అమ్మా! అనుమతి నిమ్ము; భారత సేనలోచేరి
శిక్షణ పొందగ అనుమతిచ్చి నన్నాశీర్వదించు.
ఆకతాయి నైన నేను "ఆర్మీ"లో చేరి, శిక్షణ పొంది
ఆదర్శ పురుషుడినీ, అసమాన వీరుడినీ ఔతాను,
అస్త్రశస్త్రాల నలవోకగా వాడటం నేర్చుకుంటాను.
పొరుగువాడు సేనతో మన దేశంపైకి దండెత్తి వచ్చిన నాడు
మాతృభూమి రక్షణకై ముందు వరుసలో ముందర ఉంటాను!
అసమాన శౌర్యంతో శత్రువుల నందరినీ చీల్చి చెండాడుతా,
రణరంగంలో వీరవిహారం చేసి విజయ పతాకం ఎగర వేస్తాను !
అడవి మొక్కలా పెరిగిన నాకు సరైన రహదారి ఇదేనమ్మా!
క్రమశిక్షణ నేర్పి, తీర్చిదిద్ది, ఉద్యాన శోభ నిస్తుం దిది నాకు.
స్వదేశ రక్షణకై రణరంగంలో పోరాడుతూ మరణించినా,
అదీ మనకు మంచిదే ఔవుతుందని అర్థం చేసుకో అమ్మా!
భూమిపై కీర్తి, స్వర్గంలో శాశ్వత వసతి కలిగి నేను సుఖిస్తా.
"అమర జవా" నన్న విస్తృత ఖ్యాతి దక్కుతుందమ్మా నాకు,
"జై జవాన్" అంటూ జనమంతా ప్రేమను నివాళులర్పిస్తారు,
నీ కన్నీరు తుడిచి, వీరమాతవని నిన్ను కొనియాడుతారు!
అమ్మా! విచారమొద్దు, నా జన్మ సార్ధకమయిందని తెలుసుకో!
నన్ను కనిపెంచిన నీ కష్టం ఫలించి, నీ జన్మ భవ్యమౌతుంది.
సమరభూమిలో హోరాహోరీ పోరాటం చేస్తూ నేను చనిపోతే
నా పార్థివ దేహాన్నిపెట్టెలో ఉంచి నీ దగ్గరకి తీసుకుని వస్తారు,
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు అంతా కలిసి జరిపిస్తారు,
నా రాకను తెలుప స్వర్గం వైపు గురిపెట్టి తుపాకులు పేలుస్తారు!
ఇకపై, నీ పుత్రుడు సాధించిన విజయాల జ్ఞాపికలన్నీ నీవౌతాయి,
నాకు బదులుగా నీ చెంత అవన్నీ నిలిచి ఉంటాయి ఎప్పటికీ!
మనసుకైన గాయాలకు ముందయ్యేది కదిలిపోయెడి కాలమే కదా!
కాలక్రమంలో నా తలపులు నీలో నిండైన గర్వాన్ని ప్రేరేపిస్తాయి.
వీర జవాన్ తల్లివైనందుకు విర్రవీగే రోజు వస్తుందమ్మా త్వరలోనే!
పుట్టలో పుట్టిన చెద పురుగు లాంటి వాడు కాకూడదు నీతనయుడు!
మాతృభూమి పరిరక్షణకై ప్రాణమొడ్డి పోరాడే మహావీరుడు అవ్వాలి
అమ్మా! భారత సేనలో చేరగ అనుమతి నిచ్చి ఆశీర్వదించు నన్ను!