కీరవాణి... చిలకలా కొలికిరో పాడవేమే
చలనచిత్ర రంగంలో వేటూరి సుందర రామమూర్తి గారికి ఒక ప్రత్యేక స్థానముంది. తనదైన పదజాలంతో భావప్రస్ఫుటమైన పంక్తులతో పాటలను రచించడం ఆయన ప్రత్యేకత. నీ కన్నులా నీలమై, నీ నవ్వులా వెన్నెలై, సంపెంగలా గాలినై, తారాడనా నీడనై అని ప్రియుడు అనగా నీ కవనాలలో నే తొలి ప్రాసనై, నీ జవనాలలో జాజుల వాసనై అని ప్రియురాలు స్పందించడం, ఇవన్నీ అక్షర రూపంలోనే కళ్ళకు కట్టినట్లు చూపించడం వేటూరి గారి సాహిత్య పటిమకు నిదర్శనం. సరళమైన తెలుగు పదాలలో గ్రాంధిక పదాలను చక్కగా ఇమడ్చగలిగిన ప్రతిభావంతులలో వేటూరి గారు ముందుంటారు. ఆయన వ్రాసిన పాటలకు స్వరబ్రహ్మ ఇళయరాజా గారు స్వరకల్పన చేస్తే, దానిని మన బాలుడి గళంలో, జానకి గారి స్వరంలో వింటే ఇక ఆ పాట అద్భుతం, సుమధురం కాకుండా ఉంటుందా? మీరే విని చెప్పండి.
చిత్రం: అన్వేషణ; సంగీతం: ఇళయరాజా; రచన:వేటూరి; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి.
సా...నిసరిసాని...సా నిసమగామరి
పదసా..నిసరీసాని...
సా..నిసమగామరి
పదసససని రిరిరిస గగగరి
మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని..
కీరవాణి... చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....
చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా....
గరిస పమగ పాని సరిగ రిగస నీద..
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే..
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే....
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి
కీరవాణి..... చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా.....
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....
చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా....