కోమలి, ఒక అందమైన అమ్మాయి. అందంగా, నాజూకుగా, అప్పుడే పూసిన మందారం, ఇప్పుడే అర విరిసిన మల్లె, అలా కవుల హృదయాలను రంజింప చేయగల అందం అనవచ్చు. కానీ పేరుకు తగ్గ నాజూకుతనం ఆమెకు పెట్టని ఆభరణం. ఆ నాజూకుతనానికి తోడు చురుకైన చూపులతో, గంభీరమైన ముఖ వర్చస్సుతో చూసిన కొద్దీ, చూడాలనిపిస్తుంది. దీనికి తోడు ఆమె చదివిన చదువు ఆమెకు హుందాతనాన్నిఇచ్చింది. ఇన్ని సుగుణాలు కలిగిన కోమలి రామనాధం గారి గారాల కూతురు. ఆయన తన కూతురు మీద ఈగను కూడా వాలనివ్వరు. ఇద్దరు అన్నలు మహేష్, సురేష్ లకు గారాల చెల్లెలు.
కోమలి ఒక మల్టీ నేషనల్ కంపెనీలో టీమ్ లీడర్ గా పని చేస్తోంది. ఒకరోజు తన గ్రూప్ తో మీటింగ్ లో ఉండగా లాంజ్లో కూర్చున్న ఒక యువకుడు తననే చూస్తూండటం గమనించి కొంచెం తడబడింది. కాసేపటికి మరచిపోయి తన పనిలోమునిగి పోయింది. కానీ తరువాత వరుసగా అతను తననే అనుసరిస్తూండటం గమనించి కంగారు పడింది.
ఒక రోజు కోమలి ఇంటికి చేరే సరికి అతను తన తండ్రితో మట్లాడుతూ ఉండటం చూసి ఆశ్చర్య పోయింది. తండ్రి లోపలకు వచ్చి, అసలు విషయం చెప్పాడు. అతను కోమలిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడట, కాబట్టి వాళ్ళ ఇంటికివచ్చి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడమని అడుగుతున్నాడని చెప్పారు.
రెండు రోజుల తరువాత రామనాధంగారు కోమలితో, ‘చూడు బంగారం, నేను, అమ్మ బాగా ఆలోచించి, ఒకసారి నవీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దామనుకుంటున్నాము, నువ్వేమంటావ్’ అని అడిగారు.
‘మీ ఇష్టం, నాన్నా’ అని చెప్పింది.
***
అంతా ఇట్టే జరిగి పోయింది. కోమలి పెళ్ళి నవీన్ తో అంగరంగ వైభవంగా జరిగింది. ఘనమైన సారె తో ఆమె అత్తగారింట్లో అడుగు పెట్టింది. పదహారు రోజులపండగ కూడా అయ్యాక కోమలి వంటింటి ప్రవేశం చేసింది. అప్పుడర్ధమైంది, కోమలికి. ఇది తన పుట్టిల్లు కాదని, ఇక్కడ అందరూ తను చేసినవన్నీ మెచ్చుకోరు, విమర్శిస్తారని. తరిగే కూరగాయలనుంచి తను చేసే ప్రతి పనికి విమర్శలొచ్చేవి. ఎదిరించటం అలవాటు లేక కళ్ళెంబడ నీళ్ళు వచ్చేవి. అది చూసిన తోడికోడలు ‘అందుకే నేనేమి కల్పించుకోను, చెయ్యడమెందుకు పడటమెందుకు?’ అని ఒక విసురు విసిరింది. అలా అని స్నేహంగా ఏం ఉండేది కాదు. ఇంట్లో అందరితో అంటీ ముట్టనట్లే ఉంటుంది. ఆమె ఏ జి ఆఫీస్ లో జాబ్ చేస్తోంది. తను తయారవటం, తన పిల్లలని తయారు చేయడం అత్తగారు చేసిన వంట బాక్సు లో సర్దుకోవడం ఆఫీసుకు వెళ్ళటం, సాయంత్రం వస్తూనే గదిలోకెళ్ళిన మనిషి భోజనాల సమయంలోనే మళ్ళీ కనపడేది. ఆడపడుచు శారద కూడా అక్కడే ఉంటోంది తన పిల్లలతో. ఆమె భర్తే, అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉంటాడు.
పెళ్ళికోసం పెట్టిన శలవు పూర్తి కావటంతో, ఉదయమే లేచి తయారయి క్రిందకు దిగింది కోమలి. వంటింట్లో ఉన్నఅత్తగారి దగ్గరకు వెళ్ళి, ‘అత్తయ్యా, నేను ఇవాళ్టినుంచి ఆఫీస్‌కు వెళుతున్నాను, ఎనిమిదింటి ఎమ్ ఎమ్ ఎస్ లో వెళ్ళాలి’ అంది. అంతే, ఆమె పెద్దగా అరుస్తూ, ఏడుస్తూ, ‘నా వల్ల కాదు, నేను ఈ వెట్టి చాకిరీ చేయలేను, ఒక్క దానినీ, ఎన్నిపనులని చేయాలి? అందరూ టింగు రంగా అంటూ పోతే’, అంటూ మొదలు పెట్టింది. ఆ హడావుడికి అందరూ వచ్చారు. మామగారు ఆమెను వెనకేసుకొస్తూ ‘ఇల్లన్నాక అందరూ తలా ఒక పని చేసుకోవాలి, అదొక్కతే ఎన్నని చేయగలదు?’
బావగారు నోరు తెరిచే లోపే తోడికోడలు విజయ ‘ఈ ఏడుపెందుకు? ఇంటా బయటా చేయడం నా వల్లా కాదు. అదిగో మీ చెల్లెలు, రెండు రోజులకొకసారి పిల్లల్నేసుకొని వస్తుంది, నెలల తరపడి ఉంటుంది, సాయం చేయచ్చుగా?’ అంటూసాగదీసింది. ఆడపడుచు ‘నేనే అందరికీ లోకువ. అక్కడ పడలేకే కదా ఇక్కడకొచ్చింది. మీకూ నేను లోకువై పోయాను’ అంటూ ఏడుపందుకొంది.
బావగారు ‘విజయా నువ్వుండు’ అన్నాడో లేదో, ‘నేనేమన్నా మీకు తప్పే, నేను, నా పిల్లలే మీకులోకువ. ఈ ఇంట్లో నేనేమన్నా తప్పే, నేను పోతున్నా’ అంటూ పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళి ఆటో ఎక్కేసింది తోడికోడలు. ఆమె వెనకాలే బండేసుకుని బావగారు వెళ్ళారు.
నవీన్ వచ్చి తల్లి ప్రక్కనే కూర్చుని, ‘కోము, ఇలారా,’ అంటూ ఒక దోషిని పిల్చినట్లే పిలిచి, వేలు చూపిస్తూ, ‘చూడు ఈవేషాలన్నీ నా దగ్గర కుదరవు, ఎవరైనా మా అమ్మని కష్ట పెడితే నాకు నచ్చదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే, అమ్మపనులన్నీ అయ్యాకే వెళ్ళాలి, అర్ధమైందా?’ అంటూ గర్జించాడు. ఆ మాటలతో శాంతించిన అత్తగారు ‘చాల్లే, దాన్నెందుకు భయపెడతావ్? నువ్వు పోవే అమ్మా, ఆఫీస్‌కి వెళ్ళాలన్నావుగా, నువ్వు పో’ అంది. ఒకసారి మొహం కడుక్కొని, బయలుదేరింది. దారంతా ఆలోచనలతో సతమతమై పోయింది. ఎవరి తప్పు ఏంటో, తన తప్పు ఎక్కడ ఉందో, ఏమర్ధం కానేలేదు. సాయంత్రం నవీన్ ఏం జరగనట్లు నవ్వుతూ మాట్లాడుతుంటే ఇబ్బందిగా అనిపించింది. కానీ సర్దుకు పోయింది.
ఆఫీసులో కూడా కోమలి పరిస్ధితి నెమ్మదిగా మారిపోయింది. అదివరకటి హుషారు తనలో లేకపోవటంతో తన ప్రాముఖ్యత తగ్గింది. రోజూ ఇంట్లో ఏదో ఒక హడావుడి, దాంతో పనిమీద ఏకాగ్రత తగ్గింది. అలవాటులేని పనుల వలన అలసటగా ఉండేది. ‘సందులో సడేమియా’ అన్నట్లు నెల తప్పింది. రెండు మూడు మీటింగులకు, సమయానికి వెళ్ళలేకపోవటం, మీటింగు మధ్య చిన్న కునుకు తీయడం, రెండు మందలింపుల తరువాత పర్ఫార్మెంస్ బాగా లేదంటూ కోమలిని టెర్మినేట్ చేసింది కంపెని.
ఇంట్లో, నవీన్ కి ఆ విషయం తెలియగానే, ‘నీకసలు బాధ్యత లేదు, ఇంట్లో లాగా బయటకూడా ఏ పనీ చేయలేవు. కాళ్ళో, గడ్డాలో పట్టుకోవాలిగాని, వాళ్ళు తీసేయగానే సరేనంటూ వచ్చేయటమేనా? మీ బాసు నంబరియ్, నేనుమాట్లాడతాను’ అంటూ విరుచుకు పడ్డాడు.
‘నేనైతే అక్కడే చచ్చేదావ్ని, అలా తీసెయ్యటం ఎంత అవమానం’ అంటూ ఆడపడుచు అంటే, ‘నాకు ఆ భయంలేదు, నేను రిజైన్ చేసేదాక నవ్నెవ్వరు తీసెయ్యరు’ అంటూ తోడికోడలు, ‘నలభైఐదేళ్ళ సర్వీస్‌లో బ్లాక్ మార్కేలేదు. జాగ్రత్తగా ఉండాలిగా’ అంటూ మామగారు, ఏమనక పోయినా చిరాగ్గా మొహం పెట్టిన అత్తగారు, బావగారు, వీళ్ళందరినీ చూసినా రాని బాధ, నవీన్ ప్రవర్తన వలన కలిగిన అవమానం ఎక్కువ బాధ పెట్టింది. ఏమీ అనలేక నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది.
కళ్ళు తెరచిన కోమలికి ఎదురుగా అమ్మా నాన్నా కనిపించారు. కోమలి లేవటం చూసిన రామనాధంగారు నవ్వుతూ ‘ఏం తల్లీ, ఎలా ఉంది’ అని అడిగారు.
‘బాగున్నాను, నాన్నా, కానీ మీరు ఇక్కడ?’
‘నిన్న అల్లుడుగారు ఫోన్ చేసి, నువ్వు పడిపోయావంటే నాన్న వచ్చి నిన్ను మనింటికి తీసుకువచ్చారు. ఉత్తిమనిషివి కావు, జాగ్రత్తగా ఉండాలి కదా? చూడు ఎంత నీరసంగా ఉన్నావో?’ అంటూ తల్లి జాలిగా చూసేటప్పటికి కళ్ళనుంచి నీరు ధారగా కారసాగింది.
‘ఊరుకో తల్లీ, డాక్టర్ గారు నీకు విశ్రాంతి కావాలని చెప్పారు. మనం తీరిగ్గా మాట్లాడుకుందాం, పడుకోరా, ఏమాలోచించకు.’ అన్న తండ్రి మాటలతో ధైర్యంగా అనిపించి నిదురలోకి జారుకుంది కోమలి.
రెండు రోజుల తరువాత, ఒక రోజు నవీన్ మాట వినిపించి నిద్ర లేచింది కోమలి.
‘అబ్బా, ఎంత బాగుందత్తయ్యా, కోమలికి నేర్పాల్సింది. తను వండితే ఈ రుచే ఉండదు. అంత నాజూగ్గా పెంచకూడదండి. ఆఫీసులో కూడా మేనేజ్ చెయ్యడం చేతకాదు. ఉద్యోగం పోగొట్టుకొని ఏడుస్తోంది చూడండి’ అంటున్నఅల్లుడి మాటలకి రామనాధంగారి మొహం కోపంతో ఎర్ర పడింది. అది కనిపించకుండా పేపర్ అడ్డం పెట్టుకొని కూర్చున్నారు.
‘నేను వస్తానండీ, పనుంది, తనకు చెప్పి నెమ్మదిగా పంపించండి’ అంటూ వెళ్ళిపోయాడు. భార్యని కలిసి పలకరించకుండా వెళ్ళే అల్లుడిని చూసి, ఏమనాలో తెలియక ఒకరి మొహం ఒకరు చూస్తూ ఉండి పోయారు.
‘వెళ్ళిపోయారా?’ అని అడిగే కోమలి మాటలతో వెనక్కి తిరిగి, నిర్లిప్తంగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న కూతురి దగ్గరికి వచ్చారు.
‘చూడు తల్లీ, పెళ్ళి అయ్యాక ప్రతి ఒక్కరికి రెండేసి కుటుంబాలేర్పడతాయి. పుట్టి పెరిగిన కుటుంబానికి నువ్వేమీ చెప్పనక్కర లేదు, వారికి నీ గురించంతా తెలుసు. కానీ మెట్టినింటి వారికి నువ్వు క్రొత్త. వాళ్ళకు నీ సంగతి తెలియటానికీ, వాళ్ళేంటో నీకు తెలియటానికీ కూడా సమయం పడుతుంది. ఓర్పుగా ఎదురు చూస్తే సుఖ పడే అవకాశం ఉంటుంది. నువ్వు మారతావో వాళ్ళని మార్చుకుంటావో నువ్వాలోచించుకో. ఈ జీవితం నీది. మా సహాయ సహకారాలు నీకెప్పుడూ ఉంటాయి’ అనే తండ్రిని చూసి అర్ధమైందని ఒక చిరు నవ్వు నవ్వింది.
***
ఒక మంచి రోజు చూసి, కోమలిని మెట్టినింట్లో దింపారు రామనాధంగారు. తల్లి చేయించి ఇచ్చిన అరిశలు, జంతికలు, గోంగూర పచ్చడి అత్తగారి ముందుంచి, ‘అమ్మ ఇమ్మందత్తయ్యా’ అంది. ‘ఇప్పుడివన్వీ ఎందుకూ, నీ కసలే ఒళ్ళు బాగలేకపోతే? ఇప్పుడెలావుంది ప్రాణం’ అని ఆరా తీసిందామె.
‘ఇప్పుడు ఫరవాలేదు, స్కానింగ్ కూడా చేయించుకున్నాను. అంతా బాగుందన్నారు.’
‘ఉద్యోగం కూడా లేదుగా, కాస్త విశ్రాంతి తీసుకో.’
‘లేదత్తయ్యా, చింటూ వాళ్ళ స్కూల్‌లో కంప్యూటర్ ల్యాబ్ ఇంఛార్జు గా జాబ్ వచ్చింది, ఎల్లుండి బాగుందంట కదా? అప్పట్నుంచి వెళదామనుకుంటున్నా’ అని చెప్పింది.
అంత పెద్ద స్కూల్‌లో అంత తొందరగా జాబు ఎలా వచ్చిందంటూ ఇంట్లోవాళ్ళంతా ఆశ్చర్య పోయారు.
నవీన్ ఒక్కడే రుసరుసలాడుతూ ‘సాఫ్టువేర్ కంపెనీ జీతంలో సగం కూడా ఇవ్వరు. నీకు మతి లేదు’ అంటూ మొదలు పెట్టాడు,
కోమలి ఒక నవ్వు నవ్వి , ‘నాకది చాలు’ అని చెప్పి, అక్కడి నుంచి తప్పుకుంది. చేసేది లేక ఊరకుండిపోయాడు నవీన్.
మూడు నెలల తరువాత చక్కని పాప పుట్టింది. అందరూ వచ్చి చూశారు. శ్రావణి పేరు బాగుంటుందని నిర్ణయించారు. కానీ నవీనే సమయంలేదంటూ, నామకరణోత్సవం దాటేస్తూ వచ్చాడు. ఆరు నెలలు చూసి కోమలి గుళ్ళో పాప పేరు చెప్పి ఇంట్లో అందరికీ చెప్పింది. చిన్నపాటి రచ్చ జరిగినా అందరూ సర్దుకున్నారు.
పాపని తనతోనే తీసుకుపోయి అక్కడే ఉన్న క్రెశ్ లో ఉంచటం అలవాటు చేసుకుంది. జీవితం సాఫీగా సాగసాగింది.
ఒక రోజు తన పాత బాసు కనిపించి, తనకు ఒక ప్రాజెక్టులో సాయం చేయమని అడగటంతో ఒప్పుకుంది. దాంతో ప్రక్క సంపాదన రావటం, తనకు నచ్చే పని చేసిన తృప్తి కలగడంతో కొంచెం హుషారు వచ్చింది.
***
అంతా ప్రశాంతంగా ఉందని ఆనందిస్తుండగానే, ఒక రోజు నవీన్ ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ అఫ్ అనివస్తుంది. రెండు రోజులు గడిచినా రాకపోయే సరికి ఇంట్లో అందరూ కంగారు పడటం మొదలు పెట్టారు. మూడో రోజు బావగారు, తన తండ్రితో కలిసి కోమలి అతని ఆఫీసుకు వెళ్లింది. కానీ అది తాళం వేసి ఉంది.
ఇంతలో ఎవరో నలుగురు అటు వచ్చారు. ‘మీకెంత బాకీ ఉన్నాడు? అందరికీ ఎగ్గొట్టి పారి పోయాడు, రానీ వాడంతు చూస్తాం’. అంటున్న వాళ్ళని చూసి, రామనాధంగారు ‘మనం మళ్ళీ వద్దాం పదండి’ అంటూ వాళ్ళని తీసుకుని ఇవతలకు వచ్చేశారు. అందరికీ అర్ధమైంది, అప్పులవాళ్ళనించి తప్పించుకుని నవీన్ పారిపోయాడని. జాగ్రత్తగా ఉండమనీ, వాళ్ళు ఇంటి మీదికొచ్చే ప్రమాదముందనీ, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటేమంచిదని చెప్పి, ఆయన వెళ్ళి పోయారు.
ఒక వారం గడిచింది, నవీన్ జాడ లేదు. అత్తగారు, మామగారు బాధ పడుతూ ఉన్నారు. కోమలి ఒక నిశ్చయానికివచ్చింది. తండ్రిని పిలిచి, ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లయింట్ చేశారు. వాళ్ళతో కలిసి వెళ్ళి ఆఫీస్ తెరిచి అక్కడి కంప్యూటర్, ఫైల్సు ఇంటికి తీసుకు వచ్చారు.
ఆ రోజు నుంచి కోమలి అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించింది. అతని పనేంటో ఏం చేశేవాడో తెలుసుకుంది. అన్నలకి ఫోన్చేసి వాళ్ళ సలహాలు తీసుకుంది. వాళ్ళ దగ్గరే కొంత సొమ్ము అప్పుగా తీసుకుంది. తండ్రిని. మామగారినీ తీసుకుని వెళ్ళి, ఆఫీస్ తెరిచి పని మొదలు పెట్టింది. వచ్చిన అప్పుల వాళ్ళతో తండ్రీ, మామగారు మాట్లాడి, సెటిల్ చేసేవారు. తనకు కావలసిన వాళ్ళని కొంతమందిని అపాయింట్ చేసుకుంది. ఇదివరకు నవీన్ ప్రాజక్టులు తెచ్చి, వాటిని వేరే వారికి సబ్లెట్ చేసేవాడు. వాళ్ళు టైంకు అందివ్వక నష్ట పోయేవాడు. డబ్బు చేతికి అందక అప్పులు చేసి అవి తీర్చలేక పారిపోయాడు.
ఇప్పుడు తండ్రి సాయంతో తనే పదిమందిని అప్పాయింట్ చేసుకుని పని ప్రారంభంచింది. ప్రాజక్టులు తెచ్చుకోవటానికి తన పాత బాస్‌ది, అన్నలది, సాయం తీసుకుంది.
ఒక సంవత్సరం అవిశ్రామంగా పని చేసి అప్పులొకటొకటీ తీరుస్తూ ఒక కొలిక్కి తీసుకు వచ్చింది. రెండేళ్ళు గడిచే సరికి కంపెనీ నిలదొక్కుకుంది. కంపెనీ ఎదుగుదలను నవీన్ స్నేహితులకి చేరేలా చేసింది. తప్పక ఎవరో ఒకరితో టచ్లో ఉంటాడనీ, తిరిగి వస్తాడనీ నమ్మింది. కనుకనే ప్రయత్నం మానలేదు.
ఐదు సంవత్సరాలు గడిచాయి. కంపెనీ లాభాల బాట పట్టింది.
***
ఒక రోజు ఇంటికి వచ్చే సరికి నవీన్ ఇంట్లో ఉన్నాడు, తన తండ్రీ, తల్లీ కూడా వచ్చారు. కోమలిని చూస్తూనే అత్తగారు ‘నీ కష్టాలన్నీ తీరాయే, నా కొడుకు వచ్చాడు చూడు’ అంటూ ఆనంద పడిపోయింది. వారందరి ఆనందం చూసి, చిరునవ్వుతో తన గదికి వెళ్ళి, కొంచెం సేద తీరి క్రిందకు వెళ్ళింది. భోజనాల తరువాత తన కూతురిని, ఒక సూట్ కేస్ని తీసుకుని వచ్చి, అత్తగారితో ‘నేను ఇక వెళతానత్తయ్యా, మీ అందరూ ఆనందంగా ఉన్నారు. అదే కావాలి. నేను నా కూతురు మా బ్రతుకు మేం బ్రతుకుదామనుకుంటున్నాం’ అంది. ఆమె అయోమయంగా చూస్తూ,
‘అదేంటి, ఇన్నాళ్ళు ఎదురు చూసి, ఇప్పుడు వెళతానంటావ్’ అనే అత్తగారితో, ‘మీకోసమే ఇన్నాళ్ళు ఉన్నాను. కొడుకుమీద బెంగతో మీరు, మామయ్య ఆరోగ్యం పాడు చేసుకుంటారని, ఇప్పుడు మీ బెంగ తీరిందిగా? ఇక మేము వెళతాము.’
ఇంతలో మామగారు ‘శాంతా, అమ్మాయికి చీర పెట్టి పంపు, ఉంటాడో లేదో తెలియని వాణ్ని నమ్ముకొని, తన జీవితంపాడు చేసుకోవాల్సిన అవసరం తనకేమిటి?’ అని, కోమలి వైపు తిరిగి,
‘చూడు తల్లీ, ఇదిగూడా నీ ఇల్లే, అప్పడప్పుడూ వచ్చి పోమ్మా’ అంటున్న తండ్రిని చూసి నవీన్ కి మతి పోయింది.
‘మీరేంటీ, దాన్ని సమర్ధిస్తున్నారు? నెత్తి మీద పడితే అంతా నేర్చుకుంటుందనే, నేనలా వెళ్ళాను, అంతే కానీ, అర్ధం చేసుకోరేం’ అంటూ విరుచుకు పడ్డాడు.
‘థాంక్స్, మీరు చాలా నేర్పారు, మేము నేర్చుకున్నాము. ఇక చాలు. నా కూతురికి తండ్రీ, నాకు నా చేయి పట్టుకుని నడిచే భర్తా కావాలి, కానీ మాకు పాఠాలు నేర్పడానికి పారిపోయే మనిషి మాకు వద్దు. నా కూతురు విలువైన ఆరు సంవత్సరాలు ఏ ముచ్చటగా లేకుండా గడిచి పోయాయి. ఇహ అలా కానీయను. త్వరలో డైవర్సు పేపర్లు వస్తాయి, సంతకాలు చేసి పంపండి’ అంటూ తండ్రి వెంట తలెత్తుకొని వెళ్ళిపోయింది కోమలి.