ఆ విధాతకు నా మీద
ఎందుకు ఇంత పగ
నాకు ఈ జన్మ కావాలని
నేను నోములు నోచానా
పూజలు, వ్రతాలు చేశానా
ఎవరినడిగి ఇచ్చాడు నాకీజన్మ
వ్యాసుడిగా పుట్టిస్తే కమనీయ
భారత కావ్యాన్ని
రచించితే భువిలో నా పేరు
శాశ్వతంగా నిలిచి పోయేదిగా...
వాల్మీకి గా వరమిస్తే రమ్యంగా
రామాయణం వ్రాసి రామభద్రుని
కరుణ పొందిన చిరు ఉడుతలా
భక్తి భావంగా నిలిచేనుగా...
పోతన గా జన్మనిస్తే ఎంత బావుండేది
భాగవతంలో క్రిష్ణలీలలు అద్భుతంగా
వర్ణించే భాగ్యం దక్కేదిగా...
కందుకూరిలా కలియుగంలోకి
పంపితే స్త్రీజాతి మానవమృగాల
చేతిలో పడకుండ కనురెప్పల
తలుపులు మూయక రేయింబవళ్లు
పహారా కాచే మహద్భాగ్యమైన
నాకు దక్కేదిగా...
విప్లవ భావాలు గోరుముద్దలుగా
తినిపించి శ్రీశ్రీ గా ఈ పుడమిలో
వదిలితే, నా కలం లోంచి నిప్పురవ్వలను
ఎగజిమ్మి జగతిని జాగృతి చేసే
మహత్తరమైన అవకాశం నాకుండేదిగా...
మహాత్మునిగా నాకో జీవితం
ఇస్తే స్వాతంత్ర్య సమరంలో
ముందుండి చరిత్రలో ఒక
పేజీని ఆక్రమించి
చదువరుల హృదయంలో
స్వర్ణాక్షరమై కొలువుదీరే
యోగముండేదిగా...
మదర్ థెరీసా గా ఓ చిన్న
అవకాశమిస్తే నా మనసు
మానవత్వంతో పునీతమై
హస్తాలు అభాగ్యులకు
అండగా ఉండేవిగా...
స్వార్థం, మోహం అహం అత్యాశ
అన్నీ రంగరించి నాలో నింపి
ఓ అనామికగా
సృష్టించి ఇక్కడ వదిలేస్తే
అన్ని నాకే కావాలనే స్వార్ధం
తప్ప అన్యమేమి తెలియని
నేను ఇక ఎవరికేమి చేయగలను?
నేను నేనుగా పుట్టడమే వరమని,నేను నేనుగా నిలవడమే నా తరమని,నేను నేనుగా మిగలటమే అదృష్టమని తెలుసుకుంటే ఇన్ని అసంతృప్తులు ఉండవు.మది నిండా ఇన్ని శాంతులు నిండవు.
సామాన్యుని ఆశ, వాటిని అందుకోలేని ఆవేదనల భావ ఉత్ప్రేక్ష చాలా బాగుంది.