నాటికలోని పాత్రలు:
- ప్రసాద్ - మినిస్టరుగారి పి.ఎ.
- సంతోషి - ప్రసాద్ భార్య
- సిద్ధాంతి
- మోహన్ లాల్ - బంగారు నగల దుకాణం యజమాని
- సురేష్ - ప్రసాద్ స్నేహితుడు
RRR ఈవెంట్స్ మేనేజ్మెంటు నుండి -
- రమేష్
- రాకేష్
- రాహుల్
(తెర తీయగానే స్టేజి మీద, సోఫాలు, సెంటర్ టేబుల్ ఉంటాయి. కొద్దిసేపట్లో ప్రసాద్ వచ్చి, సోఫాలో కూర్చుంటాడు. తెర వెనకనుండి, 'ఆనందమానందమాయెనే మా సీతాలు పెళ్లికూతురాయెనే' అంటూ పాట వినిపిస్తుంది.)
ప్రసాద్- (ఇంటిలోపలకు చూస్తూ) “ఏమిటోయ్ అంత హుషారుగా ఉన్నావ్. ఏమిటి విశేషం?”
(సంతోషి, ఇంటిలోనుండి, అట్లకాడ పట్టుకొని ప్రవేశిస్తూ)
సంతోషి- “పొద్దున్న, గుంటూరు, నుండి...”
ప్రసాద్- “సంతోషీ, మొదట, ఆ, అట్లకాడ, కిందకి దింపు.”
సంతోషి - (వెటకారంగా ) “ఏమిటి కొడతానని భయమా? అయినా ...నిజం చెప్పండి. మిమ్మల్ని ఎప్పుడైనా అట్లకాడతో కొట్టేనా?”
ప్రసాద్- “సరేలే - ఆ అట్లకాడ దింపి.. అసలు విషయం చెప్పు.”
సంతోషి - “పొద్దున్న గుంటూరునుండి మా అక్కయ్య ఫోన్ చేసిందండి. మా అక్క కూతురు సీతాలుకి పెళ్లి కుదిరిందిట.”
ప్రసాద్- “శుభం- మంచి వార్త చెప్పేవు. పెళ్ళికొడుకు ఏమిటి చేస్తున్నాడు?”
సంతోషి - “బ్యాంకులో ఆఫీసరుగా పనిచేస్తున్నాడటండి.”
ప్రసాద్ - " ఏ బ్యాంకు."
సంతోషి – “బ్యాంకు పేరు ... ఏదో ... పంజాబీయో… ఏదో… చెప్పిందండి. జ్ఞాపకం లేదు.”
ప్రసాద్- “పంజాబ్ నేషనల్ బ్యాంకా?”
సంతోషి – “ఆ.. ఆ.. అదేనండి. అందులో, ఆఫీసరుగా ఉన్నాడట.”
ప్రసాద్- “మంచి సంబంధమే .... పెళ్ళివారిది ఏ ఊరు. మరేమయినా వివరాలు చెప్పేరా మీ అక్కయ్య."
సంతోషి - "వాళ్ళది భీమవరంటండి పెళ్ళికొడుకు తల్లి, తండ్రి, ఇద్దరూ లాయర్లేనట. వాళ్లకి పెళ్ళికొడుకు ఒక్కడే సంతానమంట. భీమవరంలో వాళ్లకి పెద్ద బంగళా ఉందట."
ప్రసాద్ - "మరింకేం! పెళ్ళికొడుకు బ్యాంకులో ఆఫీసరు అంటే; బాగా మీదకు వస్తాడు. సీతాలు అదృష్టవంతురాలు."
సంతోషి - "నిజమేనండి. అది అదృష్టవంతురాలు. మా అక్కయ్య పూజలు ఫలించేయి."
ప్రసాద్ - "సంతోషీ, నువ్వో శుభవార్త చెప్పేవ్ గదా. నేను కూడా నీకో శుభవార్త చెప్తాను."
సంతోషి - "ఏమిటండి, ఆ శుభవార్త. చెప్పండి..చెప్పండి..."
ప్రసాద్ - “మా మినిస్టరుగారి, కూతురి పెళ్లికూడా కుదిరింది.”
సంతోషి - "మంచి కబురే చెప్పేరండి. పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడండి."
ప్రసాద్ - "అమెరికాలో, స్వంత కన్సల్టెన్సీ కంపెనీ ఉందట. ఆవిడ స్నేహితురాలి మనవడి పెళ్ళికి, మేడంగారు అమెరికా వెళ్ళేరు. ఆవిడే అక్కడ ఈ సంబంధం చూసేరట.”
సంతోషి - "పెళ్ళివారి వివరాలేమిటండి."
ప్రసాద్ - "సంతోషీ, మినిస్టరుగారు, పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడో చెప్పేరు. మరే వివరాలు ఆయన చెప్పలేదు; నేను అడగలేదు.”
సంతోషి - "అవునండి; పెద్దవాళ్ళు; వాళ్ళు మనతో ఆ వివరాలేవీ చెప్పరు. సరే గాని, పెళ్లిచూపులు ఎప్పుడయ్యేయండి."
ప్రసాద్ - పెళ్లిచూపులు, వీడియో ద్వారా అయ్యేయట, సంతోషి. అబ్బాయి అమెరికానుండి, అమ్మాయి ఇక్కడినుండి వీడియోలో మాట్లాడుకున్నారట.
సంతోషి – (ఆశ్చర్యంతో) “ఏమిటీ … పెళ్ళికొడుకు, పెళ్లికూతురు, ఒకరినొకరు ఎదురుగుండా చూసుకోకుండానే పెళ్లి కుదిరిందా."
ప్రసాద్ - "సంతోషీ, నువ్వు ఇంకా త్రేతాయుగంలో ఉన్నావ్. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ యుగం. బజారుకు వెళ్లకుండా, కావలిసిన సామాన్లు ఇంటికి తెప్పించుకోవచ్చు. నీకు తెలీదు. కొన్ని పెద్ద పెద్ద మీటింగులు ఎలా అవుతున్నాయో తెలుసా. వేరువేరు పట్టణాలలో ఉన్నవాళ్లు వీడియో ద్వారా అన్ని విషయాలు మాట్లాడుకొంటూ ఉంటారు. అలాగే ఈ పెళ్లిచూపులు కూడా వీడియో ద్వారా అయ్యేయి. వీడియోలో ఒకరికొకరు కనిపిస్తూనే ఉంటారు. ఎదురుగా ఉన్నట్టే ఉంటుంది.”
సంతోషి - "పెద్దవాళ్ళు, వాళ్ళ పద్ధతులేమిటో నాకు తెలీదు. మన కిషోర్ పెళ్లి మాత్రం అలా చెయ్యొద్దండి. పిల్లని చూసుకోడానికి మనం వెళ్ళాలి. స్వయంగా వెళ్లి చూస్తే గదా, వాళ్ళ వ్యవహారమేమిటో… పిల్లకి ఏవయినా అవయవ లోపాలు ఉన్నాయో… లేవో తెలుస్తుంది.
ప్రసాద్ - "సరేలే, మనవాడి పెళ్లి, పదేళ్ల తరువాత మాట. అప్పటికి ఇంకా ఏ మార్పులు వస్తాయో; మనకేమిటి తెలుసు. ప్రస్తుతం, మినిస్టరుగారి అమ్మాయి పెళ్లి, నా మెయిన్ డ్యూటీ అయింది. రేపటినుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అందుచేత, తను చాలా బిజీగా ఉంటానని, మినిస్టరు గారు పెళ్లి ఏర్పాట్లన్నీ నన్నే చెయ్యమన్నారు. ఏర్పాట్ల విషయంలో మూడు, నాలుగు సలహాలు ఇచ్చేరు. మిగిలిన విషయాలలో నన్నే అన్ని డెసిషన్లు తీసుకోమన్నారు. నీకు తెలుసుగా సంతోషి; పెళ్లిళ్లు చేయించడంలో నాకు అనుభవం ఏమీ లేదు. పెళ్ళివారు అమెరికా వాళ్ళు. ఎలాంటి వాళ్ళో, ఏమిటో... ఏవయినా చిన్న పొరబాట్లు జరిగితే, సర్దుకుపోయేవాళ్లయితే ఫరవాలేదు. లేకపోతె నాకు చీవాట్లు పడతాయి. అదీ నా భయం.”
సంతోషి - "అలా భయపడకండి. మీరు ఏ పని చేసినా ఫస్టుగా చేస్తారు. నాకా నమ్మకం ఉంది."
ప్రసాద్ - “రెండు, మూడు వారాల తరువాత అయిదారు నెలలవరకు ఆఫీసు పనుల్లో తీరుబాటు ఉండదని పెళ్ళికొడుకు అన్నాడట. అందుచేత ముహూర్తం రెండువారాల లోపుగా పెట్టిస్తే, హనీమూనుకు వారం పది రోజులు టైము ఉంటుందన్నాడట. అందుచేత, మినిస్టరుగారు, నన్ను, రెండు వారాల లోపునే ముహూర్తం పెట్టించమన్నారు. ముహూర్తం విషయంలోను, పెళ్లి ఏర్పాట్ల విషయంలోను కొన్ని సలహాలు ఇచ్చేరు. మొదట ముహూర్తం పెట్టించాలిగా. సిద్ధాంతి గారిని వెంటనే నన్ను కలవమని కబురు చేసేను.”
సంతోషి –(నసుగుతూ) ఏమండీ, … మన సీతాలుకికూడా పెళ్ళిముహుర్తం పెట్టించాలిట ... వాళ్ళ సిద్ధాంతి తీర్థయాత్రలకి వెళ్ళేడుట. 15 రోజులుదాకా రాడట .. అయినా, అతను పెళ్ళిముహుర్తానికి వెయ్యి రూపాయలు పుచ్చుకొంటాడట... అనుక్కోకుండా కలిసొచ్చింది; పనిలోపని; మన సిద్ధాంతి గారి చేత ఆ ముహూర్తం కూడా పెట్టించేస్తే… మా వాళ్లకు ఖర్చులు కలిసొస్తాయండి.”
ప్రసాద్- “సంతోషీ… ఏదో… మాడిన వాసన వస్తున్నట్టుంది....”
సంతోషి- “అయ్యో...అయ్యో.. కందిపప్పు, సగం వేయిస్తూ మీతో మాట్లాడడానికి వచ్చేసేను. పప్పుకింద స్టవ్ ఆర్పలేదనుకొంటా. పప్పంతా మాడి, మంగళమయుంటుంది.”
(సంతోషి తొందరగా ఇంట్లోకి వెళ్లిపోతుంది)
(ఇంతలో ‘అయ్యా లోపలికి రావొచ్చా’ అని పిలుపు వినిపిస్తుంది.)
ప్రసాద్ – “రండి... రండి.. సిద్ధాంతి గారూ.”
సిద్ధాంతి – “నమస్కారం సార్.”
ప్రసాద్- “కూర్చోండి.”
సిద్ధాంతి- “ఏమిటి విశేషం సర్ .. అర్జెంటుగా పిలిపించేరు.”
ప్రసాద్- “అదే…విశేషము… అంటే…మన మినిస్టరుగారి అమ్మాయికి… పెళ్లి కుదిరిందండి.”
సిద్ధాంతి- “శుభం. మగపెళ్ళివారిది ఏ ఊరండి."
ప్రసాద్ - "వారు అమెరికాలో ఉంటారండి."
సిద్ధాంతి - "మినిస్టరుగారు కదా; అమెరికా సంబంధాలే చూస్తారు."
ప్రసాద్- “సిద్ధాంతిగారూ, పెళ్లి ఏర్పాట్ల బాధ్యతలన్నీ మినిస్టరుగారు నా మీద వేసేరు.”
సిద్ధాంతి - “అవును మరి; మినిస్టరుగారి, పి. ఎ. అంటే, ఆయన బాధ్యతలన్నీ మీ మీదే ఉంటాయి గదా."
ప్రసాద్ - “మొదట, వెంటనే పెళ్లికి మంచి ముహూర్తం చూడాలి సిద్ధాంతిగారూ. మగపెళ్లివారు ముహూర్తం రెండు వారాల లోపునే పెట్టించమన్నారట.
సిద్ధాంతి - “అలాగే సర్… పెళ్లికూతురి జాతకం, ఇప్పించగలరా, సర్.”
ప్రసాద్- “పెళ్లికూతురి… జాతకం… ఇప్పటికిప్పుడు … కష్టం- సిద్ధాంతి గారూ... మినిస్టరుగారికి...ఇంటి విషయాలేవీ తెలీవు… మేడం గారికి తప్ప… ఆ విషయాలు, మరెవరికి… తెలీవు.. ఆవిడ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు… ముహూర్తం నిశ్చయం అయితే గాని… ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించలేము…10-15 రోజుల్లో పెళ్లి జరగాలి. పరిస్థితి మీకు బోధపడిందనుకొంటా…”
(సిద్ధాంతి అవునన్నట్టు బుర్ర ఊపుతాడు.)
ప్రసాద్- “అంచేత… మీరే… ఏదో, మంచి జాతకం చూసి… ముహూర్తం పెట్టాలండి.”
సిద్ధాంతి - “పెద్దవాళ్ళు… మాట కొట్టేయలేము కదా ... ప్రయత్నిస్తాను.”
ప్రసాద్- “సిద్ధాంతి గారూ.. మరో రిక్వెస్ట్.”
సిద్ధాంతి - “ఏమిటది సర్.”
ప్రసాద్- “పెళ్లి ముహూర్తం, రాత్రివేళలలోనే చూడండి.”
సిద్ధాంతి - “ఎందుచేతనండి.”
ప్రసాద్- “అది, పెళ్లికూతురు కోరిక, అని, మినిస్టరుగారు చెప్పేరు.”
సిద్ధాంతి - "అమ్మాయిగారు అలా ఎందుకు కోరుకుంటున్నారండి?"