Menu Close
దూరం (ధారావాహిక)

అత్తలూరి విజయలక్ష్మి

అత్తలూరి విజయలక్ష్మి

“మావయ్యా నేను చెప్పేది కొంచెం విని మీరో నిర్ణయానికి రావాలని నా కోరిక”

“చెప్పమ్మా.. ఏం చెప్పాలనుకుంటున్నావు?”

“మీరు పెద్దవారు అయారు.. ఇద్దరు కొడుకులుండి మీరిట్లా ఒంటరిగా ఉంటె మాకూ బాగుండదు. చూసేవాళ్ళకి బాగుండదు. అంచేత మీరు మాతో వచ్చేయండి. మాకు పెద్ద దిక్కుగా ఉంటారు.. ఆ తింగరి దాన్ని ప్రతి దానికీ బతిమాలలేక చచ్చిపోతున్నా.. ఒక్కోసారి వింటుంది.. ఒక్కోసారి వినదు. బంగారం లాంటి సంబంధం మీరు అంత కష్టపడి పంపిస్తే వద్దంది. ఆఖరికి రేప్పొద్దున ఏ పనికిమాలిన వాడినో ప్రేమించానని అంటే ఏం చేయాలా అని నాకు గుండెల్లో గుబులు పుడుతోంది. దానికి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేక ఒంటికాయ శొంటి కొమ్ములా బతకడం అలవాటై మొండిదానిగా తయారైంది. అత్తగారింట్లో మరుదులు, ఆడపడుచులు, అత్తగారు, మావగారు అందరితో కలకల్లాడుతూ ఉండాలని నా కోరిక మావయ్యా.”

“నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు సంధ్యా..”

“అయ్యో రామా మీకు తెలియదు.. ఈ కాలం పిల్లలు తాము చాలా మేధావులం అనుకుంటారు.. కానీ కెరియర్ కోసం చదువుకున్న నాలుగు అక్షరాలూ తప్ప లోకజ్ఞానం ఉండదు. ఆ మధ్య టి వి లో ఒకమ్మాయిని మహేశ్వరుడు ఎవరు అని అడిగితే మహేష్ బాబు అంది.. సీతాదేవి గురించి నాలుగు ముక్కలు చెప్పమంటే... Seetha is Rama’s wife ... she went forest ... అని తడుముకుంటూ చెప్పింది.. భారత, రామాయణాలు చదవకపోతే మానే టి విలో సీరియల్స్ చూడచ్చుగా.. చూడరు.. అస్తమానం youtube లో చెత్త video లు చూస్తూ అదే జీవితం అనుకుంటున్నారు. టెక్నాలజీ తో బతికే ఈ తరం అమ్మాయిలకు ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో టెక్నిక్ తెలియదు. ఆ మధ్య నాకు తెలిసినావిడ కూతురు ఎవరినో ప్రేమించి వాడు అబ్దుల్ కలాం కన్నా నిజాయితీ పరుడు అని చెప్తే, పెద్దవాళ్ళు అంగరంగ వైభవంగా పెళ్లి చేసారు.. వాడు ఏడాది తిరిగే సరికి ఆల్ ఖైదా ఏజెంట్ అయిపోయి ఆ పిల్లని వదిలేసాడు.. ఇంకొక ఆవిడ కూతురు ఎన్ ఆర్ ఐ, ఎన్ ఆర్ ఐ అంటూ ఎవడినో ఆర్యసమాజ్ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళింది. అక్కడ వాడు నానా హింసలు పెడితే చావు తప్పి కన్ను లొట్టబోయి తిరుగు టపాలో పుట్టిల్లు చేరింది.. ఇది సైబర్  సమాజం అంటారు.. కానీ నాకు క్రిమినల్ సమాజంలా అనిపిస్తుంది. అందుకే మీరు రండి.. కావాలంటే స్మరణ పెళ్లి అయాక తిరిగి వచ్చేద్దురు గాని ఇక్కడికి. నేను మిమ్మల్ని బాగా చూసుకోనా మావయ్యా!”

ఆయన ఆ మాటతో చలించిపోయాడు.. “ఛ ఛ అంత మాట అనగలనా తల్లి నిన్ను..నువ్వింత బాధ పడుతుంటే రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా వస్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందని ఇంతకాలం రాలేదు. నేను రాకపోతే నీకు ఇబ్బంది అని నాకు తెలియదు తల్లి.. అయితే ఒక్క మాట చెబుతున్నా..  ప్రేమ విషయంలో ఎవరూ ఎవరినీ కట్టడి చేయలేరు.. అది హృదయానికి సంబంధించింది. నిజంగా స్మరణ ఎవరినన్నా ప్రేమిస్తే అతను ఎవరో, ఏమిటో కుటుంబం.. పూర్వాపరాలు తెలుసుకుని మనకి అన్ని విధాలా బాగుంటే పెళ్లి చేద్దాం అని మానసికంగా సిద్ధపడు.. పెద్దవాడిని చెబుతున్నాను. ముందే నువ్వు నెగటివ్ ధోరణితో ఉంటే దాన్ని నువ్వు నేరస్తురాలిగా చూస్తావు... కాదన్నావని తను కూడా నిన్ను శత్రువులా చూస్తుంది. ఆ ప్రమాదం జరక్కుండా నిన్ను నువ్వు సిద్ధపరచుకో.  ప్రేమించడం నేరం కాదమ్మా.. అదొక వరం.. అందరికీ లభించదు ఆ వరం” ఆయన స్వరంలో వినిపించిన వేదన విని విచలితంగా చూసింది సంధ్య.

“నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయి” అన్నాడు.

సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతూ “అలాగే మావయ్యా” అంటూ తరిగిన కాకరకాయలు, కత్తిపీట తీసుకుని లేచి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర సంధ్య నోటి ద్వారా ఆంజనేయులు తమతో రావడానికి ఒప్పుకున్నాడని విని ఆశ్చర్యంగా అడిగాడు దీపక్ “అవునా నాన్నా”

“అవునురా.. ఈ కాకరకాయ ఉల్లికారం తిన్నాక అనిపిస్తోంది నా శేష జీవితం ఇంత రుచికరమైన భోజనంతో గడిచిపోతే చాలని .. అందుకే రావాలనుకుంటున్నాను” అన్నాడు.

స్మరణ తల్లి మొహంలో చిందులేస్తున్న సంతోషం చూస్తూ “అమ్మ వెరైటీ .. అందరూ ఇంట్లో ఉన్న అత్తగారిని, మావగారినీ బైటికి గెంటుతుంటే ఈవిడ బతిమాలి తెచ్చుకుంటోంది అనుకుంది.

ఆ రాత్రి దీపక్ భార్యని అడిగాడు. “నాన్నని నువ్వే ఒప్పించావా! ఆయన వస్తానన్నారా!”

సంధ్య నవ్వుతూ అంది “ఆయన అంటారా! నేనే ఒప్పించాను”

“నీకేం మతిపోయిందా! ఇప్పుడు ఆయనని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఆయనకి అక్కడ కాలక్షేపం ఏం అవుతుంది? అదేదో అప్పుడే చేసి ఉంటె స్మరణ ఆయన గైడెన్స్ లో పెరిగేది. ఇప్పుడాయన వచ్చి ఏం చేస్తారు?”

సంధ్యకి అతని మాటలకి చిరాకేసింది. “పెద్దవాళ్ళ వలన మనకేం ఉపయోగం ఉండదండి.. ఆయన ఒక పడక్కుర్చీ వేసుకుని కూర్చుని టి వి చూస్తున్నా చాలు ఇంటికి నిండుదనం వచ్చినట్టే.. ఆయన అవసరం మనకిప్పుడే కావాలి. చిన్న పిల్లప్పుడు డే కేర్ లో ఉంచాము.. ఇప్పుడు ఏ కేర్ లో ఉంచగలము!”

“ఆయన బెత్తం పట్టుకుని దాన్ని ఆపగలరా”

“అవసరం లేదు.. మనల్ని వాచ్ చేసే వాళ్ళు ఇంట్లో ఒకళ్లున్నారన్న భావన చాలు దానికైనా, మీకైనా కాస్త భయం ఉండడానికి.”

“దీన్నే ఉరుమురిమి మంగలం మీద పడడం అంటారు.. మధ్యలో నేనేం చేసాను.”

“ఇది చాలదూ!” విసురుగా తన నడుం మీద పడిన అతని చేయి తోస్తూ అంది.

కిటికీలోంచి వీస్తున్న గాలిలో కలిసి విరజాజులు, పారిజాతం పూల సౌరభం మిళితమై ఓ కొత్త మధురమైన పరిమళం వెదజల్లుతుంటే మత్తుగా ఆస్వాదిస్తూ “దుర్మార్గురాలా నీకసలు భావుకత లేదు” అన్నాడు దీపక్ కసిగా..

నవ్వింది సంధ్య... విచ్చుకున్న విరజాజిలా.

సంధ్య కోరిక తీరింది. ఆంజనేయులు ఇల్లు, తోట అన్నీ బంగారయ్యకి అప్పగించి జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి కొడుకు, కోడలు, మనవరాలితో హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాడు. తాతగారి పక్కన కూర్చుని ఆపకుండా కబుర్లు చెబుతూ, దారిపొడుగునా కనిపిస్తున్న పచ్చటి ప్రకృతి సౌందర్యాన్ని మైమరచి చూస్తూ తన ఐపాడ్ లో ఆ సౌందర్యాన్ని బంధిస్తూ ఆ ప్రయాణాన్ని మనసారా ఆస్వాదించింది స్మరణ. సూర్యాపేటలో కాఫీలు తాగడానికి ఆపాడు దీపక్. తిరిగి బయలుదేరినప్పుడు స్టీరింగ్ తన చేతిలోకి తీసుకుంది. మనవరాలి డ్రైవింగ్ నైపుణ్యం చూసి ముగ్దుడయాడు ఆంజనేయులు. ఇల్లు చేరేసరికి బాగా పొద్దుపోయింది.

మరునాడు ఆఫీస్ కి వెళ్తూ మావగారికి అప్పగింతలు పెట్టింది సంధ్య. “డైనింగ్ టేబుల్ మీద అన్ని రెడీగా ఉన్నాయి మావయ్య! కాసేపయాక పండ్ల రసం తాగండి. అన్ని హాట్ ప్యాక్ లో పెట్టాను.. చల్లారితే మైక్రో ఓవెన్ లో ముప్ఫై సెకన్లు వేడి చేసుకుంటే చాలు.. టీ ఫ్లాస్క్ లో పోసి పెట్టాను.. జాగ్రత్త.. బోర్ గా ఉందని ఒక్కరూ బయటకు వెళ్ళకండి.

కోడలు తనపట్ల చూపిస్తున్న శ్రద్ధకి ముచ్చటేసింది ఆయనకి. అయినా అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయి ఇంట్లో ఒక్కడే ఉండేసరికి కొంచెం దిగులు వేసింది. తనతో పాటు అన్నివేళలా కనిపెట్టుకుని ఉండే బంగారయ్య.. వంట రుచిగా చేస్తూ, ఇల్లు శుభ్రంగా ఉంచే లక్ష్మి, అటు పోతూ, ఇటు పోతూ.. ఏం చేస్తున్నావు ఆంజనేయులు అంటూ పలకరించే మిత్రులు, ఇరుగుపొరుగు అందరిని మిస్ అవసాగాడు.

ముందు కొంచెం ఒంటరి తనంతో దిగులుగా అనిపించినా సాయంత్రం ఆరింటికల్లా కోడలు ఇంటికి రావడంతో ఉల్లాసంగా మారుతున్నాడు. కొంచెం ఆలస్యంగా కొడుకు, మనవరాలు వస్తారు. సాధారణంగా కొడుకు, కోడలితో పాటు డిన్నర్ చేస్తాడు. కానీ అప్పుడప్పుడు దీపక్ వచ్చేసరికి రాత్రి పది అవుతుంటే మీకు లేట్ అవుతుంది.. మీరు తినేయండి అంటూ ఆయనకీ మాత్రం ఎనిమిదింటికల్లా పెట్టేస్తుంది సంధ్య. నెమ్మదిగా ఆ జీవితానికి అలవాటు పడసాగాడు.

స్మరణ ఒక్కోసారి సెకండ్ షిఫ్ట్ అంటూ మధ్యాహ్నం మూడింటికి వెళ్తుంది. అప్పటివరకు ఇంట్లో ఉన్నా ఎక్కువ సమయం లాప్ టాప్ తోటే గడుపుతుంటుంది. నిద్ర లేవగానే ముందు లాప్ టాప్ ఆన్ చేసి బ్రష్ చేసుకుంటుంది. ఒకసారి ఆన్ చేసి తన పనులన్నీ చేసుకుంటుంటే ఆయనకి విచిత్రంగా అనిపిస్తుంది. అదేవిటి నువ్వు కనిపించవా మీ ఆఫీస్ వాళ్ళకి అని అడిగేవాడు. “అవసరం లేదు తాతయ్యా.. లాగిన్ అయితే చాలు.” అని ఆ అమ్మాయి నవ్వుతుంటే లాగిన్ అంటే ఏమిటో ఆయనకీ తెలియక బ్లాంక్ గా చూస్తుంటాడు.

ఆయనకీ తెలిసి ఆఫీస్ పని అంటే గంపెడు ఫైల్స్ ముందేసుకుని కళ్ళద్దాలు సవరించుకుంటూ ఆ ఫైల్స్ లో ఏదో వెతుక్కుంటూ కూర్చునే గుమాస్తాలు గుర్తొస్తారు. లేదంటే స్కూల్లో పిల్లలతో గొంతు నొప్పెట్టేలా అరిచే మేష్టార్లు గుర్తొస్తారు.. అంతేకాని ఈ లాప్ టాప్ ఏంటో.. లాగిన్ ఏంటో.. ఇంట్లో ఉంటే ఒళ్లో బయటకు వెడితే భుజాన ఆ బరువు దేనికో, అందులో ఎలా పని చేస్తారో, ఏం పని చేస్తారో ఆయనకీ అర్థం కాదు.

మరో నెల గడిచింది.

స్మరణకి ఆఫీస్ లో పని ఎక్కువైంది. ఒక్కోరోజు బాగా లేట్ గా వస్తోంది ఇంటికి. ఆఫీస్ కాబ్ లో పిక్ అప్ డ్రాపింగ్ చేస్తున్నారు. కొత్త, కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కంపెనీ బాగా లాభాల్లో ఉంది అని చెప్పింది. స్మరణ రావడం లేట్ అయిన రోజు సంధ్య అలా హాల్లో సోఫాలోనే పడుకుని ఎదురు చూస్తూ ఉంటుంది.

ఒకరోజు  స్మరణ విసుక్కుంది  “ఎందుకమ్మా అలా ఎదురుచూస్తావు.. నువ్వు పడుకో.. నేను ఆఫీస్ కాబ్ లో వస్తాను కదా నాకేం భయం”.

“నీకేం భయం? నీకుండదు.. భయం నాకే ఉంటుంది”  అంది  సంధ్య.

“ఇలా భయపడుతూ ఉంటే బతకడం కష్టం.. మా ఉద్యోగాలు ఇంతే ఇలాగే ఉంటాయి.. నువ్విలా టెన్షన్ పడితే నీకు శాంతి ఉండదు.. నాకూ శాంతి ఉండదు.”

“సరేలే... అర్ధరాత్రి ఎందుకు ఆర్గ్యుమెంట్... ఏమన్నా తిన్నావా... తింటావా!”

“తినేశానమ్మా..

“సరే పడుకో” సంధ్య తన గదిలోకి వెళ్ళిపోయింది.

మరునాడు  సంధ్య లేచిన దగ్గర నుంచీ సీరియస్ గానే ఉంది. అందరితో ఆఖరికి మావగారితో కూడా ముక్తసరిగా మాట్లాడింది. వంట చేసి, టిఫిన్ చేసి రోజూలాగే అన్నీ అప్పగింతలు పెట్టి ఆఫీస్ కి వెళ్ళింది. కానీ హాఫ్ డే కాజువల్ లీవ్ పెట్టి ఇంటికి వచ్చింది.

అప్పటికే లంచ్ ముగించి కునుకు తీస్తున్నాడు ఆంజనేయులు. అనుకోకుండా త్వరగా వచ్చిన కోడలివైపు ఆశ్చర్యంగా చూస్తూ “ఏమ్మా! ఒంట్లో బాగాలేదా అప్పుడే వచ్చావేంటి?” అడిగాడు.

“బానే ఉన్నాను మావయ్య.. ఊరికే వచ్చాను” సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. పావుగంట తరవాత చీర మార్చుకుని వచ్చి “పడుకున్నారా మావయ్యా” అని పిలిచింది గుమ్మం దగ్గర నిలబడి.

“లేదమ్మా రా లోపలికి” ఆప్యాయంగా ఆహ్వానించాడు.

నెమ్మదిగా లోపలకి నడిచి కుర్చీ ఆయన మంచానికి దగ్గరగా జరుపుకుని కూర్చుంది.

“చెప్పమ్మా..  ఏంటి విషయం? ఆఫీసులో పని ఎక్కువగా ఉందా!”

పల్చగా నవ్వింది.. “మాది కార్పోరేట్ ఆఫీస్ కాదుగా మావయ్యా..” అంది.

ఆయన కూడా నవ్వి.. “కాలంతో కొన్ని మార్పులు అనివార్యం సంధ్యా.. స్మరణకి పని ఎక్కువైందని టెన్షన్ పడుతున్నట్టున్నావు.. నీకు, నాకు కష్టం అనిపించేది వాళ్లకి చాలా సులువుగా అనిపిస్తుంది. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు..”

సంధ్య మాట్లాడలేదు.. కొన్ని నిమిషాలు మౌనం తరవాత అంది. “మావయ్యా.. మా నాన్న నన్ను ఎలా పెంచారో మీకు తెలుసు.. అమ్మ నాకు పన్నెండేళ్ళ వయసులో పోయింది. అప్పుడు మా అక్క వయసు పదహారు.. నాన్న మా చేత చాలా తక్కువ పనులు చేయించేవారు.. ఇంట్లో పనులతో అలసిపోతే చదువు సాగదు ఆడపిల్లలు చదువుకోవాలి ఎప్పటికైనా దాని అవసరం రావచ్చు అనేవారు. నన్ను, అక్కని కూడా డిగ్రీ చేయించారు. ఉద్యోగం తప్పనిసరిగా చేయించాలి అనుకోలేదు. పెళ్లి చేస్తాను.. మీ భర్తల ఇష్టప్రకారం, మీ ఇష్టప్రకారం ఉద్యోగాలు చేసుకోండి అంటూ అక్కకి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు..  రెండు, మూడు పెళ్లి చూపుల తరవాత సంబంధం కుదిరింది. అక్కని అడిగారు కూడా నీకీ సంబంధం నచ్చిందా అని తల ఊపింది... కానీ సరిగ్గా తాంబూలాల రోజు కనిపించకుండా పోయింది.. ఏమైందో తెలియక నాన్న పిచ్చి పట్టినట్టు వెతికించారు. వేరే కులం వాడిని ప్రేమించిన విషయం నాన్నకి చెప్పడానికి భయపడి, చెప్పా, చేయకుండా అతనితో వెళ్ళిపోయింది. ఆ విషయం తెలిసి నాన్న చాలా కుమిలిపోయారు. ఎంతో స్వేచ్చని ఇచ్చాను.. ఒక తండ్రిలా కాక స్నేహితుడిలా ఉన్నాను.. సంబంధాలు చూస్తున్నప్పుడే చెపితే కాదంటానా! ఎందుకిలా చేసింది అని కుమిలి, కుమిలి నాన్న ఒకవిధంగా మనోవ్యాధితో పోయారు.”

సంధ్యకి ఒక తోబుట్టువు ఉండేది సంధ్య పెళ్లి నాటికి ఆ అమ్మాయి చనిపోయింది అని ఆయనకి తెలుసు. కానీ ఈ విషయం మొదటిసారి వింటున్నాడు. ఆశ్చర్యంగా అడిగాడు.. “నువ్వు చెప్పేది నిజమేనా”

“అవును మావయ్యా.. అక్షరాలా నిజం.. అక్క ఎవరితోటో వెళ్ళిపోయింది..అతను మోసం చేసాడు.. అక్క ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం మీదగ్గరే కాదు అందరి దగ్గరా దాచారు మా వాళ్ళు.. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే నా కూతురు జీవితం అల్లా కాకూడదని ... అది ఎవరినీ ప్రేమించకుండా ఉంటె బాగుండు అని మీకు చెప్తున్నా.. స్మరణకి త్వరగా పెళ్లి చేసేద్దాం మావయ్యా.. ఓసారి పార్ధ సారధి గారికి మీరు ఫోన్ చేయండి. వాళ్ళు పిల్లని చూసి వెళ్ళాక అసలు కబురు చేయలేదు. ఏదో ఒకటి చెప్పాలిగా.. మగపిల్లాడు వాళ్ళం అని బిగదీసుకున్నారేమో.. మనం మాట్లాడితే తప్పు లేదుగా. మీ అబ్బాయి అసలు ఆ విషయమే పట్టించుకోడం లేదు.”

సంధ్య చిన్నపిల్లలా చెబుతోంటే ఆయనకీ ఆమె పట్ల వాత్సల్యం పెల్లుబికింది. సంధ్య అమాయకురాలు అనుకున్నాడు. ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ “ఎందుకమ్మా అంత ఆందోళన.. స్మరణ మామూలు ఆడపిల్ల కాదు.. నువ్వు దాని గురించి అసలు బెంగపెట్టుకోవద్దు. ధైర్యస్తురాలు, తెలివైనది.. వివేకవంతురాలు.. దానికి తన భవిష్యత్తు మీద కచ్చితమైన లక్ష్యం ఉంటుంది. నాకు తెలుసు.. ఆ లక్ష్యం దిశగా ప్రతి అడుగూ వేస్తుంది.. ఆ అడుగులు తప్పటడుగులు కావు.. కాబోవు.. నన్ను నమ్ము..” అన్నాడు.

దీర్ఘంగా శ్వాస తీస్తూ అంది..”నా కోరిక అదే మావయ్యా.. అల్లా అని నా బాధ్యత విస్మరించలేను కదా! నా కొలీగ్స్ ఎదురుకునే సమస్యలు ఎదుర్కునే గుండె ధైర్యం నాకు లేదు.. అదలా అర్ధరాత్రి వస్తుంటే భయంగా ఉంది. ప్లీజ్ మావయ్యా.. మాట్లాడండి” ఆయన కళ్ళల్లోకి ఆశగా చూసింది.

“వాళ్ళు మన విషయం పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టు లేరమ్మా.. తీసుకుని ఉంటే తప్పక నాకు ఫోన్ చేసేవాళ్ళు.. ఆరోజు వాళ్ళు ఆ అబ్బాయి ఇండియా వస్తున్నాడు.. పెళ్లి చేసి పంపించాలనుకుంటున్నాము అంటే నేను యాదాలాపంగా మా మనవరాలు ఉంది చూడండి ఓసారి అన్నాను.. స్మరణ ఆసక్తి చూపించలేదు అని నాకు తెలిసాక నేను ఒత్తిడి చేయలేదు.. వాళ్ళు సంప్రదించలేదు.. మనమెందుకు వాళ్ళ వెంట పడాలి.. మన పిల్లకు ఏం తక్కువ.. ఇంకా మంచి సంబంధం వస్తుంది.. నాతొ పాటు పని చేసి రిటైర్ అయిన ఆనందరావు కొడుకు దగ్గర కుకట్ పల్లిలో ఉంటున్నాడు.. వాడి కొడుకు కూడా మంచి పొజిషన్ లో ఉన్నాడు.. వివరాలు నాకు అంతగా తెలియవు.. రేపు ఫోన్ చేస్తాలే. నువ్వు ఏమి బెంగ పెట్టుకోకు.. సరేనా ”

సంధ్య నిట్టూర్చి అంది.. “ఏంటో ఆధునిక స్త్రీ జీవితం ఎంతో బాగుంది అనుకున్నా.. ఇప్పుడే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి..అప్పుడే బాగుండేది జీవితం.. అసలు జీవితం అంటే ఏమిటి అని తెలిసేలోగానే సగం జీవితం గడిచిపోయేది.. మిగతా సగం ఇంతే ఈ జీవితం అని సరిపెట్టుకుంటూ బతికేవాళ్ళు..”

ఆయన ఎటో చూస్తూ నిర్వేదంగా అన్నాడు..” ఆ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళు అరుదు.. ఎవరో అదృష్టవంతులు తప్ప అందరూ తలవంచుకుని పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకుని, ఇష్టం ఉన్నా, లేకపోయినా కాపురాలు చేసారు.. పిల్లల్ని కన్నారు.. యజ్ఞ, యాగాది క్రతువులన్నీ జరిపి సంప్రదాయాను సారంగా బతికారు. కానీ సంధ్యా! ఆ జీవితంలో ఆనందం ఏముంది చెప్పు! రసహీనంగా, యాంత్రికంగా బతికిన బతుకు కూడా ఓ బతుకేనా!”

ఆయన మాటలకి విస్తుబోయి చూసింది సంధ్య.. “మీరు ప్రేమ పెళ్ళిళ్ళ ని సమర్ధిస్తున్నారా” అడిగింది.

“సమర్ధించడం, సమర్ధించక పోవడం అలా ఉంచు.. సంప్రదాయ పద్ధతిలో జరిగిన పెళ్ళిళ్ళు గొప్పవని ఒప్పుకోలేకపోతున్నాను.”

“అయితే స్మరణ ఎవరినైనా ప్రేమించానని చెబితే మీరు అంగీకరిస్తారా!”

కోడలి స్వరంలోని విస్మయానికి, ఒక విధమైన నిష్టూరానికి ఆయన ఆమె మొహంలోకి చూసి నవ్వి “పిచ్చిపిల్లా! మనం చూసిన వాడికన్నా యోగ్యుడు, మంచివాడు అయితే దీవించక ఏం చేస్తాం!”

సంధ్య సమాధానం చెప్పకుండా ఆయనవైపు సాలోచనగా చూస్తూ కొద్ది క్షణాల నిశబ్దం తరవాత అంది “ఏమో! నేనిప్పుడేమి చెప్పలేను..సరేలెండి.. టీ పెడతాను... నాలుగవుతోంది” అంటూ అక్కడి నుంచి లేచి వంట గదిలోకి వెళ్ళిపోయింది.

****సశేషం****

Posted in November 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!