Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

అత్త తొక్కింది పాతకుండ, కోడలు తొక్కింది కొత్తకుండ

స్వాతంత్య్ర దినోత్సవం ముందురోజు ముంగమూరు పంచాయితీ ఆఫీసులో మరునాటి వేడుకలకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంచాయితీ ఆఫీసరు, పంచాయితీ ప్రెసిడెంట్ దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నారు.

మూడు స్కూళ్ళ పిల్లలు మూడు వందల మంది, ముప్పై మంది ఉపాధ్యాయులు ఉదయాన్నే ఊరేగింపుగా పంచాయితీ ఆఫీసుకు వచ్చి, కొన్ని కార్యక్రమాలు పాటలు, నృత్యాల వంటివి చేయబోతున్నారు. దానికోసం వేదిక, ఇంకా అనేక ఏర్పాట్లూ ఘనంగా చేయిస్తున్నారు. పంచాయితీ ప్రెసిడెంట్ గారు గెలిచాక వస్తున్న మొదటి పండుగ అదే. పిల్లలందరికోసమే కాక ఊర్లో పండుగ చూడను వచ్చే వారందరికోసం లడ్డూలు చేయిస్తున్నారాయన. పెద్ద పాఠశాల పెద్దపంతులు గారు కూడా వారి కోరికపై అక్కడ ఏర్పాట్లలో పాలుపంచు కుంటున్నారు.

ఒక కూలీ వ్యక్తి ఒక పెద్ద ఎత్తైన బల్ల ఎక్కి వేదిక చుట్టూ తోరణాలు కడుతున్నాడు. ఇంతలో పెద్ద శబ్దంతో ఆ బల్ల విరిగి ఆ వ్యక్తి క్రిందపడ్దాడు. పెద్దగా దెబ్బ తగల్లేదు కానీ కొద్దిగా గాయాలయ్యాయి. బల్ల మాత్రం మధ్యలో చెక్క విరిగి పోయింది. పంచాయితీ ప్రెసిడెంట్ వచ్చిచూసి, "ఏమోయ్ ! జాగ్రత్త ఉండద్దూ! ఇలా బల్లలన్నీ విరగ్గొట్టుకుంటూ పోతే మన పంచాయితీ సంపద ఏమైపోనూ! చూసుకుని వాడుకోవద్దూ!" అంటూ కోప్పడ్డాడు.

క్రిందపడ్డ ఆవ్యక్తి మోకాళ్ళు డోక్కుపోయి చిన్న పాటి గయాలయ్యాయి. అక్క డే ఉన్న పెద్దపంతులుగారు "లేదు లెండి ప్రెసిడెంట్ గారూ ఈ బల్ల చాలా పాతది. గత ఏడాదే దీన్ని రిపేర్ చేయించమని చెప్పాను. ఆ పాత ప్రెసిడెంట్ గారు విన్నారుకాదు." అంటూ తన బ్యాగ్ లోని ప్రధమ చికిత్స పెట్టేతీసి క్రిందపడ్డ ఆ వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ తర్వాత మరొకరు ఎత్తైన నిచ్చెన తెచ్చి ఆ తోరణాలుకట్టారు. ఆ తర్వాత అక్కడ కట్టిన బ్యానర్ లో తన పేరు బాగా కనిపిస్తున్నాదా, లేదాని చూడను ఆ ప్రెసిడెంట్ గారు పక్కనే ఉన్న ఒక బల్లమీద ఎక్కి చూస్తుండగా, ఆ బల్ల ఆయన బరువుకు మధ్యలో కన్నంపడి ఆయన పైనుంచీ క్రిందకు జారి పోయాడు. అందరూ వచ్చి ఆయనకు చేయిచ్చి పైకి లాగారు.

"ఏమయ్యా! మంచి బల్ల చూసి ఇక్కడ పెట్టవద్దూ! పాత పాతవి తెచ్చి పెట్టి ఇలా చేస్తారా!" అంటూ అందరి మీదా నోరుచేసుకున్నాడు.

పెద్దపంతులుగారు వచ్చి "సార్! ఇది ఈ రోజే కొని తెచ్చిన కొత్త బల్ల. దాని బలం అంతబాగా ఉంది. దాన్ని తయారు చేసిన వారి చాతుర్యం ఇంత గొప్పగా ఉంది." అని సర్ది చెప్పారు.

దూరంగా రంగు కాయితాలు కట్టిస్తున్న పంచాయితీ ఆఫీసరు దగ్గరికొచ్చి పెద్ద పంతులుగార్ని "ఏమైంది మాస్టారూ!" అని అడిగారు. దానికి పెద్ద పంతులుగారు "ఏమీ లేదండీ! ‘అత్త తొక్కింది పాతకుండ, కోడలు తొక్కింది కొత్తకుండ.’ అంతే పదండి మిగతా ఏర్పాట్లు చూద్దాం" అని నవ్వుతూ కదిలారు.

Posted in August 2018, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!