మనిషి పుట్టుక ఎంతో మహత్తరమైనది. మనిషిగా ఈ గడ్డమీద కాలుమోపిన ప్రతి ఒక్కరి జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది, ఉండాలి. ఆ విషయాన్ని అవగతం చేసుకున్న వారు వారి పుట్టుక యొక్క ఆంతర్యాన్ని గ్రహించి తదనుగుణంగా వారి జీవన శైలిని మలుచుకుని తమ జీవితసారాన్ని అర్థవంతంగా మలిచి సార్ధకతను చేకూరుస్తారు. అటువంటి వారినే మనం మహాపురుషులంటాము. నిరాడంబరులైన అటువంటి పుణ్య పురుషులు తమ జీవితాలనే అనుభవాలుగా, తృష్ణతో, తపనతో, సేవాతత్పరతతో సమాజ పోకడలను, అందులోని లోటుపాట్లను ఎత్తి చూపుతూ ప్రజల జీవితాలలో చైతన్యం రగిలించి అభ్యుదయ అభివృద్ధి పథం వైపు శ్రమ తెలియకుండానే నడిపించి, మానసిక స్థైర్యంతో సమస్యలను ఎదుర్కొనే విధానాలను సమాజానికి అందిస్తారు. తమ రచనల ద్వారా అటువంటి సామాజిక చైతన్యానికి దారి చూపిన మహనీయుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. రావూరి భరద్వాజ నేటి మన ఆదర్శమూర్తి.
1927 జూలై 5 న కోటయ్య, మల్లికాంబ దంపతులకు జన్మించిన మన భరద్వాజ గారి బాల్యమంతా గుంటూరు జిల్లా, తాడికొండలో గడిచింది. చిన్నప్పటి నుండే ఎన్నో కష్టాలను చవిచూశారు. అతి చిన్న వయసులోనే తాడికొండ చెరువు ప్రక్కనే చెట్టు క్రింద, ప్రక్కనే ఉన్న గుడిలో నివసించిన అనుభవాలు ఆయనకు లభించాయి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులున్ననూ వెరవక నిజాయితీగా తన జీవన సమరాన్ని కొనసాగిస్తూ ఎన్నడూ తప్పుడు పనులను చేయకుండా రోజువారి కూలీగా, హోటల్ లో సర్వర్ గాను ఇలా ఎన్నో ఇబ్బందులను అధికమించారు. కారణం, తన జన్మకు ఒక సార్ధకత చేకూర్చాలనే బలమైన సంకల్పం అంతర్లీనంగా ఆయన ఆలోచనలలో ఉండటం, అందుకు సరిపోయే ఆత్మస్థైర్యం తన వద్ద ఉండటమే.
మూడు మెతుకులు కూడా లేని రోజుల్లో మూడు రూపాయలు ఇచ్చి తనను సాహిత్య రంగం వైపు ప్రోత్సహించిన తన మిత్రునికి కృతజ్ఞతాపూర్వకంగా తనకు జ్ఞానపీఠ అవార్డును సంపాదించిన ‘పాకుడురాళ్ళు’ నవల ఆ మిత్రునికే అంకితమిచ్చిన గొప్ప వ్యక్తి మన భరద్వాజ గారు. ఇలా ఎన్నో మానవతా కార్యాలను, అడక్కుండానే సహాయాన్ని అందించి తన మనస్సు చెప్పిన మాటను ఆచరించి చూపిన మహా మనీషి. తన జీవితంలో తారసపడి తనకు సహాయం చేసిన, సలహాలను ఇచ్చిన ప్రతి ఒక్కరినీ జీవితాంతం గుర్తుపెట్టుకున్న నిజమైన మానవతావాది.
కత్తి కంటే కలం గొప్పది అనే సిద్ధాంతాన్ని నమ్మి తన రచనల ద్వారా సమాజంలో మార్పును చైతన్యాన్ని ఆశించి మానవాళి మనుగడకు, మానవత్వానికి మార్గదర్శకునిగా నిలిచి సమాజ పోకడల మీద చక్కటి అవగాహనతో, తన సాహిత్య పటిమను ఉపయోగించి బడుగు వర్గాల నిజజీవిత కష్టాలను స్వానుభవంతో అర్థం చేసుకుని వారి అభ్యున్నతికి పాటుపడ్డాడు. కనుకనే జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారానికి అర్హత సంపాదించారు. నేటి వరకు విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణ రెడ్డి తరువాత ఆ పురస్కారాన్ని పొందిన మూడవ వ్యక్తి మన భరద్వాజ గారు మాత్రమే.
భరద్వాజ గారు తన జీవన గమనంలో 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించాడు. జమీన్ రైతు, దీన బంధు తదితర పత్రికలలో పనిచేసి ఆ తరువాత ఆకాశవాణిలో చేరి అక్కడే పదవీ విరమణ చేశారు.
రావూరి భరద్వాజకు 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన బహుముఖ కృషికి గుర్తుగా 2012 వ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం ఆయనను వరించింది. ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు కానీ ఏనాడు ఆయన వాటి కొరకు అర్రులు జాచలేదు. ‘ఒక చిరునవ్వు ముందు, ఒక దయామయమైన చూపు ముందు, ఒక అద్భుతమైన, ఆత్మీయ కరచాలనము ముందు ఏ పురస్కారాలు, ప్రశంసలు సరిపోవు.’ అని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ లో భరద్వాజ గారు చెప్పారు. 1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున ఆకలితో అలమటించి అన్నం దొరకక రెండు దోసిళ్ళ నీరు తాగి కడుపునింపుకున్న ఆయన తన అనుభవాలు, తన చుట్టూ రోజూ చూస్తున్న సమాజ కష్టనష్టాలను ప్రత్యక్షంగా గమనించి, వాటికి అక్షర రూపం కల్పించి సమాజానికి అందించిన గొప్ప సాహితీ నిష్ణాతుడు. చదువు లేకపోయినా సమాజమే విద్యాలయంగా మలుచుకొని నాటి సామాజిక స్థితిగతులను, వాస్తవ పరిస్థితులను తన రచనల ద్వారా ప్రపంచానికి ప్రత్యక్షంగా చూపించిన మహోన్నత వ్యక్తి భరద్వాజ గారు.
https://www.youtube.com/watch?v=f3m1Sgy2etg
తన స్వచ్ఛమైన, పవిత్రమైన, నిజాయితీ ధర్మాలే ఆయనకు ఎంతో మానసిక ధైర్యాన్ని సమకూర్చాయి. తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక కాంతిపుంజంగా విలసిల్లిన డాక్టర్ రావూరి భరద్వాజ 2013 అక్టోబరు 18 మరణించారు. ఇతరులకు సహాయం చేయాలనే తలంపు మనలో ఉన్నంతవరకూ మనిషి జీవితానికి ఒక విలువ ఉంటుందనే సూత్రాన్ని నమ్మి తన జీవితం అంతా ఆ సూత్రాన్ని ఆచరించి చూపారు. అట్లని ఆయన అత్యంత ధనవంతుడు కూడా కాదు. కానీ విలువకట్టలేని ఆత్మస్థైర్యం, సేవా దృక్పథం, కష్టాలలో ఉన్నవారిని ఆదుకునే మనస్తత్వం ఇవే ఆయన అస్తిత్వాలు. కనుకనే ఈ నిజమైన మానవతా మూర్తి ఎంతోమందికి ఆదర్శ ప్రాయుడయ్యాడు.