పంచతంత్రం కథలు
- దినవహి సత్యవతి
ఒంటె – మెడలో గంట
అనగనగా ఒక పట్టణంలో ఉద్దీపుడనే వ్యాపారి ఉండేవాడు. మనుషులు సవారీ చేసే బండ్లు తయారుచేసి, అమ్మి, ఆ వచ్చిన డబ్బులతో సంసార జీవితం గడుపుతుండేవాడు. కాలక్రమేణా బండ్ల సవారీకి గిరాకి తగ్గి వ్యాపారం దెబ్బతినడంతో ఉద్దీపుడు పేదవాడై పోయాడు. జీవితం గడవడం కష్టమైపోయింది.
‘ఛ! ఛ! నా బ్రతుకెందుకు ఇలా అయిపోయింది? నా తోటివారందరూ హాయిగా వ్యాపారం చేసుకుంటూ, మేడపై మేడ కట్టుకుంటూ ఆనందంగా ఉంటే నేనేమో ఇలా దరిద్రంతో బాధపడుతున్నాను. ఇంక ఈ ఊళ్ళో ఉంటే లాభం లేదు. ఇంకో ఊరుకి వెళ్ళి బ్రతుకుతాను’ అనుకుని ఆ మర్నాడే భార్యా పిల్లలతో వేరే ఊరుకి ప్రయాణమైయ్యాడు.
మార్గమధ్యంలో ఓ అడవిలోంచి ప్రయాణం సాగిస్తుండగా బాధతో మూలుగుతున్న ఒక ఒంటె ప్రక్కనే చిన్న ఒంటె పిల్ల కనిపించాయి ఉద్దీపుడికి.
‘ఈ ఒంటెకి ఇప్పుడే పిల్ల పుట్టినట్లుంది. అందుకేనేమో అంత బాధపడుతోంది’ అనుకుని జాలి పడి ఆ ఒంటె పిల్లని ప్రక్కనే ఉన్న చెట్టుకి కట్టి, దాని ముందు తినడానికి లేత గడ్డి తెచ్చి పెట్టాడు. తల్లి, పిల్ల ఒంటెలు బాగా కోలుకునేదాకా వాటిని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ ఒంటెలు కోలుకున్నాక వాటిని తనతో పాటు వేరే ప్రాంతానికి తీసుకొనిపోయాడు. చెంగు చెంగున గెంతుతూ తిరుగుతున్న పిల్ల ఒంటెను చూసి ముచ్చటపడి, దానికి ‘చిచ్చరపిడుగు’ అని పేరు పెట్టి, సరదాగా దాని మెడలో ఒక చిన్న గంట కట్టాడు. గంట చప్పుడు విచిత్రంగా తోచి పిల్ల ఒంటె మరింతగా మెడ ఊపుతూ గెంతుతుంటే చూసి సంబరపడేవారు ఉద్దీపుడూ, అతడి భార్యా పిల్లలూ.
రెండు ఒంటెలనూ సంరక్షిస్తూ, తల్లి ఒంటె పాలను అమ్మి బ్రతుకు సాగించడం మొదలు పెట్టాడు ఉద్దీపుడు. కాలం కలిసి వచ్చి మరొక ఒంటెని కొని తెచ్చాడు. అలా..అలా..ఉద్దీపుడి వద్ద పది ఒంటెలు చేరాయి.
తన మెడలో మాత్రమే గంట ఉండడంవల్ల, పిల్ల ఒంటె..చిచ్చరపిడుగుకి, మిగిలిన ఒంటెల కంటే తానే గొప్పదానిననే భావం కలిగి అహంతో విర్రవీగడం మొదలుపెట్టింది.
ఒంటెలన్నీ కలిసి కట్టుగా మేతకు వెళ్ళినప్పుడు తాను వాటితో కలవకుండా వెనుకగా వెళ్ళడం, మిగిలిన ఒంటెలన్నీ ఒక చోట మేత మేస్తుంటే తాను వాటికి దూరంగా మేయడం, అన్నీ మళ్ళీ తిరిగి ఇంటికి వెళుతుంటే తాను మాత్రం వెనుకగా ఆలస్యంగా బయలుదేరడం..ఇలా చేస్తుండేది చిచ్చరపిడుగు.
‘అలా ఒక్కత్తివే తిరగొద్దు ప్రమాదం, అడవిలో క్రూర జంతువుల్ల వల్ల అపాయం వాటిల్లుతుంది ...’ అంటూ తోటి ఒంటెలు ఎంత చెప్పినా ‘ఆ వీళ్ళు నాకు చెప్పేదేమిటీ..నేను వినేదేమిటీ’ అని అహంభావంతో ఆ సలహాలన్నీ పెడ చెవిన పెట్టింది చిచ్చరపిడుగు.
అలా ఉండగా ఒకనాడు ఒంటెలన్నీ సాయం సమయమయ్యాక ఇంటికి తిరుగుదారి పట్టాక, ఎప్పటిలాగానే చిచ్చరపిడుగు మాత్రం ఆలస్యంగా మిగిలిన ఒంటెలన్నీ వెళ్ళిపోయాక తీరుబడిగా బయలుదేరింది.
ఇంతలో ఆకలితో నకనక లాడుతూ తినడానికి ఏదైనా దొరుకుతుందెమో అని వెదుకుతూ వెళుతోన్న ఒక సింహం గంట చప్పుడు విని, ఆ వైపుగా అడుగులు వేసింది.
కొంతసేపటికి సింహానికి, మెడ అలవోకగా ఊపుతూ గంట చప్పుడు చేసుకుంటూ వయ్యారంగా నెమ్మదిగా నడుస్తూ వెళుతున్న చిచ్చరపిడుగు కనిపించింది.
‘ఆహా! ఈ ఒంటె ఎంత లేతగా ఉంది. ఇవాళ దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను’ అనుకుని పరధ్యానంగా ఉన్న చిచ్చరపిడుగు పై దాడిచేసి, దానిని నోట కరుచుకుని అడవిలోకి పరుగెత్తింది.