మన హృదయంలోనూ, విశ్వమంతటానూ మారుమ్రోగుతున్న అనాది ప్రణవనాదము ‘ఓం’ కారము. హిందువులకు ‘ఓం’ కారము పరమ పవిత్రమైనది.
‘ఓం’ కారము పరమాత్మకు పర్యాయపదము. మనం దైవాన్ని ‘ఓం’కార రూపంగా భావిస్తాం. ‘ఓం’కారమే భగవంతునికి ప్రతీక. భగవంతుని టెలిఫోన్ నెంబర్ ‘ఓం’కారం అని చెప్పవచ్చు.
సృష్టికంటే ముందు అనాదిలో బ్రహ్మ మొక్కటే ఉండేదని చెప్తారు. అప్పుడది మహా నిశ్శబ్దంగా ఉండేదిట! అట్టి మహానిశ్శబ్దం నుండి నాద బ్రహ్మము ఉదయించిందిట! అదియే ‘ఓం’కారము. దాని నుండి పంచ భూతాత్మకమైన సృష్టి వెలువడిందిట!
ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధ్వి. [పృధివ్యాపస్తేజోవాయు రాకాశములు.] ‘ఓం’ కారము సృష్టి అంతా అంతర్లీనమై ఉంటుంది. అందుకే ‘ఓం’కారము ప్రణవము. ప్రణవమనగా ప్రాణములన్నింటిలోనూ, ప్రాణులన్నిట్లోనూ వ్యాపించి ఉన్నదని అర్ధం చెప్పవచ్చు.
వేదము నందు ఇలా ఉంది."ప్రజాపతి వై ఇదం అగ్ర ఆసీత్ -తస్య వాఃక్ ద్వితీయ ఆసీత్- వాగ్వై పరమం బ్రహ్మ” - అనగా ఆది యందు ప్రజాపతి ఉండగా అతనితో కల్సి అతని వాఃక్కు ఉండేది, ఆవాఃక్కే పరబ్రహ్మము.
తైత్తిరీయోపనిషత్ నందు ఇలాఉంది - "బ్రహ్మణః కోశోసి" అంటే '‘ఓం’కారమా! నీవు బ్రహ్మమునకు కోశము వంటిదానవు' అని భావము.
ప్రశ్నో పనిషత్ లో "ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ" అని ఉంది. అనగా 'ఓం' కారము అనే ఒక్క అక్షరమే 'బ్రహ్మము' అని, ఓంకార ధ్యానము వలన పరమాత్మను పొంద నగును అని అర్థము. ఋగ్వేదం నుండి ‘అ’ కారము, యజుర్వేదం నుండి ‘ఉ’ కారము, సామవేదం నుండి ‘మ’ కారము పుట్టి, వాటికలయికతో ‘ఓం’కార రూపం ఉద్భవించిందని చెప్తారు.
"యః పునరేతం త్రిమాత్రేణో మిత్యే తేనై వాక్షరేణ పరం పురుష మభిధ్యాయీత స తేజసి సూర్యే సంపన్నః" ‘మాత్రాత్రయ విశిష్టమూ, సూర్యాంతర్గతమూ ఐన పురుషునిగా ఈ ‘ఓం’కారమును ఎవరు ధ్యానిస్తారో వారు తేజస్వులై సూర్యుని చేరగలరు' అని అర్ధం.
ముండకోపనిషత్ నందు కూడా ‘ఓం’కార ప్రాశస్త్యాన్ని గురించిన ప్రస్తావన ఉంది. పతంజలి మహర్షి 'యోగ సూత్రము' నందు 'తస్య వాచకః ప్రణవః' అనగా భగవంతుని పేరు తెలుపునదే ‘ఓం’కారము.
‘అ’ కార, ‘ఉ’ కార, ‘మ ‘కారము లను మూడు బీజాక్షరముల త్రిపుటియే ‘ఓం’కారం. ‘అ’కారము బ్రహ్మము, ‘ఉ’ కారము విష్ణువు, ‘మ’ కారము మహేశ్వరుని వ్యంజింపజేయు బీజాక్షరములు.
‘ఓం’కారము శబ్ద ప్రపంచమునకు స్పోటకము. శబ్దశాస్త్రమునకు మూలము. ధ్వని శాస్త్రమునకు సారము. ధ్వను లన్నింటికీ, శబ్దము లన్నింటికీ మూలము.
‘ఓం’కారము నాల్గు మానసికావస్థలకు ప్రాతినిధ్యము వహిస్తున్నది. ‘ఓం’కారము ఆత్మకు ప్రాతినిధ్యం వహిస్తున్నదని ఉపనిషత్తులు కీర్తిసున్నాయి. ఆత్మకు 1. జాగ్రదావస్త [మేలుకుని ఉన్నస్థితి], 2. స్వప్నావస్థ [నిద్రలో కలలుకంటున్నస్థితి], 3. సుషుప్తావస్థ [కలలు లేని గాఢనిద్రావస్థ] ఉంటాయి.
ప్రతిమానవుడూ ఈమూడు అవస్థల నూ నిత్యజీవితంలో అనుభవిస్తూనే ఉంటాడు. కానీ యోగులుమాత్రం వీటన్నింటికీ ఉత్తమమైన, 'తురీ యావస్థను' పొందుతారు. ఇది ఇంద్రియాలకు అతీతమైన ఆధ్యాత్మిక స్థితి. తురీయావస్థలో యోగులు తమ ఆత్మ నిజస్థితిఐన 'సమాధి' అనే ఆత్మానంద స్థితిని పొందుతారు.
సత్ చిత్ ఆనంద రూపమైన పరమాత్మ స్థితి లో నిల్చి ఉండటమే తురీయావస్థ.
‘ఓం’ కారమును ఉచ్చరించవలసిన విధానం. -- ‘ఓం’ కారమును సాధ్యమైనంత నెమ్మదిగా ఉచ్చరించాలి. నాభి స్థానము నుండీ అకారమును ప్రారంభించి, కంఠస్థానము వరకూ వచ్చి ఉకారము నాలుక పైకి వచ్చి నోటి కొసకు చేరి, మకారము పెదవుల కలయిక తో ముగిసేలా ఉచ్చరించాలి.
‘ఓం’ కారముతో ప్రారంభము కాని మంత్రానికి పూర్ణత్వ చేకూరదు. మనం నిత్య జీవితంలో చేసే పూజల్లో మన ఇష్ట దైవాన్నికానీ ఏ ఇతర పూజలూ వ్రతాలూ ఆచరించేప్పుడు కానీ, ఇతర దైవాలనుకానీ పూజించే సమయంలో చేసే అహ్టోత్తరశత నామాలకు ముందు ‘ఓం’కారం చేర్చనిదే ఆ మంత్రోఛ్ఛారణ ఫలించదు, అది వృధా.--'ఓం శ్రీ గణేశాయ నమః , ఓంశ్రీ కృష్ణాయనమః . ఓం నమః శ్శివాయ, ఓం నమోనారాయణాయ, ఇలా ‘ఓం’కారముతో చేరిన నామాలకే ఫలం లభ్యమవుతుంది.
మనం ఎలా శ్వాసిస్తామో అంత సహజంగా ‘ఓం’ కారముతో కూడిన భగవన్నామాన్ని జపించడం అభ్యాసం చేసుకోవాలి.
ద్రౌపది, రాధ, భక్తమీరా--వారి హృదయాల్లో జాగ్రద్ స్వప్నావస్తల్లోనూ నిరంతరం శ్రీకృష్ణ నామాన్ని జపించేవారు. హనుమంతుని రోమరోమానా రామనామం వినిపిస్తుందని మనకు తెల్సుకదా!
‘ఓం’కారము మోక్షాన్నికలగజేస్తుంది. అమృతత్వాన్ని కలిగిస్తుంది. భగవంతునిలో ఐక్యం చేస్తుంది.
భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయమైన 'అక్షర పరబ్రహ్మ యోయం’ లో శ్రీకృష్ణ భగవానుడు ఇలాచెప్పారు కదా!
“ఓం ఇత్యేకాషరం బ్రహ్మ బ్యాహరన్ మా మనుస్మరన్
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం”
‘ఓం’ అనే అక్షరమొక్కటే బ్రహ్మము. దానిని స్మరించుట నన్ను స్మరించుటయే! ‘ఓం’కారమును స్మరించుచూ ఎవరు దేహమును విడుతురో వారు పరమ గతియైన నన్ను పొందుదురు."
చివరిశ్వాస ‘ఓం’ కారముతో విడచినవారు తిరిగి చావుపుట్టుకల చక్ర భ్రమణంలో చేరరు. మోక్షమును పొందెదరని భగవద్వాణి.
‘ఓం’కారము ఆధ్యాత్మికతతో పాటుగా శ్వాసకోశమును పవిత్రమూ, పరిశుభ్రమూ చేస్తుంది. ‘ఓం’కార మంత్రోఛ్ఛారణ వలన మన ఉఛ్వాస నిశ్వాస లతో సమాంతరత ఏర్పడుతుంది.
‘ఓం’కారము ప్రారంభించే ముందు గుండె నిండా గాలి పీల్చి, క్రమేపీ మెల్లి గా వదలడం వలన ఒక నిర్ధిష్ట ప్రమాణంతో గాలి పీల్చి వదిలే అభ్యాసం ఏర్పడు తుంది. ఊపిరితిత్తులనిండా మంచి గాలి వెళ్ళి నిదానంగా వదలడం వలన రక్త శుధ్ధి సజావుగా జరుగుతుంది. శరీరారోగ్యం పెంపొంది మనస్సు పవిత్రమై, బుధ్ధి వికసిస్తుంది. కనుక ఇట్టి ‘ఓం’కారమును మనం నిత్యం ధ్యానిస్తూ ఆధ్యాత్మికతతో పాటుగా ఆరోగ్యాన్నీ పొందే ప్రయత్నం చేద్దాం.
“ఓంకారం బిందుసం యుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమోనమః.”
చాలా బాగా వ్రాసారు ఓంకారం గురించి.