Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

శంకరం మీనాక్షికి స్వయానా మేనత్త కొడుకు. ఒకే ఊరు కావడంతో చిన్నప్పటినుండీ కలిసి పెరిగారు. శంకరం తండ్రి ఉపాధ్యాయుడు, మీనాక్షి తండ్రికి ఏదో చిన్న బిజినెస్ ఉంది. అనుకోకుండా బిజినెస్ లో బాగా డబ్బు కలిసిరావడంతో ఇరు కుటుంబాల మధ్య అంతస్థుల తేడా పెరిగింది. అంతేకాదు, తండ్రి అకాల మరణంతో పెద్ద కొడుకైన శంకరమే ఇంటి భారం మొయ్యవలసి వచ్చింది. ఇంటర్ చదువుతున్న శంకరం వెంటనే చడువుమాని, ఉద్యోగ ప్రయత్నం చెయ్యక తప్పలేదు. ఊరిలోకి కొత్తగా కరెంటు రావడంతో, క్రాష్ కోర్సు చేసి "లైన్ మేన్" గా ఉద్యోగంలో చేరాడు శంకరం ఉన్న ఊరిలోనే. రోజులు అంతంతమాత్రంగా గడుస్తున్నాయి.

రెండు కుటుంబాల మధ్యనున్న అంతస్థుల భేదం వల్ల, మేనరికాన్ని విడిచి, పెళ్ళీడుకి వచ్చిన మీనాక్షికి వేరే సంబంధం చూడసాగారు మీనాక్షి తల్లితండ్రులు. కాని మీనాక్షి, "బావనే పెళ్ళాడుతా"నని పట్టుపట్టడం వల్ల, శంకరంతో మీనాక్షి పెళ్లి జరిగిపోయింది. శంకరం బావ చిటికెనవేలు పట్టుకుని మేనత్త ఇంటికి కాపురానికి వెళ్ళిపోయింది మీనాక్షి.

సంపాదన తక్కువైనా శంకరం ఉత్తముడు, ఏ వ్యసనాలూ లేని మంచివాడు, మంచి మనసున్నవాడు, అతని సాహచర్యంలో తమ కూతురు సుఖపడుతుందని ఆశించారు మీనాక్షి తల్లిదండ్రులు. తన కంటే అన్నివిధాలా మంచి సంబంధం వచ్చే వీలున్నా, తననే కోరి పెళ్ళాడిన మీనాక్షిని, శంకరం కూడా ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. ఉద్యోగంతో పాటుగా శంకరం తీరికవేళల్లో, రకరకాల 'ఎలట్రికల్ అప్లయెన్సెస్' రిపైర్ చేసేవాడు. దాంతో వాళ్ళ జీవితం ఏ ఇబ్బందీ లేకుండా సుఖంగా గడిచిపోతోంది.

పెళ్ళైన ఏడాది గడిచేసరికి మీనాక్షి గర్భవతి అయ్యింది. ఏడవ నెల రావడంతో, అత్తవారింట సీమంతం జరిపించి, కూతురుని పురిటికి పుట్టినింటికి తీసుకురావాలని సన్నాహాలు మొదలుపెట్టారు మీనాక్షి తల్లిదండ్రులు. పేరంటానికి, ప్రయాణానికి ముహూర్తాలు కూడా పెట్టించారు. ఇక ఆ ముహూర్తం రెండు రోజులుందనగా జరిగింది ఆ దుర్ఘటన! అక్కడితో మిన్ను విరిగి మీద పడ్డట్లయ్యి మీనాక్షి బ్రతుకు తలక్రిందు లయింది ...

మెయిన్ లైన్ కి రిపేరు రావడంతో, డ్యూటీలో ఉన్న శంకరం ఆ పనిమీద వెళ్ళాడు. అతడు "ఆఫ్" చేసుకున్న మెయిన్ స్విచ్ ని, ఎవరో ఆన్ చేయడం జరిగింది. అకస్మాత్తుగా వచ్చిన కరెంట్ సర్జి కి బలైపోయాడు శంకరం! స్థంభం మీద ఉన్న అతడు మరు క్షణంలో శవమై క్రింద పడిపోయాడు. చుట్టూ ఉన్న జనం "హాహా"కారాలు  చేశారు.

సీమంతినిగా పూలరధంపై పుట్టినింటికి చేరుకోవలసిన మీనాక్షి, దురదృష్ట వశాత్తూ; భర్తను పోగొట్టుకుని, గర్భభారంతోపాటుగా పుట్టెడు దుఃఖభారాన్ని కూడా మోసుకుంటూ, పూర్వసువాసినిగా ఆమె పుట్టింటికి చేరుకోవలసి వచ్చింది. తలను భూమిలోకంతా వంచుకుని, కన్నీరు మున్నీరౌతూండగా వచ్చి తనను కౌగిలించుకుని, భోరున ఏడుస్తున్న కూతుర్ని చూడగానే, మీనాక్షి తల్లి, నిలువునా కృంగిపోయింది. పక్షవాతంతో మంచంపట్టింది. ఆపై, మనుమడు పుట్టాడన్న మాటైనా వినకుండగానే దుఃఖభారంతో ఆమె గుండె ఆగిపోయింది. తల్లి గుండెలమీద వాలి సేదతీరాలనుకున్న మీనాక్షి ఆశ అడియాసే అయ్యింది. తల్లి మరణంతో మీనాక్షి మరింతగా కృంగిపోయింది.

కాలం తన దారిన తాను కదిలిపోయింది. మీనాక్షికి నెలలు నిండి, పండంటి మగ బిడ్డడు పుట్టాడు. పుట్టిన పసివాణ్ణి అంతా నష్టజాతకు డన్నారు. అంతకు మించి వాడిని గురించి అంతగా పట్టించుకున్న వారెవరూ లేరు! తక్కిన పిల్లలకిలా వాడికి ఓ బారసాలనీ, నామకరణమనీ, తొట్టెలో పెట్టడమనీ - ఏ వేడుకా జరగలేదు. అసలు వాడికి ఏం పేరు పెట్టాలి - అని ఆలోచించిన వారుకూడా ఎవరూ లేరు. కాని వాడి ప్రసక్తి వచ్చినప్పుడల్లా మీనాక్షి తండ్రి మాత్రం "చిరంజీవి" అని వ్యవహరించేవారు.

"అమ్మా, మీనాక్షీ! చిరంజీవి ఆకలికి ఏడుస్తున్నాడమ్మా, చూడు!" అనో, బజారుకి వెళ్ళినప్పుడు, ఏ గిలక్కాయో, చొక్కాయో కొనితెచ్చి, మీనాక్షికి ఇస్తూ, "ఇవి చిరంజీవి కోసం కొని తెచ్చా" అనడంమో చేస్తూ, సందర్భపడ్డప్పుడల్లా పసివాడిని "చిరంజీవి" అని సంభోదించేవాడు. క్రమంగా అదే ఆ పిల్లాడి పేరయింది. ఆపై ఆ పేరే సౌలభ్యం కోసం 'జీవా'గా మారి, చివరకు వ్యావహారిక నామం "జీవన్" గా స్థిరపడింది.

*          *          *

మీనాక్షికి, అన్నగారైన వెంకటాచలపతికీ మధ్యలో చాలామంది పిల్లలు పుట్టి పోవడం వల్ల ఎడం పదేళ్ళకు పైనే ఉంది. మీనాక్షి పెళ్లినాటికే అతనికి ఏడాది కొడుకు ఉన్నాడు. వాడిపేరు రవి. ఆ తరువాత మూడేళ్ళకి రాధిక పుట్టింది. చలం భార్య పద్మ ఎప్పుడూ తలనెప్పనో, నడుము నెప్పనో, ఏదో ఒక బాధపేరుతో మూలుగుతూ సాధారణంగా మేడ దిగి రాదు. చిన్నతనంలోనే తలచెడి, ఇల్లుపట్టిన బంధువు ఒకామె చాలావరకూ ఇల్లు నడిపేది. కొన్నాళ్ళకు ఆమె కాలం చెయ్యడంతో మొత్తం పనంతా మీనాక్షిమీద పడింది.

ఎంత వంచిన తల ఎత్తకుండా పనులు చేసుకుని పోతున్నా, అప్పుడప్పుడు మేడ దిగివచ్చిన పద్మ, ఏవేవో వంకలు ఎంచి, మీనాక్షిని నానామాటలూ అనిగాని మళ్ళీ మేడమీదకు వెళ్ళేది కాదు. అసలే తన దురదృష్టాన్ని తలుచుకు కుమిలిపోతున్న మీనాక్షి, వదినగారి మాటలకు మరింతగా ఏడవడం తప్ప ఇంకేమి చెయ్యలేకపోయేది.

“ఉన్నకర్మ చాలక ఉపాకర్మ కూడా తోడయ్యిం”దన్నట్లు, మీనాక్షికి ఉన్న కష్టాలకి తోడు, పిల్లలు పెద్దవాళ్ళౌతున్నకొద్దీ వాళ్ళ మధ్యన పేచీలు కూడా మొదలయ్యాయి. నాలుగేళ్ళున్న మీనాక్షి కొడుకుమీద పితూరీ లేని రోజు ఉండేదికాదు. రాధిక చేతిలోని బొమ్మ లాగేసుకున్నాడనో, రవి తింటున్న బిస్కట్ ఊడలాక్కుని, చటుక్కున నోట్లో వేసుకుని తినేశాడనో చెప్పి, కొడుకుని అదుపులో పెట్టనందుకు మీనాక్షిని పద్మ నానా మాటలూ అనేది.

"మా కొంపమీదపడి తింటున్నది చాలక, మా పిల్లల్ని ఏడిపిస్తాడా" అనేది పద్మ. వదినగారిని ఎలా సముదాయించాలో తెలియక సతమతమయ్యేది మీనాక్షి. ధైర్యంగా, "వాడూ చిన్న పిల్లాడేకదా వదినా! వాడికీ ఒక బొమ్మో, బిస్కట్టో ఇస్తే గొడవ ఉండదుకదా" అని వదినగారికి చెప్పాలని ఉన్నా, చెప్పలేక, మనసులో మధనపడుతూ, ఒక్కొక్కప్పుడు తిక్కరేగి పసివాడైన జీవన్ ని, ఒంగదీసి, వీపుమీద రెండు దెబ్బలు వేసేది, ఆ తరువాత వాడు ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోయి, తనూ ఏడిచేది మీనాక్షి. ముసలాయన బ్రతికుండగానే మొదలైన గొడవలు, ఆయన పోయాక మరీ ఎక్కువైపోయాయి. పసివాడైన జీవన్ ని ప్రతిదానికీ తప్పుపట్టి, మీనాక్షిని మాటలతో వేధించసాగింది పద్మ.

వెంకటాచలపతికి రెవెన్యూ డిపార్టుమెంట్ లో ఉద్యోగం కావడంతో సంపాదన బాగానే ఉండేది. పిల్లలకోసం పద్మ ఏవేవో బొమ్మలూ, బట్టలూ తెగ కొనేది. తన పిల్లల్ని చక్కగా ముస్తాబు చేసే పద్మ, జీవన్ సంగతి అసలు పట్టించుకునేది కాదు. తొడుక్కునేందుకు రవికి పనికిరాని పాత బట్టలు ఇచ్చేది. విరిగిపోయిన ఆటబొమ్మలు తప్ప, జీవన్ కి మరేమీ ఉండేవికావు. తను మడిగట్టుకోబోయీ ముందర కొడుకుకి స్నానం చేయించి, ఉతికి ఆరవేసిన బట్టలు తొడిగి, తలదువ్వి వదిలితే మళ్ళీ రాత్రికి గాని కొడుకుని పలకరించే తీరిక ఉండేది కాదు మీనాక్షికి.

మరీ చిన్నప్పుడు తెలియలేదుగాని, ఐదేళ్ళ వయసు వచ్చేసరికి జీవన్, మామయ్య పిల్లలకీ తనకీ సంరక్షణలో ఉన్న తేడాని కనిపెట్టగలిగాడు. వాళ్ళకిలాగే తనకూ అందమైన ఆటబొమ్మలు కావాలనీ, స్నానం చేశాక, మిక్కీమౌస్ బొమ్మున్న బొచ్చుతువ్వాలుతోనే తనకూ తుడవాలనీ - ఇలా ఏదో ఒకదానికి పేచీ పెట్టేవాడు. ఇంటి చాకిరీ అంతా చేసి చేసి, ఆపై కొడుకుతెచ్చిపెట్టే పేచీలు పడలేక, వాడిని సంతృప్తి పరచి సముదాయించనూలేక సతమతమయ్యేది మీనాక్షి. సాధారణంగా కొడుకు పేచీ పెడితే, గట్టిగా గదమాయించి పంపించెయ్యాలని చూసేది. ఇంకా మారాంచేసి, చెప్పిన మాట వినకపోతే రెండు వాయించి పంపించేసేది పనితొందరలోనున్న మీనాక్షి. వాడు ఒక మూలచేరి, ఏడ్చి ఏడ్చి చివరకు సొమ్మసిల్లి, అక్కడే పడుకుని నిద్రపోయేవాడు.

మీనాక్షి తనకు తీరుబడి అయ్యాక, కొడుకు దగ్గరకు వచ్చేది. దుఃఖంతో చిన్నబోయిన ముఖంతో, ముఖమంతా కన్నీటి చారికలతో, నిద్రలో కూడా వెక్కిళ్ళు పెడుతూన్న కొడుకుని చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోయేది. పక్కన చతికిలబడి, వాడిని ఒడిలోకి తీసుకుని, గుండెలకు హత్తుకుని తానూ ఏడ్చేది మీనాక్షి.

"కాలమూ కెరటమూ ఒకరికోసము ఆగేవి కావు కదా!" జీవనన్ కి ఆరేళ్ళు నిండాయి.

*      *       *

రవి దగ్గర ఒక పసుపుపచ్చని టెన్నిస్ బంతి ఉండేది. దాన్ని రవికి వాళ్ళ మామయ్య ఇచ్చాడుట! దాంతో రవి "పుటికీలు" కొట్టి ఆడుకుంటూ ఉండేవాడు. జీవన్ దూరంగా నిలబడి దానివైపే ఆశగా చూసేవాడు. వాడికికూడా దాన్ని నేలకేసి కొట్టి ఆడుకోవాలని ఉండేది. అదే ఆశతో దానివైపు చూస్తూ నిలబడేవాడు. ఆ ఆశ వాడి కళ్ళల్లో కనిపించేది. కాని ఎంత ప్రాధేయపడి అడిగినా, రవి దాన్ని ఒక్కసారి కూడా జీవన్ ని ముట్టుకోనివ్వలేదు.

తల్లి స్నానం చేయిస్తున్నప్పుడు ఒకసారి కసిగా తల్లితో అన్నాడు జీవన్, "రవికి వాళ్ళ మామయ్య చక్కని బంతి కొనిచ్చాడు. నాకూ ఉన్నాడు, ఒక మామయ్య! ఎందుకూ పనికిరాడు. ఒక్క బంతి కూడా కొనివ్వలేడు. తలమీద "ఠంగున" మొట్టడానికి మాత్రం పనికివస్తాడు."

ఎవరైనా వింటే ప్రమాదమని, మరి మాటాడనీకుండా కొడుకు నోరు చేత్తో మూసేసింది మీనాక్షి. అది మొదలుగా, జీవన్ ఆ బంతికోసం రవితో ఎక్కడ గొడవపడతాడోనని ఆమె భయపడుతూనే ఉంది...

ఆ రోజు సాయంకాలం రవీ, రాధికా బంతితో వీధి అరుగుమీద పుటికీలు కొట్టి ఆడుకుంటున్నారు. జీవన్ ఎప్పటిలాగే స్తంభం చాటున నిలబడి దాన్నే చూస్తున్నాడు. పద్మ పొరుగింటికి పెత్తనానికి వెళ్ళింది. సాయంకాలం ఔతూండడంతో మీనాక్షి పెరట్లో పశువుల కొట్టం దగ్గర పనిలో ఉంది.

జీవన్ ఏమనుకున్నాడో ఏమో, ఒక్క పరుగున వచ్చి రవి చేతిలోని బంతి ఊడలాక్కుని, తను వేగంగా "పుటికీలు" కొట్టడం మొదలుపెట్టాడు. ఒకటి - రెండు - మూడు - అలా బంతి నేలను తాకి, చప్పుడు చేసినప్పుడల్లా లెక్కిస్తూ, మహావేగంతో “పుటికీలు” కొడుతున్నాడు జీవన్. తన చిరకాలపు కోరిక తీరిన సంతోషం కనిపిస్తోంది వాడి ముఖంలో. వాడు పుటికీలు కొట్టే తీరును, వేగాన్ని ఆశ్చర్యంగా, రెప్పవాల్చడం కూడా మర్చిపోయి చూస్తూ నిలబడిపోయాడు రవి. రాధిక మాత్రం పెద్ద గొంతుక పెట్టుకుని అరుస్తూ తల్లిని పిలవడం కోసం పరుగెత్తింది. పుటికీల లెక్క వందను సమీపించింది.

కూతురు కేకలు వినిపించగానే, కబుర్లాపి కంగారుగా లేచి, ఇంటికి వచ్చింది పద్మ, గాలిదుమారంలా ఉరుకులు పరుగులతో! విసురుగా జీవన్ చేతిలోని బంతిని ఊడలాక్కుని, వాడిని దూరంగా వెళ్లి పడేలా ఒక్కతోపు తోసింది. ఆ విసురుకి అల్లంతదూరం వెళ్లి క్రింద పడ్డాడు జీవన్. తల్లి ఆసరా చూసుకుని రవి, రాధిక పరుగునవెళ్ళి, వాడిమీదపడి శక్తికొద్దీ కొట్టడం మొదలుపెట్టారు. జీవన్ విసురుగా లేచి తిరగబడ్డాడు. రాధిక తూగలేక నోరంతా తెరిచి "అమ్మా" అంటూ ఏడవసాగింది. పద్మకు పూనకం వచ్చినట్లయ్యింది. జీవన్ని జబ్బ పట్టుకుని ఈవలికిలాగి, చేతికొద్దీ కొడుతూ అరవసాగింది...

"ఈ నష్టజాతకుడు నా బిడ్డల్ని పొట్టన బెట్టుకునేలా ఉన్నాడు, రక్షించండి బాబోయ్" అంటూ.

ఆ కేకలు విని ఇరుగుపొరుగులవాళ్ళు పోగుపడసాగారు. పద్మ పట్టు సడలించడంతో, విసురుగా వెళ్లి, రవిని క్రిందకు పడదోసి, వాడిమీద ఎక్కి కూర్చుని, గుప్పిళ్ళ బిగించి వాడిని గ్రుద్దడం మొదలుపెట్టాడు జీవన్. రవి వయసులో జీవన్ కన్నా రెండున్నరేళ్లు పెద్దవాడైనా, పీలగా ఉండి, చూపులకు జీవన్ కన్నా చిన్నవాడనే భ్రాంతిని కలిగిస్తాడు. రవి, జీవన్ సమువుజ్జీలుగా క్రిందుమీదవుతూ, నేలమీదపడి దొల్లుతూ పెనుగులాడుతోండగా, దీనికంతటికీ కారణమైన బంతిమాత్రం అరుగుక్రిందకు దొల్లిపోయి, గడ్డిలోపడి ఏమీ ఎరుగనట్లు స్తబ్దంగా ఉండిపోయింది. ఈ గొడవలో పడి, దాని ఊసు పట్టించుకున్న వారెవరూ లేకపోయారు.

తన కొడుకు జీవన్ చేతిలో దెబ్బలు తినడం చూడలేకపోయింది పద్మ. జీవన్ నుండి రవిని విడదీసి, జీవన్ ని చెడామడా కొట్టడం మొదలుపెట్టింది. కొట్టి కొట్టి, ఇంకా కసి పట్టలేక వాడిని స్తంభం వైపుకి తోసింది. వాడు విసురుగా వెళ్లి స్థంభానికి కొట్టుకుని "అమ్మా" అంటూ ఆక్రోశించి, క్రింద పడిపోయాడు. స్తంభం కొట్టుకోడంతో ముక్కుకి మూతికి దెబ్బలు తగిలి, రక్తం ధారగా కారసాగింది. అది చూసి పద్మ పిల్లల్ని తీసుకుని విసవిసా మేడమీదకు వెళ్ళిపోయింది. పద్మ నోటి దురుసుతనానికి వెరచి, ఒకరొకరూ నెమ్మదిగా జారుకున్నారేగాని ఎవరూ, స్తంభం పక్కన దెబ్బతిని పడివున్న ఆ పసివాడిని గురించి పట్టించుకున్నది లేదు. కొంతసేపటికి తనంతట తానే తెప్పరిల్లి, కారుతున్న రక్తాన్ని చూసి భయంతో, "అమ్మా" అంటూ పెద్దగా ఆర్తనాదం లాంటి కేకపెట్టి, తల్లికోసం పరుగుపెట్టాడు జీవన్.

*          *         *

గోధూళి వేళకి మీనాక్షి దొడ్డిగుమ్మంలో సిద్ధంగా ఉంటుంది, మేతకు వెళ్ళిన పశువులు ఇళ్ళకు తిరిగి వచ్చే వేళది! నిండుగా ఉన్న పొదుగులతో ఇంటికి వచ్చిన పాడిపసువులు దూడలను పలకరించే "అంబా"రవాలతో, లేగదూడల జవాబులతో సందడిగా ఉంది అక్కడంతా. వాటికోసమే కనిపెట్టుకుని ఉన్న మీనాక్షి, వెంటనే వాటిని గుంజలకు కట్టి, దాణాపెట్టి, ఆపై వాటి ముందర కొంచెం గడ్డివేసి, పాలుపితకడానికి గొల్లడు వచ్చేవేళకు తగిన రంగం సిద్ధం చేసేసరికి అసుర సంధ్య అయ్యింది. ఆ తరవాత వెళ్లి స్నానం చేసి, మడిబట్ట కట్టుకుని రాత్రి వంట చేసీందుకు వంటగదిలోకి వచ్చింది మీనాక్షి. సరిగా అప్పుడే తల్లిని వెతుక్కుంటూ వచ్చిన జీవన్, ఆర్తితో, "అమ్మా" అంటూ వచ్చి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు.

అప్పటికింకా వంటగదిలో స్విచ్ ఆన్ చెయ్యకపోడంతో గదంతా చీకటితో మసగమసగగా ఉంది. ఆ చిరు వెలుగులో కొడుకు పరిస్థితి తెలియకపోడంతో, "అయ్యో! నా మడి మంటకలిపేశావు కదురా" అంటూ, పని తొందరలో ఉన్నమీనాక్షి, వాడి వీపుమీద ఒక్క చరుపు చరిచింది. మూలిగే నక్కమీద తాటికాయ పడింది! బాధతో గిలగిలలాడుతూ "కెవ్వు" మన్నాడు, ఆ పసివాడు, పాపం!

స్విచ్ ఆన్ చేసింది మీనాక్షి. అప్పుడు తెలిసింది ఆమెకు కొడుకు ఎంత దుస్థితిలో ఉన్నాడో... జరిగినదేమీ తెలియని మీనాక్షి, జీవన్ ఆటల్లోపడి దెబ్బలు తగుల్చుకున్నాడనే అనుకుంది.

"ఏమైందిరా నీకు? ఇంత దెబ్బ ఎలా తగిలిందిరా బాబూ!" అంటూ ఆక్రోశించింది ఆమె. తాను వాడిని కొట్టినందుకు బాధపడింది. ఆపై తన పైట చెంగు నీళ్ళలో ముంచి, వాడి మొహాన్ని అంటివున్న రక్తాన్ని మృదువుగా తుడిచి, పంచదార డబ్బాతీసి రవంత పంచదార నోటిలో వేసింది, కదిలిన పళ్ళనుండి కారే రక్తాన్నది ఆపుతుందన్న ఉద్దేశంతో.

కొడుకుని చేరదీసుకుని, "పంచదార నెమ్మదిగా చప్పరించు. నెప్పి తగ్గుతుంది" అంది ఓదార్పుగా. అసలే బాధలోవున్నవాడిని, తను కొట్టి, మరింత బాధపెట్టినందుకు పశ్చాత్తాపంతో కన్నీరు పెట్టుకుని జీవన్ని దగ్గరగా హత్తుకుంది మీనాక్షి.

సరిగా అప్పుడే మేడ దిగి, వంటింట్లోకి వచ్చిన పద్మ అదంతా కళ్ళారా చూసింది. అసహనంతో ఆమెకు ఒళ్ళు మండిపోయింది. గుడ్లెర్రజేసి, అరచేత్తో నోటిపైన కొట్టుకుంటూ "హవ్వ, హవ్వ! అసలు సంగతి ఇదన్నమాట! తల్లి మద్దతు ఉండబట్టే వాడలా పేట్రేగి పోతున్నాడు! వెధవపని చేసి వచ్చిన వాడిని, మందలించి బుద్ధిచెప్పకపోగా, వాడికి పంచదార మెక్కబెట్టి మరీ ముద్దుచేస్తోంది ఈ మహాఇల్లాలు! చూడండి బాబూ! చూడండి! ఇంక వీడు ఇలాకాక ఇంకెలా తయారౌతాడు చెప్పండి?" ఊరందరూ తనమాటలు వినాలన్నట్లు గట్టిగా అరుస్తోంది పద్మ.

సద్ది చెప్పడానికి ప్రయత్నించింది మీనాక్షి, "వీడేం చేసివచ్చాడో నాకు తెలియదు వదినా! నేను దొడ్లో పశువులకు దాణా పెడుతున్నాను. ఇప్పుడే లోపలకు వచ్చా, వీడు ముక్కూ, నోరూ పగిలి, రక్తాలు కారుతూ వస్తే, రక్తం కడుతుందని, కొంచెం - చాలా కొంచెం పంచదార నోట్లో వేశాను" అంది భయం భయంగా.

పద్మ మీనాక్షిమాటల్ని అసలు పట్టించుకోలేదు. వంట గదిలోకి పిల్లి వస్తే బెదిరించడానికని తలుపు మూల దాచిన వెదురు బెత్తం తీసి, తల్లిని కరుచుకుపోయి ఓదార్పును పొందుతున్న జీవన్ని బయటికి లాగి, ఆ బెత్తంతో కొట్టడం మొదలెట్టింది పద్మ...

"వెన్న పెడితే వేలుకరిచాడుట! నా ఇంట్లోపడి తింటూ, నా పిల్లల్నే కొడతాడా" అంటూ నిండా ఏడేళ్ళైనా లేని పసివాడైన జీవన్ ని ఆ బెత్తంతో ఎడాపెడా కొట్టసాగింది.

మీనాక్షి కొడుక్కి అడ్డుపడి, చాలావరకూ ఆ దెబ్బలన్నీ తనే కాసింది. వాళ్ళనలా కసితీరా కొట్టి కొట్టి, పద్మ అలసిపోయింది కాబోలు, బెత్తం క్రిందపడేసి, జీవన్ ని తల్లినుండి విడదీసి ఈడ్చుకుపోయి, పాతసామాను పడవేసే కొట్టుగదిలోకి తోసి, బయటనుండి తలుపుమూసి గడియవేసింది. ఏడుస్తూ వెనకాలే పరుగెట్టుకువచ్చిన మీనాక్షితో, "ఏమమ్మోయ్! నీకే చెపుతున్నా, విను! నువ్వు గాని తలుపు తెరిచావంటే మాటదక్కదు. ఈ దెబ్బతో వాడికి బుద్ధిరావాలి, లేదా చావాలి" అంటూ వేలు చూపించి బెదిరించి మరీ మేడపైకి వెళ్ళిపోయింది పద్మ. హతాశురాలై ఏడుస్తూ వంటగదిలోకి పరుగెత్తింది మీనాక్షి.

*           *            *

టక్ - టక్ - టక్ మంటూ నేలను తాకి చప్పుడు చేస్తూ,  పైపైకి  లేస్తూ ఎంతో అందంగా ఎగురుతోంది బంగారు రంగులో ఉన్న ఆ బంతి ! వేగంగా పుటికీలుకొట్టి ఆడుకుంటున్నాడు జీవన్. నీరెండపడి, బంగారురంగుతో మెరిసిపోతూ, జీవన్ పుటికీ కొట్టినప్పుడల్లా పైపైకి ఎగురుతూ ఆడుతోంది ఆ బంతి. దాన్నే చూస్తూ, దానితో ఆడుతూ తన్నుతాను మరిచి, మురిసిపోతున్న జీవన్ కి మనసంతా సంతోషమే! అంతులేని ఆనందం!!

"అమ్మా! ఇటు చూడు, ఎంతబాగుందో నా బుజ్జి బంతి! బంగారు రంగులో - రవిగాడి బంతికంటే కూడా నా బంతే ఎక్కువ అందంగా ఉంది కదూ! వాడిది ఉట్టి పసుపురంగు, నాది బంగారు రంగు! ఇది నిజంగా బంగారు బంతే, సందేహం లేదు."

అది ఎన్నోసారో జీవన్ ఆ బంతినిగురించి అలా గొప్పగా అనుకోవడం. ఇది వందోసారో, అంతకంటే ఎక్కువో కూడా...  పట్టరాని ఆనందంతో వాడు పుటికీలు కొడుతుంటే దగ్గర నిలబడి చూస్తోంది మీనాక్షి. బంతి పైకి లేస్తున్నకొద్దీ సూర్యరశ్మి పడి అది ఇంకా ఇంకా ధగధగలాడుతూ మెరిసి పోతోంది. అది ఒక అద్భుతంలా ఉంది జీవన్ పసి మనసుకి!

"అమ్మా! నా బంతి చూడు, ఎంత ఎత్తుకి ఎగురుతోoదో " అంటూ, ఉషారుగా, అరచేత్తో శక్తినంతా ఉపయోగించి, ఒకే ఒక్క దెబ్బ గట్టిగా కొట్టేడు జీవన్ ఆ బంతిని, అంతే! ఆ బంతి నేలకు కొట్టుకుని పైకంతా లేచింది. అలా లేచి, లేచి, లేచి ...  మేఘాలలోకంతా లేచి, ఆపై నక్షత్ర మండలంలోకంతా వెళ్ళిపోయి, జీవన్ చూస్తూవుండగానే మాయమై కనిపించకుండా పోయింది!

"అయ్యో! నా బంతి" అంటూ పెద్దగా కేకపెట్టి లేచి కూర్చున్నాడు జీవన్. అక్కడితో కల చెదిరిపోయి వాస్తవం ప్రత్యక్షమయ్యి, భయంతో వణికాడు ఆ పసివాడు.

(తన చీకటి కొట్టులోని అనుభవాలన్నీ తల్లికి ఆ తరవాతి రోజుల్లో తు - చ తప్పకుండా చెప్పాడు జీవన్. అందుకే అవంత బాగా తెలుసు మీనాక్షికి.)

మేనమామ భార్య పసివాడైన జీవన్ ని కొట్టుగదిలోకి తోసి, తలుపులు బిగించి వెళ్ళిపోగానే, ఒంటరిగా అసహాయంగా ఆ పాతసామాను మధ్య కూర్చుని, బాధతో, భయంతో ఏడుస్తూ ఉండిపోయాడు జీవన్. అప్పటికింకా ఎలుకల సంచారం మొదలవ్వలేదు. ఏడ్చి ఏడ్చి అలసి నేలమీద పడుకుని నిద్రపోయాడు ఆ పసివాడు. ఆ నిద్రలో కలగన్నాడు. ఆ కలలో బంగారు బంతితో ఆడుకున్నాడు. కానీ, మెలకువ రాగానే వాస్తవం ఎదురుపడింది...

చుట్టూ చీకటి. కీచు కీచుమంటూ సామాను మధ్య ఎలుకలు పరుగులు పెడుతున్నాయి. వాటి అల్లరికి ఉండుండీ దొర్లిపడిన సామాను గుండెలవిసేలా పెద్దగా చప్పుడు చేస్తున్నాయి. ఎక్కడో ఎత్తుగా గోడలో ఉన్న వెండిలేటర్ ద్వారా చంద్రుని వెన్నెల తాలూకు వెలుగు కొద్దిగా వస్తోంది. చాలీచాలని ఆ గుడ్డి వెలుగు వల్ల, ఆ గదిలోని పనికిమాలిన సామాను సృష్టించిన పెద్ద పెద్ద నీడలు, మరింత భయాన్ని కల్గిస్తున్నాయి. ఎలుకల ధాష్టీకానికి చిట్టటకమీదనుండి క్రిందపడిన రేకుడబ్బా భయంకరమైన శబ్దం చెయ్యడంతో 'కెవ్వు'న కేకపెట్టి, పెద్దగా ఏడ్చాడు జీవన్. కాని అది అరణ్యరోదనమే అయ్యింది. అది విని కాపాడడానికి ఎవరూ రాలేదు. మరేమీ చెయ్యలేని అసహాయ స్థితిలో కళ్ళు గట్టిగా మూసుకుని, భయాన్ని అణుచుకోవాలని చూశాడు ఆ పసివాడు. అలా వాడు ఎంతసేపున్నాడో వాడికే తెలియదు. క్రమంగా ఆ రవంత వెన్నెల కూడా సమసిపోవడంతో చీకటి గుయ్యారంలా మారింది ఆ ప్రదేశం.

మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి, దూరం నుండి మినుకు మినుకుమనే చిన్న వెలుగు, చుక్కలా కనిపించింది. అది అంతకంతకూ దగ్గరగా వస్తోంది. దానిని చూసి, జీవన్ మరింత భయభ్రాంతుడయ్యాడు. వాడి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. బడిలో పిల్లలు చెప్పుకునే కథల్లోని కొరివిదయ్యాలు గుర్తుకొచ్చాయి. వెంటనే, "బాబోయ్! కొరివిదయ్యం" అంటూ అరిచి, పెద్ద కేకపెట్టాడు జీవన్!

పెద్ద కేక పెట్టానని వాడు అనుకున్నాడేగాని, అది గొంతుపెగిలి వెలికి రాలేదు. అంతలో ఆ వెలుగు మరింత దగ్గరగా రానేవచ్చింది. భయంతో బెగ్గటిల్లిపోయాడు జీవన్. మళ్ళీ అరవాలని నోరు తెరవగానే ఒక చల్లని చెయ్యి ఆ నోరు మూసేసింది. నెప్పికి మూలిగాడు జీవన్.

"భయపడకురా కన్నా! నేనేరా అమ్మను" అన్న మాటలు చెవిలో గుసగుసగా వినిపించాయి వాడికి..

భయంతో నిలువుగుడ్లు వేసుకుని చూస్తున్న పసివానికి, "అమ్మ" అన్నపదం అమృతభాండంలా తోచింది. మరుక్షణంలో వాడికి కడంటి పోతున్నప్రాణం వెనక్కి వచ్చినట్లయ్యింది. ఆ బుడ్డి దీపపు చిరువెలుగులోనే తల్లిని గుర్తుపట్టగలిగాడు జీవన్! అక్కడితో భయం పోయింది.

అమ్మ వచ్చేసిందికదా, ఇక భయం లేదు. అన్నీ అమ్మే చూసుకుంటుంది" అన్న భరోసా చిక్కింది వాడికి. "అమ్మా!" అని ఆర్తితో పిలుస్తూ, తల్లిని కౌగిలించుకున్నాడు జీవన్. కొడుకును గాఢంగా హృదయానికి హత్తుకుంది మీనాక్షి.

ఇప్పుడామె కన్నుల్లో కన్నీళ్ళు లేవు, కార్యదీక్షతో జ్వలిస్తున్నాయి ఆ కళ్ళు. కొడుకు చెవిలో గుసగుసగా చెప్పింది మీనాక్షి, "గట్టిగా మాటాడకు ఎవరైనా వింటారు, మనమింక ఇక్కడ ఉండటం లేదు, ఇప్పుడే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చేసే చాకిరీ మరెక్కడ చేసినా, మన రోజులు గౌరవంగా వెళ్ళిపోతాయి. నడు, పోదాం" అంది.

ఇల్లు విడిచి వెళ్ళడంలోని సాధక బాధకాలు ఏమీ తెలియని జీవన్ కి అది బాగానచ్చింది, వెంటనే మీనాక్షి ఒడిలోనుండి లేచి నిలబడ్డాడు. వాడికి తెలిసిందల్లా ఇల్లు విడిచి పోవడమంటే, అత్తలాంటి బ్రహ్మరాక్షసికి దూరంగా వెళ్ళడం అన్నంత వరకే!

"మనం ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దమ్మా! పదపోదాం" అంటూ తల్లి చెయ్యి పట్టుకున్నాడు జీవన్.

కొడుకు చెయ్యి విడిపించుకుని, టిఫిన్ బాక్సులో తీసుకువచ్చిన మజ్జిగా అన్నం పైకి తీసింది. "ఈ కొంచెం, రెండు ముద్దలు తిను, ఉట్టి కడుపుతో ప్రయాణం చెయ్యకూడదు" అంటూ తినిపించబోయింది.

"తినలేనమ్మా! నోరంతా నెప్పి" అన్నాడు జీవన్. బుడ్డిదీపం వెలుగులో చుస్తే ముఖమంతా వాచిపోయి కనిపించింది. అప్పుడు గుర్తించింది మీనాక్షి, కొడుకుకి మూతీ, ముక్కూ తెగవాచి ఉన్నాయనీ, మాటకూడా సరిగా పలకలేకుండా ఉన్నాడనీను. ఇక చేసేదేమీ లేక, అన్నం పిండేసి, మజ్జిగమాత్రం నెమ్మదిగా ఎత్తిపోసి మింగించి, శాస్త్రం ముగించింది ఆమె. వెంట తెచ్చిన తుండు తడిపి, ఆ తడిబట్టతో ముఖంపైన, ఒంటిమీద ఉన్న రక్తపు మరకలు తుడిచి, ఒంటినున్న బట్టలు విప్పించి, ఉతికిన బట్టలు తొడిగించి, తలదువ్వి కొడుకుని ప్రయాణానికి తయారు చేసింది మీనాక్షి.

ఒక చేత కొడుకుని, మరొకచేత మరో రెండు జతల బట్టలున్న సంచీని పట్టుకుని, బయలుదేరింది మీనాక్షి. ఒక్కొక్కతలుపు తెరుచుకుంటూ, బయటికి వచ్చి దొడ్డిగుమ్మం తలుపు కూడా తెరుచుకుని, రోడ్డుమీదకు వచ్చింది.

అలా మొదలయ్యింది ఆ తల్లీకొడుకుల జీవిత ప్రస్థానం - గమ్యమేమిటో ఎరుగని ఆ సుదూర ప్రయాణం!

****సశేషం****

Posted in November 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!