Menu Close
కొంటె కోర్కె … !!
-- డా. కె. ఎల్. వి.ప్రసాద్ --

సంజయ్, శ్రీలత హైదరాబాద్ కు వచ్చి ఆరునెలలు. వాళ్లకు పెళ్ళై షుమారు సంవత్సరం కావొస్తోంది. వాళ్లకి ఇంకా పిల్లాపీచు ఉన్నట్టు లేరు. మరి హైదరాబాద్ కు ఎందుకు వచ్చినట్టు? కారణం లేకపోలేదు. వాళ్ళ పెళ్ళికి రెండునెలల ముందే సంజయ్ పోటీ పరీక్షలకు వెళ్ళాడు. పెళ్లితర్వాత ఇంటర్వ్యూ రావడం, ఉద్యోగం వచ్చినట్టు సమాచారం అందడానికి అతనికి ఇంత కాలం పట్టింది.

ఇంతకీ అతనికి ఉద్యోగం ఎక్కడ వచ్చినట్టు? అదే చెప్పబోతున్నా. హైదరాబాద్ లో రవీంద్రభారతికి కొంచెం దూరంలో రోడ్డుకు ఆవలి వైపు వున్న ఫారెస్ట్ ఆఫీసులో స్టెనోగా అతనికి ఉద్యోగం వచ్చింది.

సంజయ్ హైదరాబాద్ గురించి వినడమే గాని, ఎప్పుడూ అక్కడికి పోయే అవసరం ఏర్పడలేదు. ఇప్పుడు ఉద్యోగం కాబట్టి రాక తప్పలేదు. ఇద్దరూ.. ఒక చిన్న జీతగాడి సంపాదనతో బ్రతకడం కష్టమని తెలిసినప్పయికీ, కొత్తగా పెళ్ళైన ముచ్చటైన జంట మరి, ఒకరినొకరు వదలి ఎలా ఉండగలరు? అందుకే ‘కష్టమైనా సుఖమైనా కలసి బ్రతుకుదాం’ అనే ఫార్ములాను నమ్ముకుని, ధైర్యంగా నరసాపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ఎక్కి తెల్లారేసరికి హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ లో దిగిపోయారు.

వాళ్ళ సహనాన్ని పరీక్షించడానికన్నట్టు బండి వచ్చిన పదిహేను నిముషాలకు వెతుక్కుంటూ వచ్చాడు సంజయ్ మిత్రుడు సంపత్. కుశల ప్రశ్నలు ముగించుకుని స్టేషన్ బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుని చింతలబస్తీకి చేరుకున్నారు ముగ్గురూ. సంపత్ బ్రహ్మచారి కనుక సంజయ్ ఇల్లు చూసుకునేవరకూ ఒక వారం రోజులు తన ఇంట్లో ఉండమని చెప్పాడు సంపత్. సంజయ్ కి అతని ముద్దుల భార్యకి ఈ ఆలోచన నచ్చింది.

ఆఫీసులో జాయిన్ అయి మరునాటి నుండీ ఇంటి వేటలో పడ్డాడు సంజయ్. అనుకోకుండా ఆఫీసులో పరిచయం అయిన మిత్రుడి సహాయంతో రెండు రోజుల్లోనే వాళ్లకి సరిపోయే రెండు గదుల ఇల్లు దొరికింది, ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ కు దగ్గరలో. ఆఫీసుకి మిత్రుడికీ దగ్గరలో ఇల్లు దొరికినందుకు ఎంతగానో సంతోషించారు సంజయ్ దంపతులు.

ఒక ఆదివారం పూట రిక్షా మాట్లాడుకుని, సంపత్ ను అప్పుడప్పుడూ తమ ఇంటికి వస్తుండమని ఆహ్వానించి రిక్షాలో తమ ఇంటికి ఆనందంగా చేరుకున్నారు.

ఇల్లు సింపుల్గా వున్నా సంజయ్ భార్య స్రవంతికి ఆ ఇల్లు తెగనచ్చేసింది. ఇంటి ముందు ఖాళీస్థలం, చుట్టూరా పూలమొక్కలు ఆమెకు ఎంతగానో నచ్చింది ఇల్లు.

ఉన్నదాంట్లో సర్దుకు పోతూ వాళ్ళ జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది.

స్రవంతి పెద్ద.. పెద్ద .. కోర్కెలు కోరకుండా భర్తకు ఎంతగానో సహకరిస్తుంది. భార్య సహకారం, ఆమె అందిస్తున్న ప్రేమ అతనిలో ఉత్సాహం మరింత పెంచుతోంది. భర్త ఆఫీసుకు వెళ్ళిపోయాక, పనులన్నీ పూర్తి చేసుకుని నవలలు, కథలూ చదువుకుంటుంది. ఆమె జీవితానికి కావలసిన ఆనంద సూత్రాలు పుస్తక పఠనం ద్వారా ఎన్నో తెలుసుకుందామె. అందుకే వాళ్ళ జీవితం సంతోషంగా గడిచిపోతోంది.

ఆ రోజు సాయంత్రం కాస్త అలసిపోయి వచ్చాడు భర్త. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన సంజయ్ స్రవంతిని ఉద్దేశించి “బంగారం .. ఈవాళ భోజనం బయట చేయాలనిపిస్తోందోయ్ ..” అన్నాడు, భార్య కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ.

“అవునండీ .. నాకూ అనిపిస్తోంది, మీతో చెబితే ఏమంటారో అని నేను మీకు చెప్పడం లేదు” అని, “ఇప్పుడే తయారై వచ్చేస్తానండీ” అని ఆనందంగా ముందుకి కదలబోతున్న స్రవంతి సడెన్ గా ఆగిపోయింది.

“ఆ .. ఆ .. త్వరగా తయారై, ప్లేట్లు, అన్నం బయటికి తెచ్చేయి, ఈ లోగా నేను చాప పరుస్తాను. పుచ్చ పువ్వులాంటి ఈవెన్నెల్లో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తినేద్దాం” అన్నాడు మామూలుగా.

భర్త సంజయ్ అన్నమాట అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు సాగింది వంట గదిలోకి స్రవంతి. సంజయ్ తన హడావిడిలో తానున్నాడు.

(సమాప్తం)

Posted in November 2021, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!