పిల్లలలో ఉండాల్సింది ఆత్మస్థైర్యం, ఎదురయ్యే ఇబ్బందులను విచక్షణతో అధికమించి ముందుకు సాగి పోయేందుకు సహాయపడే ఆలోచనా సరళి. మన ఆలోచనాసరళి మరియు మన మెదడు స్పందనలకు అనుగుణంగా కాలం అనేది పయనించదు. మనం ఉత్తేజంగా ఉన్నప్పుడు వేగం గాను, నీరసంగా ఉన్నప్పుడు నిదానంగాను ఉండదు. అది మనయొక్క మానసిక స్థితి మాత్రమె. కనుక కాలానికి అనుగుణంగా మారుతున్న సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ పిల్లలు వారి ఆలోచనా సరళిని మార్చుకోవలసిన అవసరం కూడా ఉంది. ఆ ఆత్మస్థైర్యాన్ని, విచక్షణను పిల్లలకు అర్థమయ్యే విధంగా వివరించి వారిలో ఆ లక్షణాలు మెండుగా ఏర్పడేటట్లు చేయవలసిన బాధ్యత వారిని పెంచుతున్న పెద్దవారిదే. తమ పెద్దరికంతో పాటు స్వయం అనుభవాలను జోడించి పిల్లలకు కొంత సమయం కేటాయించి వారికి వివరిస్తూ సమయం గడిపితే ఆ ప్రక్రియ కొన్ని కోట్ల నగదుతో సమానం.
పుట్టినప్పటి నుండి మనిషి జీవన సరళి అభివృద్ధి పథంలో సాఫల్యత దిశగా సాగాలంటే అందుకు తగిన కృషి, విధివిధానాలు, స్వయం ప్రోత్సాహం ఇలా ఎన్నో విషయాలు పాత్రను పోషిస్తాయి. అందుకు చదువు, ఉద్యోగం, సామాజిక బాధ్యత, కుటుంబ అనుబంధం తదితర సాధనాలు ఉపయోగ పడతాయి. ఆ సాధనాలను ఉపయోగించే విధానం అందరికీ ఒకే విధంగా ఉండదు. ఆ పనిముట్ల వాడకంలో ఎన్నో వర్గాలు, విబేధాలు ఉంటాయి. మనకు అనువైన వాటిని ఎంచుకొని తద్వారా మన జీవన సాఫల్యాన్ని సాధించేందుకు పైన చెప్పిన ఆత్మస్థైర్యం, విచక్షణా జ్ఞానం ఎంతగానో ఉపయోగపడతాయి. చదువు, ఉద్యోగం, వైవాహిక జీవితం ఇవన్నీ జీవితంలో భాగాలే కాని అవే జీవితం కాదు. అన్నీ సమ పాళ్ళలో కలిసిన నాడే మనం అనుకొంటున్న జీవన సాఫల్యం సిద్ధిస్తుంది.
పిల్లలలో ఉండాల్సింది జీవితంలో ఎంత ఆనందకర సమయాన్ని గడిపామని అంతేగాని సమాజంలో తమకు, తమ తల్లిదండ్రులకు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించామని కాదు. చేసిన పనిలో, విధిలో నిబద్ధత ఉంటే దానికి తగిన ఫలితము, తద్వారా గుర్తింపు లభిస్తాయి. ఇష్టంతో చేసినప్పుడు కష్టమైననూ ఆ కష్టము మరింత ఇష్టంగా మారుతుంది. అది శారీరక శ్రమ అయితే మానసిక పరిపుష్టితో ఆ శ్రమను అధికమించవచ్చు.
ఏ తరగతిలో నైనా పాఠ్యప్రణాళిక, విద్యార్థుల సరాసరి మెదడు గ్రహించే సామర్ధ్యం మీద రూపకల్పన చేయడం జరుగుతుంది. అంతేగాని అతి పిన్న వయసులోనే అన్ని పూర్తిచేసి స్థిరపడాలనే తపన ఉండకూడదు. స్థిరత్వం అనేది కేవలం సాపేక్ష పదం మాత్రమె. నిజంగా మన మెదడు యొక్క సామర్ధ్యం మరింత ధృడంగా ఉంటే మరికొంత భారాన్ని మోయడానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ అది అందరికీ సాధ్యం కాదు.
జీవితంలో స్థిరత్వం అనేది రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఆశ, రెండు నమ్మకం. జీవన అభివృద్ధి కి సంబంధించిన ఆశ ఉండాలి అలాగే దానిని సాధించి జీవితాన్ని మరింత తేజోవంతంగా మార్చుకోగలమనే నమ్మకం మనలో ధృడంగా ఉండాలి. అప్పుడే ఎన్ని అవరోధాలు ఎదురైననూ మనం రూపకల్పన చేసుకొన్న అభివృద్ధిని సాధించి మనం కోరుకుంటున్న జీవన పథం లో అత్యంత స్థిరమైన విశ్వాసంతో ముందుకు సాగగలము.
‘సర్వే జనః సుఖినోభవంతు’