Menu Close
balyam_main

చిన్ననాటి చేదు అనుభవం

- ప్రతీక బుడమగుంట

రేవతి పార్క్ కి వెళ్లి ఆడుకోవడం అంటే ఎంతో ఆనందంగా ఉంటుందని ఎప్పుడూ అనుకొంటూ ఉండేది. అయితే ఒక చిన్న చేదు అనుభవంతో తన ఆలోచనలు అన్నీ తప్పు అనే నిర్ణయానికి వచ్చేసింది.

విజయవాడ అనే ఒక పట్టణంలో రేవతి వాళ్ళ అమ్మా నాన్నలు, అన్నలు, అక్కలతో కలిసి నివసించేది. అప్పుడు రేవతికి ఐదేళ్ళు. ఆ పట్టణం, జిల్లా ప్రధాన కేంద్రం అయినందున ఎప్పుడూ చాలా బిజీ గా ఉండేది. దానికితోడు రేవతి వాళ్ళ ఇల్లు పట్టణం నడిబొడ్డున ఉండేది. అందుకని ఎప్పుడూ రేవతి వాళ్ళ వీధి ఎక్కువ మంది మనుషులతో చాలా సందడిగా ఉండేది. అంతేకాక వాళ్ళ ఇల్లు కూడా రకరకాల పూలమొక్కలతో, పండ్ల చెట్లతో ఎంతో అందంగా ఉంటూ తన ఎదుగుదలకు ఎంతో హాయినిచ్చేది.

రేవతి ఎంతో సౌమ్యంగా, అమాయకంగా ఉండే అమ్మాయి. తన అక్కలైన ప్రియ, లక్ష్మి, మరియు కల్యాణి లతో ఎప్పుడూ ఆడుకోవడానికి ఇష్టపడేది. వాళ్ళ అక్కలు కూడా తను వారికన్నా చిన్నదైనను ఎప్పుడూ తమతో ఆడుకోనిచ్చేవారు. రేవతికి ఒకే ఒక అన్నయ్య మహేష్ బాబు ఎప్పుడూ తనకు భయం కలిగించే కథలు చెబుతూ, రకరకాల ట్రిక్స్, మేజిక్ లు చేస్తూ తనను ఎప్పుడూ ఆట పట్టించేవాడు. అయినను రేవతికి తన అన్న అంతే ఎంతో ఇష్టం.

park-aug2018ఇలా ఉండగా ఒకరోజు, అందరూ కలిసి వారి ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ కు వెళ్లాలని అనుకొన్నారు. అది విని రేవతి ఎంతో ఖుషిగా ఫీల్ అయ్యింది. తనకు పార్క్ కు వెళ్ళడం అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అక్కడ మంచి గాలి ఉంటుంది. పార్క్ లొ ఉన్న జారుడు బండలు, ఉయ్యాలలు అన్నీ కూడా ఎంతో బాగుంటాయి. వాటి మీద ఆడుకుంటుంటే టైం అసలు తెలీదు. అయితే ఆ రోజు రేవతికి ఒంట్లో కొంచెం నలతగా ఉంది. అందుకని తనను ఇంట్లోనే ఉంచి వారందరూ పార్కు కు వెళ్లారు. రేవతి వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. ఇంట్లో ఎంతో మంది కుటుంబ సభ్యులు ఉంటారు. వారి ముందరి రూమ్ నుండి ఫ్రంట్ గేటు కు వెళ్ళాలంటే చాలా దూరం అనిపిస్తుంది. మన రేవతి అందరూ తనను వదిలి వెళ్లిపోయారని ఆ మెయిన్ గేటు వద్ద ఏడుస్తూ నిలబడింది. రేవతి గేటు వద్ద ఉన్న విషయాన్ని మిగతా ఇంటి సభ్యులు ఎవ్వరూ పట్టించుకోలేదు. గేటు కూడా కొంచెం దూరం అయినందున ఆమె ఏడుపు కూడా ఎవ్వరికీ వినబడలేదు. తను ఎక్కడో ఆడుకొంటున్నదని రేవతి వాళ్ళ అమ్మ అనుకొంది.

“ఎందుకు రేవతి ఏడుస్తున్నావు?” అని తనను ఎవరో అడిగినట్లు అనిపించి రేవతి వెనుకకు తిరిగి చూసింది. ఎవరో పరిచయం లేని వ్యక్తి దాదాపు ఇరవై ఏళ్ళు ఉండచ్చు, తన దగ్గరకు వచ్చాడు.

“మా అక్క వాళ్ళు అందరూ నన్ను వదలి పార్కు కు వెళ్ళారు. నాకు ఆ ఫన్ అంతా మిస్ అయిపోతుందని ఏడుపు వస్తున్నది” అని వెక్కిళ్ళ మధ్య చెప్పింది.

“ఏడవకు. నేను నిన్ను ఆ పార్క్ కు తీసుకువెళతాను” అని ఆ వ్యక్తి నమ్మబలికి ఎన్నో విషయాలు చెబుతుంటే రేవతికి ఆటను తను ఇంతకు మునుపు పరిచయం ఉన్నట్లుగా అనిపించింది. అతనిని నమ్మవచ్చని కూడా భావించింది.

“మా వాళ్ళు ఏ పార్క్ కు వెళ్ళారో నీకు తెలుసా?” అని ప్రశ్నించింది.

ఆ ప్రశ్నకు ఒక నిమిషం అతడు తడబడి పిమ్మట “తెలుసు. ఎందుకంటే నిన్నూ, మీ అక్కలను నేను చాలా సార్లు ఆ పార్క్ లో చూశాను.” అని చెప్పాడు.

“సరే” అని చెప్పి రేవతి అతనితో కలిసి పార్క్ కు వెళ్ళడానికి బయలుదేరింది.

వారిద్దరూ కల్సి వెళుతూ ఉన్నపుడు, రేవతి పార్క్ కు వెళుతున్నానని ఎంతో ఆనందంగా చేతులు ఊపుకొంటూ అతనివెంట నడుస్తున్నది. నడుస్తూ ఒకసారి అతని వంక చూసింది. జులపాల జుట్టుతో కొంచెం వింతగా ఉన్నాడు. అతని కళ్ళలో ఎదో తీక్షణతను రేవతి గమనించింది.

రేవతి ఆ వ్యక్తిని చూడటం మానేసి ప్రక్కకు తిరిగి నడుస్తూ చుట్టుపక్కల ఉన్న భవనాలను, చెట్లను చూస్తున్నది. అంతా కొత్తగా ఉన్నది. ఈ త్రోవ తాము ఎప్పుడూ వెళ్ళే దారిలాగా అనిపించడం లేదు.

“నిజంగా నీకు ఆ పార్క్ తెలుసా? మేము ఎప్పుడూ వెళుతున్న దారి లాగా నాకు అనిపించడం లేదు” అని ప్రశ్నించింది.

“అవును ఇది పార్కుకు దగ్గరిదారి అందుకే ఇటుగా వెళుతున్నాము.”

అయితే రేవతి ఒక్క విషయం గమనించింది. అతను సందేహాత్మకంగా చూడటం గమనించింది. బహుశా తన లాగే అతను కూడా పార్కు కు వెళ్ళే ఆనందంలో ఉన్నాడని, అందుకనే సరిగా దారి గురించి ఆలోచించడం లేదని అనుకొని పార్కుకు వెళ్ళే వరకు ఏమీ మాట్లాడకుండా పరిసరాలను గమనిస్తూ అతనిని అనుసరించింది.

పార్కును సమీపించిన తరువాత అది తాము రెగ్యులర్ గా వెళ్ళే పార్క్ కాదని రేవతి గమనించింది. అయితే బహుశా పార్క్ ను అంతా క్రొత్తగా మార్చారేమో అని తనను తానూ సమాధానపర్చుకొంది.

“మీ వాళ్ళు కనపడ్డారా?” అని ఆ అపరిచిత వ్యక్తీ రేవతి భుజం మీద చేయి వేసి అడిగాడు.

రేవతి పార్క్ అంతా తన వాళ్ళ కోసం వెతకడం మొదలుపెట్టింది. పార్క్ అంతా వివిధ రకాల పచ్చటి పొదలతో, రకరకాల పూల చెట్లతో ఎంతో మనోహరంగా ఉంది. రంగు రంగుల ఊయలలు, జారుడు బండలు ఎంతో ముచ్చటగా ఉండి తమ వద్దకు రమ్మని పిల్లలను ఆహ్వానిస్తున్నట్లు ఉంది. చెట్ల మధ్య చక్కటి దారులు నడవడానికి ఎంతో అనువుగా ఉన్నాయి. రేవతి ఆ దార్ల గుండా నడుస్తూ తన కుటుంబ సభ్యుల కోసం వెతుకుతూ ఉంది. గడ్డిపోచల మధ్య సూది కోసం వెతికినట్లు, ఇంతమంది జనాల మధ్య తన అక్కలు, అన్న కొరకు వెతకడం అనేది ఎంతో కష్టమైనదని ఆ చిన్ని మనసుకు అర్థమైంది. వారు ఎక్కడా కనపడలేదు.

ఎక్కడో ఏదో తప్పు జరుగుతున్నది అని రేవతికి అనిపించసాగింది. అప్పుడే ఆ అపరిచిత వ్యక్తి అకస్మాత్తుగా రేవతి చెవులు పట్టుకొని గుంజసాగాడు.

“ఏయ్! ఏమి చేస్తున్నావు” అని రేవతి గట్టిగా అరిచింది.

అయినా కూడా అతను వదలక రెండు చెవులకు ఉన్న బంగారు చెవి రింగులను తెంపుకొని రేవతిని అక్కడే వదిలేసి పారిపోయాడు.

“హేయ్! ఎవరన్నా కాపాడండి. నాకు సహాయం చేయండి” అని రేవతి పెద్దగా అరిచింది. కానీ ఎవ్వరూ ఇటువైపు తలతిప్పి కూడా చూడలేదు. రేవతికి అంతా అయోమయంగా ఉంది. ఇటువంటి అనుభవం ఎప్పుడూ తనకు కలగలేదు. ఏమి చేయాలో తెలియడం లేదు. ఈ పార్క్ కూడా తనకు అంతా కొత్తగా ఉంది. ఒడ్డున పడిన చేపలా ఉంది తన పరిస్థితి.

రేవతి ఎంతో బాధతో ఏడుస్తూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది. ఎంత దిగమింగుకున్ననూ ఏడుపు ఆగక వస్తున్నది. ఏమి చేయాలి, నేను ఇంటికి ఎలా వెళ్ళాలి, ఈ పార్క్ లోనే ఉండిపోవాలా? ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆ బెంచ్ మీద కూర్చొని ఏడుస్తుండగా, ముగ్గురు అబ్బాయిలు తన వద్దకు వచ్చారు. “ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు. ఇంతకుముందే ఒక క్రొత్త వ్యక్తి తో తనకు అయిన చేదు అనుభవం బాధిస్తుంటే మరలా ఇంకెవరో వచ్చారు అనే అనుమానంతో వారిని చూసింది. అయితే వారు ఎంతో హుందాగా, చక్కని వస్త్రధారణ తో ఉన్నారు. వారి నవ్వులో కూడా నిజాయితీ కనిపించింది.

“నేను తప్పిపోయాను. నన్ను ఇక్కడకు తీసుకొని వచ్చినవారు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఇలా ఒంటరిగా ఉండిపోయాను” అని చెప్పింది.

రేవతి మాటలను విని వారు వెంటనే “మీ ఇల్లు ఎక్కడ? మేము నిన్ను మీ ఇంటి దగ్గర వదిలివెళతాము” అని అడిగారు. చూస్తుంటే వీళ్ళు చాల మంచివాళ్ళుగా అనిపిస్తున్నారు. కానీ నాకు “మా ఇంటి అడ్రస్ తెలీదు. మరి ఇప్పుడు ఎలా” ఆ మాటను పైకే అనేసింది.

అది విన్న ఆ అబ్బాయిలు నిరాశ చెందక, రేవతిని ప్రశ్నించడం మొదలుపెట్టారు.

“మీ ఇంటికి సంబంధించిన గుర్తులు ఏవైనా నీకు గుర్తున్నాయా? అంటే, మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు, షాపులు. లేకపోతే మీ నాన్న, తాతయ్య పేర్లు, ఇలా?” అని అడిగారు.

“తాతయ్య పేరా? నాకు మా తాతయ్య పేరు తెలుసు.” రేవతి ఆలోచించింది. వెంటనే వాళ్లకు తన తాతయ్య పేరు చెప్పింది. ఆయన ఆ వూరిలో పేరుమోసిన న్యాయవాది కనుక వారికి రేవతి వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కోవడం సులభమైంది. ఆ ముగ్గురు అబ్బాయిలు రేవతిని వెంటపెట్టుకొని జాగ్రత్తగా రేవతి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టారు.
ఎప్పుడైతో తన ఇంటి పరిసరాలు రేవతి చూసిందో వెంటనే పరిగెట్టుకుంటూ ఇంటి వద్దకు చేరుకొని ఇంట్లోకి వెళ్ళింది. ఇంటి వాకిట్లోనే రేవతి వాళ్ళ అమ్మ కూర్చొని ఉంది. ఆవిడను చూడగానే రేవతి ఎంతో ఆనందపడి పరిగెత్తుకెళ్ళి ఆవిడ వడిలో వాలిపోయింది.

“ఎక్కడికి వెళ్లావు రేవతి? మాకు ఎంతో భయమేసింది. ఇంట్లోని అందరూ నీకోసం వెతకడానికి వెళ్ళారు. మీ తాతగారు మనకు తెలిసిన వారిని కూడా నిన్ను వెతకడానికి పంపించారు.” ఎంతో ఉద్వేగంతో రేవతి వాళ్ళ అమ్మ రేవతిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని అడిగారు. అప్పుడే రేవతికి దెబ్బలు ఏవైనా తగిలాయేమోనని కూడా తన కాళ్ళూ, చేతులను పరీక్షించారు రేవతి అమ్మగారు. అదృష్టవశాత్తు దెబ్బలు ఏవీ లేవని తెలిసి సంతోషపడ్డారు. వెంటనే తన కర్తవ్యం గుర్తుకువచ్చి రేవతితో పాటు ఇంటి బయటకు వచ్చి రేవతిని తీసుకొని వచ్చిన అబ్బాయిలకు కృతజ్ఞతలు చెప్పింది.

రేవతి వాళ్ళ అమ్మతో కలిసి ఇంట్లోకి వెళ్లి మంచి నీళ్ళు తాగేసమయానికి తనను వెతకడానికి వెళ్ళిన మిగిలిన కుటుంబ సభ్యులందరూ వెనుకకు వచ్చేశారు. అందరి కుతూహలాన్ని గమనించిన రేవతి, జరిగిన విషయాలన్నీ వారికి పూసగుచ్చినట్లు చెప్పి, వారందరూ తనను కోప్పడుతారేమోనని భయపడింది. కానీ, ఆశ్చర్యం ఎవ్వరూ తనను పల్లెత్తు మాట అనలేదు. తను ఇంటికి క్షేమంగా వచ్చిందని ఎంతో సంతోషపడ్డారు.

ఈ సాహస అనుభవం ద్వారా రేవతికి ఒక విషయం తెలిసివచ్చింది. ఎవ్వరో ముక్కు మొహం తెలియని వ్యక్తులతో కలిసి ఎప్పుడూ తెలియని ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు నుండి ఎవరైనా అపరిచిత వ్యక్తులతో కలిసి తను ఎక్కడికీ వెళ్ళలేదు.

స్వీయ అనుభవాలు మనకు జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పుతాయి.

### ఇంకా వుంది ###

Posted in August 2018, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!