ప్రేమ
మొక్కకు
అనుమానం వేరు పురుగు,
అవమానం చీడ పురుగు.
గీత
గీసుకోనేదీ మనిషే,
చెరుపుకొని
దాటిపోయేదీ మనిషే.
ఒకసారి కొబ్బరి చెట్టును
సాక్ష్య మడిగాడు దేవుడు
తెలిసీ చెప్ప నందుకే
కొబ్బరికాయల తలలు పగలటం.
కఠోర సత్యాన్నయినా
సున్నితంగా చెబుతుంది
అందుకే తమలపాకుకు
పూజలో అగ్ర తాంబూలం.
వినాయకుడు కూడా
బాగా అలిసిపోతున్నాడు
గొందులలో అవతారా లెత్తలేక!
భారీ కోర్కెలు తీర్చలేక.
అటల్ జీ, నీకు
రాజకీయం ఒక పువ్వు,
నేడు అది
జనం చెవిలో పువ్వు!
చేతిలో కొడవలితో
నీవు కనిపిస్తే చాలు -
సాయంత్రం సూర్యుణ్ణి నరికింది
నువ్వే అని నిరూపిస్తాడు.
మూతతో పోసేలా
వాగ్దానాలు చెయ్యాలి,
గెలవటానికి
సీసాలు పగలగొడుతున్నారే!
వాడు చాలా మంచోడు
ఎక్కడా కన్నాలు పెట్టడు>
చీమ కన్నం ఉన్నా
సింహాన్ని బయటకు తీస్తాడు.
చెలమ
తవ్వుతున్నాను,
భూమిని పేల్చేస్తున్నానని
నామీద నిందలు.