Menu Close
balyam_main

పంచతంత్రం కథలు

- దినవహి సత్యవతి

కోతి – మొసలి

Panchatantram - Koti Mosali

ఒకానొకప్పుడు ఒక నది ఒడ్డున ఉన్న చెట్టుపై ఒక కోతి నివసిస్తుండేది. అది ఆ చెట్టుకి కాచే తియ్యటి పళ్ళని తింటూ జీవించేది.

ఆ కోతి ప్రతిరోజూ కొన్ని పళ్ళని తింటూ మరికొన్ని సరదాగా నీటిలోకి విసురుతూ ఆనందించేది.

అలా కోతి నీళ్ళలోకి విసిరిన పళ్ళను అందులో నివసిస్తున్న మొసలి ఒకటి తింటూ ఉండేది.

మొసలికి ఆ పళ్ళు ఎంతగానో నచ్చి ఒకనాడు ‘ఓ కోతిబావా నాకు ఈ పళ్ళంటే ఎంతో ఇష్టం. నువ్వు నీళ్ళలోకి విసిరిన పళ్ళని తిని ఆనందిస్తున్నాను. దయచేసి రోజూ కొన్ని పళ్ళని నాకు ఇవ్వగలవా’ అని బ్రతిమిలాడింది.
ఆ రోజునుండి కోతి, మొసలి కోసం కొన్ని పళ్ళు కోసి ఇవ్వసాగింది. ఆ విధంగా అనతికాలంలోనే మొసలి, కోతీ మంచి స్నేహితులయ్యాయి.

మొసలి ఇంటివద్ద భార్యా పిల్లలని కూడా మరచి ఎక్కువ సమయం కోతితోనే గడప సాగింది.

దాంతో మొసలి భార్య కి చాలా కోపం వచ్చింది.

‘ఈ కోతితో స్నేహం ఏర్పడ్డాక నా భర్త నాతో సమయం గడపడటమే మానుకున్నాడు. దీని పీడ వదిలించుకోకుంటే నా భర్త నాకు దూరమైపోతాడు’ అనుకుంది.

ఇలా ఉండగా మొసలి ఒకనాడు కోతి ఇచ్చిన పళ్ళు తీసుకుని భార్యకి ఇద్దామని ఇంటికి వచ్చింది.

భార్య పడుకుని ఉండడం చూసి ‘ఏమైంది? ఎందుకలా ఉన్నావు?’ అని అడిగింది.

‘నాకు ఈ మధ్య విపరీతమైన తలనెప్పిగా ఉంటున్నది. ఎంతమంది వైద్యులను అడిగినా అందరూ కోతి గుండెకాయతో చేసిన మందుతోనే నా తలనెప్పి తగ్గుతుందని చెప్పారు. ఇప్పుడు కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుంది?’ దిగులుగా అన్నది మొసలి భార్య.

‘ఓస్! ఇంతేనా? నువ్వేం దిగులుపడకు. నాకు ఒక కోతి మిత్రుడు ఉన్నాడు. అతడి గుండెకాయ అడిగి తెస్తాను. నీ తలనెప్పి తప్పక తగ్గుతుంది’ అని చెప్పింది మొసలి.

వెంటనే కోతి వద్దకు వెళ్ళి ‘మిత్రమా మనం ఇంతకాలం నుంచి స్నేహితులుగా ఉన్నా నిన్నెప్పుడూ మా ఇంటికి తీసుకుని రాలేదని నా భార్య అలిగింది నాపై. అందుకని నిన్ను పిలుచుకుని పొదామని వచ్చాను’ అంది.

‘కానీ, నేను నీళ్లల్లోకి ఎలా రాగలను?' సందేహం వెలిబుచ్చింది కోతి.

‘ఓహ్ అదా! నువ్వు నా వీపు పైన కూర్చో. నిన్ను క్షణంలో మా ఇంటికి తీసుకెళతాను’

మొసలి మాటలు నిజమని నమ్మిన కోతి చెట్టు మీదనుండి క్రిందకు వచ్చి మొసలి వీపు పైన కూర్చుంది.

కోతిని మోసుకుంటూ మొసలి తన ఇంటి దారి పట్టింది. నీళ్ళల్లో కొంత దూరం వెళ్ళాక మొసలి ఏడవడం మొదలు పెట్టింది. మొసలి కన్నీళ్ళు చూసిన కోతి కంగారుగా ‘అదేమిటి మిత్రమా ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగింది.

‘ఏం చెప్పమంటావు మిత్రమా!’ అంటూ భార్యకు తలనెప్పి రావడం.. వైద్యులు చెప్పిన మందు గురించి భార్య చెప్పడం... అంతా వివరంగా కోతికి చెప్పి ‘నువ్వు నాకు మంచి మిత్రుడివి కనుక నీకు ఈ విషయం ముందే చెప్తున్నాను’ అంది మొసలి.

తనని చంపాలని మొసలి భార్య పన్నాగం పన్నిందని అర్థమైంది తెలివిగల కోతికి.

అందుకే ‘అయ్యో! ఎంత పని జరిగింది మిత్రమా! ఈ మాట నువ్వు ముందరే చెప్పి ఉంటే బాగుండేది కదా!’

‘ఏం ఇప్పుడేమైంది?’ ప్రశ్నించింది మొసలి.

‘నా గుండెకాయ చెట్టు మీద పెట్టి వచ్చాను. గుండె లేని నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళినా నీకు లాభం ఉండదు’

‘అవునా? మరిప్పుడేం చేద్దాం?’

‘నన్నువెంటనే చెట్టు వద్దకు తీసుకెళ్ళు. నా గుండె తీసుకుని త్వరగా వచ్చేస్తాను. అప్పుడు నీ భార్య కూడా సంతోషిస్తుంది. ఆమె తలనెప్పికి మందూ అమరుతుంది.’ అంది కోతి.

తెలివి తక్కువ మొసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి నది ఒడ్డుకి తీసుకొచ్చింది.

అంతే కోతి చెంగున ఒడ్డు పైకి గెంతి గబ గబా చెట్టెక్కి కూర్చుంది.

కోతి ఎంతకూ రాక పోయేటప్పటికి మొసలి ‘మిత్రమా త్వరగా రా’ అని కేక పెట్టింది.

అప్పుడు కోతినవ్వి ‘ఓరీ ! మిత్ర ద్రోహీ, నన్ను చంపి నీ భార్యను కాపాడుకుందామనుకున్నావా? నీ దుర్భుద్ది నాకు తెలిసింది. గుండె ఎక్కడైనా చెట్టు మీద ఉంటుందా? మోసాన్ని మోసంతోనే జయించాను. ఇవాల్టితో నీకూ నాకూ మధ్య స్నేహం ముగిసిపోయింది. వచ్చిన దారినే తిరిగి పో!’ అంది కోతి.

మొసలి తను చేసిన బుధ్ధిమాలిన పనికి సిగ్గుపడి మంచి మిత్రుణ్ణి కోల్పోయానని బాధపడి నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోయింది.

నీతి: మోసకారులనుంచి తప్పించుకోవాలంటే వారిని మోసంతోనే జయించాలి.

Posted in August 2018, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!