానేమిటి? అని నిరాశ, నిస్పృహ అలముకున్నాయి సూర్యానికి. కానీ అంతలోనే రచయత కోబ్రా ఎదో ఒక ఇంటర్వ్యులో చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఆయన క్రొత్తలో వ్రాసిన ఎన్నో కధలు తిరుగు టపాలో దర్శనమిచ్చాయని అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా రాయడం మానలేదని. ఆ మాట మంచి టానిక్ లా పనిచేసింది. “ఇంక సమయం లేదు మిత్రమా!” అనుకొని కధ మీద దృష్టి పెట్టాలనుకొని ఒక నిశ్చయానికొచ్చాడు.

రోజూ ఆఫీసు నుండి తొందరగా ఇంటికొచ్చేయడం, ఫ్లాస్కు నిండా టీ పెట్టుకొని అర్ధరాత్రి దాకా కధతో కుస్తీ పట్టడం చేస్తూనే ఉన్నాడు. మొత్తానికి ఒక సుముహూర్తానికి ఒక ప్లాటు దొరకడంతో, కలాన్ని వేగంగా పరిగెత్తించి తెల్లారే దాకా రాసాడు. రాసింది ఒకటికి పది సార్లు చదువుకున్నాడు. కధ బాగానే వచ్చిందనుకొని చిన్న చిరునవ్వు వదిలాడు. మర్నాడే సమీరకి వినిపిద్దాం అనుకుంటూ అక్కడే సోఫాలో పడుకున్నాడు.

ప్రొదున్నే బ్రేక్ ఫాస్ట్ చేస్తూ, "సమీ డార్లింగ్! కధ రెడీ" అని చాలా ఉత్సాహంగా సూర్యం చెబుతుంటే, "అవునా" అంటూ ఆశ్చర్యంగా చూసింది సమీర. అవునని

విజయగర్వంతో తలవూపుతూ "సాయంత్రం తమరికి వినిపిస్తాను. నా కధకి మొదటి శ్రోత నువ్వే" అని బుగ్గమీద చిటిక వేసి ఆఫీసుకి బయలుదేరాడు సూర్యం. ఎప్పుడు ఆఫీసవుతుందాని టైము చూస్తూనే ఉన్నాడు.

ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కాఫీ కలిపి ఒకటి సమీరకిచ్చి ఎదురుగుండా కూర్చొని, రాత్రి రాసిన కధ పేపర్లు తీసుకొని చదవడం ప్రారంభించాడు సూర్యం.

"ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతనికి ఒక అమ్మాయి పరిచయం అవడం, అనుకోకుండా ఆమెతోనే పెళ్లి కుదరడం జరుగుతాయి. కానీ అనూహ్యంగా అతను పెళ్లికి ముందు ఒక హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. తాను చేయని ఒక హై ప్రొఫైల్ హత్యలో బలవంతంగా ఇరికించబడతాడు” అంటూ, కధ చెప్పడం ప్రారంభించాడు.

కధ సగం అవకుండానే, " ఇక ఆపేయ్" అని ఒక్క కేక వేసింది సమీర. అనుకోని ఆ పరిణామానికి సూర్యం ఒక్క సారి ఉలిక్కిపడేసరికి చేతిలోనున్న కాగితాలన్ని కింద పడిపోయాయి.

"ఏమైంది సమీ! అల్లా అరిచావు?" అని అమాయకంగా అడిగాడు సూర్యం.

"అరవక మరేంచెయ్యాలి? సినిమా కధ చెప్పేస్తుంటే, వింటూ ఊ కొట్టాలా? " అంది సమీర.

"సినిమా కధేవిటే? రాత్రంతా నిద్దర ఆపుకొని మరీ రాసిన కధ ఇది" అని కొంత ఉక్రోషంగా అన్నాడు సూర్యం.

"ఇంక కట్టేయ్ దుకాణం, క్రితం నెల్లో రిలీజయిన సినిమా కధ ఇదే. నీకు కాఫీ తో బాటు కాపీ కొట్టడం కూడా బాగా వచ్చన్నమాట " అని మొత్తం కధనంతా వినిపించేసరికి సూర్యం ముఖంలో నెత్తురు చుక్కలేదు. సేం టు సేం - మొత్తం తను రాసిన కధే.

"నన్ను నమ్ము సమీ! నేను సినిమాలు చూడనని నీకు తెలుసుకదా! అదే ఆలోచన నాకెందుకు రాకూడదు?" రెట్టించి అడిగాడు సూర్యం.

"ఆ విషయం నాకు తెలుసు. కానీ బయటివాళ్ళకు తెలియదు కదా? బ్రహ్మండంగా కాపీ కొట్టావనుకుంటారు. ఇంకా నయం నాకు చెప్పావు గాబట్టి సరిపోయింది" అని కొంచెం కోపంతో బాటు వెటకారం కలిపి మిక్సడ్ ఫీలింగ్ వదిలేసరికి, చేతిలోనున్న్ కాగితాలని డస్ట్ బిన్ లో పడేసి మంచమెక్కేసాడు సూర్యం.

%%%

కధ పంపడానికి సరిగ్గా వారం సమయం మాత్రమే ఉంది. పట్టువదలని విక్రమార్కుడిలా సూర్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం మెరుపు లాంటి ఒక ఆలోచన తట్టడంతో రాయడానికి ఉపక్రమించి ఎందుకేనా మంచిదని ఆమర్నాడు ఆఫీసుకి సెలవు మెసేజ్ పంపించాడు.  కధ ఒక కొలిక్కి వచ్చింది. మధ్యాహ్నం టీవీ ముందు కూర్చున్న సమీరని పిలిచి నువ్వు ఖాళీగా ఉంటే కధ వినిపిస్తానని చెబితే, ఇంకా రెండు సీరియల్స్ ఉన్నాయి ముందు అవి అవ్వాలని నిర్మొహమాటంగా చెప్పేసింది.

సమీర సాయింత్రం అవుతుండగా సూర్యం ఎదురుగా కూర్చొని "ఇప్పుడు చెప్పు వింటా" అంది.

అడగడమే తడవుగా వెంటనే మొదలు పెట్టేశాడు సూర్యం. తను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సమీర నుంచి మాత్రం ఏ ప్రతిస్పందన లేదు, కళ్ళు మూసుకొని వినడం తప్ప. చెప్పటం పూర్తయి సమీర మొహం కేసి చూసాడు. ఇంకా కళ్ళుమూసు కొనే ఉంది. ఒక నిమిషం తరువాత కళ్ళు తెరచి ఇప్పుడు చెప్పనా అన్నట్లు సూర్యం వైపు చూస్తూ.

"నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు ఎప్పటినుంచో అనేక రకాలైన రచనలు చదివే ఉంటావు కదా! అందులోఎందరో ప్రముఖలు రాసినవి ఉండచ్చుగదా! కనీసం ఒక్కరైనా హింసని ప్రేరేపించేలా రచనలు చేసారా? “అని సమీర స్కూల్ టీచరు పిల్లలనడిగినట్లు అడుగుతుంటే,

“తను ఒక రచన చేసాడా లేక ఏదైనా దొంగతనం చేసాడా” అని తనమీద తానే అనుమానపడ్డాడు సూర్యం.

“అదికాదు సమీ ఇది ఇప్పుడున్న సొసైటీలో జరిగేదే కదా” అనే సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటే,

"కిందటేడు బెంగులూరు లో ఏం జరిగిందో మరచిపోయావా" అని సమీర గద్దించినట్లు అడిగింది.

అప్పుడు సూర్యానికి వెలిగింది. నిజమే "ఒక రచన ఒక మతంవారి మనోభావా లను దెబ్బతీసాయని, ఆ రచయతను పొట్టను పెట్టుకున్న సంఘటన" తన కళ్ళ ముందు మెదిలి, ఒక్కసారి ఒళ్ళు గగుర్పొడిచింది. తొలిసారి నిజంగా భయమేసింది. ఇంక మారు మాట్లాడకుండా ఆ కధని ముక్కలు ముక్కలుగా చింపి డస్ట్ బిన్ లో పడవేయబోతూ, ఆగి కిచెన్లోకి వెళ్ళి గాస్ స్టౌ వెలిగించి అవన్ని పూర్తిగా కాల్చేసాడు.

%%%

ఆరోజు స్మిత స్కూల్ యానివర్సరి. స్మిత ఒక డ్యాన్స్ ప్రొగ్రాం లో చేస్తొంది.

సాయంత్రం అందరూ కలసి స్కూల్ కి వెళ్ళారు. స్మిత ప్రొగ్రాం ముందుగానే అయి పోయింది. తరవాత ఇంకా నాటికలు, పాటల కార్యక్రమాలు ఉన్నట్లున్నాయి.

ఇంతలో సూర్యం మెల్లిగా సమీర చెవిలో "సమీ! నాకు తలపోటు విపరీతంగా వస్తోంది. ఇంటికెళ్ళిపోతాను, మీరు అన్నీ చూసిరండి" అని చెప్పి ఇంటికొచ్చేశాడు. నిజానికి సూర్యానికి తలపోటేమీ రాలేదు. కధ పంపడానికి ఇంక రెండురోజులు మాత్రమే టైం ఉంది. అతని ధ్యాస అంతా దానిమీదే ఉండటంతో తలపోటు వంకతో ఇంటికొచ్చి, కధ మీద పడ్డాడు.

రాత్రి పదవుతుండగా సమీర, స్మిత ఇంటికొచ్చారు. వస్తూనే సూర్యాన్ని చూసి తలపోటు తగ్గిందా అన్న సమీర ప్రశ్నకు సూర్యం తలూపుతూ రచనలో నిమగ్న మైపోయాడు.

స్మితని పడుకో బెట్టి, సూర్యానికి ఎదురుగా కూర్చుని, అతను వీళ్ళని వదిలి మధ్యలో స్కూల్ నుండి వెళ్ళిపోయాకా జరిగిన కార్యక్రమాల గురించి చెబుతొంది సమీర. సూర్యం ఊ కొడుతున్నాడు కాని అతని ధ్యాస కధపైనే ఉంది.

"ఫిఫ్త్ గ్రేడు పిల్లలు నాటిక వేశారు సూర్యం. ఎంతబాగుందనుకున్నావు? స్నేహం గురించి మంచి మెసేజ్ ఇచ్చారు" అని ఆ నాటిక కధ చెప్పసాగింది.  మొదట అంతగా వినిపించుకోని సూర్యానికి నలుగైదు లైన్లు వినగానే ఒక్కసారి గతుక్కుమని ఎటెన్సన్ లోకి వచ్చాడు.

"సమీ! నువ్వు నిజంగా ఆ నాటకం కధే చెబుతున్నావా?" అని సమీర కళ్లల్లోకి చూస్తూ అడిగాడు.

"అవును ఆ కధే! నీకెందుకు డౌటు?" అని సమీర మళ్ళీ కధ కొనసాగిస్తుంటే,

ఒక్కసారి సూర్యం "ఆగు! ఆ ఫ్రెండుకి ఒక కిడ్నీ ఫెయిల్ అయిందా? ఇంకో ఫ్రెండు దానం చెయ్యడానికి ముందుకొచ్చాడా?"

"అవును సూర్యం! అంత కరక్ట్ గా ఎలా గెస్ చేసావు" అని సమీర అడ గడంతోనే, "ఇలా" అని సూర్యం రాసుకున్న మొత్తం కధ చదివేసరికి, సమీరకి అనుమానం వచ్చింది - ఈ నాటిక చూసే సూర్యం ఇంటికెళ్ళడేమోనని.

ఆ మాటే సూర్యాన్ని అడుగుదామని అనుకొనేసరికి, సూర్యం కాగితాలను సమీర వొళ్ళో పడేసి, రెండు జేబుల్లోనూ చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ ఆఫీస్ రూంలోకి వెళ్ళి తలుపేసుకొని కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారి రచయత కోబ్రా గుర్తుకువచ్చారు.ఇంతకు ముందు రెండు మూడు సార్లు ఆయన్ని కలవడం జరిగింది. వయసు ఎనభైకి దగ్గర పడుతున్నా ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ కబుర్లు చెప్పారు. ఆయన్ని వెళ్ళి కలిసి నా ప్రయత్నాలను ఏకరవు పెడితే ఎలా ఉంటుంది? ఏదైనా సలహా ఇస్తారేమో! పోనీ కొన్ని రోజులు ఆయన వద్ద పనిచేస్తే మెళులువలు తెలుస్తాయేమో! ఒప్పుకుంటారా? ఇలా పరిపరివిధాలుగా సూర్యం ఆలోచనలు సాగాయి. చివరికి ఆయన్ని వెళ్ళి కలవడానికే నిశ్చయించుకున్నాడు. ఆదివారం రోజున ఎప్పుడూ ఆలస్యంగా లేచే సూర్యం,ఆ రోజు ఆదివారమైనా చాలా తొందరగానే లేచి, తయారయ్యి కోబ్రా గారింటికి బయలుదేరాడు.

తలుపు కొట్టగానే, కోబ్రా గారి భార్య వచ్చి సూర్యాన్ని గుర్తుపట్టి, భర్తని కలవడానికి వచ్చాడని ఊహించుకుని, ప్రక్క గదిలోకి వెళ్ళమంటూ దారి చూపించింది.

గదిలోకి ప్రవేశించిన సూర్యం ఒక్కసారి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు. నాలుగు గోడలకి పెద్ద పెద్ద అలమైరాలు. వాటినిండా పుస్తకాలు, అవే కాకుండా రెండు టేబుళ్ళ మీద కూడా పుస్తకాలు. అదొక పెద్ద గ్రంధాలయంలా ఉంది. కుర్చీలో కూర్చుని రాసుకుంటున్న కోబ్రా గారు సూర్యం రాకని గమనించి, కూర్చోమన్నట్లు ఎదురుకుండా ఉన్న కుర్చీని చూపించారు. అంతకుముందే తెలిసి ఉండటంతో కుశల ప్రశ్నలు అయ్యాక, కోబ్రా గారు సిగరెట్ వెలిగించి, ఒక్కసారి దమ్ముపీల్చి, సంభాషణ మొదలుపెట్టారు,

"ఎలా ఉన్నావు సూర్యం, ఏమిటీ ముఖం అలా పీక్కుపోయి నీరసంగా కనిపిస్తున్నావు?

"ఏం చెప్పమంటారు సార్? ఇదీ విషయం" అంటూ తన కధా నిర్మాణ ప్రోజెక్ట్ గురించి పూర్తిగా ఏకరువు పెట్టాడు సూర్యం.

కోబ్రా గారు ఒక్కసారి తల పంకించి "చూడు సూర్యం! కధ రాయాలనే నీ తపన ఉంది చూదు, అది హర్షింపతగ్గదే, కానీ పేపర్లో అచ్చవ్వాలనో లేదా బహుమతి పొందాలనో ఆశ ఉంది చూశావూ, అది మాత్రం దురాశేనయ్యా?" అన్నారు.

ఆమాటలకి సూర్యం ఒక్కసారి ఉలిక్కిపడి "అదేంటి సార్ అంత మాటనేసారు?" అన్నాడు విచారంగా మొహం పెట్టి.

కోబ్రా గారు ఒక్కసారి సూటిగా చూస్తూ "అవునయ్యా! నువ్వే చెప్పావు కదా తెలుగు సాహిత్యం పాతిక సంవత్సరాలనుండి అప్పుడప్పుడు చదువుతున్నానని " అన్నారు.

"అవునండి! ఇంచుమించు అంతే" అంటూ నసిగాడు సూర్యం.

"పోనీ అంతే అనుకుందాం! నీకు గుర్తున్న రచనలు గానీ, రచయతల పేర్లు గాని కొన్ని చెప్పు" అడిగారు కోబ్రా గారు.

ఒక్కసారి బుర్ర గిర్రున తిరిగింది సూర్యానికి.

"అమ్మో! ఈ బౌన్సర్ ఏమిటి నాకు" అని లోపల అనుకోబోయి, యధాలాపంగా పైకి అనేశాడు.

కోబ్రా గారు చిద్విలాసంతో సూర్యాన్నే చూస్తున్నారు "ఏం చెబుతావన్నట్లు".

కొంచెం సేపు గింజుకొని కొంతమంది పేర్లు చెప్పి, ఆయన వైపు ఏదో తప్పుచేసినట్లు చూసాడు.

"నువ్వు నిజంగానే అత్యంత దురాశపరుడవు సూర్యం" అని నిష్కర్షగా కోబ్రా గారు అనటంతో, ఒక్కసారి సూర్యం ముఖం పాలిపోయింది.

"నా దురాశ ఏమిటండి?" అమాయకంగా అడిగాడు సూర్యం.

"కాదా మరి! నీ నోట విన్న పేర్లలో ఒక్కటి కూడా నా మస్తిష్కంలో మెదలడం లేదంటే, వాటి ప్రాచుర్యం ఏమిటో తెలుస్తొంది కదా! నీ తటపాయింపే చెబుతోoది" అవి మఖలో పుట్టి పుబ్బలో మసకబారే రచనలే అని".

“మన తెలుగు భాషలో ఎందరో మహానుభావులు ఎన్నో అద్భుతమైన రచనలను ఆవిష్కరించారు. రకరకాలైన ప్రయోగాలు చేసి వాటి ద్వారా సంఘంలో పరివర్తనకి కారణభూతులయ్యారు. ఎందరికో ఆరాధ్యులయ్యారు. చాలా మంది రచనలే వారి ఇంటిపేర్లుగా స్థిరపడ్డాయంటే వాటి స్థాయి ఊహించుకోవచ్చు. నువ్వు చెప్పినవాటిలో కనీసం అటువంటి పేరు కూడా నీ నోటినుండి నేను వినలేదు. అంటే, నువ్వు వాటిని చదవలేదన్నమాటేగా!” అంటూ అనుమానాస్పదంగా చూసారు సూర్యం వైపు.

“అవునూ కాదన్నట్లుగా” తలూపాడు సూర్యం.

“కానీ నువ్వు నాలుగు రోజులు నిద్రమానేసి, ఏవేవో కాగితం మీద పెట్టేసి రాసిన కధ మాత్రం అచ్చైపోవాలి! అందరూ చదివేయాలి, ఇది దురాశ కాదంటావా సూర్యం?” సూటిగానే అడిగారు కోబ్రా గారు.

“కధలు రాస్తే పేరు వస్తుందనుకుంటే, అందరూ అదేపనిలో ఉంటారు. కానీ రాసిన కధ పేరు తేవాలి. అది రచయతకు ఒక ఉత్ప్రేరకంలా పనిచేసి మరింత ఉత్సాహంతో ఎన్నో ప్రయోగాలు చేయాలనిపిస్తుంది”.

సూర్యం ‘ఊ’ కొట్టడం కూడా చేయకుండా స్థాణువై వింటూనే ఉన్నాడు.

కోబ్రా గారు మాత్రం ఇలా చెప్పుకుంటూ పోతున్నారు….

“సాధారణంగా రచయత స్వానుభవం లేదా తను చూసిన, తెలిసిన జీవితాలలో జరిగే నిజ సంఘటనలే ఇంచుమించు కాస్త అటూ ఇటూగా కధావస్తువులవుతాయి. ఏ సంఘటన రచయిత హృదయాన్ని కదిలించి రసస్పందన కలిగిస్తుందో అది అద్భుత మైన కధాశిల్పానికి మూలం అవుతుంది. అష్టవంకర్లున్న రాతి దిమ్మని శిల్పి నైపుణ్యం ఎంత అందమైన శిల్పంగా మారుస్తుందో అలాగే ఒక కధావస్తువు కూడా రచయత ఆలోచనని బట్టి ఒక అద్భుతమైన రచనగా మలచబడుతుంది. ఇంకో విషయం చెప్పనా? పాటలు బాగా పాడే వాళ్ళకి సంగీతం రానవసరం లేదు. కానీ ఇలాంటి వెసులుబాటు కథల విషయంలో లేదు నాయినా! కథలు బాగా రాయాలనుకొనే రచయితలకు కథాశిల్పం గురించి తప్పకుండా తెలియాలి”

"శిల్పాలు తెలుసుగాని, కధాశిల్పం ఏమిటి సార్? ఎప్పుడూ వినలేదు" అమాయకంగా అడిగాడు సూర్యం.

తప్పకుండా చెబుతాను “కథ ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి? పాత్రలను ఎలా మలచాలి? ఎటువంటి నేపథ్యంలో చెప్పాలి? ఎటువంటి కంఠస్వరం ఉపయోగించాలి? ఎల్లాంటి దృష్టికోణంలో చెప్పాలి?” అన్న ప్రశ్నలకి సమాధానమే కథా శిల్పం అంటే! కథా శిల్పం అర్ధం చేసుకోటానికి తేలిక పద్ధతి ఒకటి ఉంది. అది ప్రముఖులు రాసిన కథల్ని మంచి విమర్శకులు చేసే విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవడం.

అలాగే తెలుగులో మొదటి తరం రచయితలుగా ప్రముఖులైన రావి శాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, కాళీపట్నం రామారావు, మధురాంతకం రాజారాం, బుచ్చిబాబు, శ్రీపాద, చాసో, గోపీచంద్‌, పాలగుమ్మి పద్మరాజు మొదలైన వారి కథలను చదివితే, కధా శిల్పం అన్నది అవగాహనకు వస్తుంది. ఇక ముళ్ళపూడి విషయానికొస్తే, బాపూ గీసిన బొమ్మలే ఎన్నో కధలకు వస్తువులయ్యాయి.

అంతే కాకుండా ఇక్కడ నీకింకో విషయం చెప్పాలి,  శ్రీపాద వారు "అనుభవాలు జ్ణాపకాలున్నూ" లో చెప్పినట్ట్లు పూర్వపు రచయతలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారు వ్రాసిన కధలకు లేదా నవలలకు ఎన్ని ప్రతులు కావలసినా, అన్నీ చేతితో వ్రాయడమే. కాలి నడకన వెళ్ళి అందరికీ పంచిరావడమే. ఇప్పటి సౌకర్యాలు వారెకెక్కడ? కొంతకాలానికి అచ్చేసే రోజులొచ్చినా, డబ్బేదీ? దానికీ పరాధీనమే. ఎవరో అన్నట్లు, రచయత తన డబ్బుతో తాను అచ్చువేసుకుంటే అంతకంటే హీనం లేదు. ఒక దశాబ్దం క్రిందటి వరకూ పాఠకులు ముద్రణా సంస్థలతోపాటు రచయతలందరినీ అందలమెక్కించారు. పత్రికలన్నీ పోటీపడి కధలను ప్రచురించి రచయతలను ప్రొత్సహించారు.

ఇప్పుడు చూస్తుంటే అవన్నీ గత వైభవాలుగా మిగిలాయి. అనేక పత్రికలు మూలపడ్డాయి. కారణాలు అనేకం. వాటిని చర్చిస్తూ సమయం వృధా చేయడం కన్నా,తక్షణ కర్తవ్యం ఏమిటంటే “పుస్తకపఠనం” పెరిగేలా చేయాలి. ముఖ్యంగా యువతలో ఆ చైతన్యం తీసుకురావాలి. అప్పుడే రచయతలకు తిరిగి మంచి రోజులొస్తాయి. నిన్ను బోరు కొట్టించకుండా ఇంకో చిన్న విషయం చెప్పి ఆపేస్తాను. పూర్వం ఆంగ్ల దేశంలో జనాలు పుస్తకం ఒక్కొక్క పేజీ చదవగానే చింపేసేవారట. ఎందుకంటే పునఃముద్రణలు జరిగి రచయతలు, పబ్లిషర్లు బ్రతుకుతారని. మనం అంత త్యాగం చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ, ఎంతో సమయం వెచ్చించి, అనేక కష్టాలతో సహవాసం చేసి, కూర్చి, అద్భుతమైన కధలను ఆవిష్కరించిన మహోన్నతులు ప్రస్తుతం మనమధ్య లేరు. కానీ వారు విడిచి వెళ్ళిన అత్యంత విలువైన సాహితీ సంపద ఇబ్బడిముబ్బడిగా ఉంది. ఆ అపూర్వ సాహిత్యాన్ని మనం చదివి పదిమంది చేత చదివించడం బాధ్యత మాత్రమే కాదు కర్తవ్యం కూడాను. ఇదే మనం వారి కిచ్చే నివాళి. ఈ విధంగానైన ఎంతో కొంత వారి ఋణాన్ని తీర్చుకుంటున్నామనే తృప్తి. ఉంటాను” అంటూ కళ్ళజోడు టేబుల్ పైన పెట్టి, అర్ధమైందా అన్నట్లు సూర్యం కేసి చూసారు.

సూర్యం మొహం పాలిపోయింది. కానీ ఎంత నగ్నసత్యం చెప్పారు పెద్దాయన. కొరడాతో కొట్టినట్లైంది ఆ మాటలకి, సిగ్గుతో కుచించుకుపోయాడు తన కోరికను తల్చుకుని. ఒక్కసారి తనలో గూడుకట్టుకున్న అసంతృప్తి, దూదిపింజలా బయటికి ఎగిరిపొయింది. దాని స్థానంలో ‘నేను చదవాలి పదిమంది చేత చదివించాలి’ అన్న ధృఢ సంకల్పం మనస్సునిండా ఆవహించింది. లేచి కోబ్రా గారికి రెండు చేతులు జోడించి నమస్కరించి ఇంటివైపు నడిచాడు.

మరునాటినుండే సూర్యం దినచర్యలలో ‘ఋణం’ తీర్చుకొనే భాగం (బాధ్యత) గా ‘పుస్తకపఠనం’ ఒక  క్రమం తప్పనిదైంది.

********

Posted in December 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!