Menu Close
Oke Paddemu Rendu Bhaashallo

మన తెలుగు అజంత భాష. అందమైన అక్షరాల భాష. అనంత సొగసులూరు అమృతధార. రుచిర సంగీత సాహిత్యాల సుమధుర క్షీరధార.

కొందరు సాహితీ వేత్తలు మన తెలుగు భాషను రెండు రకాలుగా విభజించారు. ఒకటి ఆంధ్ర భాష, రెండవది తెలుగు భాష. వింతగా ఉంది కదూ! నిజమేననిపిస్తుంది. సంస్కృత పదాలతో కలిసిన భాష, ఆంధ్ర భాషని, అచ్చతెలుగు దేశియాల మాటల భాషను తెలుగు భాషని అంటున్నారు. సంస్కృతం నుండి ఏర్పడిన తెలుగు మాటలు అందంగాను, మధురంగాను ఉంటాయంటారు కొందరు. అచ్చ తెలుగు మాటలు మొరటుగా ఉంటాయంటారు మరికొందరు.

నిజమే. మొదటినుండి అలవాటు పడిన మాట అన్నము, భోజనం వినసొంపుగానే ఉంటుంది. క్రొత్తగా ఎవరైనా కూడు, బువ్వ తింటావా అంటే వింతగా, చెత్తగా వుంటుంది. అమ్మను అమ్మంటేనే అందం. మాతా, మాతాశ్రీ అంటే అదోరకంగా వుండదామరి. పక్షి అంటే అందం. పిట్ట అంటే ఎబ్బెట్టు కదా! అలాగే ‘వైట్ రైస్’ వడ్డించు అంటే గొప్ప, కూడు పెట్టు అంటే ఎబ్బెట్టు. ఇదీ ఈ నాడు మన తెలుగు వాళ్లకు పట్టిన భాష తెగులు. కాదంటారా?తెలుగు నుడి పది కాలాలపాటు బ్రతకాలంటే అందరూ ఈ విషయాన్ని ఆలోచించగలరని మనవి.

ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. ప్రస్తుతం మన తెలుగువారమంతా మాట్లాడే, వ్రాసే, వాడే తెలుగు మాటలు అసలు తెలుగు మాటలు కావు. మన తెలుగు మాటలలో ఎనభై శాతం సంస్కృత పదాలు, ఇరవై శాతం మాత్రమే అచ్చ తెలుగు మాటలు ఉంటున్నాయని మనలో ఎంతమందికి తెలుసు? ఇంతెందుకు, నేను ఇప్పుడు వ్రాస్తున్న ఈ వ్యాసంలో కూడా ఎక్కువగా సంస్కృత ప్రభావ పదాలే ఉంటున్నాయి. అవి తరతరాలుగా మన జీవనంలో, సాహిత్యంలో కలిసిపోయాయి. ఇప్పుడు వాటిని సంస్కృత, తెలుగు మాటలుగా విడగొట్టడం హాస్యాస్పదంగానే ఉంటుంది. కాని తెలుగు అభిమానిగా ఏదో తెలియని అలజడి, భాషపై అనుగరము.

ప్రస్తుత విషయం ఏమిటంటే గతంలో మన కవులు పద్యాలను ఎక్కువ సంస్కృత పదాలతోనే వ్రాసినారు. నన్నయ 80% సంస్కృతం, 20% తెలుగు వాడినారు. శ్రీనాథుడు అంతే. పోతన 40% సంస్కృతం, 60% తెలుగు వాడినారు. నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు, తెలగనార్యుడు 20% సంస్కృతం, 80% తెలుగును వాడినారు.

కనుక పద్యాలను, కవితలను, కావ్యాలను, అచ్చతెలుగు మాటలలో వ్రాయడం చాలా కష్టం. కత్తిమీద సాము వంటిదని కొందరి అభిప్రాయము.

అయితే ప్రస్తుతం ఇక్కడ ఒకే పద్యాన్ని, అదే భావంతో, సంస్కృతం కలసిన తెలుగుతోనూ, అసలు సంస్కృత పదాలు రాని అచ్చ తెలుగులోనూ మీ కోసం అందిస్తున్నాను.

ఆంధ్ర భాష :

ఉత్పలమాల

ఈ జగమందునా జననమేగతి సంభవమయ్యెనంటి మా
యా జలమాతపీఠమున ఆ తిమిరంబున నాదు నామమే
దీ జననంబు నొందుటకు తెల్వదె హేతువు బుద్ధి జూడనే
యో జనెఱుంగనైతినిల, యోనిజ కారకుడెవ్వడాత్మ భౌ

తెలుగు భాష :

ఈ ఎగమందు నేనిటుల నేతగు పుట్టితినయ్య అమ్మందున్
ఆ ఎగు ఉమ్మనీటినట, ఆ ఇరులందున పేరు యేమిటో
ఈ ఎరుకెవ్వరై ఎదరినిచ్చట తెచ్చిన సాకు యేమిటో
నే ఎటులన్ తలంచినను నిక్కము తెల్వదె వేలుపెవ్వరో

{ఎగము = జగము; ఇరులు = చీకటి; ఎదరి = ఆత్మ; వేలుపు = దేవుడు; ఎరుక = జ్ఞానము}

Posted in March 2019, వ్యాసాలు

1 Comment

  1. ASN Murthy

    తెలుగు పద్యంలో విసంధులజోలికి పోకపోయినా, మొదటిపాదం చివర గణద్వయభంగం; రెండవ, మూడవ పాదాలలో “పేరు”లోని, “సాకు” లోని ఉకారం మీద యడాగమాలు, నాల్గవపాదంలో “ఎటులన్ తలంచినను” లో ద్రుతం మీది పరుషమైన త – వీటిని సవరిస్తే బాగుండును.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!