నేడు సమాజంలో చూస్తున్న యాంత్రిక జీవన విధానాలు, పాటిస్తున్న ఆరోగ్య సూత్రాలు, రోగనిరోధక శక్తి మీద కొరవడుతున్న అవగాహన, సౌఖ్యాలకు అలవాటుపడి కనీస నొప్పిని కూడా భరించలేని మానసిక స్థితి, భయంతో కూడిన అభద్రతా భావం తదితర అంశాలను గురించి నాలో చెలరేగుతున్న మానసిక సంఘర్షణలకు, ఆవేదనతో కూడిన ఆలోచనల ప్రవాహం, అక్షరరూపంలో వాటికి ఆకృతిని కల్పించి అందరికీ పంచాలనే తపన, ఈ ‘మన ఆరోగ్యం మన చేతిలో,,’ అనే శీర్షిక రూపకల్పనకు ముఖ్య కారణమైంది.
నేను తత్వవేత్తను కాను, సైద్ధాంతిక కర్తను కాను, వేదాంత వేత్తను కాను, వేద పారంగతుడను కూడా కాను. కానీ ఏదో చెప్పాలనే ఆరాటం, నా ఆలోచనల ఉదృతి, నా చుట్టూ జరుగుతున్న సంఘటనలు, నేను స్వయంగా అనుభూతి చెందిన సన్నివేశాలు నన్ను ఈ శీర్షిక వ్రాసేందుకు ప్రోత్సహించాయి. మొదట నాలుగు లేక ఐదు సంచికలకు మాత్రమే అనుకొన్నాను. కానీ నేడు అది నలభై సంచికల వరకు వచ్చింది.
ఈ సంచికలో, పెళ్లి అనే పదం యొక్క సామాజిక ఉద్దేశ్యం, అవసరం గురించి ప్రస్తావిస్తాను.
ఏ మతంలోనైనా వివాహం లేక పెళ్లి అనేది ఒక బృహత్కర ప్రక్రియ. ఆ తంతులో జరిగే ప్రతి అంకమూ ఒక శాస్త్రీయ దృక్పథం తో సామాజిక బాధ్యతను పొందుపరుచుకొని, ఒక నిర్దిష్టమైన జీవన క్రమమును నిరంతరం ఆచరించడానికి రూపకల్పన చేసిన ఒక పవిత్ర విధానము. మనిషిని మిగిలిన జీవరాసుల నుండి వేరుచేసి నాగరిక ప్రపంచాన్ని నిర్మించి, శాస్త్ర సాంకేంతిక రంగాలలో అభివృద్ధిని సాధించే విధంగా మేథో సంపత్తిని పెంచుకొనే విధంగా చేయగలుతున్న ఒక అద్భుత కారకము. ముఖ్యంగా చెప్పాలంటే భౌతికంగా, మానసికంగా మనిషి ఎదగడానికి మరో తోడు యొక్క ప్రాముఖ్యతను అనుభవపూర్వకంగా చూపే ఒక ప్రధాన జీవన విధానం, అనుబంధం.
అయితే కాలక్రమేణా ఆ విధానంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. సామాజం లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా వివాహం అనే పదానికి కూడా అర్థం మారుతున్నది. బాధాకరమైన విషయం ఏమిటంటే పెళ్లి అనే బంధం యొక్క రూపురేఖలు మారి నేడు అది కేవలం సృష్టి కార్యానికి ఒక అనుమతి పత్రం, సమాజంలో మన ఉనికిని నిలబెట్టే ఆయుధం, ఆర్ధిక పరమైన లావాదేవీలు జరుపుకునే ఒక వ్యాపార పనిముట్టు..ఇలా ఆ ప్రక్రియకు వివిధ అవతారాలను సృష్టిస్తున్నాము. అదేమంటే ఆర్ధిక సామాజిక ఎదుగుదల కొరకు కొన్ని త్యాగాలు తప్పనిసరి అని సర్ది చెప్పుకుంటున్నాము. మనందరికీ అర్థమై కూడా, సందిగ్ధత తో తెలిసో తెలియకో ఎంతో మంచి కాలాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేక పోతున్నాం. అదేమంటే మానసికంగా ఎక్కువ దగ్గరై మరింత ఇబ్బందులను భరించే సమయం, ఓపిక లేదని వివరణ ఇచ్చుకుంటూ వేదాంతం మాట్లాడతాము. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని సిరివెన్నల గారు వూరికే వ్రాయలేదు. ఎంతో నిగూఢమైన జీవితార్థాన్ని తన పాండిత్య అనుభంతో చూపించాడు.
ఈ విశాల విశ్వంలో మనిషి ఆయుః ప్రమాణం అసలు లెక్కలోకి రాదు. కనుకనే మన జీవిత దశలను విభజిస్తూ ఏ దశలో ఏ విధానాలు అనుకరించాలి వాటి సాఫల్యంతో సిద్దించే ప్రయోజనం ఏమిటి అనేది ఎవ్వరూ చెప్పారు. తెలుసుకోవాలనే ఆత్రుత కన్నా ఆ విధానాలను పాటించి సాధించే అనుభవపూర్వక ఆనందం విలువ మనకు మాత్రమె తెలుస్తుంది. అది ఒకరు చెప్పేది కాదు. కనుకనే నీ జీవితం నీది, దాని కర్త, కర్మ, క్రియ లకు నీవే బాధ్యుడవు.
వివాహమైన తరువాత ఆలుమగలు ఇరువురు గడిపిన ప్రతి క్షణమూ ఎంతో విలువైనది. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు అనే స్థాయికి వచ్చి, తరతమ బేధాలు మరిచి, పారదర్శకంగా తప్పొప్పులను అంగీకరించి, సామాజిక బాధ్యతను పరికిస్తూ, ఆ జీవితానుభవాన్ని సంయుక్తంగా అనుభవించిన కాలమంతా భవిష్యత్తులో ఒకరికొకరు జీవితాంతం అదే అనుబంధం తో కొనసాగి అవసరమైన రోజు కావలిసిన శక్తిని, భౌతికంగా మరియు మానసికంగా సాధించగలరని మనందరికీ అర్థం అయితే ఆ మధురిమ క్షణాలు మన వెంట సదా ఉంటాయి. అదే మన సంపూర్ణ ఆరోగ్య సూత్రం. కాలంతో పోటీ పడటం కాదు ముఖ్యం, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకొని మన సంతోషాన్ని, సాన్నిహిత్యాన్ని పదిలపరుచుకొని ముందుకు సాగడమే వాస్తవ జీవితం. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది.
‘సర్వే జనః సుఖినోభవంతు’