నేటి హైటెక్ యుగపు బాలబాలికల్లారా!
పొట్టివాళ్ళైననూ గట్టివాళ్ళన్నది నానుడి
పిల్లలైనను మీరు చిచ్చర పిడుగులు కదా!
మీరెక్కడున్ననూ సందడి అడుగిడు సదా!
హృదయాలలో మాయామర్మమెరుంగరు
వదనాలలో అమాయకత్వమే పొంగారు
కత్తికి సాన పడితే దేనినైన తెగనరుకు
మీ బుద్దికి ఊతమిస్తే నింగి దిగు నేలకు
కానీ ఆ అవకాశమేదీ! ఆ ప్రోత్సాహమేదీ!
ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్న లీల
ఎవరికి వారే యమునా తీరైన వేళ
ఒంటరి బ్రతుకుల అమ్మానాన్నలకు
మీరు ముద్దు బిడ్డలే గారాల పట్టీలే
ప్రొద్దు పొడిచినదాది ప్రొద్దుగూకే వరకు
సంపాదనకై అమ్మానాన్నల పరుగులే
అలసి వచ్చి పడకలవైపు అడుగులే
మీ గురించి ఆలోచించే సమయమేదీ?
మీ ఆలనా పాలనకిక అవకాశమేదీ?
మీ ఆలోచనా మేధోమధనాలు చెప్పగా
మీ కష్టసుఖాలు మనోభావాలు విప్పగా
కనీసం తాతమ్మ తాతయ్య పిన్నీ బాబాయి
పెద్దమ్మ పెదనాన్న అన్నాదమ్ముల్లు లేరే!
జననీజనకుల యాంత్రిక జీవనగమనంలో
తుంటరి వాళ్ళు సైతం ఒంటరులౌతున్నారు
సుమతి సద్గతివ్వని యంత్రాలకు సలాం చేసి
ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ కి గులాములౌతున్నారు
మీ జీవితమెటుపోతుందో ఏమైపోతుందేమో
బిజీ తల్లీదండ్రులకు పట్టదేమాత్రం సంతు
మీరడిగినవన్నీ సమకూర్చుటే తమ వంతు
అంతటితో చేతులు దులిపేసుకొనుటే తంతు
ఓ తల్లిదండ్రుల్లారా! యికనైనా కళ్ళు తెరవండి
మీ పిల్లల బాగోగులు మనసార పట్టించుకోండి
వారికి మీ సమయమించుక కేటాయించండి
వారి ఆలోచనామేధోమధనాలకు పదును పెట్టండి
దిశ మారి దశ తప్పిన ఓ బాలబాలికల్లారా!
మొబైల్ యుట్యూబ్ ఫేస్ బుక్కులకు ఫుల్ స్టాప్
యికనైనా మీ చదువులను పట్టాలెక్కించండి
మీ నవ్యభవితకు, దివ్యచరితకు నాంది పలకండి
నవయువ భారత నిర్మాణానికి ప్రస్థానం సాగించండి