Menu Close

గ్రంథ గంధ పరిమళాలు

సింహరాజ్ గారి ‘పంచతంత్రంలో ప్రపంచతంత్రం’

(సంస్కృత శ్లోకాలకు ఆంధ్ర పద్యానువాదం వ్యాఖ్యానసహితం)
సంస్కృత మూలం : విష్ణు శర్మ రచించిన “పంచతంత్రం”

గత సంచిక తరువాయి »

ఉపశీర్షిక 11: కోట – ప్రాముఖ్యము:

(1) స్థల దుర్గాలు (2) జల దుర్గాలు (3) గిరి దుర్గాలు.  వీటిని గూర్చి చెప్తూ, సింహరాజ్ గారు మనదేశంలో గిరి దుర్గాలే ఎక్కువన్నారు. ఆంద్ర లోని ఉదయగిరి, తెలంగాణా లోని గోల్కొండ, కర్నాటక లోని హంపిని పేర్కొన్నారు. భూగర్భ మందిరాలు, సొరంగాలు, కోటలు – ఇవి రక్షణకు ఉపయోగపడతాయని చెప్పి, రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనుల బాంబు దాడులను ఇంగ్లాండు భూగర్భ సొరంగాల వల్ల ఎదుర్కొన గలిగినదని గుర్తు చేశారు .

4. వివిధ లౌకిక విషయాలు

“లోభం వల్ల లాభం లేదు” దీనికి ఒక కోతి కథ సింహరాజ్ చెప్పి మన కళ్ళు విప్పమన్నాడు. లోభాన్ని, తృష్ణను వదిలి తృప్తి పొందకపోతే

“సప్త ఖండ మండిత ధరాజానికైన

త్రుప్తి లేనిదె సౌఖ్య సంప్రాప్తి లేదు”

అని విష్ణుశర్మ సంస్కృతంలో చెప్పిన తీర్పును, తెలుగు వారికి మన సింహరాజ్ చక్కటి తెలుగులో వివరంగా విపులీకరించారు.

శీర్షిక 13: “ధనమేరా అన్నిటికీ మూలం” ఈ విషయానికి సంబంధించిన ఆణిముత్యాల వంటి పద్యాలు-

౧) ధనముచే సాధ్యపడని ధరణి లేదు (పేజి 194)

౨) ఎట్లు ఆహారము వలన ఇంద్రియములు….

౩) చిన్న చిన్న సెలయేళ్ళు అన్ని కలిసి… (పేజీ 198).

దానం మానవుని జీవన వాహనానికి కావాల్సిన ఇంధనం. అందుకే దాన్ని ఎంత మెళకువగా సంపాదించాలో చెప్తూ అనేక విధాలైన సూచనలను సూచించాడు రచయిత.

శీర్షక 32: అష్టవర్షా భవేత్ కన్యా (పెండ్లి కెదిగిన అమ్మాయి).

పై సూక్తికి ఒక సుదీర్ఘమైన వివరణ సమకూర్చారు సింహరాజ్ గారు.

ఆడపిల్ల ఎనిమిది సంవత్సరాలకే పెళ్లీడు కొచ్చిన కన్య అవుతుంది. ఈ సిద్ధాంతం ఆధారంగానే బాల్య వివాహాలు భారతదేశంలో వీరవిహారం చేశాయి. ఇప్పుడు గూడా కొన్ని చోట్ల విహరిస్తూనే ఉన్నాయి. దీన్ని గూర్చి చెప్తూ అనువాదకర్త-

“లక్ష్మీ, సరస్వతి మొదలైన స్త్రీ దేవతామూర్తులకు, సీత, సావిత్రి వంటి సాధ్వీమణులకు కూడా బాల్య వివాహాలు, వయో పరిమితులు లేవు. ఎనిమిదేళ్ళకే అమ్మాయి కన్య (స్త్రీ) అవుతుంది, అనే శాస్త్రం ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ ఇలాంటివి పుట్టడం సులభమే. కానీ తెరమరుగు కావడానికి శతాబ్దాలు పడతాయి.” అని ఎన్నో వివరాలను ఉదాహరణలతో వివరించారు.

శీర్షిక 44; ఆశ్వవైద్యం.

పూర్వకాలంలో గూడా మానవ వైద్యంతో పాటు, పశుపక్ష్యాదులకు, ముఖ్యంగా గోవులు, అశ్వాలు మొదలైన వాటికి వైద్యం చేసేవారని చెప్పి అశ్వానికి ఒళ్ళు కాలితే కోతులను చంపి వాటి కొవ్వు “వేకువకు ముందు చిక్కనౌ, చీకటివలె..” దట్టంగా గాయానికి పట్టిస్తారని చెప్పడం జరిగింది. ప్రస్తుత కాలంలో కూడా పరిశోధనార్థం కోతులు, ఎలుకలు, గినీ పందులు, మొదలైన జంతువులను చంపుతున్నారని సింహరాజ్ ఆవేదన చెందారు.

సృష్టి రహస్యం (43), దాతృత్వ వైభవం (47), అతిధి దేవో భవ (48), వలపు రేపెడు తలపులు (30), దుష్ట నారీ విలాసము (28) ఇలా ఎన్నో విషయపూర్ణమై, సులభశైలిలో అనువాద శీర్షికలను అందించిన సింహరాజ్ అభినందనీయులు.

మూలకథలో సంస్కృత శ్లోక రూపంలో ఉన్న సూక్తులను, తెలుగులోకి అనువదించే సందర్భంలో వాటిని తన వ్యాఖ్యానంతో చిన్న చిన్న కథల రూపంలో చదివే వారికి ఎక్కడా విసుగు రాకుండా, అంతా ఒకేసారి చదవాలనే ఆసక్తి పాఠకులకు కలిగించడంలో సింహరాజ్ గారు నిజంగా కృతకృత్యులయ్యారు.

చివరగా..

చెలిమి కలిమి యొక్క బలిమి-

“బ్రతుకు కొనగడియల హితులు గెడలనున్న

చావబోవువాడు సంబరపడు

అట్టి హాయివలన అసులు నిల్వగ వచ్చు

కాని యెడల మిత్తియైన తనుపె”

సహృదయుడు అంటే ఆంతరంగిక మిత్రుడు, స్నేహితుని వల్ల, స్నేహితుని రాకవల్ల చావబోయే వాడు గూడా బ్రతకవచ్చు, లేక చనిపోయినా తృప్తిగా చనిపోవచ్చు. అన్న ఈ పద్యం స్నేహానికి పరాకాష్ఠ.

డా. శింగరాజు రామకృష్ణ ప్రసాదరావు (సింహరాజ్) గారు, బహుభాషా కోవిదులు, సహృదయులు. చక్కటి ధారా కలిగిన కవి. వారి ద్వారా ఎన్నో పదాలు మనకు తెలుస్తున్నాయి. ఉదా : ఉక్కివులు = దుర్మార్గులు; సేదువ = శ్రమ, స్వాదు = తియ్యన; ఈలువు = శీలము; వీరవు =సేవకుడు; మారుడు = శత్రువు; పుష్పలిట్టు = తుమ్మెద ఇలా…

వారి కలం ద్వారా మరిన్ని గొప్ప, ఉపయోగకరమైన రచనలు జాలువారతాయని ఆశిద్దాం.

ఉత్తమ గ్రంథ పఠనం  – గొప్ప ధనం. వచ్చే సంచికలో మరొక గ్రంథ విశ్లేషణతో మీ ముందుకు వస్తాను.

Posted in March 2019, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!