"మన ఊరి రచ్చబండ" కొత్త శీర్షికను సిరిమల్లె పాఠకులకు జనవరి 2023 నుండి అందిస్తున్నాము. అందుకు ముందుమాటతో ఈ సంచికలో పరిచయం చేస్తున్నాము.
సిరిమల్లె జనవరి సంచిక నుండి ప్రారంభం అవుతున్న "మన ఊరి రచ్చబండ" కొత్త శీర్షిక కు రచయిత గా నా ఆలోచనలను పంచుకునే అవకాశం కల్పించినందులకు సిరిమల్లె సంపాదకులకు నా ధన్యవాదాలు. ఈ డిసెంబర్ సిరిమల్లె సంచికలో ఉపోద్ఘాతంతో మొదలు పెడదాము. రచ్చబండ అంటే "సమావేశ స్థలం". దాదాపు ప్రతి పల్లెటూరులో రచ్చబండ ఆ గ్రామస్థులు కలుసుకొనే ప్రదేశంగా, వారి సమస్యలను చర్చించే వేదికగా, పంచాయతీ తదితర కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశంగా, గ్రామంలో బడికి ఒక భవనంలేనప్పుడు పిల్లలకు చదివించుకునేందుకు ఇలా చాలా రకాలుగా ఆ గ్రామస్తులకు ఉపయోగపడుతుంది. దీనినే వేదిక అనికూడా అనవచ్చు. రచ్చబండ, ఒక పెద్ద వృక్షం మూలం చుట్టూ నిర్మించిన ఎత్తైన పీఠం. సహజంగా మఱ్ఱి లేదా రావి, చింత లేదా నేరేడు లాంటి భారీ వృక్షాల క్రింద నీడలో చెట్టు కాండం చూట్టు రాతి బండతో వృత్తాకారంతో కట్టిస్తారు. చారిత్రాత్మకంగా ప్రాచీనకాలం నుండే అంటే మన తాత ముత్తాతల కాలంనుండే ఈ రచ్చబండ వాడుకలో ఉన్నట్లు చెబుతారు. పట్టణాలలో పుట్టి పెరిగినవారికి రచ్చబండతో పరిచయం తక్కువ, గ్రామీణ నేపథ్యంతో కూడిన సినిమాలలో అయితే ఒక రచ్చబండ సీన్ తప్పనిసరి. ఎంత ఎండలోనైనా చెట్టు చల్లని నీడలో రచ్చబండ కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఆ ఆనందమే వేరు.
ఇక ప్రవాసాంధ్రుల విషయానికి వస్తే, ఇక్కడ పెద్ద చెట్లకేమి తక్కువలేదు, అయితే సమస్యల్లా దాని చుట్టూ రాతి బండ వంటి నిర్మాణం, ముఖ్యంగా కూర్చోవడానికి ప్రజలను అక్కడ సమీకరించడం పెద్ద పనే. రాతి బండ బదులు చెక్క వంటి నిర్మాణాన్ని కూడా ఆధునిక ప్రపంచంలో చూడవచ్చు. అయితే బండల నిర్మాణాన్ని, నైపుణ్యాన్ని ప్రస్తావించడం నా ఉద్దేశ్యం కాదు, నిర్మాణం ఎటువంటి దైనా కావచ్చు, కానీ ముఖ్యంగా అక్కడ చర్చించే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. అట్లాగే సిరిమల్లె "మన ఊరి రచ్చబండ" - కొత్త శీర్షికలో కూడా అటువంటి ఆసక్తికరమైన విషయాలను చర్చించే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది, అదేమిటంటే చర్చ అంటే కనీసం ఇద్దరు, ముగ్గురు ఉండాలి కదా, మరీ ఒకరు “వారితో వారు”, లేదా “వారి లోపల వారు” ఏమి చర్చిస్తారు? దాన్నీ అంతర్మధనం అనవచ్చునేమో! అయితే మనకున్న పరిమితుల్లో చర్చ సాధ్యమే. నేను చేసే పనేమిటంటే - నిశ్చలంగా ఉన్న ఒక కొలను మధ్యలో ఒక రాయి విసరడం వంటిది. రాయి మూలంగా ఉద్భవించిన తరంగాలు ముందుకు ప్రయాణించి తీరాన్ని చేరి మరలా వెనుకకు మరలి వచ్చే క్రమంలో కొలనులో ఒకింత అలజడి రేగుతుంది. అదేవిధంగా సిరిమల్లె "మన ఊరి రచ్చబండ" - కొత్త శీర్షికలో వ్యక్తీకరింపబడిన నా భావాలు అక్షర రూపంలో మీకు చేరినప్పుడు, అంతిమంగా మీలో ఒక అవగాహన ఏర్పడుతుంది, దానిమూలంగా సమాధానపడటం లేదా ప్రతిస్పందన జనిస్తాయి, అది సహజం. నిజంగా నాకదేనండి కావాల్సింది. నేను ఎంచుకున్న అంశం ఏవైనా కానివ్వండి, మీలో అవి కాసింత స్పందనను కలగజేస్తే నా ప్రయత్నం ఫలించినట్లే! సిరిమల్లె జనవరి సంచిక నుండి ప్రారంభం అవుతున్న "మన ఊరి రచ్చబండ" లో వ్యక్తీకరింపబడిన భావాలు పూర్తిగా రచయిత గా నావే. మీ స్పందనను ఈ శీర్షిక క్రిందనున్న పాఠకుల స్పందన (కామెంట్స్ బాక్స్) ద్వారా మాకు తెలియజేయగలరు. సరే ఇంతటితో ఈ కొలను - రాయి చర్చను ఆపి, వచ్చే సంచికలో ఒక మంచి అంశంతో మనం రచ్చబండ ప్రారంభిద్దాం. మీకు నిరాశ అయితే కలగదు, పూచి నాదే!
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం
ఈ శీర్షిక ద్వారా ‘సిరిమల్లె’ పాఠకులు తమ అనుభవాలనూ, అభిప్రాయాలనూ ఒకరితో ఒకరు పంచుకోగలరు. ఇటువంటి వినూత్న శీర్షికను ప్రారంభిస్తున్న వెంకట్ గారికి శుభాకాంక్షలు.