Menu Close
Chaduvu Katha

ఒరే నరిశిమ్మ గా పోచమ్మత్త ఇంటికివోయి గొన్ని పాలు దేపో బిడ్డా మీ అయ్యా చాయ్ తాగి పొలం బోతడు.

పిల్లగాన్ని లాపకు, పొలంకు ఒంగా అడా ఓటళ్ల తాగి పోతాలే, ఆడు మల్ల బడికి వొవాలే.

ఎందయ్యో పొద్దుగూకుల బడి బడి అంటవు ఆడు సదివి ఉజ్జోగం సెయ్యాలా, వూర్లెలాలా. ఆ సదులు సట్ట బండలు మనకెందుకు. గా దొర గోజలు గాయనికి పంపితే నెలకు ఇన్నూరు రూపాలు ఇత్తన్నడు. నా మాటిని ఇంకో యాబై రూపాలు ఎక్కియ్యమని గీ పోరన్ని ఆ దొర కాడ గోజలు మేపనియకి వెట్టు. లేనివొని ముచ్చట్లు సెప్పకు. అయిన మీ అయ్యా ఎంజదివిండు, నువ్వేం సదివినవు, తింటాలేమా, పంటలేమా, బతుకుత లేమా, ఇగ ఆడు బతకడా?

ఆ బతుకు తాడుదియ్యి. ఇటు పిల్లేమో పెరిగి గూసింది. దానికి లగ్గం జెయ్యాలా, పటేల్ తాన దెచ్చిన బాకీ వడ్డిమీద వడ్డీ పెరిగివొవట్టే. ఇన్నేండ్ల నుంచి ఆ మడి సెక్కను నమ్ముకుంటే  పొట్ట కు బట్టకు బతికినం. పిల్లకు  పెండ్లి గుదిరితే ఆ ముత్తెమంత పొలం అమ్ముడే ఇగ. ఇంకా ఈడికి ఎంబెట్టి పెంచుదం నాలుగు అచ్చరాలు నేర్సుకుంటే ఆడి బతుకు ఆడు బతికి మన కాల్జేతులు మూలకు వడ్డనాడు ఇంత గంజివోస్తాడు.

ఆ.. కలకటేరు సదివి నిన్ను కూకోవెట్టి పెడ్తడు. మీ అయ్యా కొడుకులు సదివి కొలువులు జేసీ మిద్దెలు మేడలు గట్టుండ్రీ. నేను కైకీలు బోవాలే, మీతో న్యావ వెట్టు కొని కూసుంటే ఇగ పనికెప్పుడు బోవుడు.

సెప్పుడు యాది మర్శిన, నిన్న మాపటేల  గా పంతులమ్మ దార్లో గనిపించి నిన్ను రమ్మని సెప్పింది పోయి కనవడు.

సరేదీయ్యి  గట్టనే వోతలే.

ఓ పంతులమ్మా ఎందుకో పిల్సినవట ఏమైనా పంజెయ్యా లా..

పనేమీ లేదు గాని నీ కొడుకును స్కూల్ కు వెళ్లొద్దు అంటున్నావట వాడు చక్కగా చదువుకుంటుంటే ఎందుకలా వద్దంటున్నావు?

ఆ మాకెందుకమ్మా గా సదువులు గిదువులు పొట్టకొచ్చేనా బట్టకొచ్చేనా...

అగాగు చదువుకుంటే ఏమి రాదు మరి తర తరాలనుంచి  చదువులు లేక కూలి చేస్తూ మీరు సాధించింది ఏమిటి అవే  కూలి పనులు అవే గుడిసెల బతుకులు. నీకు పనేమీ లేకుంటే ఓ ఐదు నిమిషాలు నేను చెప్పింది వింటావా..

నాకేమి పనుంటధమ్మ గా కైకిలి వోవుడు దప్ప..

అదే లచ్చి నేను చెప్పేది. ఎన్నో ఏళ్లనుంచి ఈ పనులకెళ్తున్నారు. మరి నాలుగు డబ్బులు వేనుకేసుకున్నారా ఏ రోజుకారోజు పొద్దంత కష్ట పడి తెచ్చుకున్న ఆ నాలుగు డబ్బులు పప్పు ఉప్పుల కే సరి పోతుంది కదా.

అదే నరసింహ బాగా చదువు కుంటే మంచి ఉద్యోగం చేస్తాడు. మిమ్ములను బాగా చూసుకుంటాడు. శరీరం సహకరించని వయసులో మీరు ఎండనక వాననక కూలికి వెళ్లే అవసరం ఉండదు.

కానీ అమ్మ సదు సెప్పించేంత పైసలు మా కాడ ఏడున్నయి...

అవసరం లేదు లచ్చి సర్కారి బడులున్నై. మీరు ఒక్క పైసా కూడా పెట్టక్కర్లేదు, పైగా మధ్యాహ్నం మంచి భోజనం పెడ్తారు, బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొంటే మీకు తొందరగా ఉద్యోగాలు కూడ ఇస్తారు.

కానీ అమ్మ..అదీ. ఈ సర్కారు బడిలో సదు బాగా సెప్పరంట అదే పైవేటు ఇస్కూల్లో మంచిగ సెపుతరటమ్మా.

అలాంటివి నమ్మొద్దు లచ్చి. ఇప్పుడంటే ప్రయివేట్ స్కూల్స్ వచ్చాయి. మరి ఒకప్పటి మన గొప్ప గొప్ప

దేశ నాయకులందరూ ఈ గవర్నమెంట్ స్కూలోనే చదివి విదేశాల్లో పట్టాలు పొందిన వారే. దానికేమంటావు?

నా మాట విని నరసింహ ను బడికి పంపు.

నువ్వింత సెపుతున్నవు పంపిత్తామ్మా, ఆడు బాగా సదుకుంటే నాకు సంతోసం గాదమ్మా. నా కొడుకు ఉజ్జోగం సేసి నన్ను కుర్సీలో గుసో వెడితే ఇంక నాకెంగావాల తల్లి. బడి ఐపోయినంక గూడ నీ తననే సీకటయ్యేదాక గూడ నాల్గు ఆచ్చరాలు సెప్పు పంతులమ్మా. మకున్నయి ఓ సొలేడు బియ్యం ఎండు సేపలు పంపిత్తా తల్లి.

అవేవి వద్దు కానీ మళ్ళీ మనసు మార్చుకోకుండా అటు స్కూల్ కు, సాయంత్రం నా దగ్గరకు పంపు చాలు.

అట్టాగే పంతులమ్మ ఆడు సదువుకొని ఉజ్జోగం సేస్తే నీకు నీ పెనిమిటి కి పై నిండ బట్టలు వెడత పంతులమ్మా.

అలాగే పెడుదువు గాని ముందు నీ కొడుకుని చక్కగా రెడీ చేసి స్కూల్ కు పంపు.

గట్టనేమ్మా నీ కడుపు సల్లగుండా ఇంగ నేను వోయిస్తా పంతులమ్మ..

 

(నేటి కాలంలో, సర్కారి బడులు చదువుకు సరిపోవు అనే అపోహనుండి అందరి దృష్టి మరలించాలనే నా ఆలోచనలోంచి పుట్టినదే ఈ కథ. తప్పులుంటే సహృదయంతో మన్నించగలరు – రచయిత్రి)

Posted in March 2019, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!