Menu Close
శుభాశంసన
- ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ
పూర్వ ఉపకులపతి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం,ఆం.ప్ర.

అటు తలలో, ఇటు గుండెలో సందడించే భావాలు నడుమ సయోధ్య పొందుతూ కలగలసి,
చేతివేళ్ల చైతన్యంతో  అక్షరాలై ప్రాణం పోసుకొని పదుగురికీ చేరే వేదిక - పత్రిక!
                            'యద్భావం తద్భవతి!'
మనల్ని మనం అక్షరాల్లో సృజింపచేసుకొనే వేదిక - సాహిత్య పత్రిక!

దేశం కాని  దేశంలో  మన భాషను, 
భాషనే కాదు- భాష తల్లిపాలతో రంగరించి ప్రాణం పోసిన భావాలను, 
భావాలనే కాదు - వాటికి ప్రాణం పోసిన మన సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని 
పిన్నా పెద్దలందరికీ అందుబాటులోని శైలిలో, అభిరుచి పెంచే శీర్షికలతో 
శ్రమ సమయాలను వెచ్చించి, ఇంటిల్లిపాదీ నిస్వార్థ సేవా భావంతో 
ఓ సాహిత్య పత్రిక నడపడమంటే అంత సులువు కాదు, అందులో మూడేళ్లు!!
అందునా, వైద్యశాస్త్రరంగ ఆచార్యకత్వంలో ఉంటూ, 
అమెరికాలో ఇల్లాలినిబ్బంది పెట్టే దుస్సాహసం చేస్తూ 
తాను రచయిత కాకున్నా , కేవలం  మాతృభాషా సాహిత్యాలపట్ల మమకారంతో!!
అందుకు మధుగారిని, వారి అర్ధాంగిలక్ష్మి ఉమగారిని మనసారా అభినందిస్తున్నాను...

సృజన అంటే చిరంతనంగాసాగే  'సాంస్కృతిక వ్యక్తిత్వ'  ఆవిష్కరణ!
ఆ వ్యక్తిత్వం తనకుంటమే కాదు,అందరిలో వికసింప చేస్తున్నారు మధు!
అభినందించి, యథాశక్తి సహకారమందించడం 'తెలుగు' ప్రేమికుల విధి ! 

************************

ఇంటా బయట అలా సహకారమందిస్తున్నవారిలో 
నన్నాకట్టుకొనే చక్కటి రచనలు చేస్తున్నవారిలో ముఖ్యులు 
అద్భుత పద్యకవితామూర్తి అయ్యగారి సూర్యనారాయణ మూర్తి,
ఎనభై మూడేళ్ల పెద్ద వయసులో కూడా నిత్య రచనోత్సాహశీలి, వెంపటి హేమ గారు..

లోతైన భావుకత, శబ్దంపై అధికారం, చమత్కారం, ఛందోబద్ధమైన సంగీతం 
కలిస్తే ఒక పద్యం.

అది తెలుగన్నడిగులు కలిసి సాధించుకొన్న వారసత్వం. అందులో తెలుగు వారిది మరీ ప్రత్యేకం.
పద్యం తెలుగు వారికే స్వంతమన్నంతగా ప్రత్యేకం. పాటనూ శ్లోకాన్ని కలిపి తీర్చిదిద్దిన విశిష్టరూపం.
శోకాన్ని, గీతాన్ని కలిపి వాల్మీకి సంస్కృతంలో సుశ్లోకమైన ఆదికావ్యావతరణం చేయిస్తే, 
శ్లోకాన్ని, పాటనూ కలిపి నన్నయ తెలుగులో భారతీదేవికి పద్య తీర్థం నిర్మించాడు. 
ఎందరు మహాకవులు ఆ తీర్థంలో మునిగి తరిస్తున్నారో, తరింపచేస్తున్నారో! 
ఇప్పటికీ తెలుగువారొక్కరే యావద్భారతదేశంలో పద్యాన్ని నిలుపుకొన్నారు. పద్యంతో తెలుగు తల్లిని అభిషేకిస్తున్నారు.... కన్నడిగులతో సహా అందరూ ఆ విద్యను పోగొట్టుకున్నారు....

పద్యమంటే గణాల కూర్పూ కాదు, ప్రాసయతుల చేర్పూ కాదు, ఆటవెలదుల కంద(క) క్రీడ నేర్పూ కాదు. పైన చెప్పిన లోతైన భావుకత, శ్రావ్యమైన శబ్దంతో కలిసి ప్రవహించే పాలధార. సరస్వతీదేవి రెండు చేతులా, సంగీతం సాహిత్యం కలిపి తెలుగుజాతికిచ్చిన తల్లి పాల ధార.  భాషపై సాధించే అధికారం కంటే మించి, సుప్త చిత్తం( సబ్ కాన్షస్ దశ) లో ప్రశాంత సాధన జరుగుతుంటేగాని పట్టుబడని విద్య.

అలాటి పద్యవిద్యారహస్యం తెలిసిన ఆధునిక సుకవుల్లో శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారొకరు. కావడానికి ఆయన ఇంజనీరింగులో ' సర్వేషాం ఫస్టు ఫస్ట' యినా, సమున్నత బాధ్యతల్లో మునిగి తేలినా, ఆయన పురాసుకృతం, పద్యవిద్యాకళ  ఆయనకు పట్టుబడింది. ఆ కళతో ' సిరిమల్లె' వేదికగా, తెలుగుతల్లిని ఎన్నో అందమైన పద్యాలతో ఆయన ప్రతినెలా అలంకరిస్తున్నారు. నిజం చెబుతున్నా, మరెన్నో మంచి శీర్షికలున్నా, నేను సిరిమల్లెను ప్రతినెలా క్రమం తప్పక తెరిచేది ఆయన పద్యాలు చదవడానికే! ఆధునిక అంశాలతోపాటు, అలాటి సాంప్రదాయిక శీర్షికలను నిర్వహిస్తున్నందుకు సిరిమల్లె సంపాదకుల్ని మనసారా అభినందించాలి.

 ************************

సిరిమల్లెకు ఆర్థిక సౌలభ్యముంటే, అలాటి వారిని ఆహ్వానించి, ఇలాటి సమ్మర్ లో, ఓ రెండు వారాంతాల విడుపులో, స్థానికులకు ఓ వర్క్ షాప్ నిర్వహించి, కొందరినైనా స్థానిక కవులను తయారుచేయిస్తే చాలా బాగుంటుంది. తయారు చేయడమంటే, తర్ఫీదిచ్చి తీర్చిదిద్దడమే! 

రచనాసక్తి చాలామందిలో సహజంగా ఉంటుంది. ఒడుపుగా తర్ఫీదిచ్చి తీర్చిదిద్దే అవకాశాలే తక్కువ. వారి సంఖ్యను ఎక్కువ చేయడంలోనే, ఆ భాషాజాతి భవిత, ఘనత, గౌరవం ఆధారపడి ఉంటాయి . అందులోనూ ఇలాటి బహుళ సాంస్కృతిక దేశంలో. ఇంగ్లీషు మాధ్యమంలోని మన కుర్రకారులో రచనాసక్తి ఉన్నవారు బాగానే ఉన్నారు, ఇక్కడ బడులలో క్రియేటివ్ రైటింగ్ మీద చూపే శ్రద్ధను మరీ హర్షించాలి.  ఆ పిల్లల దృష్టిని వాళ్లకు వచ్చీ రాని మాతృభాషల వైపు మరల్చాలి. మధ్యలో ఓ క్రియోల్ -సంకరభాష- ఏర్పడ్డా ఫర్వాలేదు. మారిషస్ దేశంలో ఫ్రెంచ్ సాంకర్యంతో రూపొందిన క్రియోల్ భాషకు  ఆధికారికమైన గుర్తింపుంది.

యాసపేరిట రాష్ట్రాలే విడగొట్టుకొన్న తెలుగువారు ఇక్కడో కొత్త యాసభాషను సృష్టించుకొంటే తప్పేమిటి? అసలు భాషంటేనే ఓ systematised arbitrariness! ధ్వనికీ ధ్వనికీ మధ్య arbitrary! శబ్దానికీ అర్థానికీ మధ్య ఆర్బిట్రరీ. వాటిమధ్యలో ఒక స్పష్టమైన వ్యవస్థీకరణే భాష. ఒక సమాజం మొత్తంగా చేసుకొనే  వ్యవస్థీకరణ!

కొత్త తరాన్ని వ్యవస్థీకరణ చేసుకోడంలోనే, భవిష్యత్తరాల మనుగడ, మన్నన!

అలాటి చారిత్రక  పాత్ర నిర్వహణలో పత్రికల పాత్ర అమోఘం.

అందులో అమోఘంగా మూడు వసంతాలు పూర్తి చేసుకొన్న 'సిరిమల్లె'

మరో వంద వసంతాలు వసివాడకుండా పరిమళిస్తుండాలని నా శుభాశంసన!

నిజానికిది శుభాశంసన కాదు, పాఠకుల పక్షాన అభినందన, ధన్యవాద సమర్పణ.

Posted in August 2018, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!