Menu Close
ManaKadupukuRenduKallu_Mar2019

కాలజ్ఞానం రాయ బ్రహ్మ గారిని కాను

కాని

కాలమందున మార్పు చెప్పగా నేర్తు

పూటకూటి ఇళ్ళు ఫైవ్ స్టార్ హోటళ్ళుగా మారె

అబ్బో

వాటి తీరే వేరు నాటి రుచులే చూడు

కుంపట్లు పెడతారు కూరలు ఫలములు

కమ్ములకు గుచ్చి కాల్చి మాడ్చిన తీరు

అయిదువందల బిల్లు అప్పళంగా చెల్లు

పాత వంటల కింక పంగనామాలు

టి.వి. ల వంటలు

మన కడుపు పంటలా?

ఏది ఏమైనా

‘అబ్బా ఏమి రుచి’ పోయి ‘అభిరుచులు’ వచ్చె

పాత వంటలకు పెడ్తిరి పంగనామాలు

అంతేగాక

‘మా వూరి వంటైనా’, ‘ఈ వూరి వంటైనా’

‘ఏ వూరి వంటైనా’ ఒక్కటే బ్రాండు

పచ్చి...కరి...కొత్తి...నూనె...కారం...ఉప్పు లే.

దానిలో ఇది పోసి, దీనిలో అది కలిపి

కలిపి, కలిపి చేసి ‘పారేస్తె’ సరిపోయె

సమయమ్ము సరిపోవు

పోగ్రాము అయిపోవు.

పాకశాస్త్రం అంటే, సమతూకంగా

తగుపాకంగా, ఉప్పు వేసే నుండి ఉడికి దించేదాకా

నేర్పుగా, ఓర్పుగా చూచి చేసితే వంట

లేకపోతే వచ్చేది కడుపు మంటే

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు

ఆంధ్రుల ఇంటివంటలు పచ్చళ్ళు, పొడులు

ఇంద్రాదులనైనా ఇట్టే మైమరిపించు

శ్రీనాథుడు, వేటూరి ప్రభాకరులు, - ఎందఱో

ఈ రహస్యాన్ని ఎప్పుడో చెప్పారు.

అందుకే

అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, అత్తయ్యలు

మీ చేయి జారకముందే ‘అబ్బా ఏమి రుచులు’

అభ్యాసం చెయ్యండి.

ఆవకాయను మీ తలకెక్కించుకోండి

మాగాయను మంచి చేసుకోండి

మన తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలు

“నోటి రుచులతో మిళితమై

కవుల కలాలలో అలలుగా లేచె

పాత క్రొత్తల మేలు కలయిక – దేనికైనా దారిదీపం

శీఘ్రమే “అబ్బో రుచులు” సర్వులకు

ప్రాప్తిరస్తు.

Posted in March 2019, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!