కాల చక్రంతో పాటు పరిభ్రమిస్తూ మనిషి జీవితం ముందుకు సాగిపోతుంది. నాలుగు లేక ఆరు కాలాలు మనతో పాటు వస్తూ మనం ముందుకు పోవడం లేదనే భ్రమను కలిగిస్తాయి. కానీ మనిషి జీవితం ఒక నిరంతర ప్రవాహమై ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఆ ప్రవాహంలో ఎన్నో సుడిగుండాలు, సేదతీరే తీర ప్రదేశాలు, బురదతో నిండిన మట్టి నేలలూ, పచ్చటి తివాచీల వంటి మైదానాలు.. ఇలా అన్ని కోణాలలో మనిషి జీవితం కూడా ముడిపడి వుంటుంది. అయితే సంతోషం వచ్చినప్పుడు అహంకారంతో పొంగిపోయి, కష్టాల ఊబిలో పడినప్పుడు మానసికంగా క్రుంగి నీరసించి పోతే, పర్యవసానం మనకే వర్తిస్తుంది కానీ పరులకు కాదు. అందుకే మహాకవి బద్దెన అన్నట్లు, “తన కోపమె తన శతృవు, తన శాంతమె తనకు రక్ష,..”. మన కోపం భౌతికంగా, మానసికంగా మనకే నష్టం కలిగిస్తుంది. అట్లని మరీ శాంతంగా ఉంటె అందరూ మనలను వాడుకొని వదిలేస్తారు అనే భావన కూడా ఉంది. అదీ నిజమే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకు దక్కవలసిన కనీస మర్యాద కూడా లభించక మనం బాధపడే అవకాశం కూడా ఉంది. కనుక సందర్భాన్ని బట్టి మన ప్రవర్తన ఉండటం ఎంతో అవసరం. అదేవిధంగా మనలోని, మనకు నష్టం కలిగించే భౌతిక ధర్మాలను అంటే ఆవేశాన్ని, కోపాన్ని, రోషాన్ని, వ్యంగ్య ప్రవర్తనను నియంత్రించుకునే సామర్ధ్యం కూడా మనకు ఎంతో అవసరం. మనందరం మరిచిపోతున్న విషయం ఒక్కటే. ప్రతి రోజు చివరి నిమిషంలో, మనం ఆ రోజు చేసిన పనుల తాలూకు ఆనవాలు, ఫలితాలు మన మెదడులో తిరుగుతుంటే మనం సేద తీరుతున్నాము. కనుకనే కలలు అనే పదం ఉద్భవించింది. భౌతికంగా అలిసిపోయినప్పుడు నిద్ర దానంతట అదే వస్తుంది. మానసికంగా అలసిపోతే నిద్ర రాదు అదే విచిత్రం. కనుకనే నిద్ర రావాలంటే మన మెదడులో ఉన్న ఆలోచనా సుడులను తొలగించాలి. అది సాధనతో, అవగాహనతో, అనుభవంతో లభిస్తుంది. మన sub conscious mind ను మనం మన నియంత్రణలో ఉంచుకుంటే అప్పుడు మన శరీరం అడిగినట్టు, మన మెదడు కూడా సంకేతాలను పంపి మనకు ప్రశాంతమైన నిద్రను వచ్చేటట్లు చేస్తుంది.
ప్రతి మనిషిలోనూ ఒక శాస్త్రజ్ఞుడు, వేదాంతి, విచక్షణా శీలుడు, ఒక గురువు ఉన్నారు. అది గ్రహిస్తే, కొంచెం విశ్లేషణను జోడిస్తే, మన శరీరం ఇచ్చే స్పందనలను గమనిస్తే, మన ప్రవర్తనను మన చుట్టూ ఉన్న వాతావరణానికి అనుగుణంగా, అవసరమైతే కొద్దిగా మార్చుకుని సంతోషంగా మనుగడను సాగించవచ్చు. అందుకు మన జీవన శైలిని విపరీతంగా సర్దుబాటు చేయవలసిన అవసరం కూడా లేదు. మనలోని సుగుణాలను మనమే పెంచుకోవచ్చు, మనలోని బలహీనతలను సరిచేసుకోవచ్చు. అందుకు సలహాలు ఇచ్చేందుకు ఎంతోమంది ఉంటారు. ఆ సలహాలు మన విషయంలో ఎంతవరకు పనిచేస్తాయి అనే విచక్షణా జ్ఞానం మనకు ఉండాలి. ఆ విషయంలో గురువు అనేవారు దిశానిర్దేశం చేస్తారు. ముందు నీ మనసు చెప్పే మాటను విని నీకు నీవే గురువు కావాలి. ఆ దిశలో తగిన కృషి చేయాల్సిన అగత్యం, అవసరం ఎంతో ఉంది.
మానవ శరీరానికి, ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరు, వెలుతురు, మట్టితో పాటు మనమే పండించిన కాయగూరలు, దుంపలు, ఆకులు, పప్పుదినుసులు ఇలా అన్నీ కావలసినవే. కాకుంటే, మన శరీరానికి అవసరమైన గాలిని మన ప్రమేయం లేకుండానే నిరంతరం సాగే ప్రక్రియ ద్వారా పొందుతున్నాము. అంతేగాని ఆవేశంగా గాలిని పీల్చకూడదు. గుండె కొట్టుకునే వేగాన్ని అప్పుడప్పుడు వ్యాయామం ద్వారా పెంచుతూ, తగ్గించుతూ ఉంచాలి. అతి వేగం లేక అసలు లేకుండా ఉండకూడదు. అలాగే మన బరువులో దాదాపు 70 శాతం ఉన్న నీటిని మాత్రము మనం తరచూ సేవించడం చేస్తుండాలి. తీర్థంలా పుచ్చుకుంటే కుదరదు. అలాగే ఏ వంటకాన్ని అయినను నిషేధించకూడదు కాకుంటే ఏదీ అధిక మోతాదులో తినకూడదు. ఈ అతి చిన్న విషయాన్ని మనందరం మిడిమిడి జ్ఞానంతో ఉన్న సామాజిక మాధ్యమాల వ్యాసాలకు ప్రభావితమై మధ్యంతర పరిజ్ఞానంతో అసలు విషయాన్ని మరిచిపోతూ మనల్ని మనం అయోమయంలోకి నెట్టుకుని అపోహలో బ్రతకడానికి అలవాటు పడుతున్నాం. మనిషి శరీరంలోని కణాల ధర్మాలు వారు పెరిగే వాతావరణానికి అనుగుణంగా మారి మనలను కాపాడుతాయనే విషయాన్ని విస్మరిస్తున్నాం. మనం గమనిస్తే ఉష్ణమండల ప్రాంతంలో ఉన్న వారి ఆహారపు అలవాట్లు కొంచం ఘాటును తలపిస్తాయి. శీతల ప్రాంతం వారు కొంచెం చప్పగా తింటారు. ఇలా ఒక్కోరికి ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. వాటిని వెంటవెంటనే మార్చుకుంటూ మన శరీరాన్ని కష్టపెట్టడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఏది అవసరం, ఏది అనవసరం అనే విషయాన్ని మన శరీరమే మనక స్పందనల రూపంలో చెబుతుంది. అది గమనించి తదనుగుణంగా మార్పులు అవసరమైతే చేసుకోవాలి. ప్రక్కవాళ్ళను చూసి కాదు.
మనలను అందరూ గుర్తించాలనే తపనను వదిలి, మనం అందరినీ గుర్తించి తగిన గౌరవము, ప్రోత్సాహము ఇవ్వవలసిన అవసరం ఉంది.
‘సర్వే జనః సుఖినోభవంతు’