Menu Close
Galpika-pagetitle
నరకానికి ప్రయాణం - మి లి కథలు -2 -- ఆచార్య రాణి సదాశివ మూర్తి

తనొక ఇంజినీరింగ్ పట్టభద్రుడు. చిన్న నాటినుండి చదువుకోమని, రాంక్ తెచ్చుకోమని చెప్పడమే తప్ప లోకంలో ఎలా నెగ్గుకు రావాలో నేర్పలేదు అమ్మా, నాన్న.

తన మిత్రగణం అంతా తనలాంటి వాళ్ళే. చదువులైతే చదివారు కాని ఉద్యోగాలకోసం ఉసూరుమంటూ నిట్టూర్పులే తప్ప ఊతం ఎక్కడా అందింది లేదు. రోజూ సాయంత్రం అయ్యేసరికి తమ పేట సెంటర్ లో ఉన్న టీస్టాల్ లో చాయ్, బిస్కెట్లు తినేసి కాసేపు కబుర్లు చెప్పుకుని బైకులు ఎక్కి ఇంటికి చేరుకోవడమే. కాలం గడిచే కొద్దీ తాము చదువుకున్న వారం అనే విచక్షణ కూడా తగ్గిపోతోంది. వ్యవస్థ మీద కోపం. ఎవర్ని తిట్టాలో లేక తమని తాము తిట్టుకోవాలో తెలియని అయోమయం. ఇలా తమలోని అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొత్త కొత్త అలవాట్లు. వాటిలో ఒకటి. ప్రాణాంతకమైన స్థలాలలో సెల్ఫీలు. వారంరోజులలో వుంది సెల్ఫీలు. ఎవరు ముందు పూర్తి చేస్తే వారికి మిత్రమండలి సన్మానం. ఈ ప్రయత్నం లోనే తనను తాను ఉరితీసుకుంటున్నట్టు సెల్ఫీ తీసుకునే ప్రయత్నం లో ఒక మిత్రుడు ఉచ్చు బిగిసి ప్రాణాలు విడిచాడు. మరొకడు కొండ శిఖరం ఎక్కి అంచుమీద నిలబడి వెనక్కు ఏ ఆధారం లేకుండా లోయవైపుకి వంగి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం లో తను నిల్చున్న రాయి విరిగి లోయలోకి పడిపోయి ప్రాణాలు విడిచాడు. అయినా మిగిలిన వారు తమ ప్రయత్నాలను మానలేదు. ఇటువంటి ప్రయత్నాలలో తన మిత్రులంతా తనకిచ్చిన అసైన్మెంట్ రైళ్ళతో చెలగాటం. ఇప్పటికి తను రైళ్ళ విషయంలో ఎనభై సెల్ఫీలు పూర్తి చేశాడు. రైలు వేగం పుంజుకున్నాక సెల్ఫీలు తీసుకుంటూ రైల్ లోంచి దూకడం, వేగం గా పరిగెడుతున్న రైల్ లోకి ఎక్కుతూ సెల్ఫీ, కదులుతూన్న రెండు ప్రక్క ప్రక్క ప్లాట్ఫారం లలో బయలుదేరుతున్న రైళ్ళ లో ఒకదాన్నుంచి ఒకదానిలో దూకుతూ సెల్ఫీ ఇలా. ఇప్పుడు తను చేయబోయే మరో ప్రయత్నం - రైల్  స్టేషన్ లో కి వచ్చేలోపు రైలు పట్టాలపై నిలువు గా పడుకుని రైలు తనమీదుగా వెళుతూండగా సెల్ఫీ తీసుకోవాలి. ఆ ప్రయత్నంలో తానుండగా పోలీసులు వచ్చి తనని రైల్వేస్టేషన్ కి తీసుకొని వచ్చి దేహశుద్ధి చేశారు. పోలీస్ అధికారి విషయం తెలుసుకుని కేసు పెడితే భవిష్యత్తు చెడిపోతుందని అమ్మా, నాన్నల్ని పిలిపించి వారిని, తననూ కూడా మందలించి ఇంటికి పంపించేశాడు. ఒళ్ళు హూనం అయ్యింది. ఇంటికి చేరుకున్నాడు. అమ్మా, నాన్న తనని ఒక్క మాట కూడా అనటం లేదు. తమలో తాము మంచినీళ్ళు కూడా ముట్టకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. వాళ్ళను అలా ఏడిపిస్తున్నందుకు సిగ్గు పడ్డాడు. వాళ్ళకి తను ఒక్కడే కొడుకు. ఇద్దరూ విద్యాధికులే. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారే. తనను తిడితే ఏమై ఉండేదో? తనంటూ లేకపోతే? వాళ్ళకి ఏడుపే ఉండదు కదా? వెంటనే తనకు ఒక చిత్రమైన కోరిక కలిగింది. తనను తాను అంతం చేసుకుంటే? ఎన్నాళ్ళ నుంచో తనకు ఒక కోరిక ఉంది. స్వర్గం, నరకం ఎలా ఉంటాయో చూడాలి అని. అవి మరణించాకా కానీ సాధ్యపడేవి కావు. సరే తన మరణానంతరం అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి? ఆ నిశ్చయంతో ఏడిచి, ఏడిచి సొమ్మసిల్లి అమ్మా, నాన్నా వాలిపోయాక ఆరోజు రాత్రి ... ఉరివేసుకుని మరణించాలని నిశ్చయించుకున్నాడు. తన గదిలోకి వెళ్ళి తలుపులు చేరవేశాడు. తమ ఇంట్లో సీలింగ్ కొంచెం హైట్ ఎక్కువే. 15 అడుగులు ఎత్తు. సీలింగ్ ఎత్తుగా ఉంటే గాలి వెలుతురు బాగా వస్తాయని నాన్న ప్లాన్ కి ప్రతిరూపం ఆ ఇల్లు.

తన ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ మెసేజ్ పంపాడు. *నేను నరకానికి బయల్దేరాను. మళ్ళీ కలుస్తానో లేదో? తెలియదు. అందరికీ గుడ్ బై.* అని.

టేబుల్ పై స్టూల్ వేసుకుని ఎక్కి తన లుంగీతో ఉచ్చు బిగించి తలదూర్చి క్రిందనున్న స్టూల్ ను తన్నేశాడు. కాని మెడకు ఉచ్చు బిగుసుకోవడానికి బదులు ఎవరో విప్పేసినట్లో లుంగీ ముడిజారిపోయింది. తను సీలింగ్ ఎత్తు నుంచి టేబుల్ మీదికి, అక్కడ నుండి నేలపైకి తలక్రిందులుగా తిరుగుతూ పడ్డాడు. ఆ టేబుల్ కోడు బలంగా తలకి తాకింది. తలలోంచి రక్తం కారుతోంది. ఆ చప్పుడుకు అమ్మా, నాన్నా తన గదిలోకి పరుగున వచ్చారు. బెంబేలెత్తుతున్నారు. అమ్మ తనతలను ఆమె ఒళ్ళో కి తీసుకుంది.  ఆ క్షణం లో అమ్మని చూసాకా తనకు బ్రతకాలనిపించింది. కాని మగతా లేక మరణమో తెలియని స్థితిలో మత్తులోకి జారుకున్నాడు తను.

అలిగిన అలుగక.... -- గౌరీ కాసాల

ఎక్కడికి అమ్మాయి  బయలుదేరావ్...

కూరగాయల సంత కి పిన్ని ఆయన రావడం లేట్ అవుతుందిట.

మెడలో తగిలించుకున్న బ్యాగ్ లో ఉన్న పాప ని సరిచూసుకుంటూ అంది వాణి.

అయితే ఆ దుమ్ము ధూళి లో ఈ చంటిది. ఎందుకు నేను చూసుకుంటాను లే !! నువ్వు వెళ్లిరా! చనువుగా బ్యాగులో ఉన్న పాపని అందుకని లోపలికి వెళ్లిపోయారు పిన్ని గారు.

చిరునవ్వుతో ఆవిడ వైపే చూస్తూ అసంకల్పితంగా గతంలోకి వెళ్ళిపోయింది వాణి.

*        *       *      *

కిటికీ ట్రాన్స్పరెంట్ అద్దం లోంచి లేత సూర్య కిరణాలు నిద్రలేపాయి వాణిని. ఆ  ఏర్పాటు చేసింది శేఖర్. అలాంటి మెలకువ ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది అంటాడు.

ఇవాళ శేఖర్ క్యాంపు నుంచి వచ్చేస్తాడు.

ఆ ఊహ రాగానే గబుక్కున లేచింది వాణి.

ఇంతలో భూపాలరాగం లో కాలింగ్ బెల్. ఇదీ  శేఖర్ ఏర్పాటే. పొద్దున్నే ఎవరైనా బెల్లు కొట్టినా విసుక్కోకుండా లేవగలుగుతాం అంటాడు మంచి రస హృదయం శేఖర్ ది.

శేఖరేనా...

ఒక్కంగలో  వెళ్ళి తలుపు తెరిచింది...

..

అమ్మాయ్ వాణి ఇంట్లో సరుకులు అన్నీ ఉన్నాయా లేకపోతే తెప్పించుకో మందులన్నీ కూడా..

రేపటి నుంచి మూడు వారాలు బందుట జాగ్రత్తపడు... మాట్లాడుతూనే తన ఇంట్లో ఏర్పాట్లు చేసుకోవడానికి వెళ్ళిపోయారు ఆవిడ.

ఒక్క క్షణం బుర్రంతా బ్లాంక్ అయిపోయింది.

మరి శేఖర్శే.... ఖర్ ఎలా వస్తాడు?

గుండెల్లో దడ కళ్ళల్లో నీళ్ళు ఒక్కసారే వచ్చేసేయ్.

ఇంతలో శేఖర్ ఫోన్

హలో.

శేఖర్ గొంతు వినగానే దుఃఖం పొంగుకొచ్చింది వాణి కి

వాణి...  వాణి బి  బ్రేవ్... నా బుజ్జి కదూ... నువ్వు డల్ గా ఉంటే ఏడిస్తే కడుపులో పాపాయికి  కూడా మంచిది కాదు.... ఏదో మంత్రం విన్నట్టు వాణి దుఃఖం తగ్గిపోయింది.తర్వాత మాట్లాడుకుందాం ముందు నీకు ఏమేం కావాలో అవన్నీ తెప్పించుకో...డియర్.... పళ్ళు డ్రైఫ్రూట్స్ మర్చిపోకు బలమైన ఆహారం తిను...... ప్రాక్టికాలిటీ కూడా శేఖర్ సొంతం.

వాణి కూడా ఆ హడావిడిలో పడిపోయింది.

*     *     *     *

నాలుగైదు రోజులు గడిచిపోయాయి.

అందరిలాగే వాణి కూడా మెల్లమెల్లగా లాక్ డౌన్ కి  అలవాటు పడింది.

శేఖర్ ప్రతి రోజు ఫోన్ చేసి, ఎలాగో ఒకలాగా పర్మిషన్ తీసుకుని కారులో అయినా వచ్చేస్తాను అని చెప్తున్నాడు.

ప్రతి రోజు ఎదురు చూడటం

శేఖర్ రాలేకపోయానని ఫోన్ చేయటం.

లాక్ డౌన్ పొడిగింప బడింది.

ఇప్పుడిప్పుడే ఏదీ సాధ్యం కాదని అర్థం అయిపోయింది వాణి కి.

శేఖర్ రోజు ఫోన్ చేసి వాణి కి ధైర్యం చెప్తూనే  ఉన్నాడు.

నాలుగు రోజులు అయ్యేసరికి అంట్లు తోముకోవడం... ఇల్లు ఇల్లు తుడుచుకోవటం కష్టమైపోయింది వాణి కి.

ఒకరోజు మెయింటినెన్స్ కోసం వచ్చిన వాచ్మెన్ వాణి కష్టం చూసి కరిగిపోయాడు.

అబ్బ గారికి సాయం చేసి రా అని  భార్యని పంపాడు.

అది ఎదిరింటి ఆవిడ గమనించేసింది. వాచ్మెన్ భార్య కూడా 24 గంటలు సెల్లార్ లోనే ఉండాలని ఎవరింట్లోనూ పని చేయకూడదని రూల్ ఉంది. అది పట్టుకుని ఎదురింటి ఆవిడ ఫోన్ లో అసోసియేషన్ వాళ్లందరినీ  కాంటాక్ట్ చేసి నానా యాగీ చేసింది.

వాచ్ మెన్ భార్య పైకి సరే అన్నాచాటుగా వచ్చి పని చేసి పోయేది.

దాంతో ఎదురింటి ఆవిడ కి ఒళ్ళు మండింది. వాణి కనపడితే మొహం మీదే తలుపు వేసేయడం..పిల్లి మీద, ఎలక మీద పెట్టి వాణిని సూటిపోటి మాటలు అనడం, మనశ్శాంతి లేకుండా పోయింది వాణికి.

శేఖర్ "వాణీ ఇవన్నీ పట్టించుకోకు. నీకు పుస్తకాలు చదవటం అలవాటే కదా... నా టేబుల్ మీద ఒక ఫైలు ఉంది చూడు. నా ఫ్రెండ్ వ్రాశాడు. భారతంలో సూక్తులు. వాటిని నిత్యజీవితంలో ఉపయోగించే గలిగితే ఎంత హాయిగా ఉంటుందో అంటూ చిన్ని చిన్ని కథలతో చక్కగా రాశాడు అది చదువు..పాపాయి ఆలోచనలు కూడా చక్కగా తయారవుతాయి.”

లాక్ డౌన్ మళ్ళీ పొడిగింపబడింది. పనమ్మాయి పనులు చేసుకుంటూ ఉంటే...పాపాయి ఆరోగ్యం కోసం బలమైన తిండి తినటం, మంచి పుస్తకాలు చదవడం అలవాటు అయిపోయాయి వాణి కి.

రోజులు ఒక పద్ధతి ప్రకారం గడిచి పోతున్నాయి.

*      *      *       *

ఒకరోజు పొద్దున్నే అసోసియేషన్ సెక్రెటరీ ఫోన్ చేశాడు.

ఎదురింటి ఆంటీ తండ్రిని పొద్దున్నే అంబులెన్స్లో తెచ్చారని.. కరోనా తో  ఆయన్ని ఊరు నుంచి తీసుకొచ్చారని,. అది మంచిది కాదని.. అందులోనూ నేను ఎదురు ఇంట్లోనే ఉంటాను కాబట్టి... నాకు అసలు మంచిది కాదని..

అందరము కలిసి ఆయనని  ఊరికో హాస్పిటల్ కో పంపేయాలని సారాంశం... మధ్యలో లోపాయికారిగా పని మనిషి విషయంలో ఆవిడ నన్ను పెట్టిన బాధలన్నీ ప్రస్తావించాడు.

నేను ప్రెసిడెంట్ ను కాబట్టి ఆర్డర్ పంపించాలని ఆయన అభ్యర్థన.

ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ కళ్లుమూసుకు కుంది వాణి. ఆవిడ తనని పెట్టిన శాపనార్థాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జ్ఞాపకం వస్తున్నాయి. ఇన్నాళ్లు  చదివిన మహాత్ముల జీవిత  చరిత్రల సారాంశం..

భారతంలోని సూక్తులు మరోవైపు మానవత్వమ్ లోని మహనీయతను గుర్తు చేస్తున్నాయి.

అమ్మాయ్.. వణుకుతున్న కంఠం...కళ్ళు విప్పి చూసింది వాణి ఎదురింటి ఆవిడ.

చెదిరిపోయిన జుట్టు, ఆందోళన అలసటలతో కళ తప్పిన మొహము "నాన్న కి కరోనా పూర్తిగా తగ్గిపోయిందమ్మా... పెద్దవాడు కదా ఒకసారి ఇక్కడ పెద్ద డాక్టర్లకి చూపించండి అని అక్కడి డాక్టర్లు పంపారమ్మా ... ఆయన మా ఇంట్లో ఉండకూడదు అంటే.... దుఃఖం పొంగుకు రావటంతో కొంగు నోట్లో కుక్కుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ.

తన మీద అరచి యాగీ చేసిన ఆవిడ రూపం ఎందుకో కళ్ళముందు కనిపించింది వాణికి.

మనసుకి బుద్ధి కి సంఘర్షణ.. బుద్ధి గెలిచింది

అసలు ఆవిడ అలా మాటలు మానేయటం వల్లనే కదా తను మంచి పుస్తకాలు చదివింది.

అది ఆచరణలో పెట్టకపోతే ఇంకా చదివి ప్రయోజనమేమిటి.

ఫోన్ తీసి సెక్రెటరీ హలో అనంగానే

"చూడండి సార్.. ఆ పెద్దాయనకి కరోనా  తగ్గిపోయింది. లేకపోతే ఊరు  దాటనిస్తారా...వాళ్ళది సొంత ఇల్లే. ముసలాయనకి ఈవిడే దిక్కు... మనం ఆయనని ఇంట్లో ఉండకూడదు... అని ఎత్తులు వేస్తే అందరము జైలుకెళ్లి కూర్చోవాలి".

ఎవరి జాగ్రత్తలో వారు ఉండటమే. ఇంకా ఈ విషయంలో నో మోర్ డిస్కషన్స్" స్థిరంగా చెప్పేసి ఫోన్ పెట్టేసింది.

చెప్పలేని తృప్తి.

ఫోన్ మోగింది.. సెక్రెటరీ గారేమో ఈ సారి గట్టిగా జవాబు చేద్దామని ఫోన్ తీసింది.

"వాణి డార్లింగ్ శేఖర్ కంఠంలో చెప్పలేనంత ఆనందం ఉద్విగ్నత.

"నేను వచ్చేస్తున్నాను బుజ్జి నిజమే... దారిలో ఉన్నాను. గంటలో నీ ముందు ఉంటాను. వచ్చాక వివరాలు చెప్తాను.

నీళ్ళు నిండిన కళ్ళతో ఎదురుగా గోడ మీద ఉన్న గీతోపదేశం  పటం చూస్తూ ఉండిపోయింది వాణి.

అన్వేషి -- శ్రీముఖి

"ఈ రోజు మీ అన్వేష్ స్కూల్కి రాలేదు ఎందుకని?"

స్కూల్ నుండి వచ్చిన ఆ మెస్సేజ్  చూసిన ఆనంద్ వెంటనే భార్య శిల్పన కు  కాల్ చేశాడు.

ఉలిక్కిపడింది ఆమె.

"అదేమిటి...వెళ్ళాడు కదా?" అందామె.

ఇద్దరూ పర్మిషన్ పెట్టి, ఇంటికి వచ్చారు. తాళం తీసి లోపలికి వచ్చిన వాళ్లకు  ఎదురుగా క్యాలెండర్ కి పిన్ చేసి ఉన్న కాగితం కనిపించింది.

వైట్ పేపర్ మీద రెడ్ ఇంక్ తో రాసిన లెటర్ లాంటిది ఉంది.

అది...అన్వేష్ చేతి వ్రాతే!

ఇద్దరూ ఒకరి నొకరు అర్ధం కానట్లు అయోమయంగా చూసుకున్నారు. శిల్పన కళ్ళు అప్పటికే నీటితో నిండి...వెక్కిళ్ళ రూపంలో బైటికి వస్తున్నాయి.

ఆనంద్ ఆ కాగితాన్ని తీసుకుని నిలబడలేనట్లు..సోఫాలో కూలబడ్డాడు.. అతని ప్రక్కనే కూర్చుని శిల్పన కూడా ఆత్రంగా అక్షరాల వెంట దృష్టి సారించింది.....

"డియర్  డాడీ ....నేను  అన్వేష్ ని రాస్తున్నాను. మీరు నాకోసం వెదుకుతారని తెలుసు డాడీ. అందుకే కంగారు పడకుండా ఇది రాస్తున్నాను.

నేనిప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాను  కదా..ఇంక నాకు చదవాలని లేదు డాడీ..

నా కసలు మనింట్లోనే ఉండాలనిపించటం లేదు. బోర్ డాడీ...బోర్ గా ఉంది.

నేను స్కూల్ నుండి వచ్చేసరికి మీరు ఇద్దరూ ఉండరు. తాళం తీసి, డ్రెస్ మార్చుకుని డైనింగ్ టేబిల్ మీద పెట్టిన స్నాక్స్..తిని, ఫ్లాస్క్ లో పాలు తాగాలి. వెంటనే మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళాలి.

నాకు వెళ్లాలని ఉండదు మమ్మీ వెళ్లాల్సిందే అంటది, నీవేమో మాట్లాడవు.

‘చెస్ నేర్చు కోవచ్చు కదరా?’ అంటావ్...నైట్ నిద్ర మానేసి నేర్చుకోనా?

డాడీ..రోజూ ఉదయమే మీరు ఆఫీస్ లకు, నేను స్కూల్కి వెళతాం. నేను తిరిగి వచ్చేసరికి మీరు వుండరు.

నేను మ్యూజిక్ క్లాస్ నుండి రాగానే  ‘తొందరగా స్నానం చెయ్, హోమ్ వర్క్ చెయ్’, అంటారు.

భోజనం చేసేప్పుడు..మీరిద్దరూ మాట్లాడుకోవటమే సరిపోతుంది.

భోజనం అవగానే..’వెళ్లి పడుకో నాన్నా...అలారం మోగ గానే లేవటం లేదేమిటి?

ఎక్సర్సైజ్  చేయమని రోజూ చెప్పాలా?’ అంటారు...

నాకసలు....చదువు కోవాలని లేదు. మ్యూజిక్ మీద లేదు. ఎక్సర్సైజ్  చేయాలని లేదు..

నీతో మమ్మీతో మాట్లాడాలని కూడా లేదు....

డాడీ...నేను ఫిఫ్త్ క్లాస్  లో వున్నప్పుడు...నాన్నమ్మ చనిపోక ముందు...మన విలేజ్ కి వెళ్లాం గుర్తుందా?

అక్కడ ఎంతబాగుంది !! అక్కడ మన ఇంటి ముందు బుల్లి బుల్లి రంగు రంగుల కోడిపిల్లలు!

తాతయ్య తో పాటు ఓ రోజు నేను కూడా మన పొలానికి వెళ్ళాను. నీకు తెలుసా డాడీ...కొంతమంది అసలు కాళ్లకు చెప్పులు లేకుండానే నడిచేస్తున్నారు!

తాతయ్యను అడిగితే...

‘చూసుకుని నడిస్తే ఏం కాదురా, అరికాళ్ళు గట్టి పడతాయ్.. రక్తం చక్కగా ప్రసరిస్తది’ అన్నారు.

మరి ...మన ఇంట్లో టైల్స్ పరిచిన ఫ్లోర్ మీద కూడా మీరు నన్ను 'స్లిప్పర్స్...స్లిప్పర్స్.’ అంటారెందుకు?

మన చేలో వేసిన వేరుశనగ మొక్కలు పీకి, ఒక పక్కకు తెచ్చి, ఎండు తాటాకుల తో మంట పెట్టారు తాతయ్య. ఆ మంట చల్లారాక..తాతయ్య, పొలం లో పని చేయటానికి వచ్చిన అంకుల్స్..పక్కనున్న మామిడి తోట తాతయ్య..నా చుట్టూ కూచున్నారు తింటూ..

నన్నూ తినమన్నారు.

‘చేతికి నల్లగా అంటుతుంది తాతయ్యా..’ అన్నాను.

‘మనం నేల తల్లి బిడ్డలం రా, మసి అంట కుండా, మట్టి అంట కుండా ఎట్టా బతుకుతాం?’ అంటూ, తాతయ్య వలిచి పెట్టారు.

భలే...టేస్టీ గా ఉన్నాయ్!

అవి తిన్నాక నేను ‘తాతయ్యా వాటర్.’ అన్నాను.

మాతో పాటు కూర్చుని..కాయలు తింటున్న మామిడి తోట తాతయ్య...పక్కనున్న అంకుల్తో

‘రేయ్ ఎంకా...మాతోటలో కెళ్ళి నాలుగు కొబ్బరి బొండాలు తెంపుకు రారా. బుడ్డోడికి దావతగా ఉందట’ అన్నాడు.

ఆ కోకోనట్ వాటర్ తాగేసరికి..

స్టమక్ ఫుల్ !

డాడీ...నాన్నమ్మ చనిపోయాక, తాతయ్యను మనింటికి తీసుకు వచ్చావ్ కదా...అప్పుడు తాతయ్య నాకు ఎన్ని స్టోరీస్ చెప్పారో తెలుసా? తాతయ్య చిన్నప్పటివి, నీ చిన్నప్పటివి...బోలెడు చెప్పారు.

నీవు చిన్నప్పుడు స్కూలు నుంచి రాగానే..బుక్స్ బాగ్ అక్కడ పడేసి..ఆడుకోవటానికి వెళ్ళేవాడివట కదా?

ఆడి ఆడి.. చీకటి పడ్డాక వచ్చేవాడివట.. స్నానం చేసి, కాసేపు చదువుకుని, అన్నం తిని, తాతయ్య దగ్గర పడుకునే వాడివట.

అప్పుడు తాతయ్య నీకు సుమతి శతకం పద్యాలు నేర్పేవారట.. నానమ్మ దగ్గర పడుకుంటే కథలు చెప్తుంటే వింటూ నిదుర పోయేవాడివట.

డాడీ..నాకూ అలా...మీ దగ్గరే పడుకోవాలని  ఉంటది...మీరెందుకు నన్ను ఒక్కడినే వేరే బెడ్ రూమ్ లో పడుకోపెడతారు?

మీరు తాతయ్యను మనింటికి తీసుకొచ్చాక నాకు బాగుంది. కానీ..తాతయ్య కొద్ది రోజులున్నాక ....మీరు, మమ్మీ మాట్లాడుకోవడం..నేను విన్నాను.

డాడీ...

‘ఇద్దరం ఆఫీసు కెళతాం..బాబు స్కూల్ కి వెళతాడు..ఇంట్లో ఆయన ఒక్కరూ  ఏం వుంటారు?’

అనుకుంటున్నారు. మీరు తాతయ్యతో చెప్పటం కూడా విన్నాను డాడీ..

‘నాన్నా...మీరు ఒక్కరు ఇంట్లో ఉండలేరు గానీ..హోమ్ లో అయితే...మీ లాంటి వాళ్ళుంటారు కాలక్షేపం గా ఉంటుంది. సరిగా చూడరని భయపడొద్దు.. ఉచితంగా ఉండేది కాదు. నేను డబ్బులు కడతాను..అన్నీ అమర్చి పెడతారు.’ అన్నారు మీరు.

తాతయ్య ఏం మాట్లాడ లేదు..నీ వైపు... నా వైపు..చూసి...

‘నీ ఇష్టం రా’ అన్నారు.

పాపం...అప్పుడు తాతయ్యను చూస్తే...'పిటీ' అనిపించింది.

ఇంట్లో ఇంక తాతయ్య 'కంపెనీ' ఉండదని తెలిసి ఏడుపొచ్చింది.

పంపవద్దని నేనేడిస్తే...

‘ఆయనుంటే...నీ చదువూ, సంగీతం సాగి నట్టే..’ అంది మమ్మీ.

నువ్వేమో..‘మంచి పప్పీని కొనుక్కొస్తాను...దానితో ఆడుకుందువు గాని...’ అన్నావ్.

‘నేను వెళ్తున్నాను గా..ఫోన్ లో అయితే...మాట్లాడినంత సేపే..ఉత్తరాలు  అయితే..మళ్లీ మళ్లీ చదువు కుంటాను..నువ్ నాకు ఉత్తరాలు రాయి నానా’ అని తాతయ్య నాకు రాయటం నేర్పించారు.

అప్పుడప్పుడు రాస్తూనే వున్నాను. నా కిడ్డీ బాంక్ లో దాచుకున్న డబ్బులు తీసుకున్నాను.

నేను తాతయ్య దగ్గరకు వెళుతున్నాను. అడ్రస్ తెలుసు..మీతోపాటు వెళ్ళేవాడిని  కదా?

తాతయ్యను తీసుకుని మన విలేజ్ కి వెళ్లిపోతాం.

నీకు తెలుసా డాడీ..తాతయ్యకు వంట చేయటం వచ్చు...నేనూ నేర్చు కుంటాను.

తాతయ్యకు హోమ్ కి కట్టే ఎమౌంట్ మాకు పంపు డాడీ...

నేను మన పొలం లో..పేడి.. వెజిటబుల్స్ పండించటం నేర్చుకుంటాను.

ప్లీజ్...ఓ.కె...అనండి డాడీ..తాతయ్యను నాతో పంపించేయమని...హోమ్  వాళ్లకు కాల్ చేయండి. నన్ను వెనక్కి తీసుకు రావద్దు. మనం తలుపులు, కిటికీలు వేసేసుకుని...ఏ.సీ...వేసుకుని..పడుకుంటే...కరెంట్ పోయి...రాకపోతే...ఎలా ఉంటుంది?

మనింట్లో నాకలా ఉంటుంది డాడీ...."

చదవటం పూర్తి చేసిన ఆనంద్ అలా...స్తబ్దుగా ఉండిపోయాడు.

వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు జేబులో సెల్ ఫోన్ తీసి తండ్రి ఉన్న హోమ్ కి కాల్ చేశాడు.

తండ్రిని అడిగాడు.

“నాన్నా..అక్కడికి అన్వేష్ వచ్చాడా?" అని.

"ఇప్పుడే వచ్చాడు నానా..ఏంటి ఒక్కడే వచ్చాడు?" అడుగుతున్నారాయన

"ఏం లేదులే...మిమ్ములను చూడటానికి..." కాల్ కట్ చేశాడు ఆనంద్.

"వాడికి ఏం తక్కువ చేశామండీ ఇలా చేశాడు?" ఏడుస్తూ అంది శిల్పన.

ఆలోచిస్తూ ఉండిపోయిన ఆనంద్...స్వగతం లా అన్నాడు.

"ఆనందించే వాటిని అందకుండా చేసాం..అక్కర లేదన్న వాటిని ఎక్కువ చేశామ్...భరించలేని ఒంటరి తనాన్ని తోడు చేశామ్...."

"............"

కొంత సేపాగి...మెల్లగా అన్నాడు.

"నాన్న పరిస్థితి కూడా ఇదే అయి ఉంటుంది....వీడు చెప్పగలిగాడు...ఆయన చెప్పలేక..." ఆగి పోయాడు ఆనంద్. అతని నేత్రాలు నీటితో తొణకుతుంటే...గొంతు గాద్గికంగా వణుకుతూంది..

పరిస్ధితినీ.. భర్త మాటలనూ బేరీజు వేసుకుంటుంది శిల్పన.

చటుక్కున లేచాడు ఆనంద్

"శిల్పనా...లేచి, బైలు దేరు...వెళ్లి బాబుని, నాన్నను ఇంటికి తీసుకువద్దాం" అన్నాడు ఆనంద్.

"అలాగేనండీ" లేచింది శిల్పన.

Posted in November 2021, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!