Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

మనం మొదటిసారిగా ఒకరినొకరు పలకరించుకున్నపుడు స్నేహితులం అవుతామని అనుకున్నాను. స్నేహం ఎదుగుతుంటే తెలిసింది అది ప్రేమగా పరిణామం చెందుతోందని..

వికసించడం, పరిమళించడం ప్రేమ సహజ లక్షణం కదా..

పరిమళించద్దని శాసించే హక్కు నీకూ, నాకే కాదు

ఎవరికీ లేదు...

నీదీ ప్రేమించే హృదయమే కదా!

మరెందుకు స్పందించడం లేదు..

అంత నిర్దయగా ఎలా వెళ్లావు?

అయితే ఏంటిలే ...నా గుండెల మీద పడిన

నీ అడుగులు చెక్కిన శిలలైనాయి ..

శిలలైతే ఏం .... శిల్పాలైతేనేం....

ప్రేమించే హృదయం పలకరిస్తే

శిలలూ నవ్వుతాయి...శిల్పాలు స్పందిస్తాయి..

నువ్వు శిల్పం కన్నా కఠినం కావు కదా!

అందుకే ఎదురుచూస్తూ ఉంటా..

నన్ను ముంచేస్తున్న ప్రేమ అనే నదీ ప్రవాహంలో

ఉదయించే ఆశల కలువలు ఏరుకుంటూ..

కనిపిస్తే నీ మెడలో మాలగా వేయాలని తపిస్తూ..

వెచ్చని కన్నీళ్లు చెంపల్ని తడిపేస్తుంటే తలగడ మీద చెక్కిలి ఆనించి అనుకుంది.. “Good night, Good night parting is such sweet sorrow that I shall say Good night till it be morrow.”

%%%

తను ఆ ఆఫీసులో చేరిన రెండేళ్లకు మొదటిసారిగా సి.ఇ.వో మాధవన్ ని చూసింది ఆర్తి.. మామూలుగా అయితే చండశాసనుడు అయిన సి.ఇ.వో ఎక్కడో విదేశాలు తిరిగుతూ కూడా మొత్తం ఆర్గనిజైషన్ని రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తూ అందరినీ హడలెత్తిస్తుంటే “వీడెవడో అక్కడే ఉంటె బాగుండు ... వచ్చాడంటే కాల్చుకు తినేస్తాడు” అని అందరిలాగే ఆమె కూడా అనుకుంది. కానీ, అతన్ని మొదటిసారిగా కాన్ఫరెన్స్ లో చూసాక ఆమెకి మతి తప్పినట్టు అయింది.

సి.ఇ.వో అంటే వయసు కనీసం నలభై ఐదు, యాభై మధ్య ఉంటాయి అనుకుంది... అతని ఆకారం విషయంలో పెద్దగా ఊహలు లేవు. అలాంటిది యంగ్, డైనమిక్ కాక హ్యాండ్సంగా హిందీ సినిమా హీరోలా ఉన్న మాధవన్ ని చూసాక ఇతను ఇంత పెద్ద కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని తలచుకుంటుంటేనే ఒళ్ళంతా పులకించి పోతోంది.. ఎంతో హుందాగా ఉన్న ప్రవర్తన, గంభీరమైన స్వరం.. ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేక పోతోంది. ఏదో అద్భుతమైన కలకంటున్నట్టు ఉంది.. కళ్ళు తెరిస్తే ఆ కల చెదిరిపోతుందేమో అని భయం కూడా వేస్తోంది.

ఆర్తి తెల్లగా, సన్నగా ఐదు అడుగుల ఎత్తుతో లిల్లీ పూవులా ఉంటుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీరు..వయసు పాతిక దాటింది.. ఇంకా పెళ్లి కాలేదు.. అత్యాధునికంగా అలంకరించుకుంటుంది. ఆ అలంకరణ ఆమెకి నప్పదు... క్రోటన్ మొక్కకి మల్లె పూవు పూస్తే ఎంత అసాధారణంగా ఉంటుందో అలా ఉంటుంది. ఆమెకి చాలా సంబంధాలు చూస్తున్నారు పెద్దవాళ్ళు, కానీ ఆమెకి ఉన్న కోరికలకి సరిపడ్డ వ్యక్తి ఇంత వరకూ లభించలేదు. బెంగుళూరు రోడ్ మీద కారు నడుపుతూ నా కారుకి రెక్కలుంటే బాగుండు అనుకున్నట్టు అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన ఆర్తి తనకి కాబోయే భర్త బాగా చదువుకోవాలని తనని లోకల్ గా అయితే, బిఎండబ్ల్యు కారులో, అవుట్ స్టేషన్ అయితే చార్టర్ ఫ్లైట్ లో తిప్పుతూ, ప్రేమనగర్ సినిమాలో నాగేశ్వర రావు వాణిశ్రీ కోసం నిర్మించిన అద్దాల మేడ నిర్మించే వాడు కావాలని కలలు కంటూ అందరినీ తిరస్కరించింది. ఇప్పుడు మాధవన్ చూసాక ఇతనే తనకి కావాల్సిన వ్యక్తి అనిపిస్తోంది.. ఆమె మనసంతా మాధవన్ ఆక్రమించుకున్నాడు. ఆ రాత్రి నిద్రపట్టలేదు. తేనెటీగలాగా ఝుం అంటూ అతని చుట్టూ ఆమె ఆలోచనలు పరిభ్రమిస్తూ ఊహల తేనెపట్టు అల్లుకుంటోంది.

మరునాడు రోజూకన్నా మరింత శ్రద్ధగా, ప్రత్యేకంగా అలంకరించుకుంది. బ్లూ జీన్స్, మిరప రంగు టీ షర్టు వేసుకుంది. అదే రంగు లిప్ స్టిక్... షాంపూ చేసిన జుట్టు చక్కగా దువ్వి లూజుగా వదిలేసింది.. పెద్ద లాకెట్ ఉన్న పొడుగాటి చెయిన్, చెంపల దాకా వేళ్ళాడే ఇయర్ రింగ్స్.. ఒకప్పుడు లంబాడీలు మాత్రమే వేసుకునే కొన్ని రకాల ఆభరణాలు ఇప్పుడు ఫాషన్ పేరుతో అమ్మాయిలంతా వేసుకుంటున్నారు. హై హీల్స్ తొడుక్కుని బయలుదేరింది.

ఆఫీస్ కి దగ్గరగా ఒక మాల్ ఉంది. తొమ్మిదింటికే ఆ మాల్ ఓపెన్ చేస్తారు. నేరుగా తన బండి మాల్ వైపు పోనిచ్చింది. గిఫ్ట్ స్టోర్ కి వెళ్లి ఖరీదైన ఫ్లవర్ వేజ్ కొంది..

దానివైపు అపురూపంగా చూసుకుంటూ... నువ్వే నా ప్రేమ సంకేతం అనుకుంది..

ఆమె ఆఫీస్ లో అడుగుపెట్టగానే అందరూ ఆశ్చర్యంగా చూసారు.. డ్రెస్ కోడ్ ఉండగా ఈ డ్రెస్ ఏంటి అన్న ప్రశ్న అందరి కళ్ళల్లో కదిలింది.. అది గమనించని ఆర్తి తన డ్రెసింగ్ చాలా స్టన్నింగ్ గా ఉంది కాబోలు అనుకుంది. వర్క్ టేబుల్ దగ్గరకి వెళ్లి అందరికీ హాయ్ అంటూ పలకరింపు ఒకటి విసిరేసింది.

బ్యాగు టేబుల్ మీద పెట్టి, వాష్ రూమ్ కి వెళ్లి జుట్టు ఒకసారి సరిచేసుకుని, మరోసారి లిప్ స్టిక్ అద్దుకుని వచ్చింది.

“ఎనీ థింగ్ స్పెషల్?” అడిగింది పక్క టేబుల్ కొలీగ్ శ్రీవాణి..

“అఫ్ కోర్స్..” కన్ను గీటి నవ్వింది..

ఆ నవ్వుకి, ఆ కన్ను గీటడానికి అర్థం తెలియక సైలెంట్ అయిపొయింది శ్రీవాణి.

సరిగ్గా అప్పుడే అందరి అటేన్షన్ డ్రా చేస్తూ మాధవన్ అడుగుపెట్టాడు. అందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేస్తుండగా ప్రతిగా తల పంకిస్తూ తన ఛాంబర్ వైపు వెళ్ళిపోయాడు.

తిరిగి అందరూ వారి, వారి సీట్ లలో కూర్చున్నారు. ఆర్తి మాత్రం అతను వెళ్ళిన వైపు పరవశంగా చూస్తూ అలా ప్రతిమలా నిలబడిపోయింది. వచ్చేసాడు... వచ్చేసాడు అనుకుంది. అందరి దృష్టి మరోసారి ఆమె వైపు ప్రత్యేకంగా పడింది.

ఆమె ఎవరినీ పట్టించుకోలేదు... ఇప్పడు ఆమె కళ్ళ ముందు ఒక్క మాధవన్ వంద మాధవన్ లుగా మారి, తన చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. అతని తేజోవంతమైన కళ్ళు ఆమె కళ్ళల్లోకి చూసి ఓ చిలిపి నవ్వు నవ్వి, ఐ లవ్ యు అని చెప్పినట్టు తనువంతా విరగబూసిన పొగడపూల కొమ్మ అయింది.  మనసు, స్వరం అన్నీ అచేతనం అయినట్టు  కొన్ని నిమిషాలు స్థాణువులా  కూర్చుని, గబుక్కున తనని తాను సర్దుకుని బ్యాగ్ లో నుంచి అందంగా పాక్ చేయించిన గిఫ్ట్ తీసుకుని మాధవన్ చాంబర్ వైపు బయలుదేరింది. అందరూ నిర్ఘాంతపోయి చూడసాగారు.. ఈమెకి సి ఇ వో తో ఏం పని... మేనేజర్ తప్ప అది కూడా మరీ అవసరం అయితేనే ఎవరూ ఆయన ఛాంబర్ వైపు వెళ్ళరు... అలాంటిది ఈ మె కి ఏం పని అన్నట్టు చూస్తూ ఉండిపోయారు.

ఆమె వెళ్తున్న వైపు అయోమయంగా చూస్తూ “హలో ఆర్తీ! ఎక్కడికి వెళ్తున్నావు?” అడిగాడు మేనేజర్..

“నాకు పనుంది... ఐ వాంట్ టూ మీట్ హిమ్” అంది నిర్లక్ష్యంగా..

“నో... డోంట్ గో... హి విల్ నాట్ ఎంటర్ టైన్” అన్నాడు..

“దట్స్ ఓ..కే..” అదే నిర్లక్ష్యంతో వెళ్ళిపోయింది.

ఈమెకి మూడింది అనుకున్నాడు మాధవన్ గురించి అంతో, ఇంతో తెలిసిన మేనేజర్.

గుండె వేగంగా కొట్టుకుంటుంటే, అడుగులు తడబడుతుంటే విశాలంగా ఉన్న క్లోస్డ్ చాంబర్లో కి అడుగుపెట్టింది.

ఏసీ చల్లదనం, రూమ్ స్ప్రే పరిమళం ఆమె కోరికలకు రెక్కలు అతికాయి.

“గుడ్ మార్నింగ్ మిస్టర్ మాధవన్” అంది వీలైనంత తీయదనం స్వరంలో కలిపి కార్పోరేట్ స్టైల్ లో.

కంప్యూటర్ మీద నుంచి దృష్టి ఆమె వైపు తిప్పి “ఎస్” అన్నాడు మాధవన్..

తెల్లటి తన ఒంటి రంగుకి ఎరుపు అయితే చూడగానే అతన్ని ఆకర్షించేలా ఉంటాను.. అతను అద్భుతాన్ని చూసినట్టు చూసి చిరునవ్వుతో పలకరిస్తాడు అని ఊహిస్తూ వచ్చిన ఆర్తికి అతను అలా సీరియస్ గా అనేసరికి నిరాశ ఆవరించింది.. కొండొకచో కొంచెం భయం కూడా వేసింది. అయినా బయటపడకుండా “ఏ స్మాల్ గిఫ్ట్” అంటూ తన చేతిలో ఉన్న గిఫ్ట్ పాక్ అందించబోయింది.

“ఏంటది?” అడిగాడు ఇంగ్లీష్ లో .

“అది.. అది...ఫ్లవర్ వేజ్ ...” ఓపెన్ చేయబోయింది..

“ఎందుకు? మీరు నాకు గిఫ్ట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి?” అడిగాడు.

ఆ అడిగిన తీరుకి నివ్వెరపోతూ “మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను కదా... మెమరీ..”

“థాంక్స్... అక్కడ ఉంచండి.,.”

అతను కంప్యూటర్ లోకి మొహం తిప్పేసుకున్నాడు.

ఇంక ఏం మాట్లాడాలో, అక్కడ ఏం చేయాలో తెలియలేదు.. నెమ్మదిగా అక్కడి నుంచి వచ్చేసింది. ఎర్రబడ్డ ఆమె మొహం, నిరాశ నాట్యం చేస్తున్న ఆ కళ్ళు అందరూ ఇప్పుడు ఆమె వైపు సానుభూతిగా  చూసారు.

ఆమె సీట్ లో కూర్చున్న పది నిమిషాలకి మేనేజర్ కి ఆయన నుంచి పిలుపు వచ్చింది.

“హైదరాబాద్ లో బాగా పని చేసే వాళ్ళని ఇద్దరినీ ఇక్కడికి పిలిపించండి” అన్నాడు మాధవన్..

“ఎస్ సర్... కానీ పే ఇంక్రీజ్ చేయాలి” అన్నాడు మేనేజర్..

“డూ ఇట్ ... అండ్ అది తీసుకుని వెళ్లి మీ రూమ్ లో పెట్టుకోండి” టేబుల్ మీద ఆర్తి ఇచ్చిన గిఫ్ట్ కళ్ళతో చూపిస్తూ అన్నాడు.

అక్షరాలను అతి పొదుపుగా వాడే అతను ఇంక ఎక్కువ ఏమి చెప్పడు అని అర్థం చేసుకున్న మేనేజర్ బయటకు వచ్చేసాడు. అతని చేతిలో ఆర్తి ఇచ్చిన గిఫ్ట్ పాక్ ఉంది.

%%%%

నర్సాపురం నుంచి తిరిగి వచ్చేశారు స్మరణ, బదరీ..

“ఎలా జరిగింది ట్రిప్?” అడిగాడు దీపక్..

“ఎక్సెలెంట్ అంకుల్... నేచర్ని బాగా ఎంజాయ్ చేసాను” అన్నాడు బదరీ సంతోషంగా.

“బాగా అలసిపోయావా డ్రైవింగ్ తో” దగ్గరగా వచ్చి మెడ చుట్టూ చేతులు పెనవేసి తన గుండెల మీద వాలిన కూతురి జుట్టు సవరిస్తూ అడిగాడు దీపక్.

స్మరణ మాట్లాడలేదు.. ఆయన గుండెల మీద సేద తీరుతున్నట్టు అలా కళ్ళు మూసుకుని నిశ్సబ్దంగా ఉండిపోయింది. రెండు రోజులుగా మెదడుని గ్రైండ్ చేస్తున్నట్టుగా ఉన్న ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందుతున్నట్టు ఆయన భుజాల మీద తలవాల్చింది.

“ఏమైందిరా” వాత్సల్యం కురుస్తున్న స్వరంతో మార్దవంగా అడిగాడు.

స్మరణ మాట్లాడలేదు.. ఆమెకి దుఃఖం వస్తోంది.. కానీ దానికి కారణం అడిగితే చెప్పలేదు.. కారణం చెప్పకపోతే ఇంట్లో వాళ్ళు మరేదన్నా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. తను వెళ్ళిన పని అవలేదు.. మాలతి అనే ఆవిడ కనిపించలేదు అనే బాధకన్నా తాతయ్య ప్రియురాలు కనిపించకపోతే మధు కూడా కనిపించడేమో అనే దిగులు ఆవరించింది మనసంతా.. నిజానికి ఆ రెంటికీ లింక్ ఆమెకే తెలియదు.. గ్లోబలైజేషన్ అనేది సమస్త ప్రపంచాన్ని సన్నిహితం చేసింది.. సోషల్ మీడియా ఎక్కడెక్కడి మనుషులను కలుపుతోంది.. ఇది అసాధ్యం అన్నదేది ఇప్పుడు లేదు.. ఆ నమ్మకంతోటే. ఒక స్థైర్యం తోటే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చింది. తన నమ్మకం విశ్వాసం, స్థైర్యం అన్నీ ఒక పెద్ద గాలి కెరటం వచ్చి తన్నుకుపోయినట్టు అవడంతో ఆమె మానసికంగా బాగా క్రుంగిపోయింది. అందుకే వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహం వచ్చేటప్పుడు లేదు.. దారిలో ఆమె ఏమి మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నప్పుడే బదరీకి ఆమె మానసిక స్థితి అర్థం అయింది.. సానుభూతితో మనసు ఆర్ద్రమైంది. కానీ అతని సానుభూతి వ్యక్తం చేసే అవకాశం ఆమె అతనికి ఇవ్వలేదు. ఇప్పుడు ఇంట్లో అడుగుపెట్టగానే బడి నుంచి వచ్చి తండ్రి ఒళ్లో వాలిన పాపాయిలా ఆమె తండ్రి గుండెల మీద వాలడం బదరీకి వింతగా అనిపించలేదు.

అప్పుడే వాకింగ్ చేసి వచ్చిన ఆంజనేయులు ఆ దృశ్యం చూసి ఒక్క క్షణం మ్రాన్పడిపోయాడు..జలజల ఉరికే జలపాతం అకస్మాత్తుగా ఘనీభవించినట్టు అనిపించింది ఆయనకీ.. అంతేకాదు మనవరాలు నర్సాపురం వెళ్ళిన కారణం ఆయనకీ తెలుసు కాబట్టి ఇప్పటి ఆమె వాలకం అక్కడ జరిగిన విషయాన్ని తేటతెల్లం చేస్తున్నట్టు అనిపించింది. ఆయన అడుగుల చప్పుడుకి తలెత్తి చూసిన స్మరణ తండ్రి దగ్గర నుంచి తాతగారి దగ్గరకు వెళ్ళింది.. ఆయన చేయి పట్టుకుని “వాకింగ్ కి వెళ్ళావా తాతయ్యా.” అంది..

ఆయన మందహాసం చేసి అవును అన్నట్టు తలాడించి “ప్రయాణం బాగా జరిగిందా తల్లి..” అడిగాడు.

స్మరణ బలవంతంగా నవ్వి తలాడించింది.

“అక్కడ ఏం చేసావు... ఎవరిని కలిసావు నువ్వు వెళ్ళిన పని అయిందా” అనే ప్రశ్నలు ఆయన గండె చప్పుడులో వినిపిస్తున్నాయి స్మరణకి... తను వెళ్ళిన కారణం ఆయనకి చెప్పలేదు.. ఆయనకీ తెలుసు అన్న విషయం ఆమెకి తెలియదు.. ఆ రెండు గుండె చప్పుళ్ళ లో అపురూపమైన అనుబంధం తాలూకు స్పందనలు ఆ పరిసరాల్లో నిశ్శబ్దంగా ప్రతిధ్వనించాయి.

“ఫ్రెష్ అవండి... కాఫీ ఇస్తాను” అంది సంధ్య వచ్చి.

స్మరణ సన్నగా నిట్టూర్చి తల్లి దగ్గరకు వెళ్లి ఆవిడ చెంప మీద ముద్దు పెట్టుకుని పెరట్లోకి వెళ్ళిపోయింది.

“ఆంటీ, అంకుల్ మీ ఇద్దరికీ చాలా థాంక్స్”  అన్నాడు బదరీ..

“ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగింది సంధ్య.

“మీరు పెర్మిషన్ ఇవ్వకపోయి ఉంటె నన్ను స్మరణ నర్సాపురం తీసుకుని వెళ్ళేది కాదు.. నేను ఆ బ్యూటీ చూడగలిగే వాడిని కాను.”

అతనలా అమాయకంగా అంటుంటే దీపక్ కి ముచ్చటేసింది.. అతని భుజం మీద చేయేసి..

“వెకేషన్ వచ్చినపుడు ఏం చేస్తావు” అన్నాడు.

“ఎక్కడికో అక్కడికి వెళ్తుంటాను ఫ్రెండ్స్ తో...  సిమ్లా, డార్జిలింగ్, కొడైకెనాల్ .. ఇవన్నీ చూసాను... కానీ ఈ బ్యూటీ వేరు కదా అంకుల్..” నవ్వాడు బదరీ..

దీపక్ గట్టిగా నవ్వేసి “రేపు పాపి కొండలు వెళ్లి అటు నుంచి బోటు లో భద్రాచలం వెళదాము.. అక్కడి నుంచి హైదరాబాద్... దిసేజ్ ప్లాన్ ఓ కే” అన్నాడు..

“వావ్... థాంక్ యు అంకుల్” ఉత్సాహంగా అన్నాడు బదరీ.

సంధ్యకి మొదటిసారిగా అతని నిజాయితీ, మంచితనం, సంస్కారం అర్థం అయాయి.. మనస్ఫూర్తిగా నవ్వి..” వెళ్ళు నువ్వు కూడా ఫ్రెష్ అయి రా” అంది.

మనసు అనే కడలిలో ఎగసిపడుతున్న రక,రకాల సందేహాల కెరటాలను వెనక్కి తోయడానికి ప్రయత్నిస్తూ ఆంజనేయులు తన గదిలోకి వెళ్ళిపోయాడు.

****సశేషం****

Posted in December 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!