Menu Close

page title

స్వర్గలోకపు పక్షి

Paradise Bird

స్వర్గలోకపు పక్షి లేదా ‘సూపర్బ్ బర్డ్ ఆఫ్ పారడైజ్’ ఒక రకమైన పక్షి.  దీని  శరీరం నల్లగా ఉంటుంది. శరీరం మీది నెమలి కంఠం రెక్కలు ఎంతో అందంగా  ఉంటాయి. పైగా అవి మెరుపులుచిందిస్తాయి.  నెమలి గుండ్రంగా తిరుగుతుంటే  ఎలా రంగులు మెరుస్తుంటాయో అలా ఈ స్వర్గలోకపు  పక్షి రెక్కలు మెరు స్తాయి.  వాటికి తోడు రంగు రంగుల ఈకలు ఇంకా అందాన్నిస్తాయి.  ఇవన్నీ 'సూపర్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్' పక్షికి గల ప్రత్యేక గుణాలు. అందుకే ఇది  స్వర్గలోకపు పక్షిగా పిలువబడుతున్నదేమో!

స్వర్గలోకపు పక్షి అని పిలువబడే ఈ పక్షి ప్యారాడిసైకల్ కుటుంబానికి చెందిన ‘లోఫోరిన’[Lophorina] జాతి పక్షి అని తెలుస్తున్నది. ప్రపంచంలోని అందమైన పక్షుల జాబితాలో ఇది ప్రధమురాలు అనవచ్చు. నెమలితో అందాల పోటీకి ఇది ముందుంటుంది. దీన్ని చూడాలంటే ‘న్యూగునియా అడవుల’కి వెళ్ళాల్సిందే మరి.

Paradise Birdమగపక్షులు  పదంగుళాల పొడవుంటాయి. చాలా అందంగా ఉం టాయి.  ఇవి ఆడవాటిని ఆకర్షించడానికి చేసే విన్యాసాలు చాలా తమాషాగా ఉంటాయి. అవడానికి పక్షే అయినా దీని రూపం వేరుగా ఉంటుంది. వీటికి వెనక ఉండే నల్లని రెక్కలతో పాటు ప్రత్యేకంగా ముందు భాగంలో ఆకర్షణీయమైన నీలం-ఆకుపచ్చ రంగులో  రెక్కల్లాంటివి ఉంటాయి. అదే రంగులో తలపై అటూ ఇటూ కిరీటంలా చిన్న రెక్కలుంటాయి. వెనకేమో నల్లగా మెరిసే ఈకలతో ఉన్న పెద్ద రెక్కలుంటాయి. ఇంచుమించు మగనెమలి  రంగులో ఉంటాయి. మగ, ఆడపక్షుల రంగుల్లో భేదం ఉంటుంది. మగ పక్షులు చాలా అందమైనవి. ఆడపక్షులు  కాస్త  ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఆడ పక్షులను ఆకర్షించడానికి మగ పక్షులు గట్టిగా అరుస్తాయి. ఆడపక్షి సమీపించగానే ముందున్న రెక్కలు వెడల్పుచేసి, నెమ్మదిగా తలపై నున్న నీలం రంగు చిన్ని రెక్కలను పై కెత్తుతాయి.  ఆ తర్వాత వెనుకున్న రెక్కలను కూడా పూర్తిగా విప్పుతాయి. అచ్చంగా నెమలిలా కనిపించడమే కాదు, ఆడవాటి చుట్టూ తిరుగుతూ లయ బద్ధంగా నాట్యం కూడా చేస్తాయి. ఇలా చేస్తున్నపుడు  ముందు నుంచి చూస్తే దీని రెక్కలన్నీ వెడల్పాటి పింఛంలా కనిపిస్తాయి. తమ కౌగిలిలోకి ఆహ్వానించడమన్నమాట.

తలపై ఉన్న చిన్ని రెక్కలు కళ్లలా, వాటి రూపమంతా కలిపి చూడ్డానికి కార్టూన్ బొమ్మ ముఖంలా కనిపిస్తుంది. అందుకే వీటిని 'స్మైలీ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్' అని కూడా పిలుస్తారు.

అందమైన పక్షులన్నింటిని కలిపి 'బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్' అంటారు. అంటే స్వర్గ లోకపు పక్షులన్న మాట. స్వర్గం ఎంత అందంగా ఉంటుందో తెలీదు. అక్కడి పక్షులు ఎంత అందంగా ఉంటాయో కూడా మనకు తెలీదు. ఐనా మనకు స్వర్గలోక మంటే అంత ప్రేమ. అందుకే అందంగా ఉన్న వాటిని స్వర్గ లోకపు వస్తువులతో పోల్చుకోడం రివాజు.

ఎక్కువగా న్యూగునియా అడవుల్లో ఉండే వీటిల్లో 43 జాతులుంటా యంటే ఆశ్చర్యమే మరి. వీటిల్లో మగవి ఎక్కువగా ఎత్తులో ఉండే చెట్ల పై ఉంటుంటాయి. ఆడ పక్షులు మాత్రం సాధారణంగా కిందే ఉంటాయి. ఎప్పుడో గానీ ఆడపక్షులు, మగపక్షులు కలుసుకోవు. హాయిగా స్వతంత్ర జీవనం  సాగిస్తుంటాయి. చిన్న చిన్న కీటకాలు, పురుగుల్ని తింటూ బతుకుతాయి.

మానవుల్లాగే  పిల్లల బాధ్యత ఆడవాటిదే. గుడ్ల నుంచి ఇరవై రోజుల్లో  పిల్లలు బయటకు వస్తాయి! వీటి అందమైన రెక్కల కోసం మానవులు వీటిని నిర్ధాక్షిణ్యంగా  చంపేస్తున్నారు. మనిషికి స్వార్ధంతప్ప మరేమీలేదు కదా! తమ గృహాలంకరణల కోసం అన్నింటినీ చంపడమే. వీటి అందమే వీటికి శత్రువై ఇప్పుడు అంతరించి పోయే దశకు చేరు కున్నాయి.

Posted in March 2019, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!