Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

ఒక చేత్తో కొడుకు చెయ్యి పట్టుకుని, రెండవ చేత్తో బట్టలున్న చేతిసంచీ పట్టుకుని ఆ చీకటి రాత్రిలో, నక్షత్ర కాంతిని ఆధారంగా చేసుకుని, అగమ్యగోచరమైన భవిష్యత్తులోకి, మనోధైర్యమే ఆసరా కాగా, భగవంతుణ్ణే నమ్ముకుని ధైర్యంగా ముందుకు నడిచింది మీనాక్షి.

ఆమె ఆ గడ్డమీద పుట్టిన బిడ్డ! అక్కడ దారులన్నీ ఆమెకు గుర్తే. ఒక్కసారి ఏ ఇబ్బందీ లేకుండా, ఆ ఊరి మీదుగా సాగే "జాతీయ రహదారి" కనుక చేరగలిగితే చాలు, రాత్రులందు ఆ రహదారి పైన సుదూర ప్రాంతాలకు సాగే బస్సులు ఎన్నో ప్రయాణం చేస్తూ ఉంటాయి.

"ఏదో ఒక బస్సు ఎక్కి, దూరంగా ఉన్న ఏ పట్టణానికో వెళ్ళిపోవచ్చు. ఆ తరువాతి విషయం అంతా ఆ పరమాత్మునిదే భారం" అనుకుంది మీనాక్షి.

అలా ఆ భగవంతునిపైనే భారం మోపి, అగాధమైన భవిష్యత్తులోకి పసివాడైన కొడుకుచెయ్యి పట్టుకుని ప్రయాణమయ్యింది, ఆ వెర్రితల్లి! పట్నంలో తనకు ఏదో ఒక పని దొరక్కపోదనీ, అది తననూ, తన బిడ్డనూ బ్రతికించగలదనీ ఆశతో ఉంది మీనాక్షి. ఆ నమ్మకంతోనే ఆమె ఇంత సాహసానికి ఒడిగట్టింది.

సందులగొందుల వెంట నడుస్తూ, తోటలు దొడ్లు దాటుకుంటూ, పొలంగట్ల వెంట సాగే అడ్డదారిలో తమ గమ్యమైన నేషనల్ హైవే వైపుగా నడవసాగారు ఆ తల్లీ కొడుకులు. పొలాల వెంట నడుస్తూ ఉంటే ఈదురుగాలి ఈడ్చి కొడుతోంది. అయినా, మనసులో ఆందోళన ఎక్కువగా ఉండడంతో, మీనాక్షికి చలి తెలియడం లేదు. కాని, జీవన్ చలికి గడగడా వణకసాగాడు. ఒళ్ళంతా హూనమయ్యి ఉండడంతో, వాడికి సలపరంగా ఉంది. అది చూసి, సంచీ లోంచి ఒక చీర తీసి, మడతవిప్పి వాడి బుజాల మీదుగా కప్పింది మీనాక్షి.

నాలుగడుగులువేసి, "అమ్మా" అంటూ నిలబడిపోయాడు జీవన్. "ఇంకా ఎంతదూరం? నా కాళ్ళు నెప్పులుగా ఉన్నాయి. నడవలేనమ్మా" అంటూ పొలం గట్టుమీద చతికిలబడిపోయాడు.

మీనాక్షి కూడా ఆగింది. "లే నాన్నా! ఇంక ఎంతో దూరం లేదు. కొద్ది సేపట్లో పె . . . ద్ద బస్సు వస్తుంది. అదెక్కి మనం ఇక్కడికి దూరంగా వెళ్ళిపోదాం."

ఎలాగో బ్రతిమాలి బుజ్జగించి వాడిని మళ్ళీ నడిచేలా చేసింది మీనాక్షి. మళ్ళీ నడక సాగించారు వాళ్ళు ఇద్దరూ.

"ఏది ఏమైనా ఇక నడిచేది ముందుకే, వెనక్కి తిరిగేది కల్ల" అనుకుoది మీనాక్షి మనసులో దృఢంగా.

కొడుకు చెయ్యి పట్టుకుని వడివడిగా అడుగులు ముందుకు వేసింది.

ఎగుడు దిగుడుగా ఎత్తుపల్లాలతో, వంకరటింకరగా ఉన్న పొలం గట్లపైన నడక చాలా కష్టంగా ఉంది. రాత్రి ఇద్దరూ తిండికూడా తినకపోవడం వల్ల బలహీనపడ్డారు కూడా. కాని పట్టుదలగా నడుస్తున్నారు ఇద్దరూ, తమ కష్టాలకు కాణాచియైన ఆ ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలని!

ఎటుచూసినా కనుచూపుమేర విశాలంగా విస్తరించివున్న పంటపొలాలు, కంకులు వేసివుండడంతో గాలి వీచినప్పుడల్లా బరువుగా తలలూపుతున్నాయి. అక్కడక్కడ గట్లమీద ఉన్న చెట్లు, గాలికి కదులుతున్న కొమ్మలతో, ఆ గుడ్డివెలుగులో జుట్టు విరబోసుకుని ఆడుతున్నదయ్యాల్లా కనిపిస్తున్నాయి. అల్లంత దూరంలోవున్న స్మశానంలో తిరుగుతున్న నక్కలు, అకస్మాత్తుగా గొంతెత్తి మూకుమ్మడిగా ఊళలు వెయ్యడం మొదలుపెట్టాయి. ఆ శబ్దం హృదయవిదారకంగా ఉంది.

"అమ్మా! నాకు భయమేస్తోందే" అంటూ, జీవన్ ఏడుస్తూ తల్లిని చుట్టుకుపోయాడు.

మీనాక్షి నడక ఆపి, కొడుకుని పొదివి పట్టుకుని, కొంగుతో కళ్ళు తుడుస్తూ, "నాన్నా! భయ పడకురా! ఆంజనేయస్వామిని తలచుకో, భయం పోతుంది" అంది. మరు క్షణంలో, మళ్ళీ "అసలు నీకు తెలుసా, నీది ఆ స్వామిపేరే! అన్ని భయాలు చిటికలో పోగొట్టే స్వామిపేరు పెట్టుకున్న నీకు ఈ భయమేమిట్రా, సిగ్గుసిగ్గు! దగ్గరకు వచ్చేశాం, ఇంకొక్క నాలుగు అడుగులు వేస్తే చాలు, మనం హైవేమీద ఉంటాము. ఎంత తొందరగా నడిస్తే, అంత తొందరగా మనం బస్సు ఎక్కగలం" అంటూ వాడిని బెల్లించి, ముందుకి నడిపించింది మీనాక్షి.

ధైర్యం తెచ్చుకుని అడుగులు ముందుకి వేశాడు జీవన్. కొంతదూరం వెళ్ళాక అడిగాడు, "అమ్మా! మనం బస్సెక్కి ఏ ఊరు వెడుతున్నాము" అని.

ఆ ప్రశ్నకు ఇప్పుడు మీనాక్షిదగ్గర ఏ జవాబు సిద్ధంగా లేదు. ఇక నామె కొడుక్కి జవాబెలా చెప్పగలదు! అందుకే ఆమె కొంచెం ఆలోచించాల్సి వచ్చింది...

"ముందుగా మనం బస్సు ఎక్కాలి, ఆ తరవాత ఆ బస్సు ఎక్కడకు వెడుతుందో కనుక్కుని, అక్కడకు టిక్కెట్టు తీసుకోవాలి. అయినా మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ పెళ్ళివారి నడకలు నడుస్తుంటే బస్సులన్నీ వెళ్లి పోతాయి. మనం మాటలాపి, తొందరగా నడవాలి" అంటూ, కొడుకు అడిగిన ప్రశ్నకు సరైన జవాబు చెప్పలేక మాటమార్చింది మీనాక్షి.

జీవన్ కి తల్లిమీద అంతులేని విశ్వాసం ఉంది. ఆమె తనతో ఉంటే, తనకే కీడూ జరగనీయదన్న భరోసాతో తన భారమంతా తల్లిపై ఉంచి, ఆమె వెంట నిశ్చింతగా నడిచాడు ఆ పసివాడు.

ఎట్టకేలకు ఆ తల్లీ కొడుకులు హైవే ని చేరుకున్నారు. ఒకదాని కొకటి దూరంగా ఉన్న పెద్దపెద్ద పట్టణాలని కలుపుతూ సాగే ఆ రహదారి మీద, సుదూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకుల్ని ఎక్కించుకుని తిరిగే, పెద్దపెద్ద బస్సులు, రాత్రనక పవలనక తిరుగుతూనే ఉంటాయి. అవి అక్కడవున్న ఆంజనేయస్వామి కోవెలముందున్న రావిచెట్టుక్రింద ఆగుతాయి. అది రోడ్డుకి ఇరువైపులా విస్తరించి ఉందేమో, ఆ చెట్టు రెండువైపుల ఉండే బస్సు స్టాప్ లకూ గొడుగు పట్టినట్లు నీడనిచ్చి, బస్సెక్కడానికై కనిపెట్టుకుని ఉన్న ప్రయాణీకులను సేదదీరుస్తూ ఉంటుంది. అటు వచ్చేవి, ఇటు వెళ్ళేవీ బస్సులన్నీ కూడా ఆ చెట్టుక్రిందే ఆగుతాయి, ఆ సంగతి మీనాక్షికి తెలిసి ఉండడంతో అక్కడికే చేరుకుంది కొడుకుని వెంట బెట్టుకుని.

కర్మంజాలకపొతే, బస్సు ఎక్కడం కోసమని తెలిసినవాళ్ళెవరైనా వచ్చి, తనను గుర్తించి పలుకరిస్తే గొడవౌతుందని భయంతో కొంగుని తలపైకంతా లాక్కుని, కొడుకుని పట్టుకుని, చెట్టు చాటుగా నిలబడింది మీనాక్షి. ఆ ప్రదేశం ఎత్తుగా ఉండడంతో దూరంగా ఉన్న ఊరు, మినుకు మినుకు మంటున్న దీపాలకాంతిలో మసగ మసగగా కనిపిస్తూవుంది. అది, మీనాక్షి పుట్టి పెరిగిన ఊరు కావడంతో, మళ్ళీ ఆ ఊరు చూడగలనో లేదో అన్నభావం ఆమెకు దుఃఖాన్ని తెప్పించింది. కన్నీరు ధారలౌతూండగా మనసులోనే తన జన్మభూమికి నమస్కరించి సెలవు తీసుకుంది మీనాక్షి.

తల్లి కళ్ళవెంట ఆగకకారే కన్నీటిని తన చేయెత్తి తుడుస్తూ, "అమ్మా! ఏడవకే" అంటూ ప్రాధేయ పడసాగాడు జీవన్. అంతలో దూరంగా బస్సు తాలూకు హెడ్ లైట్లు కనిపించాయి.

మీనాక్షి గుండె వేగం హెచ్చింది. జీవన్ మాత్రం, తొలిసారిగా బస్సును చూడబోతున్నానన్న సంబరంలో తన బాధని మర్చిపోయి, కేరింతలుకొట్టాడు. కాని ఆ బస్సు అక్కడ ఆగలేదు. ఆపై ఎన్నో లారీలూ, మోటారుకార్లూ ఆ రహదారీపై అటువైపూ, ఇటువైపూ కూడా వెళ్ళిపోయాయి. ఆ తరవాత వచ్చిన రెండు బస్సులూ కూడా ఆగకుండానే వెళ్లిపోయాయాయి. ఎంతో ఎత్తుగా, హుందాగా ఉన్నాయవి. వాటిలో ఖాళీలు లేవో లేక వాటి కక్కడ హాల్టే లేదో!

"కంగారు పడ్డకొద్దీ ఆలస్యం ఎదురౌతుంది, అదేమి పాపమో! ఈ గడ్డను దాటి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది - అనుకుంటే, ఇలా ఆలస్యమౌతోంది ఏమిటో" అనుకుంది మీనాక్షి.

తరవాత ఇంకా ఎంతో ట్రాఫిక్ వెళ్ళిపోయాక ఒక సాదా సీదా రూట్ బస్సు వచ్చి ఆగింది అక్కడ. దానినుండి ఒక వ్యక్తి దిగి, మీనాక్షి ఉన్న వైపుకి కాకుండా రెండవ వైపుకి వెళ్ళిపోయాడు. ఆ ఊరికి దూరంగా వెళ్ళిపోదామన్న తొందరలోనున్న మీనాక్షి, కొడుకుతోసహా, ఆగి ఉన్న బస్సులోనుండి ఆ మనిషి దిగగానే తను ఎక్కేసింది. కండక్టర్ "రైట్" చెప్పగానే బస్సుకదిలింది. అంతలో మరో వ్యక్తి, బస్సుకి ఎదురుగా పరుగున వస్తూ, ఆపమని చేతితో సైగచేసి, ఆపీ వరకూ ఆగకుండా కంగారుగా, కదులుతున్న బస్సులోకి చటుక్కున ఎక్కేశాడు. స్లో ఔతున్న బస్సు, "రైట్" అన్న కండక్టర్ కేకతో మళ్ళీ స్టార్టయ్యి, వేగాన్ని పుంజుకుంది. ఎవరికీ కనిపించకుండా ఉండాలని వెనకబారున ఖాళీగా ఉన్న సీట్లో మీనాక్షి, జీవన్ ని పక్కన పెట్టుకుని కూరుచుంది. దూరంగా ఉన్న మరో సీట్లో ఆఖరున వచ్చినాయన కూరుచున్నాడు. వెంటనే తల్లి కొంగుచాటున చేరి నిద్రపోయాడు అలసి ఉన్న జీవన్. బస్సు కదలగానే, "టిక్కెట్, టిక్కెట్" అంటూ వచ్చాడు కండక్టర్. కొత్తగా ఎక్కిన వ్యక్తికి టిక్కెట్ ఇచ్చి, డబ్బు తీసుకుని, అతడు మీనాక్షి దగ్గరకు వచ్చాడు. "ఏ ఊరు వెళ్ళాలి" అని అడిగాడు కండక్టరు.

బేలగా అతనివైపు చూసింది మీనాక్షి. ఏం చెప్పడానికీ తోచక క్షణం అవాక్కై ఉండిపోయింది.

"ఏ ఊరు వెళ్ళాలంటే చెప్పవేమిటి, కళ్ళు తెరుచుకునే నిదరోతున్నావా ఏoటి?" అన్నాడు కండక్టర్ చిరాకు పడుతూ. కంగారు పడింది మీనాక్షి.

మీనాక్షికి ఏమీ తోచలేదు. అది ఏ రూట్ బస్సో, ఆ రూట్లో ఏయే ఊళ్లు వస్తాయో, ఏమీ తెలియని అయోమయంలో ఉన్న మనిషి ఏ ఊరని చెప్పగలదు! అకస్మాత్తుగా మీనాక్షికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. వెంటనే, ఆ ముందుమనిషి చెప్పగా విన్న ఊరి పేరే తానూ చెప్పేసింది, ఆపద్ధర్మంగా! గమ్యమేదో తెలియని వాళ్ళకి, ఏ ఊరైనా ఒకటే కదా! సాధ్యమైనంత తొందరగా తను పుట్టిపెరిగిన ఈ ఊరుకి దూరంగా వెళ్ళిపోవడం ముఖ్యంగాని, వెళ్ళేది ఏ ఊరైనా ఒకటే" అనుకుంది నిరీహతో.

"తొంభై రూపాయలు!" ముక్తసరిగా జవాబుచెప్పాడు కండక్టర్. తనదగ్గరున్న చిల్లరలోంచి తొంభై రూపాయలు లెక్కపెట్టి తీసి ఇచ్చి, టిక్కెట్ తీసుకుని కొంగున కట్టుకుంది మీనాక్షి.

వేగంగా బస్సు గమ్యం వైపుగా సాగుతూ, మీనాక్షినీ, కొడుకునీ వాళ్ళ పుట్టిన ఊరు నుండి క్షణక్షణానికీ దూరంగా తీసుకుపోతోంది. బస్సెక్కి కూర్చోగానే, జీవన్ ఐతే తల్లి కొంగుచాటున ఒదిగి నిద్రపోయాడు కాని, మనోభారంతో ఉన్న మీనాక్షికి కళ్ళు మూతపడలేదు. బస్సులోనివాళ్ళు కొందరు కూర్చునే నిద్రపోతూ, మరికొందరు నిద్రా మెలకువ కాని స్థితిలో, కునికిపాట్లు పడుతూ ప్రయాణం చేస్తున్నారు. మధ్య మధ్య ఆగి జనాల్ని ఎక్కించుకుంటూ, గమ్యం చేరినవాళ్ళని దింపుతూ అవిశ్రాంతంగా సాగుతోంది ఆ బస్సు.

అలా ఆ బస్సు చాలా దూరం వెళ్లి, హైవేని విడిచిపెట్టి ఒక మలుపు తిరిగింది. ఆపై మరి కొద్ది దూరం వెళ్ళిందో, లేదో - సడెన్ బ్రేకుతో ఆగింది బస్సు. ఆ కుదుపుకి ఇంతెత్తు ఎగిరిపడ్డారు బస్సులోని జనం. అందరికీ నిద్రమత్తు వదలి, పూర్తిగా మెలకువ వచ్చేసింది. బస్సులో ఉన్న వాళ్ళు, "ఏమయ్యింది", "ఏమయ్యింది" అంటూ కంగారుపడ్డారు.

అక్కడ రోడ్డుకడ్డంగా జనం గుంపుగా నిలబడి ఉన్నారు. బస్సు ఆగగానే వాళ్ళు పరుగున వచ్చారు. వాళ్ళను బస్సు ఎక్కనీకుండా, గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు బస్సు కండక్టర్.

"ఇలా దారిలో బస్సు ఆపి ఎక్కాలని చూడడం తప్పు, స్టాపు రావాలి, సార్! మా యజమానికి తెలిస్తే ఊరుకోడు" అంటూ దొమ్మీగా బస్సు ఎక్కాలని చూసిన వాళ్ళని అడ్డుకున్నాడు కండక్టర్.

ఆ గుంఫులోంచి ఒక ఆసామీ ముందుకువచ్చి, కండక్టర్ చేతిలో చెయ్యేసి పట్టుకుని, "ఇవి చేతులు కావు, కాళ్ళనుకో! అర్జంటు పనిపడి, ఉన్నబడంగా పట్నం వెళ్ళాల్సి వచ్చింది. తెల్లారీసరికి అక్కడికి చేరాలి. అక్కడకు సకాలంలో చేరాలంటే ఈ బస్సునే ఎక్కాలి, ఎలా మరి! మేము నడిచి వచ్చేవరకూ మాకోసం ఇది "బస్సుస్టాప్లో" ఆగి ఉంటుందంటారా చెప్పండి? కాస్తంత కనికరం చూపిస్తే తప్పా ఏమిటి" అని అడిగాడు.

అతని ప్రార్థనే ఫలించిందో లేక అతడు కండక్టర్ చేతిని అందుకున్నప్పుడు చేతులుమారిన వందనోటు మహిమో - ఏదైతేనేమి, కండక్టర్ అడ్డుతప్పుకుని వాళ్ళకి దారి ఇచ్చాడు. రోడ్డు మీద గుంపుగా ఉన్న జనమంతా గబగబా వచ్చి బస్సు ఎక్కేశారు.

డ్రైవర్ కేకపెట్టాడు, "అంతమంది కూచోడానికి జాగా ఎక్కడ్దిరా బామ్మర్దీ!" అలా తన ఉనికిని గుంభనంగా తెలియజేసి, నీకు ముట్టినదాంట్లో సగం నాది - అని చెప్పకనే చెప్పాడు ఆ బస్సు డ్రైవరు.

"నీకేం ఫర్లేదు బామ్మర్దీ! నే నెలాగోలా సద్ది కూచోబెడతాలే! ముందు స్టేషన్లలో దిగేటోళ్ళు శానామందున్నారు" అన్నాడు కండక్టర్. అంతా ఎక్కాక 'రైట్' చెప్పాడు అతడు.

బస్సు ఫుల్ స్పీడు అందుకోకముందే, జనాన్ని సద్ది కూర్చోబెట్టి, కొత్తగా ఎక్కిన వాళ్ళకి టిక్కెట్లు కొయ్యడం ముగించాలనుకున్నాడు కండక్టర్. అందరికీ టిక్కెట్లు ఇచ్చి, తన సీటులో కూర్చోబోతుండగా అతనికి ఎందుకనో, తను చింపిన టిక్కెట్ల కంటే బస్సులోని జనం ఎక్కువగా ఉన్నారనిపించింది. వెంటనే చెక్కింగ్ మొదలుపెట్టాడు. ఒక్కొక్కళ్ళ దగ్గర టిక్కెట్ చూసి, ఎక్కడ ఎక్కారో, ఎక్కడికి వెడుతున్నారో కనుక్కుని, సరిగా ఉన్న టిక్కెట్లకు పెన్సిల్తో టిక్కు పెడుతూ, ప్రతి టిక్కెట్టునూ పరీక్షిస్తున్నాడు అతడు. తొడతొక్కిడిలో టిక్కెట్టు తీసుకోకుండా బస్సు ఎక్కినవాళ్ళు దొరికిపోయారు. కొందరు పెనాల్టీ కట్టి మరీ టిక్కెట్ తీసుకుంటే, మరికొందరు ఏడుపుమొహాలతో బస్సు దిగి వెళ్ళిపోయారు.

సడెన్ బ్రేకు వేసినప్పుడు మెలకువ వచ్చిన జీవన్ తల్లి పక్కన కూచుని, బస్సులో జరుగుతున్న "హైయ్ డ్రామా" కళ్ళు విశాలంగా చేసుకుని చూస్తున్నాడు. కండక్టర్ చెక్కింగ్ చేస్తూ, నెమ్మదిగా చిట్ట చివరలో కూర్చున్న ఆ తల్లీ కొడుకుల దగ్గరకి వచ్చాడు. మీనాక్షి టిక్కెట్ తీసి చూపించింది. అంతా కరెక్టుగా ఉండడంతో, టిక్ చేసి ఇచ్చేశాడు. 'నెక్స్టు' అంటూ, ఎటో చూస్తున్న జీవన్ భుజంపై పెన్సిల్తో తట్టాడు. అదేమిటో బొత్తిగా తెలియకపోడంవల్ల, జీవన్ దులపరించెయ్యడంతో, కండక్టర్ చేతిలోని పెన్సిల్ ఎగిరివెళ్లి  దూరంగా పడింది. కండక్టర్ కి కోపం వచ్చింది.

"ఎవరీ అబ్బాయి" అని ఉరిమినట్లుగా అన్నాడు.

"మా అబ్బాయేనండి" అంది మీనాక్షి భయం భయంగా.

"టిక్కెట్ తీశావా, ఏది?" క్రింద పడ్డ పెన్సిల్ తీసుకుంటూ కండక్టర్ అడిగాడు మీనాక్షిని.

"లేదండి. చిన్నపిల్లడే కదాని..." నసికింది మీనాక్షి.

కండక్టర్ జీవన్ వైపు పరీక్షగా చూసి, "ఎన్నేళ్ళు" అని అడిగాడు.

"మొన్ననే ఆరు నిండాయి" అంది నిజాయితీగా మీనాక్షి.

"ఐతే ఇకనేం, అరటిక్కెట్టు తియ్యాలి. అరటిక్కెట్ అంటే ఎంతో తెలుసా? నీ టిక్కెట్లో సగం! అంటే నీకు 90 రూపాయిలైతే, అందులో సగం 45 రూపాయిలు. తొందరగా తియ్యి."

మీనాక్షి కొంగుముడి ఇప్పి డబ్బులు లెక్కించసాగింది. ఒక్క నాలుగు రూపాయిలు తక్కువయ్యాయి. మాటాడకుండా మొత్తం చిల్లర కండక్టర్ చేతిలో పోసింది.

కండక్టర్ మళ్ళీ లెక్కించి, "నాల్గు రూపాయిలు తక్కువ "అన్నాడు.

"నాదగ్గర అంతే ఉంది, ఇంకొక్క దమ్మిడీ కూడా లేదు" అంది భయపడుతూనే మీనాక్షి.

"హోల్డాన్!" పెద్ద పెడబొబ్బపెట్టాడు కండక్టర్.

"క్రీచ్" మన్న బ్రేకుల చప్పుడుతో బస్సు రోడ్డువార ఆగింది.

"టిక్కెట్ కొయ్యనోళ్ళు బండి దిగండి, లేమ్మా! లేచి ఆ పిల్లోణ్ణి కిందికి దింపెయ్యి" అంటూ కండక్టరు తొందర చేశాడు. నిస్సహాయంగా జనం వైపు చూసింది మీనాక్షి.

కండక్టరు ఏమిటంటున్నాడు! ఎవరికోసమని తానింత తెగింపుచేసి ఇల్లువదలి వచ్చిందో ఆ పిల్లాడిని, ఆరేళ్ళ పసివాడిని, అర్ధరాత్రి కటిక చీకట్లో, ఏపాటి పరిచయమూలేని కొత్తచోటులో, ఒంటరిగా వదిలెయ్యడమా? అసంభవం! అది ఎంతమాత్రం జరిగే పనికాదు - అనుకుంది మీనాక్షి దృఢంగా.

"ఓయి భగవంతుడా! గమ్యమేమిటో తెలియని ఈ ప్రయాణంలో ఆదిలోనే హంసపాదా" అనుకునే సరికి ఆమెకు కన్నీరు ఆగలేదు.

ఆ కన్నీరు చూసిన ఒక ప్రయాణీకురాలికి మనసు కరిగి నీరయ్యింది. వెంటనే కండక్టరుకి హితవు చెప్పింది. "అదేంటి బావూ! అట్టంటవు? మరీ ఇసిత్రాలు మాటాడమోక! కడుపున కన్న బిడ్డను నడిరోడ్డుమీన ఒగ్గేసి, ఏ తల్లైనా ఎలిపోద్దా ఏటి? సోద్దెమాని! ఓ నాల్రోపాయీలకాడికి, అగ్గెట్టమోక, ఒగ్గెయ్" అంది.

"రూల్సు ఒప్పొద్దూ? నీ కేంటి చెపుతావ్! ఇయ్యేల నేనీ నాల్రూపాయిలూ ఒగ్గేస్తే, రోపు నా ఉద్యోగాన్ని గూడా ఒగ్గెయ్యాల్సి రావచ్చు. నీదేం పోయె! మాయదారి పొసికోలు కబుర్లు ఎన్నైనా సెబుతావు" అంటూ, ఆమెపైన విసుక్కున్నాడు కండక్టరు.

ఆపై మీనాక్షివైపుకి తిరిగి, "నీ బిడ్డకు టిక్కెట్టు కొను, లేదా వాడిని దింపెయ్యి. అది నచ్చకపోతే నువ్వూ దిగిపో. తొందరగా తేల్చు" అంటూ హడావిడి చేశాడు ఆ కండక్టరు. వెంటనే మీనాక్షి లేచి నిలబడి కొడుకు చెయ్యి అందుకుంది.

అదే బస్సులోవున్న మరో ఆసామీ కల్పించుకుని సబవు చెప్పేడు, "ఆమె కొన్న టిక్కెట్టుకి ఇంకా సగమైనా అవ్వలేదు ప్రయాణం! కట్టిన డబ్బులో సగమైనా ఆమెకు తిరిగి ఇచ్చేస్తే బాగుంటుంది."

గయ్యిమన్నాడు కండక్టరు. "నీకోసం రూల్సు మారవు. ఒకసారి టిక్కెట్ కోస్తే మరి వాపసు ఇవ్వరు. నీకంత జాలిగా ఉంటే ఆ నాలుగు రూపాయిలూ నువ్వు కట్టెయ్యి, గొడవొదిలిపోద్ది!"

మళ్ళీ ఆ మానవుడు నోరిప్పలేదు.

"దిగమ్మా! తొందరగా దిగు. ఇక్కడే తెల్లారిపోయీలా ఉంది"

మరే గత్యంతరం లేక, దిగిపోడానికే నిర్ణయించుకుని కొడుకు చెయ్యందుకుని లేచి ముందుకు నడిచింది మీనాక్షి. వెళ్ళిపోతున్న మీనాక్షివైపు జాలిగా చూస్తూ ఊరుకోలేక నోరుపారేసుకుంది ఇందాకటి ముసలమ్మే మళ్ళీ...

"ఏం మడిసివయ్యా నువ్వు? నీ కాడున్నది గుండెకాయా, బండరాయా? ఆడకూతురు, సిన్న పిల్లోన్ని ఎంటెట్టుకుని ప్రెయానం సేత్తా ఉందనైనా జాలి లేకుండా, అద్ధరేత్తిరికాడ, ఈ అడవిలో ఒగ్గేస్తవా?"

ఆమె మాటల్ని ఎంతమాత్రం పట్టించుకోలేదు కండక్టరు. మీనాక్షి కొడుకుతో బస్సు దిగగానే "రైట్“ చెప్పేశాడు. వెంటనే వెళ్ళిపోయింది బస్సు దుమ్ము రేపుకుంటూ.

కొంతసేపు, మీనాక్షి కొడుకు చెయ్యి పట్టుకుని, కొయ్యబారినట్లు, చేష్టలుదక్కి రోడ్డువారగా నిలబడిపోయింది. ఇప్పుడేం చెయ్యాలో ఏమీ తోచని పరిస్థితి ఆమెది!

చుట్టూ ఉన్నవి బంగన బయళ్లు కావడంతో జీబురోమని రొదచేస్తూ వీస్తోంది గాలి. ఆకాశంలో పరుగులు పెడుతున్న మేఘాలు, నక్షత్ర కాంతిని అడ్డుకుంటున్నాయి. ఆ కనువెలుగులో ప్రకృతి స్పష్టాస్పష్టంగా నీడలు లాగా కనిపించి భయాన్ని పుట్టిస్తోంది. రోడ్డు వార ఒత్తుగా పెరిగిన గడ్డిలో దాగివున్న కీచురాళ్ళ సంగీతం అవిశ్రాంతంగా సాగుతూ, చెవుల తుప్పు వదలగొడుతోంది. రాత్రుల్లో తిరిగే జంతువులు రోడ్డుకి వారగా పెరిగిన పొదల్లో సందడి చేస్తున్నాయి. ఏదో జంతువు వేటచేసింది కాబోలు, చనిపోతున్న జీవి కడసారిగా చేసిన ఆర్తనాదంతో పరిసరాలు కంపించాయి. హృదయ విదారకంగా ఉంది ఆ జంతువు తాలూకు రోదన ధ్వని.

"అమ్మా!" అంటూ తల్లిని చుట్టుకుని, భయంతో బెగ్గడిల్లిపోయాడు జీవన్. మీనాక్షి తెలివి తెచ్చుకుని, జీవన్ వెన్నునిమిరి సముదాయించే ప్రయత్నం చేసింది. అక్కడే, రోడ్డువార మొలచిన గడ్డిలో చటుక్కున చతికిలబడి, కొడుకును ఒడిలోకి తీసుకుని శాయశక్తులా వాడిని ఓదార్చే పనిలో పడింది ఆమె. దారీ - తెన్నూ లేని ఈ పయనం ఏ దారిన నడుస్తుందో ఎంతమాత్రం ఊహకు అందక ఆమెకీ చాలా భయంగా ఉంది. అయినా, కొడుకుని ఓదార్చే ప్రయత్నంలో ఆమె, "నాన్నా! భయపడకురా, ఆ ఆంజనేయస్వామి మనల్ని కనిపించకుండా ఎప్పుడూ కాపాడుతూనే ఉన్నాడురా! ఏది ఏమైనా, మనకొచ్చిన భయమేమీలేదు. ఆ స్వామి దయ ఉంటే చాలు మనకి అన్నీ ఉన్నట్లే! తప్పక మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు మనం ఆయన్ను ప్రార్ధిద్దామా" అంటూ గొంతు సవరించుకుని "ఆంజనేయదండకం" ఎత్తుకుంది మీనాక్షి.

బస్సు హైవే దిగి పక్కదారి పట్టిందేమో, ఆ రోడ్డుమీద ట్రాఫిక్ బొత్తిగా లేకుండా పోయింది. అక్కడ ఆ తల్లీ, కొడుకులు తప్ప, మరెవరు లేరు. రాత్రులందు తిరిగే ఋషిపక్షులు, గుడ్లగూబలు లాంటివి, ఉండుండీ కర్ణ కఠోరంగా ఆరుస్తూ, ఆ నీరవ నిశీధిలోని భయాన్ని మరింతగా పెంచుతున్నాయి!

"శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభా దివ్యకాయం... " తల్లి గొంతుతో గొంతుకలిపి, భక్తితో చేతులు జోడించి, కళ్ళు మూసుకుని ప్రార్ధించసాగాడు జీవన్ కూడా.

జీవితంలోని భయాలనీ, బాదరబందీలనీ - అన్నింటినీ మరిచిపోయి, ఆ తల్లీ కొడుకులు దైవ ప్రార్ధనలో లీనమై కొంతసేపు ఏకాగ్రతతో ప్రార్థన చేస్తూ గడిపారు. ఆ దండకాన్ని వల్లించడం పూర్తయ్యేసరికి వాళ్ళకు, పోయిన శక్తి, ధైర్యం తిరిగి వచ్చినట్లు అనిపించింది. లేచి నిలబడి, కొడుకుని లేవదీసింది మీనాక్షి. తెల్లవారేసరికి తాము విడిచి వచ్చిన ఊరికి సాధ్యమైనంత దూరంగా వెళ్ళిపోవాలన్నది ఆమె సంకల్పం. ఇద్దరూ నడక మళ్ళీ మొదలుపెట్టారు. కొంతదూరం నడిచేసరికి, "అమ్మా! నా కాళ్ళునొప్పే! ఇక నడవలేను" అంటూ ఉన్నబడంగా జీవన్ నేలమీద చతికిలబడ్డాడు.

"ఓపిక పట్టాలిరా నాన్నా, తప్పదు! మనమిప్పుడు లేని ఓపిక తెచ్చుకుని ముందుకు నడవాలి. మనం ఎంత ముందుకి వెళ్ళిపోతే అంత మంచిది మనకే. మనం ఇలా నడుస్తూండగానే, వెలుగు వస్తుంది. వెలుగువచ్చాక ఒక ఊరు వస్తుంది, అక్కడ నీకు ఇడ్లీలు కొనిపెడతా, అవైతే మెత్తగా ఉండి నువ్వు తినగలవు. నా బంగారు తండ్రివి కదూ! లేమ్మా" అంటూ ఎలాగో బ్రతిమాలి, బామాలి లేవదీసి కొడుకుని ముందుకు నడిపించగలిగింది మీనాక్షి.

మళ్ళీ కొంతదూరం నడిచాక ఇక నడవలేనని జీవన్ నిలబడిపోతే, వాడిని ఎత్తుకుని నడవడానికి చూసింది మీనాక్షి. కాని, అది ఆమెవల్ల నవ్వలేదు. కొడుకుని ఎత్తుకుని నాలుగడుగులకంటే ముందుకి నడవ లేకపోయింది ఆమె. ఇక లాభం లేదని, మళ్ళీ కాసేపు ఏ సంచారము లేని ఆ రోడ్డువార కూర్చుని విశ్రాంతి తీసుకోక తప్పలేదు. కొంచెం సేపు కూర్చుంటూ, మళ్ళీ లేచి నడుస్తూ - అలా ఇంకొంతదూరం వెళ్ళేసరికి అక్కడ రోడ్డు రెండుగా చీలింది. ఏదారిని వెళ్ళాలి అని మీనాక్షి మనసు ఊగులాడింది.

ఆలోచించింది మీనాక్షి, "మనవాళ్ళు కుడివైపు మాతృస్థానం అంటారు, తల్లి ఎప్పుడూ తన బిడ్డకు అన్యాయం చెయ్యదు. ఇంగ్లీషువాళ్ళు కూడా కుడివైపుని "రైట్ సైడ్" అంటారు! నేను అటే వెడతాను, అదే రైట్ సై డ్" అనుకుని, కుడివైపు రోడ్డు మీదుగానే అడుగులు వేసింది ఆమె. ఒక కిలోమీటరు అలా నడిచేసరికి ఆ రోడ్డు మలుపు తిరిగింది. రోడ్డుకి ఇరుపక్కలా రాళ్ళూ - రప్పలూ, పొదలు - పుట్టలూ ఉన్నాయి. ఆ కనువెలుగులో అవి స్పష్టాస్పష్టంగా నీడల్లాగా కనిపిస్తున్నాయి. రోడ్డుమాత్రం తీర్చిదిద్దిన పాపిడిలా స్ఫష్టంగా కనిపిస్తోంది.

ఎక్కడో దూరంగా కోడికూత వినిపించింది. గాలి చల్లగా సేదదీర్చేదిగా ఉంది. తెల్లవారవస్తున్న జాడ తెలుస్తోంది. ఆ తల్లీకొడుకులు మలుపు తిరిగి నాలుగడుగులు ముందుకు వేసేరో లేదో, వెనకనుండి వేగంగా వచ్చిన లారీ ఒకటి వాళ్ళకి అడ్డంగా వచ్చి సడన్ బ్రేక్ తో ఆగింది.

****సశేషం****

Posted in December 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!