శ్రీరంగం నించి బయల్దేరి, తంజావూరు లోని బృహదీశ్వరాలయం చేరుకున్నాము. మొదటి ప్రాకారం ప్రధాన గోపురం దగ్గరకి వచ్చేలోపు ఏదో కోటకి చేరామన్న భ్రాంతి కలిగింది నాకు. దీనికి రెండు కారణాలు: ఒకటి, ఆ ప్రాకారం రంగు. ఎర్ర రాయి గోడలా కనిపించాయి. దాంతో డిల్లీ లో ఎర్రకోట గుర్తుకొచ్చింది. ఎర్రరాయి గోడల లాగా కనిపించాయి. రెండు, అంతపెద్దగానూ కనిపించింది. గోపురం వద్దకి వచ్చేటప్పటికి తెలిసిపోయింది గానీ, ఆశ్చర్యం మాత్రం పోలేదు. శ్రీరంగమే చాలా పెద్ద గుడి అనుకున్నా. కానీ ఈ గుడి అంతకి తీసిపోలేదన్నది అర్ధమైపోతూనే ఉన్నది.అసలు ఈ గుళ్ళు కట్టే మహారాజులకి కానీ, ఆ గుళ్ళని అలోచించి తయారు చేసిన స్థపతులకి కానీ ఎంత విశాల దృక్పథం ఉండి ఉండాలో ఇవి చూస్తే కానీ తెలియదు. ఒక భయం మాత్రం ఉండింది – ఎంత దూరం నడవాలో చెప్పులు విప్పి అని! ఎందుకంటే ఎండలు మండుతున్నాయి.
ఈ బృహదీశ్వరుడి ఆలయం చోళరాజులు కట్టినది. పేరే కాదు, ఆలయంలో అన్నీ పెద్దవే. కింద ఫొటోలో చూడండి; మొదటి ప్రాకారం గోపురం - 5 అంతస్తులు, 7 కలశాలతో మిగతా గుళ్ళకంటే వైవిధ్యంగా ఉంటుంది. అలాగే ప్రతి శిల్పం కూడా చిన్నగా ఉండి, ప్రతి దేవతామూర్తికీ ఒక మకర తోరణంతో ఉంటుంది. అలాగే మకర ముఖాలు ఎక్కువగాఉండి, అసలు ఆ గోపురాకారమే కొంచెం తేడాగా ఉంటుంది. కానీ ఎంతో సుందరంగా ఉంది, మనలని ఆలోచించేటట్లు చేస్తుంది. ఫోటో కొంచెం జూమ్ చేసి చూడండి - ప్రతి మూర్తి కూడా చెక్కు చెదరకుండా చాలా అందంగా, సాముద్రికంగా సరిగ్గా ఉండేట్లు ఉంటుంది. చేతులు, కాళ్ళు, తలా, - అన్నీ సరిగ్గా ఉంటాయి. భంగిమలన్నీ ఎంతో సున్నితమైన ఉలులతో చెక్కారనిపిస్తుంది. ప్రతి విమాన అంతస్థు బలాఢ్యులతో మోయబడినట్లు ఉంటుంది. ప్రతి నాసి ముఖం, ప్రతి పైభాగం చెక్కడాలు, అన్నీ ఎంత అందంగా ఉన్నాయో మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. కానీ ఇది 1200 సంవత్సరాల క్రితం ఇంత అందంగా కట్టబడిన గోపురం అనే ఆలోచన వచ్చేటప్పటికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఏ యంత్రాలు వాడారా స్థపతులు?
చెప్పులు రెండో ప్రాకారం ముందర వదిలి, రెండో ప్రాకార గోపురం దాటి లోపలకి వెళ్ళాలి. ఒక్కొక్క గోపురం దగ్గిర ఇంత సేపైతే గుడి అంతా చూసేదెలా? అందుకని మూడో గోపురం దాటి లోపలకి చూసి తెరిచిన నోరు ముయ్యలేదు నేను. మళ్ళీ మొదటి ఆలోచనే వచ్చింది. ఇదేమన్నా కోట కట్టి, మధ్యలో గుడి కట్టారా అని. అంత పెద్దగా ఉన్నది. చుట్టూ నడిచే ప్రాకారం పైకప్పుతో ఉన్నది. మనకి ఆంధ్ర దేశంలో అంత పెద్ద ఆలయం కనబడదు. ఒక పెద్ద ఊరి వాళ్లంతా అక్కడ గుమిగూడడానికి సరిపోతుంది. కానీ ఇదంతా ఆలయ ప్రాంగణమే అన్నారు. రెండో ప్రాకారం తరువాత మూడో ప్రాకారం వద్ద ఒక వీడియో తీశాను, దానివల్ల మనందరికీ బాగా అర్థం అవుతుందని.
ఈ బృహదీశ్వరాలయం 9, 10 వ శతాబ్దాల్లో రాజరాజ చోళుడు నిర్మించాడు. చోళులకి శివుడు ఆరాధ్య దైవం. రాజ రాజ చోళుడు ఇది ఎంత పెద్దదిగా ఊహించి నిర్మించాడంటే ఇది కట్టడానికి 42 సంవత్సరాలు పట్టిందిట. అయినా కొన్ని తప్పులు జరిగినాయి. ఆ కథ కింద చూద్దాం. అందువల్ల అతని కొడుకు రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో తండ్రి ఆత్మశాంతికై ఇలాంటిదే, కానీ ఇంతకన్నా చిన్నది - శివాలయం కట్టించాడు. దానికి మేము వెళ్లలేక పోయాము. ఏ తప్పులున్నా, ఇది ఒక మహత్కార్యంగా చరిత్రలో నిలిచిందనడానికి ఏమాత్రమూ సందేహం లేదు. ఒక మాట గుర్తుంచుకోవాలి; చోళుల కాలంనాటికి శివాలయాల్లో అమ్మవారికి అదే ప్రాకారంలో గుడి కట్టే ఆచారం లేదు. అయినా ఇక్కడ బృహన్నాయకి ఆలయం ఉన్నది. అది 14 వ శతాబ్దంలో నాయక రాజులు - అంటే తెలుగు రాజులు కట్టించారు. నేను అడిగి తెలుసుకున్నమేరకు మధుర మీనాక్షి ఆలయం కట్టించిన తిరుమల నాయకుడే ఈ బృహన్నాయకి మందిరం కూడా కట్టించాడు. ఇది కూడా కింద తెలుసుకుందాం.
ఆఖరు ప్రాంగణం గోపుర ద్వారం దాటగానే ముందు మీకు మధ్యలో ఒక పెద్ద మంటపంలో నంది పృచ్ఛ భాగం కనిపిస్తుంది. పాదాలు మాడుతుంటే ఎలాగోలా అక్కడకి చేరుకున్న మాకు ఒక అద్భుతమైన నంది సాక్షాత్కరించాడు. తొమ్మిదడుగుల ఎత్తు, పన్నెండడుగుల పొడుగు ఉన్న బృహత్ నంది మంటపం అది. నేల మీదనించి పది అడుగుల ఎత్తులో ఉంటుంది. నంది విగ్రహం మాత్రం 25 టన్నుల బరువుంటుందని అంచనా. మరి అంత పెద్ద ఆలయం మీద కన్నువేసి ఉంచడానికి అంత పెద్ద నంది కావాలి కదా? అక్కడ నంది ఈశ్వరుడిని రెప్పార్చకుండా చూస్తూ ఉన్నాడు. కింద ఫోటోలు, వీడియో చూడండి. ఇంత పెద్ద నందిని నేను మరెక్కడా చూడలేదు. మైసూరులో నంది కూడా ఇంతకంటే చిన్నదని నేననుకుంటున్నాను. విజ్ఞులు తెలుపగలరు. ఆ నందికి ప్రదక్షిణలు చేసి, వందనాలిచ్చి, ప్రధాన గుడి వైపు చూసి మళ్ళీ నోరెళ్ళబెట్టాను.
ఈ నంది ఎదురుగా ఒక 50 అడుగుల దూరంలో మొదలైన ప్రధాన ఈశ్వరాలయం ఉన్నది. ఈ ఆలయం వాస్తు ప్రకారంగా చాలా సరిగ్గా కట్టారు అని అనిపిస్తుంది, బైట నించి. అన్నిటికన్నా ముందు మరొక నంది మంటపం - చిన్నది ఉన్నది. దాని ముందర నిజంగా బృహత్ అనిపించే గోపురంతో ఉన్నది ఈశ్వరాలయం. చాలా పెద్దది. మెట్లెక్కి లోపలకి వెళ్ళాలి. ఈ గోపురం చూడగానే ప్రత్యేకంగా అనిపించింది. కాసేపు బుర్ర బద్దలు కొట్టుకుంటే గానీ అర్థం కాలేదు ఎందుకు అలా అనిపించిందో! ఈ గోపురం నాలుగు వైపులా ఒకే లాగా ఉంటుంది, Trapezoid లాగా. చాలా అందమైన విగ్రహాలున్నాయి దానిమీద. అలా పది అడుగులు ముందుకేసి మెట్లెక్కి చూద్దును కదా, బృహదీశ్వరుడని ఎందుకన్నారో తెలిసింది. 'ఆ' అని నోరు మళ్ళీ వెళ్ళబెట్టాను. శివలింగం - 12, 15 అడుగుల ఎత్తున్నది. ఒక పెద్ద పానుమట్టం - దాదాపు 20 అడుగుల పొడవుంది. శివలింగం మీద కలువలమాల ఉన్నది. మా ఆవిడ శాంతకి ఇక్కడ మిల్పిటాస్ లో సత్యనారాయణ స్వామి దేవాలయంలో మాలలు కట్టడం సేవాచారంగా అలవాటు. ఆవిడ 'అంత పెద్ద మాలలు ఎలా కట్టారో?' అని దిగ్భ్రాంతి పడి చూసింది. దగ్గిరకి వెళితే శివ లింగం అలా తల ఎత్తి చూడాలేగాని మామూలుగా కాదు. స్వామి వారికి అభిషేకం చెయ్యడానికి స్పెషలుగా BHEL వాళ్లు తయారు చేసిన మెట్ల పరికరం ఉన్నది. మరి ఎవరూ అంత ఎత్తు ఉండరుగా? కానీ, అవసరంలేనప్పుడు అది తీసేస్తే స్వామి వారి అందం ఇనుమడిస్తుందన్న ఆలోచన నాకు రాక పోలేదు. గర్భగుడి మీద గోపురం. విభూతి ప్రసాదం తీసుకుని ఎడమ చేతి పక్కగా ఉన్న ద్వారం గుండా బయటకి వచ్చి, తలెత్తి చూస్తే గోపురం అందం తెలుస్తుంది. ఒక చోట నటరాజ విగ్రహం; ఇంకోచోట శివ పార్వతుల అందమైన విగ్రహాలు. ఇంకో చోట వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు. పరివార దేవతలందరూ ఉన్నారు. గోపురం ఎడమ వైపు దక్షిణామూర్తి విగ్రహం ఒక చిన్న ఆలయంలాగా, దానికి వేరే మెట్లలాగా ఉన్నాయి. అన్ని విగ్రహాలూ చాలా శాస్త్రోక్తంగా ఉన్నాయి. ఆయుధాలు అన్నీ సరిగ్గా ఉన్నాయి. మనం ప్రస్తుతం అనుకుంటున్న ఆయుధ ప్రమాణాలన్నీ ఇక్కడ కనబడతాయి.
ఇంత గొప్ప శివాలయం చూసినా మీకు ఎదో అసంతృప్తిగానే ఉంటుంది. ఎందుకు నాలో అలాంటి భావం కలిగిందని ప్రశ్నించుకుంటూ గోపురానికి ఎడమవైపు ఐమూలగా ఉన్న ఒక చిన్న ఆలయానికి వెళ్ళాము. అది వినాయకుడి గుడి. విగ్రహం పెద్దగానే ఉన్నది. అక్కడ దర్శనం చేసుకుని, కొంచెం మధ్యలో ఒక గుడి ఉంటే అదేమిటో అని వెళ్ళాము. అక్కడ 'సిద్ధర్ ఆలయం' అని ఉన్నది. చూసి, ఆ విశేషమేమిటో తెలుసుకుందామని అక్కడి అధికారిని అడిగాను:
ఈ శివ లింగం కోసం రాయిని గుజరాతులోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న నర్మదా నదీ తీరంలో ఉన్న 250 టన్నుల రాయిని శివలింగం గా చెక్కడానికి ఒక శిల్పి - సిద్ధర్ - తంజావూరు తీసుకు వచ్చారుట. ఇతను గొప్ప శిల్పి అయినా నిమ్న జాతివాడని అక్కడి బ్రాహ్మణులు అనుకున్నారట. ఆలోచించండి! ఆ సిద్ధర్ అంత బరువు - ఎంత కాదన్నా 1500 కి.మీ దూరం ఎలా మోసుకొచ్చారు? ఏ బండి మీద వేసి తెచ్చారు? ఎలా లాగారు? అప్పుడు ఈనాడు మనం చూస్తున్న హైవే లాంటి రహదారులు లేవు కదా? 1200 వందల ఏళ్ల క్రితం దీనికోసం రాజు ధనాగారంలో ఉన్న ధనం అంతా ఖర్చు అయి ఉండాలే? మొత్తానికి సిద్ధర్ ఈ రాయి తెచ్చి, శివలింగం చెక్కి, ప్రతిష్ట చెయ్యడానికి సిద్ధమయ్యారు. ఆలయం దాకా దానిని తెచ్చిన సిద్ధర్ ని (సిద్ధుడ్ని) అతడు అంటరానివాడనీ, పూజలకు కూర్చోవడానికి అర్హుడు కాదనీ - ఇంక నీ అవసరం లేదు - నువ్వు వెళ్ళవచ్చు - అని ఆలయ అర్చకులు, పండితులు బయటకి పంపేసారుట. ఆయన కాళ్ళా వేళ్ళా పడినా ఒప్పుకోలేదుట. ఆయన కినిసి కరువూరుకి వెళ్ళిపోయాడు. (దీన్ని ప్రస్తుతం కరూర్ అని అంటారు.) ఆ తరువాత పానుమట్టం ప్రతిష్టించి, లింగం ప్రతిష్టిద్దామని ప్రయత్నిస్తే ఏం చేసినా లింగం పానుమట్టంలో కూర్చుని ఉండలేదుట. పానుమట్టంలో లింగం సరిగా ఉండడానికి ఒక సిమెంటు లాంటి పదార్ధం వేస్తారు. అది మెత్తగా ఉండి, కొద్ది సేపట్లో గట్టిబడిపోతుంది. ఇక్కడ ఎంత సేపు ఆగినా గట్టిపడకుండా లింగం ఆ బరువుకి వొంగి పోతోందిట. ఎంత ప్రయత్నించినా ఒరిగి పోతూనే ఉన్నదట. ఒక పక్క కుంభాభిషేకానికి ముహూర్తం ముంచుకొస్తున్నది; భయపడి చెమటలు పట్టిన పూజారులు తమ పూజలకు లొంగని ఆ బృహత్ లింగానికి నమస్కారం చేసి, 'తాము సిద్ధర్ని వెళ్లగొట్టడమే తాము చేసిన తప్ప' ని గుర్తించి, గబగబా ఆయన దగ్గరకి వెళ్లి క్షమాపణ వేడుకుని, గుడిలోకి తీసుకు వచ్చారుట. అప్పుడు సిద్ధర్ తాను నోట్లో నములుతున్న తాంబూలం పిడచ తీసి పానుమట్టంలో వేసి, లింగాన్ని అమరిస్తే ఆ పదార్ధంలో ఉన్న ఒక బ్రహ్మ రాక్షసి బయటకి పారిపోయిందట; అప్పుడు ఆ పానుమట్టం మీద శివలింగం గట్టిపడి, నిలుచుందట. అందుకని రాజ రాజ చోళుడు ఇది తెలుసుకున్న వాడై, గోపురం వెనుక సిద్దర్ కి కూడా ఒక ఆలయం నిర్మించాడట. ఇలాంటి దోషం ఉండడం వల్ల ఈ ఆలయం తిరుపతిలాగా, శ్రీరంగం లాగా అవలేదని అక్కడి వాళ్ళు అనుకుంటున్నారని తెలిసింది. దీనికి ప్రమాణమైన ఒక వీడియో జతపరిచాను, చూడండి. అయితే ఇది నా ఆలోచన కాదు. ఇలాంటివేవీ అనడానికి నాకు అంత జ్ఞానం లేదు.
ఈ సిద్ధర్ ఆలయానికి కుడివైపు, అంటే ప్రధాన గుడి గోపురం ఈశాన్య దిక్కువైపు సుబ్రహ్మణ్యాలయం ఉన్నది. ముందు ఇది అమ్మవారి ఆలయం అనుకున్నాను. కానీ ఒకరితో సంప్రదిస్తే చోళులకి అమ్మవారి ఆలయం నిర్మించడం ఆచారం కాదని చెప్పారు. ఇక్కడ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడిగా వెలిసి ఉన్నాడు. పక్కన వల్లీ దేవసేన తల్లులు ఉన్నారు. ఆ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో? కాస్త మంచిగా అడిగితే అర్చకులు దీపం తీసుకుని వెనకనున్న మూడు ముఖాలూ అద్దంలో మనకి బాగా కనబడేటట్లు చూపిస్తారు. అక్కడ అర్చకులు నాకు తమిళంలో స్వామి గురించిన ఒక నినాదాన్ని నేర్పించారు కూడా. "ఆళగు సొల్లుక్కు మురుగా, అలగు ఎండ్రు పోళ్రుక్కు మురుగా!", అని! ఆ ఆలయ ప్రాంగణంలో కొంత సేపు కూర్చున్నాము. అక్కడ ఒక ద్వారపాలక విగ్రహం ముస్లిముల దాడికి గురైనదని చెప్పారు. కింద ఫోటో చూడండి, ఎంత మంచి విగ్రహం ముక్కు విరక్కొట్టబడి ఉందో చూస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ గుడి ద్వారం ముందు కింద ఉన్న రాతిమీద తెలుగు అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. అంటే ఇక్కడ దాకా తెలుగు వ్యాపించి ఉండేదన్న మాట అక్షరాలా నిజం. ఇలాంటి తెలుగుని పోగొట్టుకోడానికి వెనకాడట్లేదు ఇప్పటి తరం వాళ్ళు. ఎంత తెలివి తక్కువ తనం!
అక్కడ నించి మెల్లగా చుట్టూ ఉన్న నడిచే దారి ఉపయోగించి బృహన్నాయకి ఆలయం చేరుకున్నాము. పైన కప్పుందికాబట్టి కాళ్ళు మాడలేదు. మనకి ఈ ఆలయం చూడగానే తెలిసి పోతుంది, ప్రధాన ఆలయం కట్టినప్పుడు ఇది కట్టలేదని. రాయి గ్రానైట్ అని తెలుస్తుంది. ఆలయం Red SandStone తో కట్టబడింది. ఇందాక చెప్పినట్లు ఇది 14 వ శతాబ్దం నాటిది. ఈ అమ్మవారిని "ఉళగం మూలదైయ్య నాచ్చియార్" అని కూడా అంటారు. అంటే విశ్వానికి మూలాధారమైన తల్లి అని అర్థం. అమ్మవారు నిలువెత్తు విగ్రహం - నిలుచుని ఉన్నది. చక్కగా పూజలు చేస్తున్నారు. అక్కడ ఆలయ అర్చకులనడిగితే మమ్మల్ని స్థిరవిగ్రహం వద్దకి వెళ్లనిచ్చారు. మామూలుగా తమిళనాడులో వెనకాల ధ్రువ విగ్రహం, ముందు ఉత్సవ విగ్రహం ఉంటాయి. అర్చకులు భక్తుల కైంకర్యాలు ఉత్సవ విగ్రహం వద్దే తీసుకుంటారు. మేము ఆ ధ్రువ విగ్రహం దగ్గిర హాయిగా అమ్మవారి పాదాల దగ్గిర కూర్చుని అర్చన చేయించుకుని చాలా సేపు దర్శనం చేసుకున్నాము. శివుడి దగ్గిర లభించని ఆ భావావేశం మనకి అమ్మవారి దగ్గిర పుష్కలంగా కనిపిస్తుంది. అమ్మ వారి చేతిలో పాశము, అంకుశము ఉన్నాయి. చక్కగా పూజ చేయించుకుని వారిచ్చిన కుంకుమ, ఇతర వస్తువులు, ఒక చిన్న పుస్తకం అన్నీ తీసుకుని బయలుదేరాము.
వాస్తు, ఆలయ నిర్మాణ, ప్రతిష్టా పద్ధతులు సరిగ్గా లేకపోతే వచ్చే ఆపదలకి ఈ బృహదీశ్వరాలయం ఒక తార్కాణం. రాజ రాజా చోళుడి మరణం కూడా దానికే ముడిపెట్టారు ఆ ప్రాంతీయులు. కానీ ఇదంతా చదివి ఆలయంలో ఎదో తప్పు ఉందని మాత్రం అనుకోవద్దు. శివుడు అక్కడ లింగరూపంలో ఉన్నాడు. అంత పెద్ద లింగం ఇంకెక్కడా మీరు చూడలేరనే మాట నిజం. అక్కడ దర్శనం చేసుకోవడం వల్ల మనకి శివుడి అనుగ్రహం లభిస్తుందని నా నమ్మకం. అయితే ప్రాంతీయ గాథలు, స్థలపురాణాలు అన్నిచోట్లా ఉంటాయి. ఆ ఆలయ శిల్ప సౌందర్యం చూడడానికి తప్పక వెళ్ళాలి. మీరు ఇది వరకే చూసి ఉంటే నా మాట మీకు కూడా అనిపించిందా? అని ఒక మాట చెప్పండి. నా భ్రాంతి తొలిగిపోతుంది.